Previous Page Next Page 
బ్రతుకు బాట పేజి 18


    ''డబ్బు కోసం బాధపడకండి సుమిత్రా! మీకు నేను యిస్తాను-- ఇతరుల సమస్య కోసం మీ మెదడు ఎందుకు కుళ్ళ బెట్టు కుంటారు! విశ్వానికి ఉత్తరం వ్రాయండి. నేనింక నీకు డబ్బు పంపలేను బాబూ! అని!' అన్నాడు బసవరాజు.    
    'వాడంటే నాకు అభిమానం ఎక్కువ! ఆపని చెయ్యలేను-- వాడసలు డబ్బు వ్యర్ధం చేసే మనిషి కాదు. అవసరం అయితేనే కానీ వ్రాయడు!' అంది సుమిత్ర.
    'ఒక్కొక్కసారి మీరు చాలా అమాయకంగా మాట్లాడతారు సుమిత్రా! అతడిని ఇంజనీరింగ్ లో చేర్పించాడంటే మీ అన్నయ్య కి డానికి తగ్గ స్తోమతు వుండే వుంటుంది. కొందరు తమ బాధ్యత లన్నింటినీ ఇతరుల మీద తోయ్యడానికి చూస్తారు. హక్కులు మాత్రం వాళ్ళకే వుండా లంటారు. మీరు డబ్బు పంపడం ఆపండి, ఆయనే పంపిస్తాడు తరువాత! నిర్మొహమాటంగా వ్రాసెయ్యండి. మీ చెల్లెలు ఇక్కడ ఉందనీ అందుకని డబ్బు పంపలేక పోయాననీ!' ఆవేశంగా అన్నాడు. సుమిత్ర మాట్లాడకుండా కూర్చుంది.
    'ఈడొచ్చిన ఆడపిల్ల నడవడిని కని పెట్టకపోవడం , కనిపెట్టి సరిదిద్దక పోవడం ఒక తప్పు. వాళ్ళ తప్పును చూసుకుని వాళ్ళు భయపడి, దాని పరిష్కారం కోసం మీ నెత్తిన రుద్దడంరెండో తప్పు. మీరు ఇక్కడ పరువుగా బ్రతుకుతున్నారు. ఇలాంటి విషయాలు తెలీని వారు. ఆ అమ్మాయికి పురుడు పోయమని మీ దగ్గర వదలడం అన్యాయం! మీరెందుకు అంగీకరించారాసలు?' అన్నాడు బసవరాజు మళ్ళీ --
    'న్యాయాన్యాయాలూ, ధర్మా ధర్మ విచక్షణ లూ, వీటన్నింటికీ అతీతమైంది రక్తసంబంధం . నాకు మొదటి నుంచీ అమ్మా, నాన్నా, అన్నయ్య లన్నా, అక్కన్నా ఎంతో అభిమానం ప్రేమా ఉండేవి. వాళ్ళ కోసం ఏదైనా చెయ్యాలని పిస్తుంది. వాళ్ళు కష్టపడుతూ వుంటే నేను సహించలేనెమో అనిపిస్తుంది. ఆ ఉద్రేకంలో వాళ్ళు ఏం చేసినా సరే నంటాను-- అది బలహీనతేమో! సావిత్రి స్థితి చూసి నేను చలించి పోయాను. వదన కన్నీళ్ళు చూసి కరిగిపోయాను. ఎబార్షన్ చేయించి తీసుకేడతానంది. ఒకరిద్దరు డాక్టర్ల ని కన్సల్ట్ చేశాం. వాళ్ళ చేత చివాట్లు తిన్నాక ఈ డాక్టర్ గారి దగ్గరకు వచ్చాం.
    'తెలియక చేసింది కాబోలు! కానీ ఇంత చిన్న వయస్సులో ఈ పిల్లకు గర్బిణీ రావడం చాలా ప్రమాదం -- ఎబార్షన్ అయితే మరీ ప్రమాదం -- నవమాసాలు మోసి; మందులూ ఇంజక్షన్లూ తీసుకున్నా కాన్పు తేలిగ్గా రాదేమో ఈ అమ్మాయికి. అందుకని నా మాట విని అల్లాంటి పనులు తలపెట్ట కండి. బిడ్డ పుట్టాక అనాధ శరణాలయాని కైనా అప్పగించ వచ్చు' అన్నారావిడ.
    'దీన్ని తీసుకెళ్ళి అక్కడ నేను తల ఎత్తుకు తిరగలేను సుమిత్రా!' అని విలవిల లాడింది వదిన.
    ఇక నేనేం చెయ్యను చెప్పండి.'
    'మీరు చేసింది తప్పని కాదు సుమిత్రా! కానీ ఇది మీరు మోయ తగ్గ బరువు కాదు -- ' అన్నాడు బసవరాజు.
    'కానీ తప్పదు-- ' అన్నది సుమిత్ర.
    'ఎలా జరగాల్సింది అలా జరుగుతుంది . మీకేమిటి బెంగ! చదువుకోండి . డబ్బు కోసం యిబ్బంది పడకండి నేనున్నానుగా!' అన్నాడు అతను.
    సుమిత్ర తలఎత్తి అతని వంక చూసింది. అతని కళ్ళ నిండా నిండిన అనురాగాన్ని దాచుకునే ప్రయత్నం చెయ్యలేదు అతను. మొన్న మొన్నటి వరకూ తనెవరో తెలియదు అతనికి! కానీ తన మీద ఎందుకంత అపేక్ష అతనికి!
    ఈమాత్రం సానుభూతి తనతో రక్తం పంచుకు పుట్టిన వాళ్ళ కెందుకు లేక పోయిందో!
    'ఇక నేను వెడతాను! సావిత్రి ఒక్కతీ పని చేసుకుంటూ వుంటుంది.' అని లేచింది సుమిత్ర.
    'మరేమీ అనుకోకండి రాజూ! నా సమస్య లన్నీ గట్టెక్కితే గానీ మీ ఇంటికి రాలేను-'అన్నది బస్సు ఎక్కుతూ.
    ఆమె చేతిని మృదువుగా నొక్కి చిరునవ్వు నవ్వాడతను --
    ఇప్పుడెందుకో మనస్సు తేలికై నట్లు అనిపించింది సుమిత్రకి.
    హృదయంలో బరువు ఎవరితోనైనా పంచుకుంటే గానీ తగ్గదు.
    పరీక్షలు దగ్గర పడుతున్నాయి.
    ఎలా చదువుతున్నావని ప్రొఫెసర్ కరుణాకరం చాలసార్లు అడిగారు. కుముదిని చాలా దీక్షగా చదువుకుంటోంది. హైస్కూల్లో చదివే అగర్వాలా కూతుళ్ళే పరీక్షల కోసం కంగారు పడుతుంటే , తన స్థితి కి నవ్వొచ్చింది సుమిత్రకి.
    భగవంతుడంటూ వుండి తనలాంటి వాళ్ళ మొర ఆలకించే దయగుణమే అయన కుంటే తను వెళ్లేసరికి సావిత్రి ప్రసవించి ఒక వొడ్డున పడాలి. ఇదొక్కటే తను కోరుకునేది.
    ఇంటికి రాగానే సావిత్రి మంచినీళ్ళూ కాఫీ అందించి, "పెద్దత్త ఉత్తరం వ్రాసింది. ఇదిగో!' అని ఇచ్చింది. తన ఎడ్రస్ కి వచ్చే ఉత్తరాలేవీ సావిత్రి విప్పి చదువదు తను యిచ్చేవరకూ. ఎన్నో మంచి గుణాలు నేర్చుకున్న సావిత్రి ఒకే ఒక తప్పు చేసి జీవితంలో ముళ్ళు నింపుకున్నది.
    ఉత్తరం విప్పింది సుమిత్ర.
    'ఇన్నాళ్ళ కు నీకు ఉత్తరం రాయగలుగుతున్నాను. కృష్ణుడు బాగా చదువు తున్నాడా? నువ్వు వాడిని శ్రద్దగా కనిపెట్టి వుండి బాగా చదివిస్తావనే నమ్మకం వుంది నాకు. కాలేజీ లో చదివే కుర్ర వాళ్ళందరి కీ రిస్టు వాచీ లుంటాయి. పాపం వీడికే లేదు. ఈమధ్య నేనిక్కడ చరఖా సంఘంలో చేరి చిలువలు వడికి అమ్మగలుగుతున్నాను. అంతే కాదు. మా ఇంట్లో సగం బ్లాక్ డెవలప్ మెంటు ఆఫీసు కి అద్దె కిచ్చాం. అద్దె బాగానే వస్తున్నది. ఈ ఏడు చెరుకు కూడా బాగానే పండింది. అందుకని నేను కష్టపడి దాచుకున్న డబ్బులో రెండొందలు రూపాయలు కృష్ణుడి కి పంపుతున్నాను. వాడికి గడియారం కొనిపెట్టు. ఈసారి నువ్వొచ్చే టప్పుడు నాకు నీలం రంగు గద్వాల్ చీరే తెచ్చిపెట్టు. తెచ్చాక డబ్బులు యిస్తాను--' అసహనంగా వుత్తరం మడిచి వేయబోతూ వుంటే కాగితం వెనక మరికొన్ని పంక్తులు కనపడ్డాయి.
    'సావిత్రిని గురించిన సంగతులు కృష్ణుడు వ్రాశాడు. ఇలాంటి వన్నీ నువ్వేందుకు నెత్తిన వేసుకుంటావు? ఆమెని తిరిగి పంపించివెయ్యి. లేకపోతె నీ భవిష్యత్తు కే దెబ్బ.'
    'బాగుంది నీ సలహా' అని ఉత్తరం మడిచి సొరుగులో పడేసింది సుమిత్ర. అలసటగా కుర్చీలో వెనక్కి వాలింది.
    'ఇవాళ కృష్ణుడి పేరేదైనా మనీ ఆర్డర్ వచ్చిందా సావిత్రీ!' అని అడిగింది.
    'లేదు అత్తా! వాడికి ఉత్తరాలూ, డబ్బూ అన్నీ కాలేజీ కే వస్తాయి -- ఈ మధ్యన వాళ్ళ నాన్న యాభై రూపాయలు పంపాట్ట. వాటితో స్నేహితులతో కలిసి జల్సా చేస్తున్నాడు పది రోజుల నుంచీ!' ఇన్ని నెలలుగా తన దగ్గర వుంటూ , ప్రయివేటు గా డబ్బూ , ఉత్తరాలూ తెప్పించు కుంటూ తిరిగేటంత తెలివి గల వాడయ్యా డన్న మాట కృష్ణుడు.
    ఇల్లాంటి వాళ్లకి వాళ్ళ పాఠం వాళ్ళకే అప్పగించాలి.
    నిజానికి ఈ జీవితం అంతా ఒక పెనుగులాట. ఎవరి బ్రతుకు కోసం వాళ్ళ ఆరాటం. రెండో వాడిని అణచి పెట్టి తను పైకి పోవాలనే ఆకాంక్ష! చిన్న చేపల్ని మింగాలని చూసే పెద్ద చేపల్లాగా ఈ మనుష్యులందరూ ప్రవర్తిస్తుంటారు. ఎత్తులకి పై ఎత్తులు వేయలేని వాళ్ళ అట కడుతుంది. ఈ చదరంగం లో గెలవడానికి, లౌక్యం నటనా ఎంతో ప్రధానం.
    'నేను అలా బయటికి వెళ్లొస్తాను-- జాగ్రత్తగా వుండు సావిత్రీ! లేటయితే క్యారియర్ తెచ్చుకుందాం -- నువ్వు శ్రమ పడకు!'" అని కుర్చీలో నుంచి లేచింది సుమిత్ర.
    'నువ్వామాట అంటావని తెలిసీ అప్పుడే వంట చేసేశాను-- నువ్వు ఎంతసేపు తిరిగి వచ్చినా సరే" అంది సావిత్రి.
    మార్కెట్ కీ, ప్రావిషన్ స్టోర్ కీ, అన్నింటికీ తను వెళ్ళాల్సిందే! కృష్ణుడు ఇలాంటి పనులు చెయ్యడు. యిప్పుడు సావిత్రి బయల్దేరుతోంది. కూరలు కొని వస్తూ వుంటే వెంకటేశ్వర స్వామి కోవెల కనిపించింది. కనిపించడం కాదు- ఆహ్వానించింది. హేతువాదం ఎంత జీర్ణింపజేసుకున్నా మనస్సు నిండా ఆందోళన వున్నప్పుడు దేవుడు గుర్తురాక. మానదు. అంతేకాదు. అయన ముఖం అప్పుడు దివ్య సుందరం గా, మంగళ ప్రదంగా , అమిత శోభాస్కరంగా , వెలుగులు వెదజల్లుతూ , కరుణ కురిపిస్తూ దర్శనం యిస్తుంది. ఆత్మవిశ్వాసాని అందిస్తుంది. ధైర్య వచనాలు పలుకుతుంది. ఇవన్నీ మనస్సు లో చెలరేగే భావాలే అనవచ్చు. ఏమైనా అనుకోవచ్చు. కానీ, దైవదర్శనం వలన లాభమే వున్నది కానీ నష్టం లేదు-- దైవదర్శన ఫలాన్ని ఈ విధంగా అన్వయించుకుని జీవితంలో పురోగమింప గలవాళ్ళు ధన్యులని సుమిత్ర ఉద్దేశ్యం . ఇతరుల సాంత్వన వచనాలు, ప్రబోధాలు, ధైర్య వచనాలు మనలో ఎలా ఆత్మవిశ్వన్నీ బలాన్ని పెంపొందింప గలవో, దేవుని ముఖం కూడా అలాగే చేయగలదని అనుకుంటుంది సుమిత్ర. అందుకే దేవాలయం నుంచీ వస్తూనే మనస్సంతా కేంద్రీకరించీ మెదడు కు పదును పెట్టి రాత్రి పన్నెండు గంటల వరకూ చదవ గలిగింది. అప్పుడు రెండవ అట సినీమా చూసి ఇంటి కి వచ్చాడు కృష్ణుడు.
    'ఇంకా చదువుతున్నావా పిన్నీ!' అంటూ.
    'అవును -- నా శక్తి సామర్ధ్యాలే నాకు ఆస్తి పాస్తులు , చదవందే నాకెలా జరుగుతుంది! సరే గానీ డబ్బు పంపిందా అమ్మ!' నెమ్మదిగా అడిగింది.
    'ఇవ్వాళే అందింది పిన్నీ-- వాచీ కొందామని ఫ్రెండ్స్ తో బజారు వెళ్లాను-- నాకు నచ్చిన వాచీ ఒక్కటీ కనిపించలేదు. బసవ రాజు గారి చేతిని వుంటుంది చూశావా అలాంటిది కావాలని--! ' అతనింకేదో అనబోతూ వుండగా , 'ఇప్పుడు వాచికేం తొందర కృష్ణా! ఇంకో వారం రోజుల్లో పరీక్ష ఫీజు టరమ్ పీజు కట్టాలి గదా? ప్రస్తుతం నా దగ్గర డబ్బు లేదు-- తరువాత కొండువు గాని! ఫీజు కట్టి మిగతా డబ్బు దేనికైనా వుంటుంది దాచుకో! నా పరిస్థితి చూస్తున్నావు కదూ! నేనూ పరీక్ష ఫీజు కట్టాలి. పైగా ఈ నెల నుంచీ ట్యూషను చెప్పడం మానుకుంటున్నాను -' అని గబగబ అనేసి, అతను సమాధానం యిచ్చే అవకాశం లేకుండా లైట్ ఆపేసి పడుకుంది సుమిత్ర.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS