
ఆ రాత్రే బ్రహ్మాండంగా జ్వరం వచ్చింది రవికి. అ జ్వరం దాదాపు పది రోజులు అదే తీవ్రతతో ఉంది. సురేంద్ర ఆ పదిరోజులు గదిలో కట్టేసినట్లు ఎక్కడికి వెళ్ళలేదు. జ్వర తీవ్రత ఎక్కువయి , ఒక రోజు రవి పిచ్చి పిచ్చి మాటలు కూడా అనడం మొదలెట్టాడు. సురేఖా, సురేంద్ర లకు కాళ్ళు చేతులు ఆడలేదు. సురేంద్ర పరిగెత్తుకొని వెళ్లి డాక్టర్ని పిలుచుకొని వచ్చి రెండు ఇంజక్షన్లు ఇప్పించిన తరవాత కొంచెం తగ్గింది.
రవికి జ్వరం ఎక్కువయి నప్పటి నించి సురేఖ ప్రతి రోజు ఉదయం వచ్చి సాయంకాలం చాలాసేపటి దాకా ఉంటుండేది రవి జ్వరం సురేంద్ర కు కంగారు ఎక్కువ చేసి ఏం చెయ్యాలో కూడా తోచకుండా చేసింది. సురేఖ కు రవికి ఉపచారం చేయడం కంటే , సురేంద్ర కు ధైర్యం చెప్పటమే కష్ట సాధ్యమైంది.
ఆ రోజు జ్వరం కొంచెం జారినట్లు అనిపిస్తే, సురేంద్ర పళ్ళు, రొట్టె తీసుకొని రావడాని కని బయటకు వెళ్ళాడు.
రవి పక్క దగ్గిర సురేఖ కూర్చుని అతడ్నే చూడసాగింది. కొంచెం శుష్కించి పోయిన వదనం, మాసిపోయిన గడ్డం ఆమెకు జాలి కలిగేటట్లు చేశాయి. అతని నుదురు మీద నెమ్మదిగా తన చేయి వేసి నిమరసాగింది.
రవి కొంచెం మెదిలి "ఎవరూ?" అన్నాడు.
సురేఖ మాట్లాడలేదు. రవి కళ్ళు తెరిచి ఆమెను చూసి, "ఓ! మీరా?' అన్నాడు శుష్క హాసం చేసి.
నెమ్మదిగా ఆమె అతని తల మీద నించి చేతిని తీసివేసింది.
రవి అసంతృప్తుడయినట్లుగా ముఖం పెట్టి, "మీ చేయి అలానే ఉంచండి, ప్లీజ్. ఏమిటో హాయిగా ఉంది" అన్నాడు.
ఆమె మళ్ళీ మాట్లాడకుండా చేతిని తల మీద అన్చింది.
"ఆర్నెల్ల కిందటి దాకా నేనెవర్నో మీకు తెలియదు. ముక్కు, మొహం తెలియని వాడి కోసం మీరెందు కింత ఆదుర్దా పడుతున్నారు?"
ఆమె చిరుహాసం చేసింది కాని ఏమీ మాట్లాడలేదు.
"నేను దురదృష్ట వంతుడ్నే. కాని అందులో కూడా ఏదో తెలియని అదృష్టం ఉంది. సవ్యంగా ఉన్న మార్గాన్ని తప్పానను కున్న నాకు, అంతకంటే మంచి మార్గమే ప్రసాదించ బడింది. గమ్యం తెలియని బాటసారికి అంతకంటే ఇంకేం కావాలి?"
"మీరు జ్వరం లో ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదు. ఎక్కువగా మాట్లాడి మళ్ళీ జ్వరాన్ని ఎక్కువ చేసుకోకండి. కొంచెం విశ్రాంతి తీసుకోండి" అన్నది సురేఖ అతని దగ్గిరగా జరుగుతూ.
"రాత్రి ఏమైనా జ్వర తీవ్రత లో మాట్లాడానేమో కాని, ఇవాళ మాత్రం కాదు. నేనేం మాట్లాడుతున్నది నాకు పూర్తిగా తెలుసు."
"ఉష్. దయచేసి పడుకోండి" అంది, అతని తల మీద నించి చేతిని తీసివేసి హృదయం మీద వేసి నెమ్మదిగా రాస్తూ.
క్షణ కాలం కళ్ళు మూసుకొని రవి అన్నాడు. "నేనంటే ప్రాణం పెట్టె మిత్రులున్నారు. నాకింకేం కావాలి? నేను మంచిగా ఉండడం కోసం -- నా సౌఖ్యం కోసం ఎంత ఆదుర్దా పడుతున్నారు? ఎంత పరితపిస్తున్నారు? నేను నిజంగా ధన్యుణ్ణి."
"అబ్బబ్బ! మీతోటి ఇదే అవస్థ! కాస్త బాగుంటే చాలు; నా అంతవారు లేరంటారు" అన్నది సురేఖ కొంచెం చిరాకుగా.
కళ్ళు తెరిచి ఆమెను చూసి నవ్వి "అన్నాడు అతను.
"రోగి దగ్గిర విసుక్కునేవారు పరిచర్యలు చేయడానికి ఉండకూడదు."
ఇంతలో పళ్ళు, రొట్టేతీసుకొని సురేంద్ర ఆదుర్దాగా వస్తూనే అడిగాడు, "ఎలా ఉంది సురేఖా?" అని.
"జ్వరం తక్కువయినట్లుంది. మళ్లా లేక్చరివ్వడం మొదలెట్టారు."
"అంటే నేను అర్ధం కాకుండా వాగాననా మీ ఉద్దేశ్యం?"
రవి ప్రశ్నకు "అని నేనన్నానా?' అని నవ్వుతూ జవాబిచ్చింది.
సురేంద్ర దగ్గిరికి వచ్చి అతని ఒంటి మీద చేయి వేసి "ఎలా ఉంది రవీ " అని అడిగాడు. ఆ స్పర్శ , ఆ పిలుపులోని ఆప్యాయత, ఆ ప్రశ్నలోని మార్దవం రవి కళ్ళల్లో నీళ్ళు తిరిగేటట్లు చేశాయి.
"మీరున్న తరవాత నాకేం ఫరవాలేదు" బలహీనంగా నవ్వుతూ అన్నాడు.
బత్తాయి, తొనలు అందిస్తూ "రాత్రి మాకు విపరీతంగా భయమేసిందనుకో. అలా చేశావెం?' అని అడిగాడు.
"నాకు తెలిస్తే అలా చేసేవాడ్నా?"
అతని జవాబుకు సురేఖ, సురేంద్ర తృప్తిగా నవ్వారు.
"ఫర్వాలేదు . ఈ సాయంత్రం నాటకానికి ఇబ్బంది ఏం లేదు" అన్నాడు సురేంద్ర తృప్తిగా గాలి పీల్చుకుంటూ.
"అదేమిటి ఈ రోజు నాటకం ఉందా?' రవి కంగారుగా అడిగాడు.
"అవును" అని జవాబిచ్చాడు సురేంద్ర. "ప్రాణం మీదికి వచ్చింది. పాత నాటకమే కాబట్టి మాకు తెలియకుండా కాంట్రాక్టరు ఒప్పుకొని ఎడ్వాన్సు కూడా తీసుకున్నాడుట! ఆ సంగతి మొన్న ఏడ్చాడు. అది ఇక్కడ కూడా కాదు. ఈ సిటీకి పక్కనే ఉన్న ఏదో చిన్న టౌను లో."
"అరెరే! ....నావల్ల రిహార్సల్స్ కూడా ఆగిపోయాయా ఏం?'
"అదేం లేదు. ఆ నాటకాన్ని చాలాసార్లు ప్రదర్శించాం. రిహార్సల్స్ అవసరమేమీ లేదు. కానీ నిన్నోక్కడ్నీ ఏఅ రాత్రి ఎలా విడిచి వెళ్ళాలనే నా వర్రీ!"
"ఐ యామ్ అల్ రైట్. నాకోసమని మీరు నాటకం మానుకోవద్దు. జ్వరం తగ్గు దశలోనే ఉంది. ఏం ఫరవాలేదు."
"సురేఖా , ఏం చేద్దాం చెప్పు?" సురేఖ వైపు తిరిగి ప్రశ్నించాడు సురేంద్ర.
"ఏమో, ఎంత తగ్గు దశలో ఉన్నా, విడిచి పెట్టి వెళ్ళాలంటే నాకు మనసొప్పటం లేదు." జాలిగా ధ్వనించింది ఆమె కంఠం.
"మీరు మరీ నన్ను చిన్నపిల్లాడిలా చేస్తున్నారే! ఫర్వాలేదు, వెళ్లి రండి."
"మీరు చిన్న పిల్లవాడి కన్నా అన్యాయం! అందుకనే మేము పస్తా యిస్తున్నాం."
సురేఖ అన్న ఆ మాట అతన్ని కొంచెం బాధించింది. ఏదో అనబోయి తనను తాను సంభాలించుకొని, "నాకేం ఫర్వాలేదు. మీరు వెళ్లి రండి" అని అటు తిరిగి పడుకున్నాడు.
ఆ మధ్యాహ్నం రెండు సార్లు ఆ నాటకం కాంట్రాక్టరు వచ్చి "పరువు నిలవ బెట్ట" మని ప్రాధేయ సాగాడు. సురేంద్ర విసుక్కున్నాడు. కోపగించు కున్నాడు. చేసేదేమీ లేక చివరకు ఒప్పుకున్నాడు.
సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో సురేఖ , సురేంద్ర నాటకం కోసమని పక్క ఊరికి వానులో బయలుదేరారు. పక్క దగ్గిరే అన్ని అమర్చి పోతూ పోతూ మరీమరీ చెప్పారు , హాయిగా కళ్ళు మూసుకొని పడుకోమని, మందు తీసుకోమని, బత్తాయి తొనలు తినమని. తెల్ల వారగానే ఇట్టే వచ్చి వాలతామని.
అన్నిటికి ఊ కొట్టి పడుకున్నాడు రవిచంద్ర.
వాళ్ళు వెళ్ళిన గంట తరవాత ఒంటరితనం అంటే ఏమిటో అర్ధమయింది. ఏమి తోచక ఏదో పుస్తకం చదవడం మొదలెట్టాడు కాని సాగక దాన్ని అక్కడే పడవేశాడు.
'ఈ జ్వరం నా పరీక్షలకేమన్నా, అడ్డు రాదు కదా?' అనే శంక అతని మనసులో దిగులు మబ్బులు కమ్ముకొనేటట్లు చేసింది. ఏనాడూ తనకు ఈ పరీక్ష ఇద్దామని లేదు. ఏదో సురేంద్ర బలవంతం తోటి , రాజగోపాలం ప్రోత్సాహం తోటి చదవడానికి తను ఉపక్రమించాడు. కానీ చదవడం మొదలెట్టిన తరవాత తను తప్పకుండా ఈ పరీక్ష ఇవ్వాలని, శాయశక్తు లా కృషి చేయాలని ఒక్క కోర్కె, ఉత్సాహం బలంగా జనించాయి. అటువంటి సమయంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా సాయంకాలం పొద్దు పోవడంతో బాటు, తన కాళ్ళ మీద తను నిలబడే టట్లుగా చేసిన ట్యూటోరియల్ కాలేజీ ఉద్యోగం తో బాటు , చదువు కూడా సక్రమంగా సాగుతున్న యీ తరుణం లో ఈ జ్వరం ఏమిటి?
అతనికి గుండె మీద ఏదో పెట్టినట్లని పించింది . నలుమూల లా కమ్ముకుంటున్న చీకట్లు అతని హృదయంలో కూడా కమ్ముకున్నాయి.
ఏమీ తోచక పక్క మీద బరువుగా పడుకున్నాడు అతను. పక్కనే ఉన్న మందు, బత్తాయి జ్వరం వాసనను అతనికి కలిగిస్తున్నాయి. చికాగ్గా గడుస్తున్న సమయంలో రాజగోపాలం, ప్రియంవదల మీదికి అతని ధ్యాస మళ్ళింది. ఆ మరుసటి రోజు వాళ్ళింటికి వస్తానని చెప్పాడు. అంతే, ఆ రాత్రే జ్వరం, పది రోజుల దాకా మూసిన కన్ను తెరవనీయ కుండా! వాళ్లకు తెలియలేదేమో, తనకు జ్వరం వస్తున్న సంగతి. సురేంద్ర చెప్పకుండా ఉంటాడా? సురేంద్ర బయటకు పోయే అవకాశమే ఎక్కడ వచ్చింది, తన జ్వరం గొడవలో నిమగ్నుడవడం తప్ప? వాళ్లకు తెలిస్తే రాకుండా ఉంటారా? తప్పకుండా వస్తారు. ఏమో? వస్తారో రారో! అయినా ఎందుకు రావాలి? వాళ్లకు, తనకు ఉన్న అనుబంధ మేమిటి? తనకు మాత్రం ఏమిటో చెప్పలేనాటు వంటి అనుబంధం ఆ స్నేహంలో ఉన్నట్లు అనిపిస్తుంది. వాళ్ళు అలా అనుకుంటున్నారా?
వాళ్లకు తనకు మధ్య కేవలం స్నేహమేగా ఉన్నది? అంతకంటే ఇంకేం ఉంది? లేదు...లేదు....అంతకంటే ఇంకా ఏమిటో గొప్పది, మాటల్లో చెప్పలేనటువంటిది ఉంది....రాజగోపాలం వస్తాడు. తనను చూడడాని కన్నా తప్పక వస్తాడు! అతని మస్తిష్కం లో ఎన్నో ఆలోచనలు, ఎన్నో శంకలు, ఎన్నో ప్రశ్నలు! ఎందుకనో రాజగోపాలం తప్పక వస్తాడనే ఆశ , నమ్మకం!
గది తలుపులు ఇంతలో గభాల్న తెరుచుకున్నాయి.
చీకట్లో ఎవరూ కనపడలేదు. వచ్చిన మనిషి లైటు వేశాడు. కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతి లో ఆశగా చూశాడు అతన్ని రవిచంద్ర.
అవును, అతను రాజగోపాలం!
బెడ్ దగ్గిరికి వస్తూ , "అరెరే! ఇంత సుస్తీ చేసిందా? చాలా చిక్కిపోయారు! గుడ్ గాడ్!" అన్నాడు.
రవి నవ్వడానికి ప్రయత్నించి విఫలుడయ్యాడు.
"నాకు ఇవాళ్టి వరకు తెలియదు. అ సాయంత్రం మీరు వస్తారేమో నని ఎదురు చూశాం. రాలేదు. అలా చాలారోజులు ఎదురు చూస్తూనే ఉన్నాం. బహుశా స్టడీస్ లో పడి మరిచి పోయారేమోననుకున్నాం. ఇందాకనే సురేంద్ర టెలిఫోను చేసి చెప్పాడు , వాళ్ళు నాటకానికీ వెళ్ళవలసిన అవసరం వచ్చిందని, ఒంటరిగా ఉంచి వెళ్ళుతున్నామనీను. అరెరే!....చాలా శుష్కించి పోయారు!" అంటూ పక్క దగ్గిరే కూర్చున్నాడు.
"ఇవ్వాళ కొంచెం నెమ్మదించింది లెండి." పేలవంగా నవ్వుతూ అన్నాడు రవి.
రాజగోపాలం ఒంటి మీద చెయి వేసి చూసి "జ్వరం ఉంది . మందు తీసు కుంటున్నారా?' అన్నాడు.
"ఆ!" అంటూ పక్కనే ఉన్న మందు సీసాలు చూపించాడు.
"ఇలా చీకట్లో పడుకునారేమిటి? ఈ కిటికీ తలుపులు కూడా వేసుకున్నారు. చలిగా ఉందా?"
"అదేం లేదు. మీరేం కంగారు పడకండి. బాగానే ఉన్నది."
"నాకిదెం నచ్చలేదు. లేవండి. మీరు జ్వరం నయమయ్యెంతవరకు మా ఇంట్లోనే ఉందురు గాని, పదండి. అందుకే నేను వచ్చాను."
రవిచంద్ర కళ్ళతో కృతజ్ఞత కురిపిస్తూ, "మీరు అనవసరంగా మామూలు జ్వరానికి గాభరా పడుతున్నారు. సురేంద్ర, సురేఖా -- పాపం చాలా శ్రమపడి అన్నీ సక్రమం గానే చూస్తున్నారు. రేపటి కల్లా నయమవుతుంది ..." అంటుండగా రాజగోపాలం మధ్యలోనే అందుకొని, "అదేం కుదరదు. లేవండి. కారులో వెళ్దాం" అంటూ రవిచంద్ర ను కూర్చో బెట్టాడు.
"మీకు అనవసరంగా ఇబ్బంది...."
"ఉష్, నేనిప్పుడేమీ వినదలుచు కోలేదు" అంటూ ఒక చీటీ రాసి సురెంద్ర కోసం అక్కడ ఉంచాడు. ఆ గొంతులో ధ్వనించే అధికారానికి రవి ఏమీ ఎదురు చెప్పలేక నెమ్మదిగా రాజగోపాలాన్ని ఆసరా చేసుకుంటూ కారులోకి ఎక్కాడు.
