Previous Page Next Page 
అతని లక్ష్యం పేజి 19

 

    'అలాగని ఊరుకుందుకూ వీల్లేకుండా అక్కడేవర్తో వెంట తిరుగుతుందీ' అలా ఇలా అంటూ ఏవేవో పుకార్లు చెవిని పడుతున్నాయి కదా!' అన్నారు నొచ్చుకుంటూ కాస్త గొంతుక తగ్గించి రాజమ్మ గారు.
    'పోనీ అక్కడే మన వాళ్ళ పిల్ల లెవరన్నా ఉన్నారేమో నువ్వు కాస్త కనుక్కో రాదూ.'
    'అక్కడా! అతనితో పనిచేసే మన వాళ్ళ పిల్లే ఒకమ్మాయుంది. పెళ్లి చెయ్యాలని వాళ్ళవాళ్ళు కూడా అంటున్నారు-'
    'అయితే కనుక్కో రాదూ' ఆదుర్దాగా అన్నారు రాజమ్మ గారు.
    'అలాగే కనుక్కుంటా కాని వాళ్ళంతా కాస్త స్వేచ్చా స్వాతంత్రాల కలవాటు పడ్డవాళ్ళు.'
    'ఆ అయితే మట్టుకేం వాళ్ల మూలాన్న వాళ్ళుండేటప్పుడు స్వేచ్చకు ఇక్కడేవళ్లడ్డుస్తారని' అన్నారు. 'నీమీద అధికారాల్చేలాయించడం తో నా సరదాలన్నీ తీరిపోయింది సుమా' అన్నట్టు.
    'మరి మిగతావన్నీ కూడా --'
    'ఆ వాళ్ళ ఇష్టం ఏం చేసుకున్నా సరే. వాళ్ళ పెట్టు పోతలెవరి క్కావాలనీ' అన్నారు. ఆ విషయం లో కూడా నాక్కావలసినవన్నీ మీవాళ్ళ దగ్గర గుంజడం అయిపొయింది సుమా' అన్నట్టుగా.  
    'అలాగైతే ఇంకేం అడ్డూ? మీరన్నట్టు ఎవర్తే నో చేసుకోవడం కన్నా, సాంప్రదాయం గల ఈ సంబంధం అన్ని విధాల బాగానే ఉంటుంది. ' అంది. 'ఈ మురళి ఎంత చక్కని ప్లాను వేశాడూ' అనుకుంటూ.
    'అందుకే ఆ స్నేహలేదో ముదిరే లోగా ఈ సంబంధం ఒప్పించేయ్యి. వాడూ అక్కడేగా వుంటాడూ' అన్నారు తృప్తిగా.  
    'అలాగే అత్తయ్యా ఏ సంగతీ వెంటనే మీకు తెలియజేస్తా లెండి.' అంది. అలా రావాలి దోవకి అనుకుంటూ.
    'నే చెప్పిన మాట మర్చిపోకేం.' అని వాళ్ళు తిరిగి విశాఖ కు బయల్దేరుతుండగా రాజమ్మ గారు కోడల్ని హెచ్చరించడం విని.
    'ఏమిటది ఓదినా అన్నాడు?' ఏవీ ఎరగనట్టు మురళి.
    'నాచేత కొన్ని అబద్దాలాడిస్తే ఆడించారు గాని. ప్లాను మాత్రం మా గొప్పగా వేశార్లెండి. ప్రతి ప్రయత్నానికి అడ్డంటూ చెప్పకుండా టకీ టకీ అయిపోయాయి పన్లు.' అంది రైలు కదిలాక నిర్మల.
    'రాతి కుండకు ఇనప తెడ్డుండా లోదినా మీకు తెలియదూ....శ్రమను కోకుండా నాకోసరం ఇన్ని ఇబ్బందులూ పడ్డందుకు చాలా 'థాంక్స్' ఓదినా' అన్నాడు బాత్ రూమ్ కెళ్లి డ్రస్సు మార్చుకోచ్చిన మురళి.
    'మన్లో మనకీ ఫార్ మాలిటీస్' ఎవిట్లెండి గానీ ఏకంగా ఇంత నాటకం ఆడేందుకు ధైర్యం తెచ్చుకున్న మీరు ఈ విషయాన్ని స్పష్టంగా మూడు మాటల్తో మీ అమ్మగారికి చెప్పెసుంటే పోయేదేమో.
    'మొదట అలాగే అనుకున్నా ఒదినా అయితే అమ్మది అదో రకమైన మనస్తత్వం. అలా చేశానంటే అక్కడికి నేనేదో తనని మహా లోకువ చేసినట్టు ఫీలవుతూ ఆ అహంకారం కొద్దీ , ఎన్నన్నా గొడవలు లేవదీస్తుంది. అందువల్ల మన పరువు పోవడం మాటలా వుంచి రాత్రింబవళ్ళు అవే తల్చుకుని ఆహంకారం పెంచుకుందంటే! అసలే హై బ్లడ్ ఫ్రెషర్ మనిషా? వో దాని కొకటయిందంటే మళ్లీ ఇబ్బందని ఇన్ని చుట్లూ, తిరగాల్సోచ్చింది.' అన్నాడు మురళి.
    'నిజమే ఇలా చెయ్యడం లో-- ఆవిడకీ, తృప్తిగా వుంటుంది పాపం. ఆవిడ కోసరం . ఆ. 'ఎవత్తేనో' మానుకుని నే చెప్పిన పిల్లనే చేసుకుంటున్నాడని, పొంగి పోతారు. ఏవైనా మీరు అన్నదమ్ములంతా ఎంతకన్నా తగుదురు బాబూ' హస్యంగానే అంటించింది నిర్మల.
    'ఆ, మీరేం తక్కువ తిన్నారనీ' వారం రోజుల పాటు నన్ను సందిగ్ధావస్తలో ఒదిలి, ఇద్దరూ ఎంత కుంభకోణం చేశారనీ, అంటూ అప్పర్ బర్తు కెళ్లి పోయాడు మురళి బాబుని జోగోడుతూ అలాగే సోఫాకు జేరబడి కన్నుమూసింది నిర్మల. విశాఖ చేరగానే ఈ వివరాలన్నీ నిర్మల తన భర్త తో చెప్పెసరికీ... అచ్చా నాకు నచ్చావురా. తమ్ముడూ.' అంటూ హాస్యంగా మురళి వీప్మీద తట్టాడు తిలక్.
    'ఆ మర్నాడు నిర్మల నళిని వాళ్ళింటి కి ఫోన్ చెయ్యడంతో, వారు యధావిధి గా పెళ్లి చూపులకి రమ్మని పిల్చి వెళ్లారు. ఆ తరవాత వో మంచి రోజు చూసి పెళ్లి చూపులు కానిచ్చాక పిల్లవాడి సమ్మతాన్ని తెల్సుకుని జోగారావు గారూ భార్యా, విజయవాడ వెళ్ళి, మిగతా సంగతులన్నీ మాట్లాడి నిశ్చయపరచు కు వొచ్చారు. ఇటు రాధ మూలకంగా గుట్టు బయట పడకూడదనుకుని వీరూ అటు అమ్మమ్మని తృప్తి పరిచే నిమిత్తం వారూ ఇలా చెయ్యక తప్పలేదు. రాజమ్మ గారి భయం కారణంగా అతి త్వరలోనే వో సుముహర్తాన్న మురళీ , నళినుల పెళ్లి అతి వైభవంగా జరిగిపోయింది.
    'ఏదో అనుకోకుండా మా మురళి పెళ్ళయి పోయింది. ఇక మా రాధ క్కూడా అయిందంటే -- ' అంటూ పెళ్లి కూడా వచ్చిన పార్వతమ్మ గారితో మాటలు కదిపారు రాజమ్మ గారు.
    'అవుతుంది మరీ, దేనికన్నా వేళ రావాలి. అంటూ తటస్థంగా ఊర్కున్నారు పార్వతమ్మ గారు.
    రఘు కూడా ఆ పెళ్లి లో చాలాసరదాగా పాల్గొనడవె గాకుండా తను కాలేజీ తరపున వచ్చిన వారందర్నీ స్వయంగా ఆహ్వానించి కూర్చో పెట్టాల్సిన పనిని పూర్తిగా తను చూసుకున్నాడు. ఈడూ జోడూ గా ఉండడమే గాకుండా మిగతా అన్నింట్లలోనూ కూడా అమర్చినట్టు కుదిరిన ఆ జంటను చూస్తుంటే అదే వయసు లో వున్న రఘు మనసూ ఏవేవో కొత్త కొత్త వాంచల్ని రేకెత్తించి ఉర్రూతలాడించినా, అది వరకే కొన్ని ఆశయాలకు పూర్తిగా మనసులో తావిచ్చేసిన రఘు ఆ చపలత్వాల నెప్పటి కప్పుడు ఖండిచేస్తూ, జయం చేకూర్చు కుందుకు విశ్వ ప్రయత్నం చేస్తుండే వాడు.
    ఒక్క ఈ విషయం లో ఇప్పుడేలాగనడవే కాదు అడుగడుగునా , అతన్ని అగ్ని పరీక్ష చేస్తుండే ఇటువంటి సంఘటనలు ఎన్నెన్నో.'
    సినిమాలనీ, నవలలని, ఇలా ప్రతి వాటిల్లోనూ ప్రేమ పెరట ఎన్నెన్నో అవినీతి దృశ్యాల్ని కళ్ళ ముందు నిల్పుతుండే ఇప్పటి వాతావరణం లో ప్రతివారూ మానసికంగానూ, శారీరకం గానూ కూడా దుర్బరులై పోతుంటే, అందుకు తోడు , ఆడా, మగా కలిసి మెలిసి చదవడం తోనూ, సంస్థల్లో పన్లు చెయ్యడం తోనూ, హృదయ దౌర్బల్యానికి లోనవడం లో తప్పేం వుంది?
    అందులోనూ మెడికల్ కాలేజీ లూ హాస్పిటల్స్, ఇటువంటి చోట వుండేవారి సంగతి ఇక అడగ నవసరమే లేదు. శరీర తత్వాన్ని గురించిన పరిశోధనలూ, రుగ్మతలకు కారణాలు , వాట్ల నివారింపు లూ మొదలైన అన్ని విషయాల్ని నిస్సంకోచంగా కలిసీ మెలిసీ చర్చించు కుంటూ వుంటారేమో . ఇక వారికిందుకు సంబంధించిన అరమరికలూ అభ్యంతరాలూ మొదలైన ఎటువంటి ఆటంకాలూ , ఆక్షేపణ లూ తోచనే తోచవు.
    'జగమెరిగిన త్యాగికిక సిగ్గెందు' కన్నట్టు. ఒకటి ఎంతసేపూ అ పరిశోధన్ల లో అంతు కనుక్కోవాలను కుంటూ సర్వాన్నీ మరిచి అందుకే వారి శక్తి సామర్ధ్యాల్ని ధారపోస్తూండడంతో ఒక విధంగానూ, లేదా, ఆ పరిశోధన్ల తో పాటు నిర్బయంగా తమలో కల్గిన వ్యామోహలకి లొంగి పోతూ మరో విధంగానూ ఇలా రెండు తెగలుగా మారిపోతుండడం సహజం.' అందులోనూ ఆ మొదటి తెగ ననుష్టించా లంటే ఎంతో మనో నిబ్బరం స్థిరత్వం కావాలి గనక అది అందరికీ పట్టుపడదు గాని, ఈ రెండో పద్దతికి లోబడి కన్నూ మిన్నూ తెలియకుండా ప్రవర్తించి ఫలితాన్ననుభవించే సమయమప్పుడు బాధ పడుతుండే వారు అనేకమంది. ఇక ఈ రెండు తెగలకి చేరకుండా తమకి ఏది ఎంతవరకూ అవసరమో అంతవరకూ అలవరచు కుంటూ సందర్భాను సారంగా సర్దుకుందుకు అలవాటు పడేవారు బహు కొద్ది మందేనని చెప్పొచ్చు అటువంటి వాతావరణం లోనే తనూ వున్న రఘు ప్రయత్నం తను ఎలాగైనా మొదటి శ్రేణి కి చెందగల్గా లని, అయితే పరిస్తితులన్నీ రెండో శ్రేణి కి ఈడ్చేవిగా సిద్దమవుతూ, అతన్ని దుర్బలుడ్ని చేసేస్తున్నాయి. తను పరిశోధించవలసోచ్చే యువతులూ, ప్రతినిత్యం తనని చుట్టుముట్టి తనతో చెయ్యి, చెయ్యి కలిపి పని చేస్తుండే సుందరాంగులూ. అడుగడుక్కీ ఇటువంటి సందర్బాలింకా ఎన్నెన్నో. ఎందు వల్లో అది నిజంగా నే జరుగుతుందో, తన మతి భ్రమో తెలియదు గాని వారంతా ఎప్పుడూ తన వేపు చూస్తున్నట్టు, తన పరిచయం కోరి ఏదో నిమిత్తంగా పని కల్పించుకుని తన వద్ద కోస్తున్నట్టే ఎప్పుడూ అతని కనిపిస్తూ వుంటుంది. ఇన్నింటినీ, విదిలించుకుని ఎలాగో నిబ్బరంగా మసలు కుంటూనే వున్నా, 'అబ్బ? ఇంతమంది డాక్టర్లీ హాస్పిటల్లో వుంటుండగా వీళ్ళందరూ కక్ష కట్టి నట్టు తన్నే చుట్టుముట్టిస్తుంటారెం.' అనుకుని ఒక్కొక్కసారి చాలా చిరాకు పడి పోతుండేవాడు కూడా.
    ఒక్కొక్కసారి మరీ తన మనో నిగ్రహం బలహీనమై పోతుండడం తెల్సు కున్నప్పుడు 'మనం మన లక్ష్యాల్ని సాధించి తీరాలనుకునేటట్టయితే త్వరగా ఇక్కడ్నించీ తప్పుకోవడమే మంచిదేమో' అనిపిస్తుండేది కూడా అతనికి. అయితే తన లక్ష్యాలు సార్ధకం అవాలంటే, ఎక్కడైనా, ఇటువంటి హాస్పిటల్లో నెగా వుండి తీరాలి తనూ. ఇలా మళ్లీ తనలో తనే సర్దుకునేవాడు రఘు.  


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS