ఆ విధంగా వారం రోజులు ఆనందంగా గడిచి పోయాయి. ఇలా ఎన్ని రోజులైనా అక్కడే ఉండవచ్చు. కాని, ఎన్ని రోజులు? కేశవరావు గారిని, నారాయణ రావు గారిని కూడా చూసి గుంటూరు పోవాలను కున్నాడు ఇంతలో గుడివాడ నుంచి శుభవార్త వచ్చింది. మధుసూదన రావు వివాహామట.
మాధవరావు వివాహం కాకుండా మధుసూదన రావు వివాహం ఏమిటన్నారు దివాకర రావు గారు.
"పెంపుడు పోయాడు కదా, అటువంటి అడ్డంకు లేమీ ఉండవు. అయినా వీడేమో యుద్ధం లోకి పోయాడాయేను! ఎప్పుడు తిరిగి వస్తాడో , ఏమో? వచ్చిన పెళ్లి చేసుకుంటాడో చేసుకోడో. అసలే తిక్క వెధవ!' అన్నది భానుమతి.
పెళ్లి ఇంకా రెండు వారాలు ఉన్నది. ఈలోగా గుంటూరు పోయి తిరిగి వస్తానన్నాడు రాజశేఖర మూర్తి . కేశవరావు గారి ఇంటికి అవసరం, అయితే తరవాత పోవచ్చును. దారిలో విజయవాడ లో దిగి నారాయణ రావు గారి ఇంట్లో ఒక రోజు ఉండి పోదామను కున్నాడు.
"ఇప్పుడు గుంటూరు పోయి చేసేదేముంది? ఈ పది రోజులూ ఇక్కడే ఉండరాదా?" అన్నారు దివాకర రావు గారు. తనకు ఉండాలనే ఉంది. కాని , మర్యాదకు హద్దులు ఉన్నాయి. "ఇంటికి పోయి చదువుకోవాలి" అని చెప్పి బయలుదేరాడు.
ఇందుమతి కి ఇంకా అప్పుడప్పుడు తల నొప్పి వస్తూనే ఉన్నది. దివాకరరావు గారు ఆమెను తన వద్దనే ఉంచుకుని తగిన టానిక్కులు ఇస్తానని చెప్పారు. ఆరోగ్యం కలిగితే గాని అనంత వరం పంపవద్దని గట్టిగా చెప్పాడు రాజశేఖర మూర్తి. పతి బయలుదేరి వెళ్ళేటప్పుడు పెళ్ళికి తప్పక రావాలని చెవిలో చెప్పింది ఇందుమతి. తన హృదయం ఆమె ఒడిలో నే వదిలి వెళ్ళిపోయాడు రాజశేఖర మూర్తి.
విజయవాడ లో నారాయణరావు గారు స్టేషను కు వచ్చి బావమరిది ని ఇంటికి తీసుకు వెళ్ళారు.
"ఇందుమతి ని కూడా తీసుకు రాలేదేమి?' అన్నారు నారాయణరావు గారు.
"మీ చెల్లెలి మీద నాకేమీ అధికారం?" అన్నాడు రాజశేఖర మూర్తి.
"ఏ అధికారం లేకుండానే ఆమె హృదయాన్ని ఎలా కాజేశావు?" అన్నారు నారాయణ రావు గారు.
"ఇచ్చి పుచ్చుకున్నానే కాని కాజేయ్యలేదు" అని జవాబిచ్చాడు రాజశేఖర మూర్తి.
విజయవాడ లో ఒక రోజు ఉండి గుంటూరు తిరిగి వెళ్ళిపోయాడు రాజశేఖర మూర్తి.
19
మధుసూదనరావు వివాహానికి తప్పక రావాలని శివరామ శర్మ గారు స్వయంగా ఆహ్వానించి వెళ్ళారు. శివరామ శర్మ గారి మాజిస్ట్రేటు పదవిలో ఉండి మంచి ఆస్తి సంపాదించుకున్నారు. ఆయనకు గుడివాడ లో పెద్ద ఇల్లు ఉంది. పాతిక ఎకరాల భూమి ఉన్నది. అయన ఆస్తి కంతకు పెంపుడు కొడుకు మధుసూదన రావు ఒక్కడే వారసుడు. కలవారికి పిల్ల నివ్వటానికి కలవారు ఎంత మంది అయినా వస్తారు. కలవారికే వేలకు వేలు కట్నాలూ ఇస్తారు. మధుసూదనరావు ఇప్పుడు బందరు లో ఇంటర్ మీడియట్ చదువుతున్నాడు. మొదటి సంవత్సరం అయింది. కాబోయే మామగారు వంద ఎకరాల ఆసామీ. పదివేల రూపాయల కట్నం ఇచ్చి పెళ్లి చేస్తున్నారు.
పెళ్ళికి రాజశేఖర మూర్తి గుడివాడ వెళ్ళాడు. అప్పటికే అనంతకృష్ణ శర్మ గారి కుటుంబం అంతా వచ్చేశారు. ఏలూరు నుంచి దివాకరరావు గారు భానుమతిని, ఇందుమతి ని తీసుకు వచ్చారు. రాజశేఖర మూర్తి ని చూసిన వెంటనే రేవతి చెంగున లోపలికి పోయి ఇందుమతి కి బావ వచ్చాడని చెప్పింది. రాజశేఖర మూర్తి ఇందుమతి బయటికి వస్తుందేమో అనుకున్నాడు రాలేదు.
గుడివాడ లో కూడా అనంతవరం లో లాగే ఉండాలి కాబోలు అనుకున్నాడు. రేవతి వచ్చి అతనికి కావలసిన సపర్యలన్నీ చేస్తున్నది కాని, అతనికి ఇందుమతి ని ఎలా ఉన్నదో చూడాలని తహతహ. ఇంతమంది లో ఆమెను ఏకాంతంగా ఎలా కలుసుకోవటం?
"రేవతీ, మీ చిన్నక్కయ్య ఎలా ఉంది?"
"పదిహేను రోజుల్లో ఏం మారిపోతుంది, బావా?"
"ఇంకా తలనొప్పి వస్తున్నదా?"
"ఏమో నాకు తెలియదు. వాళ్ళు ఏలూరు నుంచి కదా వచ్చారు."
"నాకు కనిపించరాదటనా?"
"అడిగి వస్తాను. ఉండు" అని తుర్రున లోపలికి పోయింది. అయిదు నిమిషాల తరవాత బయటికి వచ్చి బావను లోపలికి తీసుకు పోయింది. గదిలో భానుమతీ, ఇందుమతి పెట్టెలు సర్దు కుంటున్నారు. రాజశేఖర మూర్తి భానుమతి ని చూసి నమస్కరించాడు. ఆమె ప్రతి నమస్కారం చేసి నవ్వుకుంటూ రేవతిని కూడా తీసుకుని బయటికి వెళ్ళిపోయింది.
"ఇందూ , క్షేమమా?" అని అడిగాడు రాజశేఖర మూర్తి.
"మునపటి కంటే నయమే. తలనొప్పి రావటం లేదు. కాడ్ లివర్ ఆయిల్, విటమిన్ మాత్రలు తీసుకుంటున్నాను."
"నన్ను పెళ్ళికి రమ్మన్నది గదిలో దాక్కోడాని కెనా?"
"మరి రచ్చ కెక్క మంటారా?"
"కనిపించనైనా అక్కరలేదా?"
"ఇదిగో, కనిపించానుగా?"
"నన్నింట విసిగించి, నేను నోరు తెరుచుకుని అడిగిన తరవాత కదా? నీకు నన్ను చూడాలని కూడా ఉండదా?"
"చాల్లెండి, ఎవరైనా వింటే నవ్వి పోతారు! ఇంత మందిలో మన ఏకాంతాల కేలా వీలవుతుంది?"
ఇంతలో ఎవరో గదిలోకి రాబోయి వెనుదిరిగి వెళ్ళిపోయారు.
"అయితే నేను వచ్చినందు వల్ల నీకేమి ఒరిగిందిటా?"
"మీరు వచ్చారంటేనే నాకు తృప్తి."
"నేనలా తలుచుకుని తృప్తి పడలేను."
"స్త్రీలకూ , పురుషులకు అదే భేదం. ఇక పదండి, మళ్ళీ ఎవరైనా వస్తారు. ఈ అంతః పురం లోకి మగవాళ్ళు రాకూడదు."
రాజశేఖర మూర్తి వెళ్ళిపోయాడు. మరునాడు తెల్లవారు ఝామున లేచి స్పెషల్ బస్సుల మీద పెళ్లివారంతా ఆడపెళ్ళి వారి ఊరికి బయలుదేరారు. మగవారంతా ఒక బస్సులో, ఆడవారంతా ఇంకొక బస్సులో.
"ఈ మాని పై నుంచి ఈపె కూ కూయంచు
ఆ మాని పై నుంచి అపే కూకూ యంచు"
అన్నట్టు ఈ బస్సులో ఒకరు , ఆ బస్సులో ఒకరు కూర్చుని దూరదూరంగా మూగ చూపులు చూసుకోవటమే కాని, ఎదురుగా కూర్చోటానికి కూడా వీలులేదా, భగవంతుడా? అనుకున్నాడు రాజశేఖర మూర్తి.
రాత్రి 11 గంటల 29 నిమిషాలకు ముహూర్తం . ఆ రాత్రి రెండు గంటల వరకూ అందరూ నిద్రలు లేకుండా గడిపారు. ఆ తరవాత ఎవరికి దొరికిన చోట వారు సోలి పోయారు. 'ఇటువంటి అర్ధరాత్రి ముహూర్తాలెందుకు పెడతారో ఈ పురోహితులు!' అని విసుక్కున్నాడు రాజశేఖర మూర్తి . మగపెళ్లి వారికి విడిదిగా ఇచ్చిన ఇల్లు పెద్దది. ఇందుమతి పంపగా రేవతి తెచ్చి ఇచ్చిన పక్క పరుచుకుని దిండు తల కింద పెట్టుకుని అరుగు మీద నిద్రపోయాడు రాజశేఖర మూర్తి. అలిసి ఉన్నాడేమో ఒళ్ళు తెలియలేదు. మరి ఏ ఆలోచనా రాలేదు. ఉదయం ఏడు గంటలయింది. అప్పటికి మగవారందరూ లేచి తదుపరి కార్యక్రమానికి తయారవుతున్నారు. రేవతి వచ్చి రాజశేఖర మూర్తి ని లేపింది.
చెంబుతో నీళ్ళు, దంత ధావన చూర్ణం , తాటాకు , తువ్వాలు తెచ్చి ఇచ్చింది. తరవాత స్నానానికి తీసుకుని వెళ్ళింది. కాలకృత్యాలన్నీ అయ్యేసరికి పెళ్లి వారందరూ కాఫీ ఫలహారాలకు పెళ్లి వారింటికి వెళ్ళారు. విడిది లో పెండ్లి కుమారుడు, భానుమతి, ఇందుమతి, రేవతి మిగిలారు. పెండ్లి కుమారుడి కోసం, ఆడబిడ్డల కోసం పంపిన కాఫీ ఫలహారాలు వారితో పాటు రాజశేఖర మూర్తి కూడా భుజించాడు. ఇదీ ఒక మంచికే వచ్చిందను కున్నాడు రాజశేఖర మూర్తి. రెండు రోజులుగా ఈ మాత్రం ఏకాంతం కూడా దొరక లేదాయేను!
"ఏమ్మయ్యా , మధుసూదన రావూ, మీ ఆవిడ ఏమి చదువు కున్నదిట?" అన్నాడు రాజశేఖర మూర్తి.
"వానాకాలపు చడువేదో ఐదో క్లాసు వరకూ చదివిందిట."
"పైకి చదివిస్తారా?"
