వాళ్ళిద్దరూ వెళ్లేసరికి రాజగోపాలం, ప్రియంవద బయటనే కూర్చుని ఉన్నారు.
దూరం నించి వస్తున్న రావిచంద్ర్త ను , సురేఖ ను చూస్తూ నెమ్మదిగా ప్రియతో అన్నాడు రాజగోపాలం. "రవిచంద్ర పూర్తిగా మారిపోయాడు. ఇప్పుడుదాదాపు వెనకటి సంగతులే మరిచి పోయినట్లుంది....చూడు, వాళ్ళెలా వస్తున్నారో? జంట బాగుంది కదూ?"
"ఉష్, ఏమిటా మాటలు పెళ్ళయిన వాణ్ణి పట్టుకొని" అంది ప్రియ నెమ్మదిగా కసురుతూ భర్తను.
"పెళ్లయినంత మాత్రాన అనగూడదని ఎక్కడుంది? ఇద్దరూ కలిసి వస్తున్నారు . జంట బాగుంది కాబట్టి బాగుందని అన్నాను.....అందులో........
"ఉష్......చాల్లెండి మీ మాటలు......రండి, రండి........" అంటూ రవిని, సురేఖ ను ఆహ్వానించింది ప్రియ కుర్చీ లోంచి లేస్తూ పెద్దగా.
ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ, "ఏమిటి గాలి మేస్తున్నారా?" అన్నాడు రవి.
"కాదు, చపాతీలు మేస్తున్నాను" అన్నాడు రాజగోపాలం ఎదురుగా ఖాళీ చేసిన ప్లేటును చూపిస్తూ.
"చపాతీలు మేయడం అయిపొయింది. ఇప్పుడు ఊసుపోక కబుర్లు చెబుతున్నారు." అంది ప్రియ.
"సరదాగా కూర్చుని చెప్పండి, చెప్పండి అని భార్యలు వేధిస్తుంటే , ఏం చేస్తారు చెప్పండి భర్తలు కబుర్లు చెప్పక?' రాజగోపాలం అందుకున్నాడు.
రవి, సురేఖ ఒకరి నొకరు చూసుకొని నవ్వుకున్నారు.
రాజగోపాలం మాట మార్చుతూ, "పరీక్షలు ఇవాల్టి కి అయిపోయాయను కుంటాను" అన్నాడు.
'అవును.' మందహాసంతో రవి అన్నాడు.
"ఎలా చేశారు?"
"ఫర్వాలేదు , బాగానే చేశాను" సంతృప్తిగా అన్నాడు రవి.
మరాఠీ పిల్ల కాఫీలు తీసుకు వచ్చి అందరికీ ఇచ్చింది.
"ఈ కాఫీ రవిచంద్ర గారు బాగా పరీక్షలు రాసినందుకు...." ప్రియ నవ్వుతూ అంది.
సురేఖ "ఇది అన్యాయం. వారు బాగా రాస్తే వారు పాసవుతారు. మనకి ఒరిగేదే ముంది?' అంది.
"ఎందుకు ఓరగదూ? నాగపూర్ లోనే వారి పోస్టింగు అవుతుందను కొండి. మీ నాటకాల టిక్కట్ల న్నీ వారి చేత అంట గట్టించవచ్చు."
అందరూ బిగ్గరగా నవ్వుకున్నారు.
"ఎవరో చెప్పినట్లు ఆలూ లేదు చూలూ లేదు కాని........"అని మధ్యలోనే తుంచి వేశాడు రవి.
అంతలోనే "కొడుకు పేరు సోమలింగ మట" అని పూర్తి చేసింది ప్రియ అందరి నవ్వుల మధ్య.
"ఉహూ! మా ఆవిడ కు కూడా సామెతలు వచ్చునే!" రాజగోపాలం దరహాసముతో అందుకున్నాడు.
"మీరే తెలివి కలవారు ఈ ప్రపంచంలో. పాపం! అంది ప్రియ ముక్కు విరుస్తూ. ప్రియ ఆ ముక్కు విరిచేటప్పుడు రాజగోపాలానికి చూడ ముచ్చటగా ఉంటుంది.
"సురేంద్ర ఏడీ? " అని అడిగాడు రాజగోపాలం.
"ఇంకెక్కడి సురేంద్ర అండీ! అయన బొమ్మ పేపర్ల లో తప్ప ఇహ మనిషిని చూడలేం!"
సురేఖ హాస్యం రాజగోపాలానికి అర్ధం గాక , "అదేం? ఏమయింది?" అన్నాడు.
"బొంబాయి నించి స్క్రీన్ టెస్టు కు పిలుపు వచ్చింది. ఆ ఆదుర్దా లో ఉన్నాడు' ఇవ్వాళ మధ్యాహ్నమే మా కంపెనీ కి సురేంద్ర పేరున సిన్హా ఉత్తరం వ్రాశాడు."
"లాక్కీ చాప్! సినిమాల్లో చాన్సు దొరికితే మాత్రం మనవాడు గొప్పగా షైను అవుతాడు. ఇప్పుడున్న హీరోలకు అతనే మాత్రం తక్కువ వాడు కాదు.' రాజగోపాలం గొంతులో మెచ్చుకోలు ధ్వనించింది.
'అందులోనూ హిందీ ఫీల్డు. ప్రోత్సాహం దొరికితే చాలా బాగుంటుంది." ప్రియ భర్తను సమర్ధించింది.
'అన్నీ బాగానే ఉన్నాయి. ఇహ మీరు బి.ఎ పాసవటమే మిగిలింది, సురేఖా!" రాజగోపాలం మాటలకు సురేఖ బిక్క మోహం పెట్టి, "ఏం లాభం? వారి పరీక్షల్లో పడి మా పరీక్షలు మరిచి పోయారు మాస్టర్లు. నేను ట్యూటోరియల్ కాలేజీ కి వెళ్లి దాదాపు ఇరవై రోజులయింది" అంది. ఆమె పెట్టిన ఆ ఫోజు తో అందరికీ నవ్వు వచ్చింది.
రవి "ఇంకా ఏదో ఆ ప్రిన్సిపాల్ మంచివాడు కాబట్టి నేను రెండు నెల్ల నించి పోకపోయినా నన్ను ఉద్యోగంలో ఉంచాడు. మీరు స్టూడెంట్స్. ఈపాటికి మీ పేరు రిజిష్టర్ లోంచి తొలగించబడే ఉంటుంది" అన్నాడు.
"ఆ అవస్థాలన్నీ రెగ్యూలర్ కాలేజీ ల్లో. ట్యూటోరియల్ కాలేజీ ల్లో ఆ పని చేస్తే వాళ్ళ పేర్లను భార్యలు తమ రిజిస్టరు లోంచి తొలగిస్తారు, సంపాదించని వాళ్ళు ఎందుకు పనికి వస్తారని."
సురేఖ మాటలకు పొట్ట చెక్కలయ్యే టట్లు నవ్వి రాజగోపాలం "మొత్తానికి గురువును మించిన శిష్యురాలి వనిపించుకున్నావు!" అన్నాడు.
"ఏదో మీ దయ వల్ల" అంది సురేఖ చటుక్కున. ఇహ ఆ నవ్వులకు అంతేలేదు కాసేపటి వరకు.
ఇంతలో సురేంద్ర దాదాపు పరిగెత్తు కుంటూ వచ్చాడు.
రాజగోపాలం అతని చేతిని ఆప్యాయంగా ఒత్తుతూ "గుడ్ న్యూస్ , కంగ్రాచ్యు లేషన్స్!" అన్నాడు.
సురేంద్ర "థాంక్స్" అంటూ , "ఇగో ఉత్తరం" అని రాజగోపాలానికి చూపించ బోయాడు.
"ఎందుకూ ఉత్తరం ? ఉత్తరం లేకపోయినా నమ్ముతూనే ఉన్నారుగా!" అంది సురేఖ.
ప్రియ ఆమెను కుతూహలంగా చూస్తూ లోనికి వెళ్ళింది. సురేంద్ర కొంచెం చిన్నబుచ్చు కొని ఉత్తరం జేబులో పెట్టుకున్నాడు.
అందరి హ్రుదయాలు ఆనందంతో నిండిపోయాయి. దేదీప్యమానంగా అ రాత్రి వచ్చింది. ఆ ఇంటి గార్డెను మధ్యలో అమర్చిన నీటి రంగు బల్బు ఆ తోటకు నీలం రంగు కాంతిని తొడిగింది. కుర్చీల దగ్గిరే ఉన్న గులాబీ చెట్టు విరగబూసిన పుష్పాలతో శోభాయమానంగా కనిపించసాగింది.
"ఈ శుభ సమయంలో మీ అందరికీ మా ఇంట్లో డిన్నర్" అంది లోనికి వెళ్లి వచ్చిన ప్రియ.
ఆమెను ఆప్యాయంగా చూస్తూ రాజగోపాలం "ఇప్పుడు నీవు నిజమైన గృహిణి వనిపించావు" అన్నాడు.
ప్రియ ముక్కు విరుపు , వాళ్ళ నవ్వులు ఆ సన్నివేశానికి మరింత శోభ తెచ్చాయి.
13
"ప్రియమైన రాజగోపాలం గారూ,
నమస్తే,'
బహుశా ఇది నేను మీకు ఇక్కడ నించి వ్రాసే ఆఖరి ఉత్తరమను కుంటాను. సాయంకాలం ఆటలయిన తరవాత డిన్నరు తీసుకున్న తరవాత మీకు ఈ ఉత్తరం రాయడానికి కూర్చున్నాను.
ముస్సూరీకి ట్రెయినింగు కోసమని వచ్చి దాదాపు రెండు సంవత్సరాలయింది. ఈ రెండేళ్ళ నించి ఎన్నోసార్లు మీరు, ప్రియంవద గారు జ్ఞాపకం వచ్చారు. ఎన్నోసార్లు మీ అందమైన డాబా, ఆ అందమైన దాబాలోని అందమైన మనస్సులు కలిగిన అందమైన మనుష్యులు కళ్ళ ముందు కనబడుతుండే వారు. ఆ క్షణాల్లో రెక్కలు కట్టుకొని అక్కడ వాలాలని పిస్తుండేది.
ఇప్పుడు నన్ను నేను ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నాకే ఆశ్చర్యం వేస్తున్నది! ఈ జీవితాన్ని గడిపింది నేనేనా. అనే శంక కూడా కలుగుతున్నది. మొన్న మీరు వ్రాసిన ఉత్తరంలో నన్ను పొగుడుతూ ఇదంతా నా పట్టుదల వల్ల సంభవించిందని వ్రాశారు. మీలాంటి ఉత్తముల సాహచర్యం, సురేంద్ర , సురేఖల ఆదరణ లభ్య పడక పోయినట్లయితే నా పట్టుదల గాలిలో కలిసి పోయి ఉండేది. నేనెంత పట్టుదల మనిషి నో నాకు బాగా తెలుసు. మీరేదో మాటల్లో ఒక రోజు అన్నారు, నా బలహీనతలు నాకు తెలుసనీ. అదొక్కటే సుగుణం, నన్నింత వరకూ వదిలి పెట్టింది.
ఆనాడు నేను ఇంటర్యూ లో కూడా విజయం సంపాదించానన్న సంగతి తెలిసిన నాడు మీరందరూ మీరే పరీక్ష పాసయినట్లు గా సంతోషం చెందారు. ఆ ఆనందాన్ని, అ ఉత్సాహాన్ని చూసిన నాకు గర్వంతో మాటలు రాలేదు. నేను ఐ.ఎ యస్ పాసయినందుకు కాదు ఆ గర్వం. మీలాంటి మిత్రులు లభ్యమయి నందుకు ఆగర్వం. గుండెల్లో ఒక పక్క మిమ్మలందర్నీ విడిచి వెళుతున్నాననే విచారం, ముప్పిరి గొంటుంటే , మరోపక్క ఒక కొత్త జీవితాన్ని రుచి చూడబోతున్నాననే సంతోషం నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే నాగపూర్ నించి నేను ఇక్కడకు వచ్చాను.
ఆరోజు మీరందరూ నాకు వీడ్కోలు ఇవ్వడానికి వచ్చిన రోజు ఇప్పటికీ , ఎప్పటికీ మరిచి పోలేను.
మీ స్వంత తమ్ముడు మీనుంచి దూరంగా వెళుతున్నప్పుడు ఎలాంటి ఆవేదన, ఆందోళన పడతారో అలా నాపట్ల ప్రదర్శించారు.
ఎవరూ లేరనుకున్న నాకు , జీవితంలో మోసగించబడ్డాననుకున్న నాకు, బ్రతుకులో ఓటమిని డీ కొన్నాననుకున్న నాకు మీరు కనిపించారు. నా నిరాశా నిస్పృహలను సమూలంగా పెకిలించి వేసి ఒక నవ్య జీవిత పథం వైపు నేను మళ్లేటట్లు చేశారు. సురేంద్ర నన్ను గురించి ఆవేదన చెందడం ;లో, ఆనందం, పొందడం లో నేను అంతగా ఆశ్చర్య పడవలసిన విషయమేమీ లేదు. వాడు నా చిన్ననాటి మిత్రుడు. చిన్నప్పుడు ప్రాణానికి ప్రాణంగా ఉండేవాళ్ళం. మళ్ళీ కొన్నేళ్ళ తరవాత దాదాపు ఒకర్ని మరొకరు మరిచి పోయిన తరవాత పరిస్థితులు మమ్మల్ని చిత్రంగా కలిపాయి. యాదృచ్చికమైన అ సంగమం మమ్మల్ని మరింత బాగా అర్ధం చేసుకోనేటట్లు చేసింది.
సురేంద్ర కు నేను ఐ.ఎ.యస్ పరీక్షకు కూర్చోవాలనే ఆలోచన ఎలా తట్టిందో తెలుసుకోలేనంతటి తెలివి లేని వాణ్ణి కాను. ఆ ఆలోచన అతనికి వచ్చేటట్లు చేసింది మీరు. నన్ను ఒప్పించేటంతటి సాన్నిహిత్యం మీకు లేదనుకొని, మీరు సురేంద్ర చేత ఆ పని చేయించారు. నేను దిగులుతోటి, మానసిక వేదన తోటి, తల్లడిల్లి పోతుంటే మీరు కూడా మానసికంగా బాధపడ్డారు. నా దృష్టి ఆ దురదృష్టసంఘటన నించి మరలించాలని, నన్ను మళ్ళీ మామూలు మనిషిగా చేయాలని మీరు శతవిధాల కృషి చేశారు. మనకు పరిచయమైన ఆ మొదటి రాత్రే , ఆ ట్రెయిను లోనే మీరు నామీద సానుభూతి , ఆప్యాయత కురిపించారు. ఇదంతా కేవలం ఏదో మీరు నానుంచి ఆశించి చేసింది కాదు. మనిషికి, మనిషికి ఉన్న అనుబంధం ఎంత విలవయిందో , ఎంత పవిత్రమయిందో మీకు తెలుసు కాబట్టి నా పట్ల అంత దయార్ద్ర హృదయులయ్యారు. పరిశుద్దమైన మనస్సు, పరిస్తితులను చక్కగా అర్ధం చేసుకొని ఆలోచించే మస్తిష్కం మీ కుంది కాబట్టి అలా చేయగలిగారు. ఏ పరిస్థితుల్లో ఇల్లు వదిలి వచ్చానో నేను మీకు చెప్పకపోయినా , రవీంద్ర ద్వారా మీకు అన్నీ తెలుసు. అయినప్పటికీ ఎన్నడూ ఆ సందేహాన్ని నాకు కలిగించే విధంగా మీరు ప్రవర్తించ లేదు. ఏళ్ళ తరబడి నేను నాగపూర్ లో నివసిస్తున్నట్లుగా నాకే నమ్మకం కలిగేలా మీరు నాతొ ప్రవర్తించారు. మీకు ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకు అర్ధం కావడం లేదు. మీ మంచితనాన్ని పరిపూర్ణంగా అనుభవించానని ఉత్తరం ద్వారా కృతజ్ఞత లు అందచేయడం వినా నేనేం చేయలేని ఆశక్తుడ్నీ.
సురేంద్ర ఫోటోలు -- 'కొత్త నటుడు' అన్న శీర్షికల కింద పత్రికల్లో చూసినప్పుడు నా ఆనందానికి అవధులు లేవు. సురేంద్ర సినిమా ప్రపంచపు అనుభవాలన్నీ ఉత్తరాల ద్వారా తెలియ చేస్తుంటే పదేపదే చదువు కుంటుండేవాణ్ణి. ఆ ఉత్తరాలు చదివి ఆ సినిమా చూడాలని ఎంత ఉవ్విళ్ళూరాను! ఎంత ఆదుర్దా చెందాను!
అ సినిమా ఇక్కడకు వచ్చిన మొదటి రోజు చూశాను.
సురేంద్ర బాగా చేశాడని పించింది నాకు. కధా, అది బాగుండక పో బట్టి చిత్రం విజయవంతం గా నడవక పోవడం నిజంగా సురేంద్ర దురదృష్టం . తరవాత బుకింగ్స్ రాలేదని, నేను మళ్ళీ నాగపూర్ వెళ్లి పోతున్నానని నాకు ఉత్తరం రాశాడు ఇక్కడకు. ఇప్పుడు నాగపూర్ లోనే ఉన్నాడని మీ ఉత్తరం ద్వారా తెలిసింది. అతడు నిరుత్సాహం చెందకుండా ఉండేటట్లు మీరు చూస్తారని నాకు నమ్మకం ఉంది. వాణ్ణి చూడటానికి నేను చాలా ఆదుర్దా గా ఉన్నాను. సురేఖ ఈ మధ్య అంత ఎక్కువగా మీ ఇంటికి రావడం లేదని, కనపడటం లేదని వ్రాశారు. సురేఖ క్షేమంగా ఉందని నేను భావిస్తున్నాను. కనపడితే నా శుభాకాంక్షలు అందజేస్తారు గదూ?
నా జీవితంలో ఎన్నడూ కలలో నైనా తలచని కొత్త అనుభవాలు పొందుతున్నాను. ఈ ట్రెయినింగ్ నా కో ఆఫీసర్ల తో సాహచర్య ము అనుభవించిన తరవాత జీవితానికి ఒక అర్ధము, ఒక ప్రయోజనము ఉన్నాయని పిస్తుంది. నిజంగా పాదరసం ప్రవహిస్తుంది వీళ్ళలో.....ఏదో తెలుసుకోవాలనే తపన, విజ్ఞానా కాంక్ష, చైతన్యము అందర్నీ తీరిక వేళల్లో కూడా ఏదో పనిలో నిమగ్నులయ్యేటట్లు చేస్తున్నాయి. మనదేశం ఎన్ని ఇబ్బందుల నైనా లెక్క చేయకుండా మన జాతిని నిర్మాణాత్మకమైన మార్గం లోకి మళ్ళించాలానే బలమైన కోరిక ఇక్కడున్న ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఇక్కడ ప్రస్తుతం ట్రెయినింగు పొందుతున్న నూట యాభయి మంది లోను ఇరవై మందిని మహారాష్ట్ర ప్రాంతానికి ఎలాట్ చేశారు. ఆ ఇరవై మందిలోనూ నేను ఉన్నాను. నన్ను ఆప్షన్ అడిగితె నేను నాగపూర్ కోరుకున్నాను.
ఇవాళే నాకు ఆర్డర్స్ వచ్చాయి, నాగపూర్ లో అసిస్టెంటు కలెక్టరు గాపోస్తూ చేసినట్లు. ఇదంతా నా అదృష్టం కాకపొతే ఇంకేమిటి? నాగపూర్ లోనే పోస్టింగ్ అవుతుందని నేను కలలో కూడానుకొని విషయాల్లో మరొకటి. ఇంకా కొంతకాలం నాగపూర్ లో మీ మంచితనం అనే గొడుగు కింద నేను సేద తీర్చుకోవాలి కాబోలు! నేను వచ్చే శనివారం ఎక్స్ ప్రెస్ లో బయలుదేరి నాగపూర్ వస్తున్నాను.
ప్రియంవద గారికి నా శుభ కాంక్షలు.
మిగిలిన విషయాలు మీ సమక్షంలో.
-- రవిచంద్ర."
రాజగోపాలం పెద్దగా చదవడం పూర్తీ చేసిన తరవాత శ్రద్దగా వింటున్న ప్రియను చూస్తూ , "చూశావా , నే నెంత మంచివాణ్ణి. ఇప్పటికైనా అర్ధమయిందా?" అన్నాడు హాస్యంగా ఆమెను చూస్తూ.
