ఇన్నాళ్ళూ ఎవరి భయం వల్ల రెండో పెళ్ళి చేసుకోలేకపోయారో , ఆ నాన్నగారు చనిపోయారు. అందుకే ఈ బెదిరింపులు! ఇక వాళ్ళకి నిర్భయం!
మూర్తి పెండ్లి నిశ్చయమైన రోజే నా నిర్ణయం కూడా తీసుకొన్నాను.
పాపను గురించి నాకు దిగులు లేదు. పాప కంతా ఉన్నారు. నా కెవ్వరూ లేరు!
ఆఖరి రోజు మీ అందరి తోటీ సంతోషంగా గడిపాను.
బ్రతుకంటే నాకు మోహం లేదు. ఏం చూసుకొని బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి!
భార్య నై ఉండి భార్యనని చెప్పుకోలేక , తల్లినై ఉండి తల్లినని చెప్పుకోలేక నేను మానసికంగా చిత్రవధ అనుభవించాను. నా ఇంటిలో నేను ఉన్నందుకు నిందలు పడ్డాను. నిజం చెబితే, నన్ను ఎంతో ఉన్నతంగా మోస్తున్న మీ ఊహల పల్లకి నుండి క్రింద పడిపోతానని భయం! బ్రతుకే భయంగా ఉన్నప్పుడు, ఆ బ్రతుకు బ్రతకక పొతే ఏం?
బ్రతకడానికీ, చావడాని కీ కూడా ధైర్యం కావాలి. ఈ మాట సుధకు చెప్పు. పిరికి పందలు చావలేరు! బ్రతకలేరు! వాళ్ళది జీవన్మరణ సంధ్య!
సుధ పుణ్యమా అని నా దగ్గర నిద్రమాత్రలు చాలా ఉన్నాయి. ఈ పనికి వాటిని ఉపయోగిస్తానని సుధ ఊహించి ఉండదు!
నీవు రచయిత్రివి. నా కధ వ్రాసి, మెరుగులు దిద్ది ప్రచురించు. నా బోటి వాళ్ళకు కనువిప్పు కావచ్చు.
మళ్ళీ స్త్రీగా పుట్టించవద్దని భగవంతునికి అప్లికేషన్ పెట్టుకొంటూ --
మీ,
--మర్కటం."
"పిచ్చి పిల్ల! ఎన్ని ఉదాహరణలు చూపినా , ఎన్ని కధలు వ్రాసినా, సమయానికి ఆడపిల్లలకు వివేకం పనిచేయదు. చేతులు కాల్చుకొంటూనే ఉంటారు! ఆ నిమిషంలో ఇది సహజ ప్రవుత్తే అని మనస్సును సమాధాన పరచుకొంటారు! లొంగిపోతారు! ఆ తరవాత బ్రతికినంత కాలమూ తీరికగా పశ్చాత్తాప పడతారు!" కన్నీరు కారుస్తూ అనుకొన్నది స్వర్ణ.
* * * *
కాలం భారంగా గడిచిపోతున్నది.
మరకతం పోతూ తనతో కూడా ఉత్సాహాన్నీ, చైతన్యాన్నీ తీసుకు పోయింది. అంతా కలిసి ఏదో మాట్లాడు కొంటారు గాని, చాలాసేపు ఉండలేరు. అందరినీ కట్టి పడేసే సూత్రం తెగిపోయింది!
పద్మ నుండి జాబు వచ్చింది.
"పైకి నవ్వుతూ , తుళ్ళుతూ కనిపించే మరకతం మనసులో ఇన్ని సుడిగుండా లున్నాయని మనకేం తెలుసు? మరకతం నిజంగానే పిరికిపంద! న్యాయ బద్దంగా ఆ దుర్మారుడికి భార్య కదా! ఆ మాటే పైకి చెప్పి ఉంటె ఏ సమస్యా ఉండేది కాదు. నలుగురూ వాడి తప్పును గ్రహించేవారు. విషయాన్ని రహస్యంగా దాచి, తానేదో పెద్ద త్యాగాన్ని చేసినట్లు, లేదా అవమాన కరమైన పనిని చేసినట్లు ప్రవర్తించడం నేను ఒప్పుకోను. తాను మూర్తి భార్యనని, పాప తన కూతురే నని బహిరంగంగా ఒక్క మాట చెప్పి ఉంటె అసలు సమస్యే ఉండేది కాదు. వాళ్ళు ఆడించిన ఆటలకు అనుగుణంగా ఆడింది. ఇది తెలివి తక్కువతనం గాని, త్యాగం కాదు. కనీసం డాక్టర్ సుధేష్ణ అయినా ఈ విషయాన్నిచెప్పి ఉండవలసింది.
స్వర్ణా! సమస్యలను మనమే సృష్టించుకొంటాము. వాటిని ధైర్యంగా ఎదుర్కొని పరిష్కరించుకోగల స్తోమతు కూడా మనకు ఉండాలి! సంఘం, గౌరవం స్థాయి, కులాలు, మతాలూ అంటూ ఏవేవో ఊహించుకొని భయపడి ఆత్మవంచన చేసుకొంటాము!
నిజంగా ఆలోచించు. మరకతంది ఒక సమస్యేనా? గర్భవతి అయిన తరువాత, పెండ్లి కాకపొతే సమస్యగా మారి ఉండేది. ఎన్ని కులాంతర వివాహాలు , మతాంతర వివాహాలు జరగటం లేదు! అవన్నీ దుఃఖాంతాలేనా? అంతెందుకు? రాజగోపాల్ గారితో వివాహానికి నీవెందుకో ఒప్పుకోలేదు గాని , జరిగి ఉంటె మీ వైవాహిక జీవితం సుఖంగా ఉండేది కాదూ? మారుతున్న కాలంతో మనమూ మారాలి. అదే ప్రగతి.
అవివాహితగా ఉండి గర్భవతి అయిన పిల్లకు మరకతం సూచించిన మార్గం సులభం కావచ్చు కాని, అనుసరణీయం మాత్రం కాదు! సాధారణంగా ఆడపిల్లలు జాగ్రత్త గానే ఉంటారు. కర్మ చాలక కాలు జారినా నిల తోక్కుకోగల మనో నిబ్బరాన్ని కలిగించాలి కాని, సులభమార్గమంటూ చావడమేనా? మన చదువు, మన సంస్కారం చావడానికే గాని , బ్రతకడానికి ధైర్యం ఇవ్వటం లేదన్న మాట!
క్షమించు స్వర్ణా! నీ కంటే కూడా మరకతం అంటే నాకు ఇష్టం. నేను ఎంతో ప్రేమించిన మరకతం ఏవేవో ఊహలతో నిజాన్ని బయట పెట్టటానికి జంకి, నిండు ప్రాణాన్ని బలి చేసుకొంది. మూర్ఖురాలు! బ్రతికినంత కాలం తెలివి తక్కువగానే బ్రతికి, ఆఖరికి చావులో కూడా తెలివి తక్కువతనమే చూపించుకొంది!
అన్నింటినీ లోతుగా విమర్శించి వాటి బాగోగులను కుండ బద్దలు కొట్టినట్లు చెప్పే మరకతం తన జీవితాన్ని విమర్శించుకోలేకపోయింది! మరకతాని కంటే మరొక హిపోక్రేట్ ను నేను చూడలేదు! చనిపోయిన మరకతం మీద జాలి కంటే కోపమే ఎక్కువగా ఉంది! మరకతం చేసిన పని స్వయం కృతం. ఎవరూ బాధ్యులు కారు.
మరకతం లాంటి హిపోక్రెట్ మళ్ళీ నా జీవితంలో తటస్థ పడకూడదని నా హృదయ పూర్వకమైన కోరిక!
త్వరలోనే మేము ముగ్గురం కాబోతున్నాము. ఆ తరవాత ,మన దేశానికి తిరిగి వస్తాము. కొన్నాళ్ళు అక్కడే ఉండి, తిరిగి ఈ దేశానికి వస్తాము. ,మిమ్మల్నంతా చూడాలని నాకు తహతహగా ఉంది. మావారికి నిన్ను చూడాలని మాత్రమే తహతహగా ఉంది! ఎప్పుడూ నీ ఫోటో వంకే చూస్తారు! నీ లాంటి అందగత్తె ను ఇంతవరకు చూడలేదని మెచ్చుకొంటారు. నీవు తెల్లగా ఉండవని నేను నవ్వుతూ అంటే "తెల్లగా లేకపోయినంత మాత్రాన అందాని కేం లోటు?' అని కోపపడుతారు! నీ ఫోటో కూ, ఆయనకూ ఏదో జన్మాంతర అనుబంధమేదో ఉన్నట్లుంది! నిన్ను చూడ్డాటానికే అయన మన దేశానికి తిరిగి రావటానికి ఒప్పుకున్నారంటే అతిశయోక్తి కాదు! అయన మీద అంత నమ్మకం లేకపోయినా, నీ మీద పూర్తిగా ఉంది కాబట్టి ఆయనను తీసుకోస్తున్నాను. కోప్పడకు మరి! నిన్ను చూసిన వెంటనే ఆయన 'రియాక్షన్ ' చూడాలని చాలా కోరికగా ఉందోయ్! అందుకే బయలు దేరిన వెంటనే ముందు నీ దగ్గరికే వస్తాము! తరవాతే మా మామగారి ఊరు, మిగతా ఊళ్లును! మనవాళ్ళందరికీ నా శుభాకాంక్షలు.
నీ.......
--పద్మ."
మరకతాన్ని పోగొట్టుకున్న దిగులుతో ఉన్న స్నేహితురాండ్రకు పద్మ తెలిపిన శుభవార్త , త్వరలోనే ఇండియా కు తిరిగి వస్తున్నది అన్న వార్త సంతోషాన్ని కలగజేశాయి.
* * * *
ఇందిర చేతిలో పద్మ కొడుకు ముద్దులతో నలిగి పోతున్నాడు. అమెరికా నుండి వచ్చిన పద్మ చూడటానికి స్నేహిత బృందమంతా తరలి వచ్చింది. పద్మ కొడుకును చూస్తూనే పద్మతో మాట్లాడటం మరిచి, వాడిని ముద్దులాడటం మొదలు పెట్టారు.
ఉంగరాల జుట్టు, చక్రాల్లాగా పెద్ద పెద్ద కన్నులు, బూరె బుగ్గలూ, బొద్దుగా, ఆరోగ్యంగా ఉన్న ఒళ్ళూ, మిసమిసలాడే పసిమి చాయా-- గోపీ మొహనుడి మాదిరి ముసిముసి నవ్వులతో అందరినీ ఆకర్షిస్తున్నాడు!
పద్మ నవ్వుతూ స్వర్ణ తో మాట్లాడుతున్నది. మధ్య మధ్య గర్వంతో వెలిగిపోతున్న కన్నులతో కొడుకు వంక చూస్తున్నది. అది మాతృ గర్వం!
పద్మకు దగ్గరగానే కుర్చీ లో రాయన్ కూర్చొని స్వర్ణ వంక తన్మయత్వంతో చూస్తున్నాడు.
పిల్లవాడి ధ్యాస లో ఎవరూ అతణ్ణి గమనించటం లేదు.
"మోహన కృష్ణ!" పిల్లవాడిని పైకి ఎగరేస్తూ జవాబిచ్చింది ఇందిర.
"మనసంతా ఇట్లా మోహింపజేస్తాడనే కాబోలు, పద్మా రాయన్ కొడుకుకు ఈ పేరు పెట్టుకొంది!" నిర్మల నవ్వుతూ అన్నది.
వెంటనే పద్మ-- "నిర్మలా! నన్ను 'పద్మ' ఆనే పిలువు. పెండ్లి అయినంత మాత్రాన తోక లాగ తన పేరుకు చివర భర్త పేరును తగిలించుకొనే నాగరికతను నేను హర్షించను. నేను పద్మనే. నా వ్యక్తిత్వం నాదే" అన్నది.
అంతా "హియర్! హియర్!" అంటూ చప్పట్లు కొట్టారు.
ఇందిర రాధగా, మిగతా వాళ్ళు గోపికలుగా , మోహన కృష్ణ మోహన కృష్ణుడుగా , నిజంగానే ఆ స్థలం బృందావని లాగా కలకలలాడింది.
పిల్లవాడి ముఖం చంద్రుడు కాగా, అందరి ముఖాలలోని సంతోషం , వెన్నెల కాగా, నవ్వులు గలగల మని ప్రవహించే యమునా తరంగాలు కాగా, స్వర్ణ ఇల్లు ప్రవహించే యమునాతటిని మించిపోయింది!
"పద్మా! నువ్వూ , మీ ఆయనా అమెరికా తిరిగి వెడితే వెళ్ళండి కాని, వీడిని మాత్రం మేము ఇక్కడే ఉంచుకొంటాము" అన్నది ఇందిర నవ్వుతూ.
"నా చేతికి బాబును ఇస్తారా? ఇవ్వరా?' స్వర్ణ చిరునవ్వు తో ఇందిరను అడిగింది.
స్వర్ణకు జవాబు చెప్పాలని తల తిప్పిన ఇందిరకు స్వర్ణను తదేకంగా చూస్తున్న రాయస్ కనిపించాడు.
"ఏమిటండోయ్ , రాయస్ గారూ! మా స్వర్ణ కు దిష్టి గోట్టుతుంది సుమా!" అన్నది నవ్వుతూ.
ఉలిక్కిపడి, భుజాలెగర వేశాడు రాయన్. మాటి మాటికీ భుజా లెగర వేసే అలవాటు అతనికి అమెరికా లో బాగా పట్టు పడింది.
రాయన్ ఉలికిపాటును గ్రహించి అంతా సరదాగా నవ్వారు.
స్వర్ణ ఒక్కటే నిర్లిప్తంగా ఉండిపోయింది.
"మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుందండీ!" కుతూహలంగా అడిగాడు రాయన్ , స్వర్ణను.
ప్రశ్నను విననట్టుగా స్వర్ణ ఇందిర దగ్గరకు పోయి, మోహన కృష్ణ ను తీసుకొంది.
స్వర్ణకు బదులుగా నిర్మల -- "మా మరకతం ఇక్కడ ఉండి ఉన్నట్లయితే మీ ప్రశ్నకు "స్వప్న లోకంలో !" అని జావబిచ్చి ఉండేది , రాయన్ గారూ!" అని జవాబిచ్చింది.
మరకతం పేరు వినగానే అందరి ముఖాల్లోనూ క్షణ కాలం దిగులు కనిపించింది.
ఇంతసేపటికి అందరి దృష్టీ రాయన్ మీదికి మరిలింది. అంతా కుతూహలంగా అమెరికాను గురించీ, అక్కడి వాతావరణాన్ని గురించీ, ఆచార వ్యవహారాల గురించి అడగటం మొదలు పెట్టారు.
ప్రతి విషయాన్నీ ఎంతో ఓపికతో వివరించాడు రాయన్.
ఆరడుగుల పొడవుతో , నిండైన విగ్రహంతో, అందంగా , హుందాగా ఉన్న రాయన్ అందరికీ నచ్చాడు.
'పద్మ అదృష్టవంతురాలు! చక్కని వాడినే ఎన్నుకోంది!' మనస్సు లోనే అంతా సంతోషించారు.
"మీరు తిరిగి అమెరికా వెళ్ళడం ఎందుకు? ఇక్కడే సెటిల్ కావచ్చుగా!" అని అడిగింది ఇందిర.
"ఇక్కడే ఉండవచ్చు. అయితే, నే నడిగిన జీతంలో సగానికి సగం తగ్గిస్తున్నది మన గవర్నమెంట్. తరవాత ప్రతి చిన్న దానికీ రికమెండేషన్ కావాలి. ప్రతిభను గుర్తించటం తక్కువ. అందుకనే తిరిగి అమెరికాకు పోతాము." అన్నాడు రాయన్.
సంభాషణ ఉద్యోగాలూ, విదేశాలూ , రాజకీయాలూ మొదలయిన వాటి మీద జరిగింది.
మాటలలో పడి , ఎంతో పొద్దు పోయిందని గమనించిన వాళ్ళే లేరు.
హటాత్తుగా రాయన్ ----"పద్మా! స్వర్ణ గారు ఏరీ! నేను అమెరికా నుండి పరుగెత్తుకొని వచ్చింది ఆమె పాట వినడానికి! ఆ పాట వారి ముఖతః వినాలని నాకు ఎంతో కోరికగా ఉంది. బాబుతో అదిగో , అక్కడ ఉన్నారు. ఇట్లా పిలు!" అన్నాడు.
అంతా సంతోషంతో రాయన్ కోర్కెను బలపరిచారు.
స్వర్ణ మొదట అయిష్టంగా ఊరుకొంది. అయితే, అందరి బలవంతానికి ఒప్పుకోవలసి వచ్చింది. "ఏం పాట పాడాలి?" అని అడిగింది.
వెంటనే రాయన్ -- "పద్మ అమెరికాలో పాడిన పాట! పద్మ ఆ పాటను గురించి మాతో చెప్పినప్పుడు రచయిత్రి ని గురించి నేను ఊహ కల్పన చేశాను. నా ఊహా కల్పనకూ , మీ రూపానికి చాలా సామరస్యం కుదిరింది! ఆ పాట పాడే కళ్ళు ఎంత అందంగా ఉంటాయని నేను అనుకొన్నానో అంతకంటే ఎంతో అందంగా ఉన్నాయి మీ కళ్ళు! క్షమించండి! ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం నాకు అలవాటు. మీ పాట వినాలని, మిమ్మల్ని చూడాలనీ ఉన్న కోరికే నన్ను ఇండియాకు లాగుకొని వచ్చింది!" అన్నాడు, చిన్నగా నవ్వుతూ.
స్వర్ణ కీ మాటలు నచ్చనట్లు ఆమె కళ్ళే చెప్పాయి.
తప్పని సరిగా "ఏ కవి ఎదలో పూచిన' అన్న పాటనే పాడింది.
పాట పూర్తీ కాగానే ఇందిర "ఆలిండియా రేడియో లో 'ఆడిషన్' కి పొమ్మంటే పోవు గదా , స్వర్ణా!" అన్నది నిష్టూరంగా.
"మీ పాటే నా గుండెలో వీణియని మ్రోగించింది!" తన్మయత్వం తో అన్నాడు రాయన్.
అంతా వెళ్ళిపోయారు.
* * * *
