7
నిర్మల తో నళిని పరిచయం చేశాక దాన్ని గురించి నళిని తన అభిప్రాయం ఏవన్నా చేపుతుందేమోనని కొద్ది రోజుల పాటు ఎదురు చూశాడు మురళి. అయితే అలా ఏమీ చెప్పలేదు సరి కదా అటువంటి ప్రయత్నం ఏమీ జరగనట్టుగా ఎప్పట్లా తనపని తను చూసుకు పోతుంది నళిని. నళిని ప్రవర్తన ని అసమ్మతంగా అర్ధం చేసుకోవడమా! ఏవీ అర్ధం గాక అయోమయంగా వుంటుంది మురళికి.
రోజూ మొహం తేలేసుకుని ఇంటి కోస్తుండే మురళిని చూచి నవ్వుకునేది నిర్మల.
'మీ అన్నగారిచ్చిన గడువు దాటి పో వస్తుందే. మరి ఇంకా ఏ ప్రయత్నమూ పూర్తీ కాకపొతే ఎలాగా' అంది ఒకరోజు టీ తాగుతుండగా.
'అదే నాకూ అర్ధం కావడం లేదోదినా , ఏదో సామ్యం చెప్పినట్టు పరిచయం చేశాక. అసలే నాతొ మాట్లాడడం మానేసిందా పిల్ల...ఇది యిష్ట సూచనంటావా?' కాస్త ఆగాక అన్నాడు.
'మరి మీ ఇద్దరికీ మాట్లాడుకోవడమే అలవాట్లేదేమో !' నవ్వాపుకుంటూ అంది.
'అంతే, అంతే, ఏ మెడిసిన్ ల విషయంగా- నన్నా, అడుగుతుండేదిగా, ఇపుడదీ లేదు' దివాలా పడ్డట్టు మొహం పెట్టాడు మురళి.
'ఎందువల్లనో?' ఎంతో అహంభావంగా ఎవర్నీ లక్ష్యం చేయ్యనన్నట్టుగా మసులు కుంటుండే మురళి లో ఈ మార్పు చూసి, మనసిచ్చిన చోట మార్దవం దానంతటదే పుడుతుందేమో ! అనుకుంటూ అడిగింది నిర్మల.
'ఏమో , నిన్న రఘుతో ఈ సంగతి చెపితే. అమాంతంగా నిన్ను చూస్తె ఆ పిల్ల కింత సిగ్గేప్పుడు ప్రారంభమయిందో అది తప్పకుండా అంగీకర సూచనే, భయపడకు' అన్నాడు. అంటే ఈ విషయం లో ప్రతి సంగతి అతని సలహా తీసుకునే జరుపుతున్నాన్లె? నేను నిజం చెప్పాలంటే, చలచిత్తగాడ్నయిన నాలో ఇంత స్థిరత్వం కుదిరిందీ అంటే అదో తప్పకుండా దృడ భావం గల రఘు పరిచయం వల్ల ఏర్పడ్డదనే చెప్పాలి. అలా కాకపొతే ఇంతమంది యువతుల మధ్య మసుల్తుండే నా ప్రవర్తన ఎన్నెన్ని పరవళ్లు తోక్కుండేదో' అన్నాడు. శూన్యం లోకి చూస్తూ మురళి.
'మరి నళిని విషయం లో అంత సబబుగా సలహా ఇచ్చాడంటే అతని కిటు వంటి వ్యవహారాల్లో అనుభవం వున్నట్లేగా!'
'ఉండొచ్చు. అయితే అది ఊహ మాత్రపుది మాత్రమె ఎందుకంటె, అతని చుట్టూ పట్ల తిరుగుతుంటే యువతు లందరూ అతన్నేతరుచూ చూస్తుండడం కనిపిస్తుంది గాని. ఇంతవరకూ అనవసరంగా అతనేవ్వరి వేపు చూడ్డం నేచూసెరగ , ఎంతసేపూ అతని ప్రాక్టికల్స్ , అతని ఆలోచన్లూ , ఎప్పుడూ ఏవేవో పరిశోదన్లూ అలా చేస్తూనే వుంటాడు గదా, మరి అతనికెంత విసుగు లేదో గాని....'
'మరి రాధ కోసరం కనుక్కోమన్నా రేమో , మీ అమ్మగారు!'
'ఆ అందనుకో. అయినా తన స్వలాభం విషయాలన్నీ మరిచి అతని ఆదర్శాలకి దోహదం చెయ్యగల్గే ఏ మంచి యోగ్యు రాలైన అయితే తప్ప. లేకపోతె అతనికి ఆ చేసుకున్న వారికీ కూడా సుఖం వుండదని నా విశ్వాసం . ఎవంటావ్.'
'నిజమేనూ'
'మరి మన సరోజ లో ఈ అలవాట్లు మచ్చుకన్నా కానరావే.'
'సరోజ మాటెలా వున్నా అతని ఆశయాలకి అనుకూలంగా వుండే పిల్ల దొరకడ మన్నది చాలా కష్టమే అవుతుందేమో.'
'ఆ మనకు తెలిసినంత లో లేరేమో గానీ. అతని కేవిటోదినా. బంగారానికి పరిమళం కూడా. అబ్బినటువంటి అతన్ని చేసుకుందుకు, సై, అంటే చాల్ననుకునే యువతు లెందరో సిద్దంగా వున్నారు. చూడబోతే ఇంకా హౌస్ సర్జనని పేరు. అప్పుడే ఎముకల్ని అతికించడం, కృత్రిమంగా వేరే ఎముకల్తో అంగ వైకల్యాన్ని సరి చేస్తుండడం ఇటు వంటి వాటిల్లో ఎంతమంచి అనుభవం , ఎంత మంచి పేరూ సంపాదించేడో! ఇక బోన్సు కి సంబంధించిన ఏకేసైనా అందుకు ప్రత్యేకంగా చేసే డాక్టర్లు అతణ్ణి పిలవందే ఆపరేషన్ ప్రారంభించరు గదా!'
'ఆసక్తి చూపెవారికి అలా అవకాశం ఇవ్వడం ఎంతో విధాయకం మరి. ఇంతకీ అవును ఈ ' బోన్ క్యూరింగ్ కోర్సు ని స్పెషలైజ్ ' చేస్తున్నాడన్నమాట' అంది ఏదో ఆలోచిస్తూ నిర్మల.
'మరే! ఆ చెయ్యడం లోనూ అతని ఆసక్తి ఇక చెప్పతరం కాదనుకో. రాత్రింబవళ్ళు ఇక అదే ధ్యాస. అదే ప్రయత్నం . అంటే ప్రజలందరి అదృష్టం బాగుండి అతని ప్రయత్నాలే గనక ఫలించాయంటే , ఇక ఈ దేశంలో అవిటి వారే వుండరనుకో.'
'అబ్బా దైవ కృప వల్ల ఆ ప్రయత్నాలు కొనసాగితేనూ...'
'తప్పకుండా అతి త్వరలో ఫలిస్తాయన్న విశ్వాసం మా కందరికీ వుందోదినా. అంత గొప్ప స్థాయిలో జరుగుతున్నాయి అతని ప్రయత్నాలు. అంతెందుకూ ఏళ్ల తరబడి ఇటువంటి కేసుల్ని చూడ్డం లో గొప్ప నిపుణులని పేరు సంపాదించుకున్న స్పెషలిస్టులంతా కూడా కొన్ని కొన్ని ఎటూ పట్టుపడని కేసుల్లో అతణ్ణి పిలిచి ఉపాయాలడుగుతున్నారంటే ఇక చూసుకో.'
'ఆశ్చర్య వేవిటీ! అసలు నమ్మతగేటట్టె లేదూ?'
'ఆ...అదీ. అంటే అతని ఆలోచనా దృష్టంతా, ఎప్పుడూ ఈ విషయాల్లోనే కేంద్రీకరించి వుండడం వల్ల ఇక చదువు లోనూ, నేర్చు కోవడం లోనూ నిమిత్తం లేనంత అపూర్వమైన ఊహలు అతనికి స్వయంగా కల్గుతుండడం వల్ల క్రమశిక్షణ తో అదే ఆధారంగా పని చేస్తుండే ఈ మిగతా డాక్టర్ల కి ఆ శాస్త్ర ప్రకారం పట్టుపడని కేసుల్ని కేవలం ఊహించడం తోనే ప్రత్యెక అనుభవాల్ని సంపాదిస్తున్న అతనికి పట్టు పడుతున్నాయన్న మాట, ఇప్పుడర్ధమయిందా.'
'ఆ అయితే అనకూడదు కాని మరీ ఇంత అమోఘంగా మెదడు పనిచేసే వార్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వుండాలి. అంటే ఈ శక్తి కి మించిన ఆలోచనలతో నరాలు బలహీన పడి ఏ మతి భ్రమ వంటి ప్రమాదమన్న సంభవించోచ్చు కూడా.'
'ఆ. ఈ 'పాయిన్ట్ ' ని గురించే మొన్న ఈ మధ్య జర్మని నించోచ్చిన ఒక పెద్ద డాక్టరు ప్రత్యేకంగా చెప్పాడు. అందులోనూ మా ప్రిన్సిపాల్ అంటే మునపటి సూపరెండెం టన్నమాట్లే. రఘుని గొప్పగా ఆ డాక్టరు కి పరిచయం చేస్తే, 'నీవల్ల వైద్య శాఖ కేంతెంతో ప్రయోజనం వుంటుంది గనక. అందుకని ముఖ్యంగా నీ ఆరోగ్యాన్ని అతి జాగ్రత్తగా కాపాడు కోవాలి తెల్సునా. అంటూ ప్రత్యేకంగా అతన్ని హెచ్చరించారాయన. అయన ద్వారానే ఇప్పుడు రఘు కి అమెరికా వెళ్లే అవకాశం కల్గుతుంది.
'అన్నట్టు అతనికి మేనరికం కూడా వున్నట్టుందే.'
'ఆ ఒక్క కాలు వంకర తప్పిస్తే, ఆ పిల్లలో ఇక ఏ లోపమూ నా వరకూ కనిపించదు. ఇక పాటని గురించి చెప్పాలంటే ఆ పిల్ల కాపిల్లె సాటి .'

'మరి అంత స్నేహితులేమో, మీతో ఈ విషయం ఏవీ చెప్పలేదా, అతనూ.'
'అబ్బో, అతని మనసు చాలా లోతు ఏ విషయాన్నీ దబ్బున పైకి తెలడు. అయినా 'వేలు జర్నా తీసుకుకోవోచ్చు గాని మాట జారితే తీసుకోలేం' అన్నట్లు ఇద్దరి మధ్య మసలుతుండే వారికి ఎప్పుడూ బుద్దేటుపోతుందో . ముందు మాట బయట పెట్టెయ్యడం అంత మంచిది కాదనుకో! అయినా అతనిది చాలా గొప్ప మనో నిబ్బరం . ఏమో ఆ పిల్లనే చేసుకుని తన నేర్పరి తనంతో చక్కగా సరిదిద్దుకుని అందరికీ తనొక ఆదర్శనీయుడయినా అవచ్చు. చెప్పలేం.'
'నిజంగా గనక అతనలా చేశాడంటే అది చాలా ప్రశంసనీయమైన త్యాగం అనాలి. అంటే, అతనలా చెయ్యాలంటే సిద్దంగా ఎదుట నున్నఎన్నేన్ని అవకాశాల్ని నిబ్బరం తో ఎదుర్కుంటూ ఎన్నాళ్ళు ఎన్నెన్ని ఇబ్బందుల్ని ఎదుర్కోవలసి వుంటుందో అదిమనకి ఊహాతీతం. ఇంతకీ ఈ ప్రయత్నం సాధారణస్తుల వల్ల అయ్యే డెంతమాత్రం కాదని నా అభిప్రాయం. నిజమేనని అంటారా.'
'తప్పకుండాను. అయినా రఘు ఇందులో జయించే తీరుటాడని నా దృడ విశ్వాసం' అంటూ లేచి వళ్ళు విరుచుకున్న మురళి 'అబ్బో , అయిదయి పోయిందే?'....అన్నాడు వాచీ చూసుకుని హాస్యంగా.
'రేపు మీకు లీవేనా....' నవ్వుతూ అంది.
'అంటే'
'విజయవాడ వెళ్లేందుకు.'
'అలూ లేదు, చూలూ '--
'అలి వుంది అతి త్వరలో అ రెండోది , కలిసే వుంది గాని, మీ మాట చెప్పండి.' అంది నవ్వుతూ.
'నాకు వీలుకేం వుంది గాని మీరు సరిగ్గా చెప్పండి ముందు. మళ్లీ వాళ్ళ నెప్పుడు కల్సు కున్నారు.'
'రోజూనూ అంటే, ఏదో ఒకవేళ ఆ అమ్మాయి కనిపించి వెళ్తూనే వుంది పాపం.'
'ఆ? అయితే నేనే నా కాని వాణ్నయ్యానూ? మీరన్నా ఇంతవరకు చెప్పనే లేదేం నాతొ?' కాస్త వోర్వలేని తనంగానే అన్నాడు మురళి.
'తొందరపాటూ, కోపం , ఈ రెండూ ఆ పిల్ల కసలే గిట్టవు'--
'చచ్చాం , నాకున్న జబ్బులు అవి రెండేనూ.౦---
'ఛా, శుభం పల్కరా ' అన్నట్టు ఏం మాటలు గానీ, మీకు నిదానం, శాంతం , అలవాటనీ, అనుకునే --'
'ఇద్దరూ ఈ ఎత్తు వేశారన్న మాట.'
'మరే. తను వెళ్లి మాట్లాడి వస్తానంటూ వాళ్ళ నాన్నగారూ ఒకసారి వచ్చారు. ఎందుకయినా , మేం ముందు చెప్తేనే గాని తొందర పడొద్దని స్పష్టంగా చెప్పేశాను.'
'రక్షించావ్'
'మీ అమ్మగారు ఏవిధమైన లోకువా వార్ని, వారి కూతుర్ని చెయ్యకుండా వుండేటట్లు మీరు హామీ ఇచ్చారంటే ఇక పెళ్లి విషయం లో మీరు కోరినట్టూ అన్నీ నడిపించేందుకు వారి కేవిధమైన అభ్యంతరమూ లేదుట.'
'వారికి లేకపోయినా నాకుంది వదినా! వారు వారంతట వారే ఇష్టపడి నడిపించేవి తప్ప ప్రత్యేకంగా మనం ఏమీ పురమాయించ కూడదని అమ్మతో స్పష్టంగా చెప్పేస్తాను. ఇంకా వాళ్ల విషయం లో సర్దుకోవాల్సిన వేవన్నా వున్నాయా.'
'నాకు తెల్సినంత వరకూ ఇంతే'
'అలాక్కాదోదినా . ఈ విషయంలో మీకు పూర్తీ స్వాతంత్యం ఇచ్చేశాం.'
'అబ్బే, పెద్దవారు అమ్ముండగా --'
'ఆ గౌరవం ఆవిడ కిచ్చి మీ ధర్మం మీరు చూపించుకున్నారు. మీ వరకూ అలా చెయ్యడం న్యాయమే. అయితే ఆ మర్యాద అమ్మ నిలబెట్టు కోదు....అందుకే. ఈ విషయాల్లో నన్నెవరేమనుకున్నా సరే, నాకు భయం లేదు గానీ న్యాయ విరుద్ద పని గానీ, ఆడపిల్ల గలవార్ని లోకువ పరచాలను కోవడం గానీ ఇటువంటి వాటికి నేనంత మాత్రం ఒప్పుకోను....'
'ఆ! ఇటువంటి దురలవాట్లు మన్లో నశించి పోవాలంటే మీలాటి వాళ్ళు కొందరుండాలి....' అనుకుంది నిర్మల.
'మౌనం వహించారేం?' అన్నాడు మురళి.
'అబ్బే, మీరెంత అనుభవంగా చెప్తున్నారో' అనుకుంటున్నా అంతే.
'ఔనోదినా ఆపాటి మొండి కెత్తక పొతే మనలోని దురాలవాట్లని కొద్ది పాటైనా ఖండించ లెం'
'సరి, మీరు స్వయంగా ఈ విషయాలన్నీ మాట్లాడవలసున్నప్పుడు ఇక నేను కూడా ఎందుకూ.'
'చెప్తాగా! వో చిన్న నాటకం అడాల్సుంటుందక్కడ. లేకపోతె పని జరగదు.'
'ఏవిటి బాబూ అదీ...'
'చెప్తా నన్నాగా, అన్నట్టు రాధిక విషయాలేవన్నా తెలుసా.'
'బయట ఏవన్నా తెలుస్తున్నాయేమో నే నెరగను గాని ఇంట్లో వరకూ ఏమీ తెలియవ్.'
'రక్షించారు. అయితే ఇక మన ప్లాన్ తప్పకుండా ఫలిస్తుంది. పాపం అమ్మ రాస్తున్నదాన్ని బట్టి చూస్తె, ఇంతవరకూ ఓపాతిక సంబందాలనన్నా ఎంచి వుంచుండాలి. అందులో తప్పనిసరిగా ఇప్పుడు పెళ్ళి చూపులు జరగవాల్సినవి అధమం ఓ పదన్నా వుంటాయి. ఎలా తప్పించు కోవడమో ఏమో!' ఒక్క నిముషం ఆలోచనగా నిలబడ్డాక ' ఒసారలా బీచీ కేసి వెళ్ళొస్తా వొదినా. బాబుని కూడా ఇలా ఇయ్యి' అంటూ అడిగి పుచ్చుకుని పదిలంగా స్కూటర్ ముందరి వేపు నిలబెట్టుకుని వెళ్లిపోయాడు మురళి.
అనుకున్న ప్రకారం ఆ మర్నాడు నిర్మలా, మురళి విజయవాడ కి వెళ్లారు మురళీ ఊహించుకున్నట్టే వరసగా పెళ్లి కూతుర్ల ని చూడ్డం, వాళ్ళలో ఏ ఒక్కరూ తనకి నచ్చలేదని మురళి చెప్పెయ్యడం జరిగాక --
'వున్నవాటిల్లో పిల్ల బాగున్నవీ. మనకి అన్ని విధాల కలిసోచ్చేవిగా ఏర్పరచి అవి చూపిస్తేనే నచ్చలేదు పొమ్మన్నవాడు ఇక మిగతావి -- వీడికేం నచ్చుతాయే' అన్నారు చిరాకు పడుతూ రాజమ్మ గారు...
'పోనివ్వండి ఇంతకన్నా మంచివి వచ్చినప్పుడే చూడొచ్చు.' అంది సర్దుబాటుగా నిర్మలా.
