11
సోమవారం సెలవు పెట్టి ఆదివారం ఉదయమే కాకినాడ వెళ్లాను. రిక్షాలో బావగారింటికి వెళుతుంటే దార్లో నే వారు కనిపించారు. మనిషిలో చాలా మార్పు కనిపించింది. సిల్కు లాల్చీ, తెల్ల పైజమా , ముఖానికి మరింత అందాన్నిచ్చే కళ్ళజోడు . చాలా అందంగా కనిపించారు.
వారని చూసి రిక్షా లో నుంచి దిగుతుంటే నన్ను చూసి విస్తుపోయారు.
"సుభా, ఏమిటిల్లా వచ్చావ్. అంతా కులాసా" నేనెందుకు వచ్చానా అన్నట్లుగా నావైపు ఇబ్బందిగా చూస్తూ అన్నారు.
"ఇంటికి వెళదాం పదండి."
ఇంటికి వెళ్ళేసరికి బావ పేపరు చదువుతూ పడుకున్నారు. నన్ను చూడగానే పేపరు అవతల పారేసి , "అనుకూల దాంపత్య మంటే మీదమ్మా సుభాషిణి నెలయిందో లేదో భర్తను చూట్టానికి ఆదర్శ గృహిణి వి కనుక నువ్వే వచ్చేశావ్. పిల్లలిద్దరూ కులాసానా."
ఆప్యాయంగా పలకరించినట్లే ఉన్నయ్యి బావ ముఖ కవళికలు. వారు కూర్చుంటే నేనూ కూర్చుందామనే అనుకున్నాను. కాని వారు కూర్చోలేదు.
"ఎందుకొచ్చావు సుభా. నేను ఈ మాత్రంగా ఉంటాం కూడా నీకు ఇష్టం లేదా."
సిగరెట్ పెట్టె తీసి సిగరెట్ తీసుకుని వెలిగించేరు. ఎప్పుడూ కాల్చే సిగరెట్ కాదు. ఇప్పుడు గోల్డ్ ఫ్లేక్ కాలుస్తున్నారు. వారికి ఏ రకమైన కంటి జబ్బూ లేదు. ఆ కళ్ళద్దాలున్న వార్ని చూస్తుంటే జమీందారు లా ఉన్నారు. ఒక్క నెలలోనే ఇంత మార్పు. జీతమంతా ఆయనే ఖర్చు పెట్టుకుంటున్నారు. ఇంటి దగ్గర ఇంతమందికీ నా జీతం చాలక నేను సతమతమై పోతున్నాను.
"ఇష్టం లేదని మీరను కుంటున్నారు. నా మీద ఇంత కార్పణ్యం ఎందుకు పెంచుకుంటూన్నారో నాకు తెలీకపోయినా మీ మీద నాకు ఏ కోపమూ లేదు. జరిగిందేదో జరిగిపోయింది. తప్పంతా నాదే. మీరు కోరుకునే సుఖాలకు నేను ఏ అడ్డు చెప్పను. నా కోరిక ఒక్కటే, కనీసం ఆ ఒక్క కోరిక తీర్చమని మిమ్మల్ని వేడుకుందామని వచ్చాను." ప్రాధేయపడుతూ అడిగాను.
"ఏమిటా కోరికా."
"వెంట వెంటనే ఉత్తరం వ్రాయండి. వీలయినప్పుడల్లా వచ్చి పిల్లల్ని చూచి వెళ్ళండి. పెద్దవాడు మీకోసం దిగులు పడ్డాడు."
'అట్లాగే నాకు పనుంది వెళ్ళాలి. క్యారియర్ లో భోజనం పంపిస్తాను. భోజనం చేసి మధ్యాహ్నం బస్సులో వెళ్ళిపో." అని వెళ్ళిపోయారు.
వారి ప్రవర్తనకు మనస్సు తల్లడిల్లి పోయింది. ఎంత కఠిన మనస్కుడైనా ప్రత్యేకం ఊరి నుంచి వచ్చిన భార్యతో పది నిమిషాలు కూడా మాట్లాడానికి ఇష్టపడని భర్త వీరొక్కరేనెమో. పైగా అక్కయ్య లేని ఆ ఇంట్లో, కోర్టులో విడాకుల దావా జరుగుతున్న ఆ తరుణం లో ఒక్కడే ఉన్న ఆ సమయంలో వారట్లా వెళ్లి పోయారంటే ఆ మనిషి స్వభావాన్నిఎట్లా అర్ధం చేసుకోవాలో ఆలోచించలేకపోయాను.

"బాత్ రూమ్ లో నీళ్ళున్నాయి స్నానం చెయ్యి సుభాషిణి. ఈలోగా నేను వెళ్ళి ఫాస్కు లో కాఫీ తెస్తాను." అని బావ కూడా వెళ్ళిపోయాడు. నాలోని ఆందోళన కాస్త తగ్గింది.
బాత్ రూమ్ లోకి వెళ్ళి స్నానం చేసి వస్తుంటే పక్కింటి ఆవిడ పలకరించింది. క్రితం సారి నేనూ, వారూ వచ్చినప్పుడు ఆవిణ్ణి చూశాను. అప్పుడు మాట్లాడే సావకాశం లేకపోయింది.
"మీరు శ్రావణ కుమార్ గారి భార్యా"
"అవునండి."
"రాజమండ్రి లో ఉద్యోగమా."
అవునన్నట్లుగా తల ఊపాను.
ఆవిడ పెద్దది. ఏభై ఏళ్ళు ఉంటాయేమో . బావగారింట్లో అద్దె కుంటున్నారు.
"బట్టలు కట్టుకుని ఓసారి మా ఇంటికి రామ్మా" అని ఇంట్లోకి వెళ్ళిపోయింది. బట్టలు కట్టుకుని జడ వేసుకుని ఆవిడ పిల్చిందని వెళ్ళబోతుంటే బావ ఫ్లాస్కు తో కాఫీ తీసుకుని వచ్చాడు. దగ్గర్లోనే హోటలున్నట్లుంది.
ఇద్దరం కాఫీ త్రాగం.
"ప్రతివాది నా సంరక్షణ లో ఉన్నా వాది ఇంట్లో ఆతిధ్యం స్వీకరిస్తున్నాను. మీ తమ్ముడు గారు ఇక్కడే ఉంటున్నారు కదూ" బావతో అన్నాను.
"ఆహా. ప్రస్తుతం మా ఇద్దరి జేవితాలు ఒక రీతిగానే ఉన్నయ్యి. జాతక ప్రకారం" ముభావంగా అన్నాడు బావ.
"మా విషయాలు మీతో ఏం చెప్పారు.' అడక్కూడదనుకుంటూనే ఆశ చావక కుతూహలం కొద్దీ అడిగాను.
"మీ కుటుంబం తో నాకున్న కోర్టు వ్యవహారాల రీత్యా నువ్వడిగిన ఏ ప్రశ్న కయినా నేను సరైన సమాధానం చప్పకూడదు. నా పరిస్థితి, వైవాహిక జీవితమూ వేరు, మీ దాంపత్య జీవితం యందు నాకు పరిపూర్ణమైన గౌరవం ఉన్నది. భార్య తెలివి తక్కువచేత నా జీవితం మరో మలుపు తిరిగింది. అందుకు నేను విచారపడినా ప్రయోజనం శూన్యం. కాని నువ్వు తెలివి కల దానివైనా కుమార్ ఈ తీరుగా చెడి పోతున్నాడంటే అది అతని తెలివి తక్కువతనం కాదు నీ దురదృష్టం."
తన కుడి అరిచేతి లోని రేఖల్ని చూసుకుంటూ కూర్చున్నాడు బావ. నాకు దూరంగా ఉంటె వారింకా చెడి పోతారని నాకు తెల్సు. బావ చెప్పినదాన్ని బట్టి నా ఊహ సరైనదే అయింది. నా మనస్సులో ఒక రకమైన నైరశ్యమూ, స్తబ్ధతా చోటు చేసుకున్నాయి. మనిషి తత్త్వం తెల్సినా చేదిపోతున్నారంటే విని చేసేది లేకపోయినా ఎంతో బాధ కలుగుతుంది."
"ఇక్కడ వారెట్లా ఉంటున్నారు బావా."
"బాగా లంచాలు మరిగాడు. విలస పురుషుడు. బాటిల్స్ బాగా ఖాళీ అవుతున్నాయి. ఇంతకన్నా మరేం కావాలి? నేనూ అన్నీ తెల్సి ఆచరిస్తున్నవాడినే , కాని నాకు ప్రత్యేకించి ఏ బాధ్యతలూ లేవు. అతను తన కున్న అన్ని బాధ్యతల్నీ విస్మరించి ప్రవర్తిస్తుంటే నేనూ బాధపడుతూనే ఉన్నాను."
ఇంక అక్కడ కూర్చో బుద్ది పుట్టలేదు. పక్క భాగం లోకి వెళ్లాను.
"వచ్చావమ్మా , ఈ పూట నువ్విక్కడే భోజనం చెయ్యాలి, తల్లి లాంటి దాన్ని , కాదనకు" చేతులు పుచ్చుకుని బ్రతిమాలు తున్నట్లుగా అన్నది.
"సరేనండి" అన్నాను.
అక్కయ్య సంగతి , కోర్టు వ్యవహారాల విషయం , అమ్మ ఆరోగ్యం సంగతీ అన్నయ్య జైలు సంగతీ అన్నీ అడిగిందావిడ. అన్నీ చెప్పాను.
"మీ బావ పాడై పోతున్నారంటే మేం అట్టే బాధపడటం లేదు. ఆ జీవితం యిక బాగుపడదు. అలాంటి వ్యసబాలకే అలవాటు పడింది. కాని మీ అయన మీ బావను మించి పోయాడు. అందుకనే ఇంత బాధపడుతూ చెప్తున్నాను. నీ భర్తను నువ్వు కాపాడుకో తల్లీ. చెయ్యి దాటిపోయాక ఎంత బాధపడ్డా లాభం లేదు" అన్నదావిడ.
క్యారేజీ పంపిస్తా నన్నవారు పంపలేదు. సరికదా ఆ పగలల్లా ఇంటికి రానేలేదు. బావ ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆ మధ్యాహ్నం పక్కింటి వాళ్ళింట్లో నే భోజనం చేశాను.
రాత్రి ఎనిమిది గంటలకు వారొచ్చారు. "అరె, నీ సంగతే మర్చిపోయాను సుమా. వెరీ సారీ. ఊ పద హోటల్ కు వెళ్ళి భోజనం చేసి వద్దాం. అన్నట్లు మధ్యాహ్నం ఎక్కడ భోం చేశావ్. మీ బావ ఎక్కడికి వెళ్ళాడో."
ఆ మాటల్ని వింటుంటే నాకు తల పగల కొట్టుకుని చావాలనిపించింది. పొద్దున్ననగా వచ్చిన భార్య కూడా స్పురణకు రానంత రాచకార్యం ఏమిటో నాకు తెలీలేదు. వార్ని చూస్తుంటే నా హృదయం ముక్కలై పోయింది. "భార్య వచ్చిన సంగతి కూడా మర్చిపోయానంటున్నారు అది నా ముఖారవిందమా లేక నన్ను ఇంకా ఏడిపించానే అట్లా అంటున్నారా."
ఆ ముఖం లో నిర్లక్ష్యం, అసూయ కనిపించాయి.
'ఈ ఊళ్ళో నాకు అనేక పన్లు, మనస్సు సరి పెట్టుకోటానికి అనేక విషయాల్లో తల దూర్చాను, అవన్నీ వింటే నువ్వు నన్నుఇంకా అసహ్యించుకుంటావు సుభా, పద హోటల్ కు వెళ్దాం." తను ముందే వాకిట్లో కి వెళ్లి నిల్చున్నారు. వెలుపలికి వెళ్లి పిలిచాను. లోపలికి వచ్చారు.
