Previous Page Next Page 
బ్రతుకు బొంగరం పేజి 19


    
                                    12
    టైఫాయిడ్ గా మారిన ఆ జ్వరం నెలరోజుల దాకా రవిచంద్ర ను రాజగోపాలం ఇంట్లోనే ఉండేటట్లు చేసింది. రాజగోపాలం, ప్రియంవద లు  రవిచంద్ర పట్ల తీసుకుంటున్న శ్రద్ధ చూసిన తరవాత సురేంద్ర తన గదికి తీసుకు వెళతానని అనలేకపోయాడు.
    పూర్తిగా కోలుకొని పద్యం తీసుకొన్న తరవాత రావిచంద్త పరీక్షల విషయమై ప్రస్తావన వచ్చింది.
    "చాలా దగ్గిరికి వచ్చాయి గదూ! బహుశా నేల రోజులున్నాయను కొంటా పరీక్షలు" అన్నాడు నవ్వుతూ రాజగోపాలం.
    "నెల రోజులెక్కడ? ఖచ్చితంగా లెక్క పెడితే ఇవాల్టి కి ఇరవై రోజులున్నాయి" అన్నాడు గాభరాగా రవిచంద్ర. అతను శ్రద్ధ తీసుకొని చదువు కుంటున్న రోజుల్లో జ్వరం పట్టి పీడించి చదవనీయకుండా చేసింది. ఐ.ఎ.యస్ కు చదువు తున్నంత సేపూ  ఆ ప్రయత్న్మగానే అతనేదో ఊహ లోకాల్లో విహరించాడు. సురేఖ కాని, రాజగోపాలం కాని "ఐ.ఎ.యస్ . ఆఫీసరు అవుతారు లెండి" అన్నప్పుడల్లా అతని హృదయం పులకించి పోయేది. చేతి కందబోతున్న స్వర్గాన్ని ఎవరో గుంజు కున్నట్ల యింది , అతనికి ఈ జ్వరం రావడంతో.
    బత్తాయి తొనలు ఒలుచుకొని ప్లేటు లో పెట్టుకొని వచ్చింది ప్రియంవద. బత్తాయి తోన ఒకటి తీసుకొని తింటూ "మీకెలా కృతజ్ఞత చెప్పుకోవాలో నాకు తెలియడం లేదు. మీరు చేసిన ఈ సహాయానికి కృతజ్ఞతలు కేవలం మాటల ద్వారా చెప్పటానికి నాకు మనస్కరించడం లేదు" అన్నాడు.
    ప్రియంవద చిరునవ్వుతో తల వంచుకుంది.
    'ఆలా అయితే ఐ.ఎ.యస్ పాసయి ఋణ విముక్తులవండి. అది పాసయి మమ్మల్ని సంతోష పెట్టడం కంటే మించింది మరొకటి లేదు." పరాచికంగా అన్నాడు రాజగోపాలం.
    రవి దిగులుగా "ఆ చాన్సు కూడా లేకుండా పోయింది. మీరు, సురేంద్ర ఇచ్చిన ప్రోత్సాహానికి నేనెంతో హుషారుగా మొదలెట్టాను. ఏం లాభం? నన్నేదో దుష్టశక్తి పీదిస్తుంటే మీరు మాత్రం ఏం చేయగలరు?' అన్నాడు.
    "వండర్, పరీక్ష ఫలితాల్లో నంబరు కనబడని విద్యార్ధి లా చూస్తున్నారేం? మీరింకా పరీక్ష ఇవ్వలేదు మిస్టర్ రావిచంద్రా! పరీక్ష ఇవ్వబోతున్నారు!"
    రాజగోపాలం మాటలకు రవి పేలవంగా నవ్వి , "మీరు హృదయ పూర్వకంగానే అంటున్నారా? ఈ పరిస్థితి లో నేను పరీక్ష ఇచ్చినా పాస్ అవగలనన్న ధైర్యం మీ కుందా?" అన్నాడు.
    "ధైర్యం ఉండడం అనేది వేరే విషయం. ప్రయత్నం చేయడం అనేది ఇప్పుడు మనం ఆలోచించవలిసిన కర్తవ్యం."
    రవి నిస్పృహతో తల వంచుకున్నాడు.
    ప్రియ అతన్ని సానుభూతి తో చూసింది. అంత తేలిగ్గా ప్రతి విషయానికీ నిస్పృహ చెందే అతని మనస్తత్వానికి కొంచెం బాధ చెందింది కూడా.
    "నా మట్టుకు నాకు మీరు పాసవుతారనే నమ్మకం ఉంది. ప్రయత్నం చేయడం మీ విధి. తరవాతా మీ ఇష్టం" అన్నాడు నెమ్మదిగా రాజగోపాలం రెండు క్షణాలు ఆగి.
    రవిచంద్ర క్షణకాలం అతన్ని ఆలోచిస్తూ  చూసి, "అంతేనంటారా? ప్రయత్నం చేయమంటారా?' అన్నాడు."తప్పకుండా . మీరు నేగ్గుతారు కూడా. అల్ ది బెస్ట్." రాజగోపాలం కంఠం లో ధ్వనించిన దృడమైన విశ్వాసం రవిచంద్ర కు వేయి ఏనుగుల బలాన్నిచ్చినట్లయింది. ఉత్సాహంతో పుంజుకుంటూ "మీ బెస్ట్ విషెస్ వృధా చేయటం నాకిష్టం లేదు. నేను ప్రయత్నిస్తాను. గట్టిగా ప్రయత్నిస్తాను." అంటూ రవిచంద్ర కొంచెం ఆవేశంతో లేచాడు.
    "అయితే ఒక షరతు మీద ....' రాజగోపాలం సదా పెదిమెల మీద వెలిగే చిరునవ్వుతోనే అతన్ని పరిశీలిస్తూ అన్నాడు.
    "ఏమిటది?" అన్నాడు కొంచెం అత్రతతో రవి.
    "రాత్రిళ్ళంతా జాగరణ చేసి మళ్ళీ టైఫాయిడ్ తెచ్చుకోనని ప్రామిస్ చేసిన తరవాతనే మీరు స్టడీ మొదలు పెట్టాలి. ఫస్ట్ హెల్త్ నెక్ట్స్ ఎవ్విరి థింగ్!"
    "ఓ...అదా? నేనేమిటా అని కొంచెం గాభరా పడ్డాను" అన్నాడు రవిచంద్ర , మనస్పూర్తిగా నవ్వుతూ. "అయినా మళ్ళీ టైఫాయిడ్ వచ్చినా మీరు, వారు ఉన్నారుగా" అన్నాడు ప్రియంవద ను చూపిస్తూ.
    "నాకేం అభ్యంతరం లేదు, మళ్ళీ టైఫాయిడ్ వస్తే మిమ్మల్ని చూడటానికి . కాని మీకే మంచిది , పరీక్షలయిన తరవాత తెచ్చుకోండి. అప్పుడయితే ఫర్వాలేదు. తీరిగ్గా టైఫాయిడ్ ను ఎంజాయ్ చేయచ్చు. ఇప్పుడయితే ఐ.ఎ.యస్ కు అడ్డం" అంది ప్రియ ఇంట్లోకి వెళ్ళబోతూ.
    ఇద్దరూ నవ్వుకున్నారు ఆ మాటలకు.
    
                          *    *    *    *
    "ఎలా రాశావు?' ఉత్సాహంగా అడిగాడు సురేంద్ర , రవిచంద్ర గదిలోకి వస్తుంటే ఎదురు వెడుతూ.
    "బాగానే రాశాను." బడలికతో కూడుకున్న మందహాసం తో రవిచంద్ర చెప్పాడు.
    "వెరీ గుడ్. అల్ ది బెస్ట్. ఈ పేపరుతో పరీక్షలు అయిపోయాయి. మొత్తానికి నా మర్యాద దక్కించావు. ఏదో పరీక్షకు కూర్చోమని బలవంతం చేసినందుకు."
    "నా మర్యాద కూడా దక్కించు కున్నాను, పరీక్షలకు భయపడి ఫేయంట్ కాకుండా" అన్నాడు రవి.
    'అరేయ్ , ఇహ నీవు వరసగా పదిహేను రోజులు భోజనానికి మాత్రమె నిద్ర లేవటానికి పర్మిషన్. తరవాత పదిహేను రోజులు రోజల్లా నిద్రపోయి ఏదో సాయంత్రానికి అలా అలా బజార్లో తిరిగి రావచ్చు. తరవాత......."
    "స్టాప్. పరీక్షలు రాసినందుకా నాకీ జైలు శిక్ష?" రవిచంద్ర మధ్యలో అందుకున్నాడు.
    "నీ మంచి కోసమేనోయ్. పరీక్షల కోసమని పాపం, చాలా కష్టపడ్డావు. అందుకోసమే ఈ కాలుక్యూ లేట్టెడ్ రెస్ట్."
    "ఎదిశావులే కాని, చాలా రోజులయింది , ఇవాళ రాజగోపాలం గారింటికి వెళ్లి వద్దాం. అన్నట్టు సురేఖ ఈ సాయంత్రం రాలేదా?"
    "నాతొ వస్తాననే చెప్పింది. మరి త్వరగా తెములు వెళ్లి వద్దాం" అన్నాడు సురేంద్ర.
    రవిచంద్ర ముఖం కడుక్కునేసరికి సురేఖ వచ్చింది. "నమస్కారం , గురువు గారూ. కనీసం ఈ ఒక్క పరీక్షన్నా పోగొట్టారా?' అంది సురేఖ ఉత్సాహంగా.
    "లేదండీ , దురదృష్టవశాత్తూ ఇది కూడా బాగానే చేశాను."
    "చంపారు పొండి. అయితే మీరు ఐ.ఎ.యస్ . అఫీసరవటం తధ్యమన్నమాట!"
    "ఏం ? వాడు ఐ.ఎ.యస్ , ఆఫీసరు కావటం నీ కిష్టం లేదా? " సురేంద్ర ఉడుకుమోతు తనం తోనే అడిగాడు.
    "ఏమాత్రం లేదు. వారేమో ఐ.ఎ.యస్ ఆఫీసరు అయి, ఇక్కడ్నించి వెళతారు. నీవేమో సినిమా యాక్తరై పోయి బొంబాయి లో కాపరం పెడతావు. నేనొక్కదాన్ని ఒంటరిగా "సోలో" పాడుకుంటూ కూర్చోవాలి."
    "వాడు ఐ.ఎ. యస్ అవుతాడేమో కాని, నీ ఉసురు తగిలిన తరవాత నేను సినిమా యాక్టర్ ని అవుతానా?"
    సురేఖ అతన్ని ఈసారి ఆశ్చర్యంగా చూస్తూ , "అరె, నీవు ఇవాళ మన కంపెనీ కి వెళ్ళలేదా  ఏం?' అంది.
    "ఏం వెళ్ళలేదు" అన్నాడు అత్రతతో సురేంద్ర.
    'అయితే నీకు తెలియదన్న మాట, సిన్హా ఉత్తరం రాసిన సంగతి."
    "ఏ సిన్హా? ఆవాళ మన నాటకం చూసిన ప్రొడ్యూసరా?" ఆమె మీదికి అమాంతం లంఘిస్తూన్నట్లుగా అన్నాడు.
    "ఆయనే నీ అడ్రసు తెలియక అక్కడకు రాశాడు. నిన్ను స్క్రీన్ టెస్టు కు బొంబాయికి త్వరలో రమ్మని కూడా వ్రాశాడు."
    "హుర్రే" అంటూ ఎగిరి గంతేశాడు సురేంద్ర.
    "నిజమా , సురేఖా? నిజంగానే? నీవు సరదాగా నాతొ నాటకం ఆడడం లేదు గదా?' సురేంద్ర కంగారుగా అడగ సాగాడు.
    "నిజమే. నేనిందాకా రావడంతోనే చెబుదామను కున్నాను. ఇంతలో వీరి ఐ.ఎ.యస్ గొడవలో పడి మరిచిపోయాను. మధ్యాహ్నం మన కంపెనీ కి వెళ్ళినప్పుడు నాకు తెలిసింది."
    "కంగ్రాచ్యు లేషన్స్ " అంటూ రవిచంద్ర సురేంద్ర ను కౌగలించుకున్నాడు. సురేంద్ర కు సంతోషంతో నోట్లోంచి మాట రావడం లేదు. అతను అప్పుడే బొంబాయి పోయినట్లుగా, సినిమాలో నటించి నట్లుగా ఊహించుకోసాగాడు.
    ఉత్సాహంగా ఆ సాయంకాలం సురేంద్ర గదిలోకి వచ్చింది సురేఖ. రవిచంద్ర పరీక్షలు బాగా రాశానన్న సంతృప్తి లో ఉన్నాడు, ఇహ సురేఖ తెచ్చిన కబురుతో రాజగోపాలం ఇంటికి వెళదామనుకున్న సంగతి కూడా మరిచిపోయి కంపెనీ కి ఉరికాడు సురేంద్ర.
    సురేఖ, రవిచంద్ర రాజగోపాలం ఇంటి వైపు నడవ సాగారు.
    "మొత్తానికి పరీక్షలు బాగా రాశారన్న మాట."
    "అనే అనుకుంటున్నాను."
    "పాసయితే, ఇంటర్వ్యూ కదూ?"
    "అదీ అయితే, సెలక్షను వస్తుంది. ఆపైన ఆఫీసరు అవడం, అంతేకదూ?"
    "అవును, అంతే కదా!"
    'అప్పుడు మీరు దర్జాగా అఫీసరవుతారు! మీ కింద మందీ మార్బలం....."
    "ముందు , వెనక చూడవలిసిన ఫైళ్ళు..........." రవిచంద్ర కొంటెగా అందుకున్నాడు.
    "ఫైళ్ళు మీరు చూస్తె ఇంకేం ఆఫీసరు? అవి చేయవలిసింది గుమాస్తాలు. మీ పని సుతారంగా సంతకాలు పెడుతూండటమే."
    నవ్వి మాట్లాడలేదు రవిచంద్ర.
    "లేడీ పర్సనల్ సెక్రటరీ , కదిలితే కారు........"
    "మెదిలితే మొట్టి కాయలు." రవిచంద్ర పూర్తీ చేశాడు.
    "ఎవరి చేత?"
    "పై ఆఫీసర్ల చేత."
    "తిన్నా ఫర్వాలేదు. దర్జా, డబ్బు వస్తుంటే తింటే ఏం?"
    రవి నవ్వసాగాడు ఆమె చెబుతుంటే.
    "మీరు దర్జాగా ఎయిర్ కండిషన్ డ్ రూం లో కూర్చొని ఉంటారు. పర్సనల్ క్లర్కు కు డిక్టేట్ చేస్తూ. అప్పుడు మీ దగ్గిరికి దవలా బంట్రోతు వచ్చి, "ఎవరో అమ్మాయి, సార్." పేరు సురేఖ ట! మిమ్మల్ని చూడాలని గొడవ చేస్తుంది. లోపలకు పంపించనా, సార్' అని అంటాడు."
    "ఊ!"
    "మీరు ఆలోచిస్తారు. సురేఖ.......సురేఖ.....ఎవరీ సురేఖ? ఎక్కడ చూశాను? ఎవరు......ఎవరని పాపం, గట్టిగానే ఆలోచిస్తారు."
    "ఆలోచించినా తోచదు. సహజమేగా. అంత ఎక్కువగా ఆలోచిస్తే ఏదైనా తోచదు. నిజమే మరి. కంటిన్యూ.....' రవి అందుకున్నాడు.
    సురేఖ ఏదో ఊహ లోకంలో ఉన్నట్లు అభినయిస్తూ చెప్పసాగింది.
    "ఏమో, నాకేం జ్ఞాపకం రావడం లేదు. "లోపలకు రమ్మను' అని చెబుతారు. అప్పుడు వస్తుంది ఆ అమ్మాయి. మాసిన బట్టల తోటీ, చింకి జుట్టు తోటి, పేదచూపుల తోటి ....వచ్చి నన్ను గుర్తుపట్టలేదా , మాస్టారూ' అంటుంది. " సురేఖ కు గిర్రున కళ్ళ వెంబడి నీళ్ళు తిరిగాయి.
    ఒక్కసారే మొత్తం వాతావరణం విషాదపు రంగు పూసుకుంది.
    "నేను, మాస్టారూ, నేను. ఒంటరిగా మీరు దిగులుతో సురేంద్ర గదిలో నాగపూర్ లో కూర్చుని ఉంటె వస్తుండే దాన్ని. మీకు పరీక్షల ముందు టైఫాయిడ్ జ్వరం వస్తే పదిరోజులు సేవ జేసే భాగ్యం పొందిన అదృష్ట వంతురాల్ని....మీతో సినిమాలకు, హోటళ్ళ కు తిరిగిన ధన్య జీవిని నేను. ఆనాటి సురేఖను. జ్ఞాపకం లేదా?' అంటుంది దీనంగా, జాలిగా.....మీరు క్షణం సేపు పరీక్ష గా చూసి "నాకేం జ్ఞాపకం రావడం లేదు. బోలెడంత పని ఉంది. డిస్ట్రబ్ చేయకు' అంటూ తల వంచుకుంటారు.......ఆ అమ్మాయి చిన్న బుచ్చుకొని......." ఇహ చెప్పలేక , దాదాపు నిర్మానుష్యంగా ఉన్న ఆ రోడ్డు మీద నిజంగానే ఏడవసాగింది.
    ఆప్రయత్నంగా ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకొంటూ, "పిచ్చి పిల్లా, ఏమిటిది? ఛీ...ఛీ......" ఇదేమన్నా డ్రామా అనుకున్నారా? ఇది రోడ్డు .....ఊరుకోండి. బాగుండదు. మొత్తానికి మీ డ్రీం లాండ్ మిమ్మల్నే ఎదిపించిందే" అన్నాడు రవి, పేలవంగా నవ్వుతూ.
    అతను కూడా కదిలిపోయాడు. సురేఖ కు తన మీద ఇంత అభిమానం, ఆదరణ ఉన్నందుకు చలించి పోయాడు. రెండు క్షణాలు ఎవరూ ఏమీ మాట్లాడకుండా నడిచారు.
    సురేఖ తిరిగి ఉత్సాహాన్ని పులుముకొని, "సురేంద్ర సంతోషానికి పట్టపగ్గాలుండవు. ఇవ్వాళ. అసలు మళ్ళీ గదికి రాకుండానే బొంబాయి వెళ్లి పోతాడేమో నని నాకు భయంగా ఉంది" అంది.
    రవి బిగ్గరగా నవ్వుతూ, "అవును, ఆ ప్రమాదం కూడా ఉంది." అంటుండగా రాజగోపాలం ఇల్లు వచ్చింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS