16
"అలా ఉన్నావేం, ఆఫీసులో ఏమైనా గొడవైందా?" అన్నాడు సీతాపతి.
తులసి జవాబివ్వకుండా, చీర మార్చుకుని, స్నానానికి వెళ్ళింది. తులసి మౌనం అతని సందేహాన్ని మరింత బలపరిచింది. చెప్పకూడని విషయమేం జరిగిఉంటుంది? తులసి మనసులో ఏదో కలవరం ఉన్నదని స్పష్ట మవుతూంది. అన్నం వండింది. మొగుడికీ, మామగారికీ పెట్టిందికాని తను తినలేదు. బలవంతం చేసినా ఒప్పుకోలేదు.

"ఎందుకు, తులసీ, అంత పంతం? ఏమయింది? నాతో చెప్పకూడదూ, నే నేమీ సహాయం చెయ్యలేనూ?" అన్నాడు సీతాపతి.
"ఏమీలేదండీ, మనసు బావుండలేదు. నన్ను నిద్ర పోనివ్వండి" అంది తులసి బలహీనంగా.
"మనసు బాగోలేకపోతే నిద్ర మాత్రం ఎలా వస్తుంది? చెప్పు, తులసీ, ఏమిటి నీలో నువ్వే అంత మథనపడుతున్నావు?" అన్నాడు సీతాపతి.
"నన్ను కదపకండి. నన్నిలా ఒంటిగా వదలండి కాసేపు" అంది.
ఆమెలో ఎంత ఆరాటముందో తెలుసుకున్న సీతాపతి, ఆమెను ఒంటిగా కాసేపుకూడా వదల్లేక, "తులసీ, ఏమిటి, ఏమిటమ్మా, చెప్పవూ?" అంటూ అనునయించ ప్రారంభించాడు.
జవాబుగా కన్నీళ్ళే మిగిలాయి.
"మీరు నాకో మాటిస్తారా?" అంది తులసి కన్నీళ్ళు తుడుచుకుంటూ.
"ఊఁ. చెప్పు, తులసీ ఏ మాటైనా ఇస్తాను చెప్పు."
"తప్పకుండా నిజం చెబుతారా?" అంది.
"నా మీద నమ్మకం లేదా?" అన్నాడు.
"మీరు నిజం చెప్పాలి" అంది మళ్ళీ.
"నీ మీద ఒట్టు" అన్నాడు సీతాపతి.
"నా మీద ఒట్టక్కర్లేదు. నన్ను తగలెయ్యండి. నిజం చెప్పండి. చాలు" అంది తులసి కోపంగా.
సీతాపతి ఆ తెగింపుకు ఆశ్చర్యపడ్డాడు.
"మరెలా-" అన్నాడు.
"సరే, చెప్పండి. మీకూ, పాపకూ మధ్య ఏమైనా వ్యవహారం నడిచిందా, లేదా? నిజం చెప్పండి" అంది.
"ఆ మాట నువ్విదివరకే అడిగావు కదూ నేను జవాబుకూడా చెప్పాను" అన్నాడు సీతాపతి నెమ్మదిగా.
"అవును నేను ఇప్పటికి వందసార్లడిగాను. మీరు వందసార్లు అబద్దాలు బుకాయించారు. అందరూ కలిసి దాని బతుకు నాశనం చేసి తమాషా చూస్తున్నారు. ఇప్పుడు ఇన్ని ప్రమాణాలు చేశారుగా, చెప్పండి, నిజం. కల్లబొల్లి మాటలన్నీ చెప్పి మోసం చేసిన ఆ నోటితోనే, ఇప్పుడు దాని కొక హితవాక్యం చెప్పండి. చూస్తూ చూస్తూ దాన్నలా ఐపోనివ్వకండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. మిమ్మల్నింకేమీ అడగను. మీ ప్రోత్సాహంతోనే అదంతకు తెగించింది. ఇప్పుడు మీరే దాన్ని బాగుచెయ్యండి" అంది తులసి గొంతు హెచ్చింది.
"ష్. నెమ్మదిగా మాట్లాడు. ఏమిటా అరుపు" అన్నాడు సీతాపతి.
"ఈ ఒక్కనాటికి భరించండి మరి. ఈవేళ వాళ్ళ హాస్టల్ మేట్ ఒకావిడ హాస్టల్లో దాని ఖ్యాతి ఎలా వెలిగిపోతూందో చెప్పింది. హాస్టలు కెళ్ళాను. అది నాతో మాట్లాడలేదు. మీరు రమ్మన్నారని చెప్పాను. వస్తానంది. దాని దారి ఏమన్నా మార్చగలరేమో చూడండి. లేదా మళ్ళీ మాయచేసి ఇంత విషం మింగించండి. మీరు దాన్ని చెడిపినదానికన్నా పెద్ద నేరమేమీ కాదులెండి ఇది" అంది తులసి తల మంచంకోడు కేసి బాదుకుంటూ.
"ఏయ్, అట్టే పిచ్చిగా మాట్లాడకు. నా కీ గొడవలేవీ తెలియవు. ఎవరి నడత వాళ్ళు చూసుకోవాలి గాని, ఎవరు ఎవర్ని బాగుపరుస్తారు, చెరుపుతారు?" అన్నాడు సీతాపతి ముసుగు బిగించి పడుకుంటూ.
తెల్లవారి-
తులసి వంటింట్లో ఉంది. సీతాపతి ఇంకా నిద్ర లేవలేదు. ఉదయం ఎనిమిది ప్రాంతాల రిక్షా దిగి వచ్చింది పాప. తులసికి ఏదో మత్తులో ఉన్నట్లుగా ఉంది. ఓ మూల తనకు పాప వస్తుందనే నమ్మకమే లేదు. వచ్చినా, ఇంత ఉదయాన్నే?
"కూర్చో, పాపా, ఇంకా మీ బావగారు లేవలేదు" అంది తులసి.
రాత్రి పీడ కల నప్పుడే మరిచిపోలేదు. ఏడవటం వల్లా, అలసటవల్లా తల భారంగా ఉంది. మనసు కుదుటపడలేదు. అసలు తనిలా ఊహించలేదు.
"బావను లేపు మరీ, ఎంతసేపని కూర్చోను?" అంది పాప ఇల్లు పరికిస్తూ.
పాప గొంతు విన్నాడు కాబోలు, సీతాపతి ముసుగు తొలగించాడు.
"ఏం బావా, నన్ను రమ్మన్నావుట. మళ్ళీ రమ్మంటే రాలేదనుకుంటావని వచ్చాను" అంది పాప.
"ఇంకా నయం. అంత దయన్నా ఉంది నా మీద" అన్నాడు సీతాపతి, లేచి కూర్చుని.
"బావుంది, నా మీదే మీరు శీతకన్నేశారుగాని, నా కెప్పుడూ అలా లేదు. చూడు, నువ్వు రమ్మన్నావని తెలియగానే ఎలా వచ్చానో, నువ్వు లేవకముందే దిగబడ్డాను" అంది పాప.
తులసి కాఫీకి నీళ్ళు పెట్టింది.
సీతాపతి మొహం కడుక్కుని వచ్చాడు.
"ఏం పాపా, హాస్టలు ఎలా ఉంది?" అన్నాడు సీతాపతి మొహం తుడుచుకుంటూ.
"హాస్టలు కేం, బాగానే ఉంది" అంది పాప.
సీతాపతికి ఏం మాట్లాడాలో తోచలేదు.
తులసి కాఫీ తెచ్చి ఇద్దరికీ ఇచ్చింది.
"నా కొద్దు, బావా. నా కాఫీ, టిఫిన్ పొద్దున్నే ఐపోయింది. మరి హాస్టల్ నివాసంలో ఉండే సుఖ మదే" అంది పాప.
"ఫరవాలేదులే ఏదో, మా ఇంటికి ఇన్నాళ్ళ కొస్తివి. అది తీసుకుని మమ్మల్ని సత్కరించు"అన్నాడు సీతాపతి.
"నువ్వు అంత కపటంగా మాట్లాడితే నా కేమీ వద్దులే" అంది పాప.
సీతాపతి నవ్వేడు.
పాప కాఫీ తాగేసింది.
"నిన్న మీ అక్క హాస్టల్ కొచ్చిందటగదా" అన్నాడు సీతాపతి, ఎలా ప్రారంభించాలో తెలియక.
పాప తల ఊపింది.
"నీ గురించి హాస్టల్లో, హాస్టలు బయటా చెప్పుకుంటున్నారట, ఏమిటి?" అన్నాడు.
"మా అక్కకు వినిపించి ఉంటాయిలే. ఆవిడ తన ఏజెంట్లతో నా రహస్యాలన్నీ కనుక్కుంటున్నది కాబోలు. పాపం, ఏం చెయ్యను, జాలిపడటం తప్ప" అంది పాప.
"ఐనా అలా అందరి నోళ్ళలోనూ ఉండటం ఏం బావుంటుంది, పాపా" అన్నాడు సీతాపతి.
"హాస్టల్లో ఒకర్ని గురించి ఒకరు అందరూ అలాగే చెప్పుకుంటారు, ఉన్నవీ, లేనివీ కల్పించి. ఆఫీసుల్లో ఆడక్లర్కుల గురించి ఎందరు, ఎలా ఊహాగానాలు చేస్తుంటారో ఆవిడకూ తెలుసుగా. వాటిని మనం పట్టించుకోగూడదు" అంది పాప.
అంత అనుభవంతో, హేయబద్ధంగా, తెలివిగా మాట్లాడిన పాపకు తనింకా ఏం సలహా లివ్వగలడో తెలియలేదు సీతాపతికి. వంటింటి గుమ్మంలో నిలుచున్న తులసి కనిపించింది.
'నువ్వు చెప్పిన పని చేశాను, చూశావుగా' అన్నట్టుగా చూశాడు ఆమె వేపు.
"పాపా, నిన్న నేను హాస్టలుకు వచ్చినప్పుడు నీ గురించి ఎన్ని మాటలు విన్నాను! ఎందుకే అందరి కళ్ళలో అంత చులకనయ్యావు? ఎందుకలా నీ బతుకు పాడుచేసుకుంటావే?" అంది తులసి ఏడుస్తూ.
"ప్చ్ నీతో మాట్లాడి లాభం లేదు. అసలు నువ్వేమనుకుంటున్నావు, నాకు గార్డియన్ననుకుంటావా ఏమిటి? నా బాగోగులకు నువ్వు బాధ్యురాలివా?నా కేమీ అర్ధం కావటం లేదు నీ వైఖరి. నేను చేసే ప్రతి పనీ చాలా ఆలోచించి చేస్తాను. నువ్వలా ఊరికే బెంబేలు పడనక్కర్లేదు. ఐనా, నీ ఇంట్లో ఉండి, నీ సంసారాన్ని రచ్చకీడ్చిన మనిషి మీద నీ కింత సానుభూతి ఎందుకో?" అంది పాప.
"ఔనే, అదేగదా కసి నా మీద నీ పగ నా మీద చూపించవే. కాని నువ్వలా..." అంటూ మిగతా మాటలను కన్నీళ్లుగా మార్చింది తులసి.
"చూడమ్మా, అక్కగారూ, నాకు నీ మీద ఏమీ కోపం లేదు. పగ లేదు. కసి లేదు. నువ్వలా బుర్రపాడుచేసుకోవటం కేవలం అనవసరం. ఇది నీ సంసారం గనకా, నే నిక్కడ ఉండి మీ మధ్య భేదాలు తెచ్చాను గనకా, నేను బావను నా వైపు ఆకర్షించుకున్నానని నువ్వపోహ పడ్డావు గనకా, ఈ ఇంట్లోంచి వెళ్ళిపోయాను. నా పొట్ట పోసుకోవటం కోసం ఉద్యోగం చేస్తున్నాను. ఉండే నీడ కావాలి గనక హాస్టల్లో ఉంటున్నాను. సొంత కష్టం మీద బ్రతుకుతున్నాను గనక నేను మరేమేం సాధించగలనో ప్రయత్నిస్తున్నాను. నువ్వలా మాటకూ నా బ్రతుకు పాడు చేసుకుంటున్నా వని అంటే ఏమీ చెయ్యలేను. కాని నా కది చాలా మూర్ఖంగా కనిపిస్తుంది. నాకు బాగా నచ్చి, అందువల్ల నాకు ఏదో శుభం కలుగుతుందనుకుంటేనే ఏదైనా పని చేస్తానుగాని, మరొకరి కళ్ళలో చులకనై పోవటం నాకూ ఇష్టం ఉండదు. చూడబోతే, నేను నీ చెల్లెల్నని చెప్పుకోవటమే నీకు కష్టంగా ఉన్నట్టుంది. సరే నువ్వు అక్కవని చెప్పుకోవటంవల్ల నా కేమీ ఒరగలేదు. నేను ఇంక ఆ మాట ఎవరిముందూ చెప్పను. మరి నా వల్ల నీ కపఖ్యాతి రావటం నా కిష్టం లేదు. అసలు అలా ఎంతసేపు ఇతరులు మన గురించి ఏమనుకుంటారో, వాళ్ళ దృష్టిలో మనం ఎలా మంచిగా కనిపించాలా అని ఆలోచించే మనుషుల మనసుల్లో చాలా కల్మషం ఉంటుందనుకుంటాను. ఐనా ఈ మాట నీ విషయంలో చెప్పదలుచుకోలేదులే. నా గురించిన నీ అనుమానాలన్నీ స్పష్టంచేశానను కుంటాను. వెళతాను మరి-" అంది పాప లేస్తూ.
తులసీ, సీతాపతీ ఏం మాట్లాడలేకపోయారు.
"ఎందుకలా నా గురించి ఊరికే మనసు పాడుచేసుకుంటారు, సుఖంగా కాపరం చెయ్యక. గడుస్తున్న కాలం తిరిగి రాదు. ఇలా ఇతరుల గురించి ఆలోచిస్తూ మీ కాలం వృథా చేసుకోకండేం, వస్తా" అంటూ మెట్లు దిగి వెళ్ళిపోయింది పాప.
17
ఆ ఉదయం రిజల్స్టు లో నంబరు చూసి చాలా సంతోషపడింది తులసి. 'హమ్మయ్య! ఈయన శ్రమ వృథా పోలేదు. జాగరణలూ, అర్ధరాత్రి కాఫీలూ అన్నీ పనికివచ్చాయి. ఎలాగైతేనేం, పరీక్ష గట్టెక్కాడు' అనుకుంది.
