Previous Page Next Page 
ప్రేమకు పగ్గాలు పేజి 18


    భాస్కరం గురించి ఆలోచించని క్షణంలేదు. పద్మావతి. "తను వాల్తేరు రాగానే అమ్మకి చూపెడ్తాను. అమ్మకి నచ్చుతాడు-యిక హాయిగా తాను నిబ్బరంగా..........." అని రక రకరకాలుగా అనుకున్నది; పద్మావతి కాని, భాస్కరం రానేలేదు తన ఇంటికి.
    'ఔను నాదే తప్పు సాంప్రదాయాలు ఎంచి ప్రేమించాలీగాని, నా కన్నా మంచి కుటుంబంలో వున్న వారిని ప్రేమించడమేమిటి?" అనుకుంది.
    "ఇంతకీ తనకేం తక్కువ-ఏది తక్కువ......?"
    గభిక్కున లైట్లు వెలిగినట్లనిపించింది. "అరె! అప్పుడే అయిపోయిందా?" అన్నది పద్మావతి ఉలిక్కిపడ్డట్లు.
    "బాగుందే తల్లీ? ప్రశ్న..........ఇది ఇంటర్ వెల్............ఇంకా కధలో విలన్ హీరోయిన్ ని కిడ్నాప్ చేయందే" నన్నది నవ్వుతూ సురేఖ.
    "పోదా మేమిటి?" అన్నది కణతలు నొక్కుకుని పద్మావతి.
    "నువ్వు నీనుంచి పారిపోవాలనుకుంటున్నావ్ పద్మా...........సినీమాలోనించి కాదు.......అంచాత ఇక్కడే ఉండు-భాస్కరంగారు ప్రేమా కాస్సేపూ దూరంగా ఉండనీ-క్లాసూ పాఠాలు జ్ఞాపకం తెచ్చుకో.......అదుగో అటు చూడు- నీ కోసరం ఎంతమంది మన ఫ్రెండ్సు హడావుడిగా మరోసారి అవతలి కెళ్ళి, అద్దం ఉన్న దగ్గరికల్లా వెళ్ళి తలలు దువ్వుకుంటున్నారో.........వాళ్ళని డిసెప్పోయింట్ చెయ్యకు............" అన్నది.
    సురేఖ మాత్రం నిర్విచారంగా వుంది గనుకనా? అయినా, నవ్వుతూ సర్దాగా ఉండటం అలవాటు ఆ అమ్మాయికి.
    సురేఖ "తిరిగి ఇంటికి వెళ్ళి తీరుతానూ. అమ్మ ఒక్కర్తే ఉంటుందీ" అన్న పద్మావతిని బలవంతం చేయలేకపోయింది, బస్సెక్కించి తాను రిక్షా ఎక్కి పోయింది.
    "ఈ భాస్కరంగారు చాలా దగాకోరు. పద్మా వతికి చాలా ప్రేమ లేఖలు రాసి ఉంటాడు......." అనుకుంది త్రోవలో.
    "పద్మావతి భాస్కరాన్ని ప్రేమించింది. ఇది నిస్సందేహం" అనుకుంది ఎట్టకేలకు తాను ఒక నిర్ణయానికి వచ్చినట్లు........కాని భాస్కరం?........

                                
    
                                 *    *    *

    జయమ్మ కూతురి కోసరం కాచుకుని కూచున్నది.......
    "ఏమే అమ్మాయీ! మీ స్నేహితురాలి దగ్గర కన్నావు కదూ........ఇంతసేపు ఉన్నావుటే? ప్రతీ బస్సూ చూస్తున్నా ననుకో......." అన్నది అన్నం వడ్డిస్తూ.
    "నువ్వు పడుకో అమ్మా! నే తింటానుగాని......." అన్నది పద్మావతి. "సురేఖ సినీమాకు లాక్కుపోయింది....." అని చెప్పింది, పీట తెచ్చి వేసుకుంటూ.
    "నేను నువ్వు పుస్తక మేదో తెరిచి ఉంచావు కదా అని.....వచ్చి చదవాలేమోనని, పెద్ద లాంతరులో చమురు పోసి ఉంచాను........వెలిగించనా?" అన్నది జయమ్మగారు.
    "వద్దమ్మా! నీకు మరీ ఈమధ్య నా చాకిరీ ఎక్కువైందీ" పద్మావతి నొచ్చుకుంది.
    "బాగుందే అమ్మాయ్! ఎవరికోసరం చేస్తాము........చదువుకోసం దురాభారం వచ్చామా లేదా?" అన్నదామె.
    "పైగా మగ దిక్కులేని సంసార మాయె" నన్నది.
    "చదువు కోసమా ప్రేమ కోసమా?" అన్నా రెవరో పద్మావతి గుండెల్లో......ఆ మాటలు గొంతులో పడి పొలక మారింది.
    "అబ్బ! నిన్నెవ్వరు తల్చుకున్నారే? తల్లీ........" అన్నది జయమ్మగారు గాభరాగా వచ్చి.
    పద్మావతి "ఆయనగారే అయ్యుంటారు.......చెప్పకుండా చెల్లి పెళ్ళి స్థిరపరుచుకుందామని వెళ్ళిపోయారుగా" ననుకుంది..........పై కేమీ అనలేదు.
    భోజనంచేసి నాలుగూ ఎత్తిపెట్టి తల్లి మంచం దగ్గర కూచుని ఆమె కాళ్ళను ఒత్తుతూ, "అమ్మా!" అన్నది.
    "ఏమే బాగా అలసిపోయావు కాబోలు పోయి పండుకో........లేదా చదువుకో........." అన్న దామె.    
    "కాదే.......పాపం నీకు కాళ్ళు పడతానూ..."
    "ఎక్కడ ఏ దేశాలు తిరిగి వచ్చాను గనుకనే నేనూ......" ఆమె నవ్వింది కూతురి విశ్వాసానికి తృప్తిగా.
    "నాన్నగారు నిన్ను చేసుకున్నప్పుడు అందరూ ఒప్పుకున్నారే......" పద్మావతి ఏదో అడుగు దామని ఏమో అడిగింది.
    "సరిపోయింది.......అదా నీ ప్రశ్న ఇప్పుడు.......పాపిష్టిదాన్ని నేను నూతిలో పడ్డప్పుడు కళ్ళు మూసుకున్నా పోయేది, ఆ మహానుభావుడు - కాని మీ తండ్రి అలాన్త్య్వాడు కారే అమ్మాయి......ఆయన మాటకి కట్టు బడ్డారేగాని- నన్ను కట్టుకుని అయిదారేళ్ళు నలుగురి చేత అనరాని మాటలు తిన్నారు........" జయమ్మగారు కూతురు కుతూహలాన్ని గమనించలేదు. ఆమెకు పాత రోజులు జ్ఞాపకం వచ్చాయి.
    వాస్తవానికి సాంబమూర్తి ఆనాడు తనకు మరో సమ్మంధం చూసి, పెళ్ళి చేస్తా నన్నాడు. కాని, తను పసిపిల్లలా అతని పాదాలకు పెనువేసుగుంది.    
    "అమ్మో! నే నెవ్వరి దగ్గర బ్రతకలేను మావయ్యా" అంది.
    అందుకనే సాంబమూర్తి ఆమెను ప్రేమించాడు. ఏనాడూ వాత్సల్యం, అనురాగం తప్ప, కాముక ప్రవృత్తిలో దరిజేరి ఎరుగడు అదివరకు.
    "మీ నాన్నగారు సంఘ సంస్కారి అన్నమాట ఇవాళ కాకపోయినా రేపేనా నిలిచే మాటే" నన్నది జయమ్మగారు.
    "ఒక ఆత్మాహత్యను ఒక బలవంతపు పెళ్ళి నీ ఆపారే ఆయన."
    అయితే జయమ్మ విశ్వాసం తర్కానికి విలువిస్తుందా? ఇలాంటిది సంఘ సంస్కరణమే అయితే ఇక ఇవాళ పద్మావతి సంప్రదాయానికి వంక ఎక్కడ?
    అదే ఆలోచించింది పద్మావతి.
    "ఛీ! మా అమ్మ యింత మంచిది......మా నాన్న గారు యింత త్యాగధనుడు....... మరి యింకా ఏం సంప్రదాయం చూస్తారో.....ఈ మనుషులు ...... రానీ ఆయన్నే అడుగుతాను....." అనుకుంది.    
    పుస్తకం తెరిచి భాస్కరం మీద కసిగా ఆలోచిస్తూ కలత నిద్దురలో పడిపోయింది.
    కలలో సురేఖ వచ్చి భాస్కరాన్ని ఎత్తుకు పోతున్నట్లు అగుపించింది.
    కెవ్వున కేకవేసి లేచింది. జయమ్మగారు లేచి "అదేమిటే ఝాడుసుకున్నావా?" అని అడిగి - గ్లాసుతో మంచినీళ్ళు ఇచ్చి "త్రాగి ప్రక్కకి తిరిగి పడుకోమంది."
    అలాగే చేసింది కాని తలపులు తగ్గందే. "ఔను - రాగానే ఆవేళ యూనివర్శిటీలో ఆయన "సురేఖగారు వచ్చిందా" అన్నారు......మొన్నటికి మొన్న టెలిఫోన్ దానికే చేసి వెళ్ళారు." అని నొచ్చుకుంది పద్మావతి. మొదటిసారిగా సురేఖను ఈర్ష్యగా ఆలోచించుకున్నది పద్మావతి-
    మళ్ళీ కల..........
    మళ్ళీ కలత...... మళ్ళీ కల......చివరికీ ఈ పోరాటంలోపద్మావతి ఆంతర్యమే నెగ్గింది.......రెక్కలు గట్టుకుని ఎగురుతూ ఉన్న సురేఖ భాస్కరాన్ని తన మ్రోల పడేసి మేఘాలమీదికి ఎగిరి పోతూన్నట్లు కలవచ్చింది. పద్మావతి లేచి దేవుణ్ణి తల్చుకుంది. నిశ్చింతగా పడుకుంది.
    ఉదయం ఎనిమిదిన్నర గంటల దాకా ఆ పిల్ల నిద్ర లేవక పోవడం జయమ్మగారు ఆశ్చర్యంగా గమనించింది.

                                     27

    భాస్క్రరాన్ని చూస్తూనే పిన్ని చాలా సంబర పడ్డది.
    "నాకు తెల్సు నా భాసడు నా పరువు దక్కిస్తాడు." అన్నది గర్వంగా.
    సుబ్బారావుగారు "సాయంకాలం నీతో మాట్లాడాలిరా, అబ్బాయ్!" అన్నారు.
    వసంత అన్నయ్యను తల ఎత్తి చూడనే లేదు. దానికి యెక్కడలేని సిగ్గూ ముంచుకు వచ్చింది.
    సుబ్బారావుగారు భాస్కరంతో ఆ సాయంత్రం, పార్కులో కూచుని మాట్లాడారు.
    "కట్నాలు ఇవ్వనూ, చట్టమూ అనడానికి ఎలా అవుతుందిరా అబ్బాయ్? ఇదేమేనా స్థిరాస్తి చరాస్తి మార్పిడి అయితే అంతేననుకోవచ్చును. గాని పిల్లదాని సుఖానికి సంబంధించిన విషయ మాయిరి!...... ఆ ధనమ్మ ఈ రాఘవేంద్రానికి కట్నం పుచ్చుకోడమే సమాజంలో ఒక హోదా అని నూరిపోసింది" అన్నారాయన.
    నిజమే మరి......భాస్కరం స్వయంగా ఎరుగును. "ఎంతోయ్! కట్నం" అంటే
    "ఓ పది.. ఎంతలే మాలాంటి బీదవాళ్ళకి" అంటారు మిత్రులు- ఘనంగా.
    వయస్సు పై బడ్డదా?
    ప్రయోజకత్వం కుంటుపడ్డదా?
    కట్నం కాసూ లేని పిల్ల లెందుకురా?......అంటారు చాలామంది.
    "మా ఫ్రెండ్ కి పదివేలు ఇచ్చారట. వాడికే అంత ఇస్తే...... ఇక అన్నీ ఉన్న నాకో" అంటారు కొందరు యువకులు.
    భాస్కరం యేమీ అనలేక పోయాడు. "సరే నాన్నగారూ! అమ్మ ముచ్చటగూడా అదే కదా?" అన్నాడు.
    "మరే.....కాని మీ పిన్ని సంగతి నీకు తెల్సుగా నువ్వు పెళ్ళి చేసుకోనంటే అది సహించదురా......" సుబ్బారావుగారు ప్రాయధేపూర్వకంగా అన్నాడు.
    "నేను చేసుకోనూ అనలేదుగా" ముళ్ళ మీద కూర్చున్నట్లుంది భాస్కరానికి.
    'వసంత పెళ్ళికి అది ఆయత్త మవ్వాలీ అంటే నువ్వు "వూఁ" అనాలిరా..... నన్నేం చెయ్యమంటావ్ అంతా మీ పిన్ని ఇష్టం' ఆయన వెనక్కు అనిమ్చిన చేతులు తీసి దులిపేసుకున్నాడు.
    "అది సరే నాన్నగారూ! ఈ సురేఖనే చేసుకోవాలీ అనే ప్రతి బంధకం ఏమిటీ మరొకరు కారాదా?"
    "ఆ మరొకరు ఎవరూ?" ఆయన కుతూహలం వ్యక్తపరిచాడు.
    "అహఁ........అది కాదు నాన్నగారూ! ...... ఈ ధనమ్మ అనుకున్నదేగాని, ఆ సురేఖ మాత్రం నన్ను ఇష్టపడొద్దూ......" భాస్కరం తప్పించుకుంటున్నాడు అని ఆయన  గ్రహించాడు.
    "చదువుకున్న అమ్మాయి గనుక ఎవరినో ఒకర్ని ప్రేమించే ఉంటుందంటావు?......అహ .......అంతేనా నీ భావన........చెప్పు చెప్పు.......నేను నీ ఫ్రెండు ననుకో.......ఫర్వాలేదు" సిగ్గు, బిడియమూ పడుతున్న కొడుకుని ఆయన బుజ్జాగించారు.
    భాస్కరం సురేఖను ఏ మాట మాత్రం ఎలా అనగలడు? -చదువుకున్న అమ్మాయి కదాని ఇవాళ ఆమెను కాదంటే-రేపు పద్మవత్తి మాత్రం చదువుకున్నది కాదా? పైగా పద్మావతి ఉద్యోగం కూడా చేస్తుందేమో!
    "ఒక్క ఏడాది ఆగండి నాన్నగారూ"
    "నేను పదేళ్ళు ఆగుతానురా అబ్బీ! మీ పిన్ని మాట...........దానికి నువ్వు ఇంకా ఐదేళ్ళు పసిబాలుడుగా ఉన్నావురా......." ఆయన నిట్టూర్చాడు.
    ఇద్దరూ ఏ మాటాడాలో తెలియనట్లు గడ్డి పరకలు త్రుంపుతూ వూరుకున్నారు.
    "వసంత పెళ్ళి కానివ్వండి నాన్నగారూ!" పిన్నికి చెబుతాగా" నన్నాడు ఎట్టకేలకు.
    ఇద్దరూ లేచారు........బరువుగా....."మీ పిన్ని గుండె నీర్సంగా ఉంది..............కాస్త "పోటు" కూడా ఉన్నది జాగర్త" అన్నాడు సుబ్బారావుగారు.
    నేను ఏడిస్తే సరి తానే వూరుకుంటుంది. అనుకున్నాడు భాస్కరం గాని ఎలా "దగా" చెయ్యడం అంత సుళువా?.......
    జానికమ్మ భాస్కరాన్ని పిలిచి, "నువ్వు ఈ ఏడాది పెళ్ళి వద్దన్నావు సరే పై ఏడాది ఐనా ఈ సురేఖను చేసుకుంటావా ఖచ్చితంగా చెప్పు.........    
    కావాలంటే కట్నం యివ్వొద్దూ మా వాడు స్వార్జితంగంజీ-నీళ్ళూ త్రాగుతాడూ అంటాను" అని నిలదీసి అడిగింది పిన్ని.
    భాస్కరం పిన్ని పాదాల దగ్గర కూచున్నాడు. "అమ్మా" అన్నాడు భక్తితో.
    "చీ! నన్నలా పిలవ్వొద్దూ" ఆమె ఎడంగా జరిగింది.
    "పిన్నీ!"-ఆమె పాదాలమీద చెయ్యి వేశాడు.
    "ఊఁ"    
    "మరి కట్నం వద్దూ అంటే ఈ స్వాతిశయం వున్న ధనమ్మ సమ్మంధం ఎందుకే........సలక్షన్ మైన పిల్లలు కాస్తగా పోతే కాస్తైనా నీ గుణాలు ఒకటి రెండు పుణికి పుచ్చుకున్నవారు దొరకరే......"
    ఆమె కొడుకును కళ్ళింతలేసి చేసి జూసింది.
    "నువ్వు ధనమ్మని కాదుగా కట్టుకునేదీ?" అన్నది.
    "అది సరేగాని ఎవర్రా? ఆ బీద పిల్లా........?" అన్నది ఠక్కున.    
    గాభరా పడ్డాడు భాస్కరం.
    కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా, కాలం పేరుకుంటున్నదా అన్నట్లు గడిచాయి.
    ఆ ఇద్దరూ ఒకర్ని ఒకరూ వదులుకోలేరు. "సరే......ఈ సురేఖను చేసుకోనూ అంటే ధనమ్మ ఏమందో తెలుసా? తన యావదాస్తి ముకుందానికి రాసి, అతగాన్ని ఇల్లరికం చేసుకుంటానన్నది."
    జానికమ్మగారు కళ్ళ నీళ్ళు కొడుకు చూడకుండా అటు మొహం తిప్పుకుంది.    
    కత్తివేస్తే నెత్తురు లేదు భాస్కరం మొహాన.....నిలువునా మనిషి నీరై పోయాడు.
    "ఛీ! పాపిష్టిది........" అన్నాడు కసిగా.
    "సరిలే! నీకు నచ్చని పిల్ల నా కెందుకు......... వసంతకు మరో మంచి సమ్మంధం నువ్వే చూసుకో. నాకు నీకంటే అది ఎక్కువ గాదు......" ఆమె భాస్కరాన్ని తల నిమిరింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS