Previous Page Next Page 
అర్పణ పేజి 18


    "ఊరికే వాగకు" అన్నాడు రాజు , గదిలోకి వెళ్ళబోతూ.
    "నీ పుణ్య ముంటుంది. ఇచ్చెయ్యి. అతనెంతో ప్రేమతో ఇస్తే తగలబెట్టడం న్యాయం కాదు." పార్వతికి ఎలా మాట్లాడాలో తెలియదు.
    "అతన్ని ప్రేమిస్తున్నావా? మీ ఇద్దరికీ నేనొక విలన్ లా కనిపిస్తుంటా నెమో!"
    "నువ్వు వట్టి చవటవి. బుద్ది లేదు నీకు."
    జానకమ్మ నిర్ఘాంత పోయింది , ఉదృతం చూస్తూ. మాట్లాడటానికి ఆవిడకు అవకాశ మెక్కడ?
    "ఏమన్నావు?" గర్జించాడు రాజు.    
    అందగాడివివని అహంకారం ఎక్కువ కాబట్టి అన్నాను. నేనేవ్వరినీ ప్రేమించలేదు. జన్మలో ఎవరినీ ప్రేమించను గాక ప్రేమించను. నీ పాపిష్టి మొహాన్ని అసలు ప్రేమించను."
    రాజుకు ఒళ్ళు తెలియలేదు. ఎప్పుడు పార్వతి మీదికి లంఘించాడో అనూహ్యం; ఎడా పెడా బదుతున్నాడు. ఎంతైనా మృదుత్వానికి సంకేతం -- స్త్రీ. చెంపలు కందిపోతున్నాయి. కంట నీళ్ళు మాత్రం చిందలేదు. విడిపించు కోవడం అసాధ్యంగా ఉంది.
    జానకమ్మ కంగారెత్తి పోయింది. స్థాణువు లా ఉన్నదంతా చక్రంలా కదిలిపోయింది.
    "రాజూ! మూర్ఖుడా!" అని అడ్డు రాబోయింది. అతను వినిపించుకోలేదు. చేసేది లేక చేతులూ, కాళ్ళూ ఆడక రామనాధం గారిని పిలవడానికి వీధి గదిలోకి పరుగెత్తింది. ఆ అదను కోసమే చూస్తున్నది పార్వతి. ఆమె అటు వెళ్ళగానే రాజు చెంప మీద శక్తి కొద్దీ ఒక్క దెబ్బ కొట్టి వదిలించుకుని , ఏమేమో అని రివ్వున వెళ్ళిపోయింది.
    రామనాధం గారు వచ్చి, "ఏమిటోయ్ ?" అన్నారు గంబీరంగా చూస్తూ.
    తల వంచుకుని వెళ్ళిపోయాడు రాజు.
    జానకమ్మ ఎన్ని ఓదార్పు మాటలన్నా ఆమె తన కొడుకు నెంత నిరసించినా ఆ రాత్రి దిగులుగా కూర్చుంది పార్వతి. అందరూ నిద్ర పోతున్నప్పటి నిశ్శబ్ధత మొదటిసారిగా అనుభవించింది. పక్కన కొంత దూరాన గదిలో రాజు నిద్రపోతున్నాడు. ఆ అమ్మాయి మాత్రం తన మంచాన్ని వదిలి, అర్ధం కాని దిగులుతో ఆలోచించు కుంటున్నది. తండ్రి మీదకు మనసు పోయింది అక్కడెంత ప్రేమగా చూస్తారు తనను! నిజమైన ప్రేమ, వాత్సల్యం అక్కడే ఉన్నాయి.' ఒక్క అమాయకమైన చూపు, వెన్న వంటి మనసు గుర్తు వచ్చీ రాగానే పార్వతి మానసం ఆర్ద్ర మయింది.

                                    15
    నలుగురి లో ఉన్నా, ఒక్కరిలో ఉన్నా సరస్వతి ది ఒంటరి బతుకు. తండ్రి సేవా సౌఖ్యాలకే ఆమె జీవితం అంకితమై నట్లుగా ఉంది. అతడు నిర్లిప్తంగా కూతురు చేత అన్ని పనులూ చేయించు కుంటాడు. చేయదగినది, చేయగలిగినవి ఏదీ ఉండని వయసు కనక మగత కమ్మే ఆలోచనల్లోనే, మరలిపోయిన అనుభవాల్లో నే మిగతా కాలం జీవిస్తుంటాడాయన.
    ఎప్పుడో ఒకనాడు గుర్తు వస్తే -- పురాతనపు గదులు తెరిచి, ప్రాచీన గ్రంధలహరి అంతా తిరగవేసి గుణిస్తాడు. తన ఆస్తి పాస్తుల్లో సరస్వతి కి కొంత ఎక్కువ భాగం చెందేటట్లు వ్రాసి మిగిలిన ఇద్దరికీ సరిసమానం చెయ్యాలనే సంకల్పం. అందువల్ల తన పిల్లల్లో ఎటువంటి కలతలూ, రావని ఆయనకు అకుంఠీత విశ్వాసం. ధనమే ప్రాణం అనుకునేవారు కారు అతని ప్రాణ ధన చిహ్నాలు.
    పార్వతి కి డబ్బంటే నిర్లక్ష్యం. ఒక్కొక్క సమయంలో ప్రేమ. డబ్బు విషయం లో ఆ అక్క చెల్లెళ్ళ కు వేర్వేరు భావాలు, కారణాలు ఉన్నాయి.
    డబ్బు కోసం తాపత్రయ పడేవారిని చూస్తె సరస్వతి కి విస్మయం. దీని వల్ల వీళ్ళెం సౌఖ్యాలు కొనుక్కుంటారు? అతని ఆశ్చర్య పోతుంది. లక్ష్మీ అలా ఊహించదు. పుట్టిన తర్వాత మనిషికి డబ్బు అవసరం ఎంతైనా ఉంటుంది. డానికి నిదర్శనాలు కొల్లలు. కాని మనిషుల హృదయాలతో ఆడుకోనంత వరకే దాని విలువ. తండ్రి లాగే సరస్వతి జీవితం విషయంలో ఆరాటం ఉంది.
    సరస్వతి అమాయకంగా కనిపించినా ఆమె కూడా వివిధ విశేషాలను తెలుసుకోవాలని అకాక్షిస్తుంది. ముఖ్యంగా ఆమె ఆలోచనల్లో విశ్వ మానవ ప్రేమ ఎటువంటిది? అనే తర్కమే ఎక్కువ. ప్రధానమైన ప్రేమ మాత్రమె ఆమె పట్ల అన్యాయంగా తెగిపోయి, చీకటి కుహరాల్లో కి నిష్క్రమించింది. విస్మృతి పదంలో పడిన బందాను బంధాలు వెనక్కు తిరిగి చూస్తె జన్మకు, ప్రకృతి కి సంబంధించిన వాంఛలు ఆకట్టుకోలేక; వెర్రి తలలు వేస్తె ఆమె కళ్ళు ఎవరికీ తెలియని చోట, అంతర్యానికే అర్ధమయిన చోట అశ్రు పూర్ణాలవుతాయి. ఏకాంతం ఆమెను మరింత ఏడిపిస్తుంది.
    ఆ పల్లెటూళ్ళో పట్టు తప్పని ఆదారాల పడతులు, ముత్తయిదువులు ఈమె ఆగిపిస్తే పమిట సవరించుకొని మూడు మార్లు ముక్కు తిప్పి వెళ్ళిపోతారు. అందుకు సరస్వతి బెదరదు. సరస్వతి వంటి నిర్భాగ్యురాలి కి అంత అందం ఉన్నందుకు మొదట వాపోయి, పోనీలే అమెకు సౌభాగ్యం లేదు-- అని తృప్తి పడి, వానినే విచారంగా నటించే అసూయ హృదయాలు ఉన్నాయి. సరస్వతి మీద నిజమైన సానుభూతి -- ఆమెను నూతనంగా చూసిన ప్రతి యువకుడికీ కలుగుతుంది. "వితంతువులా ఉందే! ఎంత దురదృష్ట వంతురాలు' అనుకోని సాగిపోతాడు.
    ఇటువంటి వెన్ని జరిగినా అశేష జనాకీర్ణచేతన మయమై ఉండి, నిరంతర నిరవధికాకర్ష ణాలతో మెరుపులు మెరిసె ప్రపంచం సరస్వతి దృష్టి లో తరచుగా జడత్వాన్ని పొందుతుంది. అచేతనంగా మారిపోతుంది. ఒక్క తండ్రి, తను నిలుస్తారు. 'ఈ తండ్రితో తన కెంత గట్టి అనుబంధం ఉన్నదో! ఇది ఎన్ని జన్మల నుంచి తరలి వస్తున్నదో?'
    కర్మ సిద్దాంతం నమ్ముతుంది సరస్వతి. అలా ఆమె ఆలోచించిన వన్నీ భగవంతుని చింతన లోకి దారి తీస్తాయి కొసకు. అప్పుడను కుంటుంది ' నాకంటే అదృష్ట వంతు లేవరుంటారు' ఎక్కడుంటారు? నా కిటువంటి జీవితాన్ని ఇచ్చాడంటే -- నేను పూర్తిగా తననే స్మరించాలని పరమాత్ముని కోరిక కాబోలు. చీమల బారుల్లా కిటకిట లాడే ప్రజానీకాన్ని సృష్టించుతున్నాడు పరమాత్ముడు. అందులో ఏ ఒక్కరి మీదనైనా అతనికి తక్కువ భావం ఉండదు. కానీ నేనంటే భగవంతుడి కి ఎక్కువ ఇష్టం ఉంది. అది నిజం!' అలా ఊహించినప్పుడు సరస్వతి హృదయానందానికి అవధులు ఉండవు. తన మనసు కళంక రహితంగా నూ, భాగవల్లీ లా చింతన తోనూ నిండి ఉన్నప్పుడు హాయి అనుభవిస్తుంది. ఇప్పుడా ఇంట్లో దేవీ ఆరాధనలతో పాటు విష్ణు పూజలు జరుగుతుంటాయి.
    స్నానాదులు, జపతపాలు పూర్తీ చేసుకుని ముంగిట నిలబడి భగవంతుడి ప్రతి రూపాలైన పసిపిల్లల అట పాటలు చూస్తున్నది. సర్వం మరిచి ప్రేమ పూర్వకంగా వారి వైపే చూస్తున్న సరస్వతి పార్వతి రాకను గమనించనే లేదు.
    తన కళ్ళను వెనక నించి వచ్చి మూసిన వారెవరు చెప్మా! అని మొదట కంగారు పడి, చేతుల మృదుత్వం తెలుసుకున్న తర్వాత, తనకు ఒక్క స్నేహితురాలు లేదే! అని విస్తుపోయింది.
    పార్వతి చప్పున కళ్ళ మీద చేతులు తీసి సరస్వతి బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టేసుకుంది. అసలే మోటు పిల్ల పార్వతి. పచ్చ చేమంతుల్లాటి సరస్వతి బుగ్గలు ఎర్ర గులాబీ లయ్యాయి.
    పార్వతి ని చూసి ఆశ్చర్యపోయింది. "ఏమిటే ఈ రావడం? హటాత్తుగా వచ్చేశావేమిటి?"
    "ఏం ? రాకూడదా? నేనేం రానని నీకు ఉత్తరం వ్రాశానా?' బుంగమూతి పెట్టి గబుక్కున నవ్వింది పార్వతి.
    "అది కాదు. సంగతేమిటని?"
    "సంగతులు తర్వాత చెబుతాను కానీ నాకు ముందు అన్నం పెట్టు. ఆకలితో మాడుతున్నా నాన్న జ్ఞానమైనా లేదు, అమ్మాయి గారికి."
    "అవును. ఈలోగా స్నానం చెయ్యి. వంట వాడిని లేపి వస్తాను" అంది సరస్వతి తొందరగా లోపలికి నడుస్తూ.
    ఆరోజు పార్వతి ఏ సంగతులూ చెప్పలేదు. తండ్రికి కనిపించి, ముఖ్య విషయాలు పొడిగా మాట్లాడింది. అంతే. అదే తొలిసారిగా పార్వతి కా పల్లెటూరు అందంగా నూ, ఆనంద మయంగానూ కనిపించింది. అక్క మాటల్లోని అమృత్వాన్ని గ్రహించింది. అత్యవసరమని చెప్పి పదిహేను రోజులు సెలవు తీసుకొని వచ్చిన పార్వతి , ప్రేమ నిండిన ఆమె మాటల్లో సంపూర్ణంగా లీనం కావడమే కాకుండా -- తన మీద తండ్రికి సోదరికి ఉన్న అనురాగానికి గర్వంతో మైమరిచిన స్థితి వచ్చింది.
    ప్రతి రోజూ తండ్రి దగ్గర గారాబం ఒలక పొయ్యటమే పని; అనుక్షణం అక్కయ్యతో ఊసులాడటమే ఉద్యోగం.
    "అక్కా! నీ చీర -- పెద్ద ఆకుపచ్చ అన్చున్నది -- ఒక మాటియ్యి, ఇలా" అని ఓ ఉదయం పార్వతి అడిగితె తెల్లబోతూ తన చెల్లెలు పొడవుగా వేసుకున్న ఒక్క జడ వైపూ , తలనిండా పెట్టుకున్న బుట్టెడు పువ్వుల వైపూ చూసింది సరస్వతి. 'ఈవిడ కివాళ ఇదేం కోరిక?' అని లోపల అనుకోని, "ఆ మోటు చీరలు నువ్వెలా కట్టుకుంటావే?' అంది సంశయంగా.
    "మోటు చీరలో, గోటు చీరలో ! ఇయ్యమన్నానా?" విసుగుగా భ్రుకుటి బిగించి జడ ముందుకు లాక్కుంది , సాభినయ ప్రబంధ నాయికలా.
    "అది కాదే! ఊ, పోనీ......తాళాలు ఇవిగో . భోషాణం లో ఉంటుంది , తీసుకో!"
    చెల్లెలు ఒక్క జడతో వయ్యారాలు నటిస్తూ వెళ్తుంటే సరస్వతి నవ్వుకుంటూ ఆమె వెనకనే వెళ్ళింది.
    'ఇలా ముస్తాబైతే చాలా బాగున్నట్లున్నానే!" అనుకుంది పార్వతి , అంతా తయారై అద్దంలో చూసుకుంటూ.
    ఒకరోజు రాజు నిద్రపోతుంటే తను లోపలకి వెళ్ళింది . అతని గుండెల మీద ఒక పుస్తకం దాని మీద ఒక చిన్న ఫోటో కనిపించాయి. చప్పుడు చెయ్యకుండా వెళ్లి, ఆ ఫోటో తీసి చూసింది తను. సరోజ ఫోటో అని గుర్తించగానే విస్మితురాలై పోయింది. అది రాజు చేతి కెలా వచ్చిందో తెలియదు కానీ, అందులోని సరోజ ప్రతి రూపం తన కళ్ళ కిప్పటికీ కట్టినట్లుంది. అసలు సరోజ కన్నా, అందులో సరోజ అందం అనన్యం. పక్క వాటుగా తీయించు కున్న ఫోటో అది. కొంతవరకు కనిపిస్తున్న జడ నిండా పువ్వులు; నుదుటి మీద గుండ్రని తీర్చి దిద్దిన బొట్టు; పెద్ద అంచున్న ఏదో రంగు చీర; దానికి తగిన చోళీ -- అంతే. అదే ఆకర్షించింది. అప్పటి కప్పుడే ఆ విధంగా అలంకరించుకుని చూసుకోవాలన్నంత ఉత్సాహం పుట్టింది. కానీ, రాజు చూస్తాడు; అతనికి ఇష్టమైనట్లు ఉండటం తనకు ఇష్టం లేనిదయింది. అది ఇప్పుడు మరీ పెరిగింది. ఏదేమైనా తన కోరిక తీరింది, ఇక్కడ. సరోజ అంత అందం తనకు లేకపోయినా ఈ అలంకరణ లో అందంగా ఉంది తను.
    "ఈ నెక్లెస్ కూడా పెట్టుకోవే! ఇక్కడ పడేసి వెళ్ళిపోయావు, పెళ్ళిలో." సరస్వతి అందిచ్చింది. "సరోజ పెట్టుకోదే, నగలు. "గొణిగింది. "సరోజ పెట్టుకోకపోతే నువ్వూ పెట్టుకో కూడదా? ఎక్కడైనా వ్రాసి ఉందేమిటి?' సరస్వతి ప్రశ్న.
    డాన్ని సర్దుతూ , "సరోజకీ నాకూ నగలంటే ఇష్టం లేదక్కా!" అంది నెక్లెస్ మెడలో పెట్టుకుని, "లక్ష్మీ లా ఉన్నావు!" అంది సరస్వతి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS