ఇదివరకు గుమస్తాగా తన పని పరిమితిగా వుండేది. ఇప్పుడు ఆ మనస్తత్వాన్నే తను వుపయిగిస్తే విఫలుడౌతాడు. సూర్యం విజయవంతమైన ఆఫీసరుకు వుండవలసిన లక్షణాలు అన్వేషించడమే గాక పదుగురు అలాంటి వాళ్ళు చెప్పినవి చదవ సాగాడు. ఈ క్రాంక్ ను త్రిప్పే గొలుసులో తనొక పూసయై నప్పుడు తను నీరసంగా వుంటే యీ గవర్నమెంటు సైకిలు జోరుగా పరుగెత్తక పోవచ్చు. అతను చిన్న ఆఫీసరు అయినా ఒక్క స్కాచ్ సామెత అతనికి గుర్తుకు వచ్చేది -- 'పెద్ద విషయాలకు గురి చూడు-- కొంతలో కొంతైనా పొందుతావు.'

తిరిగి పట్నం వచ్చేముందు తన గ్రామం లో యేటి లో ఈదాడు. యెండలో తిరిగాడు. చెట్లేక్కాడు, దిగాడు. పొలాల పైరుల మధ్య మెసలాడు. గుడికి వెళ్ళాడు, గుట్టలు యేక్కాడు. మళ్ళీ తన చిన్ననాటి చేష్టలన్నీ చేసి, పట్నం వచ్చేసరికి బొంబాయి నించి తన వుత్తరానికి జవాబు వచ్చింది. ఇదివరకు అతను యిక్కడే ఆఫీసరు గా ఒంటిగా వుండేవాడు. ఇప్పుడు పెళ్లి చేసుకుని యిద్దరూ బిడ్డల తండ్రి గా నున్నట్లు విన్నాడు.
'ప్రియమైన సూర్యం !
నీ వుత్తరం చేరింది. ఆఫీసరుగా మా మధ్యకు వస్తున్నందుకు సంతోషం. నీ నిజాయితీ, సమర్ధతే నిన్ను పైకి తెచ్చింది. నివ్వు కోరినట్లు మా యింట్లో వుండటానికి మా యిద్దరికీ యేటి అభ్యంతరం లేదు. అప్పుడే నీ కోసం ఒక గది ఖాళీ చేసి కావలసిన సరంజామా అంతా మీ వదిన సమకూర్చింది. నివ్వు నాలా కోతిలా వుంటావా కొండముచ్చు లా వుంటావా అని అడుగుతోంది. తొందరపడి నోరు జార వేసే తరవాత బాధపడ్డావని చెప్పాను. ఏ రోజున యే ట్రేనులో వస్తున్నావో తెలియ జెయ్యి. దాదర్ స్టేషను లో దిగాలి.
ఉంటాను
ఓమ్ ప్రకాశ్ మెహతా.'
ఆ వుత్తరం చదివి సూర్యం తృప్తి పడ్డాడు. తన బాగోగులు చూసే వారొకరు ఆ దూరపు దేశంలో వున్నారనే ధైర్యం కలిగింది. తను ఆఫీసరవటానికి ఒక బెంగాలీ సహాయపడితే తనకు ఆతిధ్య మియ్యటానికి ఒక పంజాబీ సిద్దంగా వున్నాడు. ఏమిటో భాషను బట్టే భారతీయులను పిలవటం తనకు నచ్చలేదు. భావాలను బట్టి మనుషులను సంబోధిస్తే యెంత బాగుండును. ఉత్తములు, మధ్యములు, నీచులు, మనుషుల్లో తెగలివే!
* * * *
బొంబాయి లోని దాదర్ స్టేషను రైలు చేరుకునేసరికి మెహతా దంపతులు పిల్లలతో ప్లాటు ఫారం మీద వున్నారు. సూర్యనని దిగగానే కౌగలించు కున్నాడు.
'ఇదిగో మీ బాభీ.'
'నమస్కారం భాభీ'
'ఇప్పుడు చూడు. మా సూర్యం కోతిలా వున్నాడో, కొండ ముచ్చులా ఉన్నాడో"
'మీ కంటే నయం" అందామె.
'మా అన్నయ్య దొరకటం మీ అదృష్టం అండీ భాభీ' అందామని సిగ్గుపడ్డాడు.
టాక్సీ మీద బొంబాయి శివార్ల లో ట్రాంబే వద్ద నున్న వాళ్ళ మకాం కు బయలుదేరారు. మెహతా కు గవర్నమెంటు వారిచ్చిన ఆ క్వార్టర్స్ ట్రాంబె కొండ ఒడ్డున వుంది. వరుసగా నాలుగు గదులున్న పెంకుటిల్లు. వెనుకను ఒక్కొక్క గదికి ఒక చిన్న గది తగిలి వుంది. పెద్ద గదులు నాలుగు లో ప్రతి గదిలో ఒక సీలింగ్ ఫేను వుంది. ప్రభుత్వం అద్దెకు యిచ్చిన ఫర్నిచరు అన్ని గదుల్లో నిండి వుంది. ముందుకు నాలుగు గదులకు అంటుకుని పెద్ద సంతర్పణ పెట్ట గలిగే టంత వరండా వుంది. ఉత్తర దక్షణాలుగా వున్న ఆ యింటి ముందు ఒక పూల తోట వుంది. దక్షిణ మూలకు యింటి దగ్గరగా పెద్ద యీత చెట్టు వుంది. ఆ కొమ్మలకు బంగారు పిచ్చుకలు గూళ్ళు కట్టుకుని అలజడి చేస్తున్నాయ్. ఉత్తరం వేపు సోనా చెట్టు వుంది. దసరా సమయంలో, ఆ చెట్టు ఆకులూ ఒకరి నొకరు యిచ్చుకుంటారు. ఆ ఆకులూ బంగారు కానుకలతో సమానమట. ఆ రోజుల్లో ఆ చెట్టు బోడి అయిపోతుంది. ఒక చిన్న కొమ్మ విలువ ఒక రూపాయి. ఒక పెద్ద చింత చెట్టు పెరట నిద్దర పోతున్న రక్కసి లా వుంది. ఆ చెట్టు పై రకరకాల పిట్టలు ముఖ్యంగా మైలు దూరంలో నున్న ట్రాంబె వుప్పు టేరులో తిరిగే తెల్లని గూడ కొంగలు వాలుతుంటాయ్. ఒకోసారి ఆ చెట్టు సాయంత్రపు టండలో అల్యూమినియం లా మెరసి పోతుంటుంది. దానికి అంటేటట్లు బోయింగు విమానాలు శాంతా క్రూజ్ విమానాశ్రయం లో దిగడానికి యేగురుతుంటాయ్. మైలు దూరములో పది మైళ్ళు పైగా వెడల్పు తో నున్న ఉప్పుటేరు పెద్ద చెరువు లా కనిపిస్తుంది. ఆ వెనుక దూర దూరాన్న పశ్చిమ కనుమలు సాఫైన నీలి కొండలుగా కనిపిస్తున్నాయ్. ఉప్పు టేరులో తెరచాప లేత్తుకున్న ఓడలు ఠానాక్రీక్ వేపు కదిలి పోతున్నాయ్.
ప్రక్కనే వున్న కొండపై రకరకాల చెట్లు. ఆ చెట్ల మధ్య నించి పెద్ద సెలయేరోకటి వానాకాలం లో పారుతుంది. అక్కడకు పశువులు మేసుకోడానికి వస్తాయ్. పుల్ల లేరుకోడానికి చుట్టూ పట్ల నుంచి పడుచులు మరాఠీ కట్టుతో వస్తుంటారు. అప్పుడప్పుడు వాళ్ళు తీసే రాగం ఒక జానపద గీతంగామోసు. అందులో సూర్యం కొద్ది చరణాలే పట్ట గలిగాడు.
'దౌలాలకాందాళ బాక్వాల బాందాలా
అకాచి నాగవశీ నాగావణీ
రూపు మజా చంద్రాచ బహాలాఖామూలా
చంద్రా చి, గోరిణి తా రంగాణి.'
చుట్టూ పచ్చదనం, కొండంతా ఆకుపచ్చని తివాసీతో కప్పబడి నట్లుంది. సూర్యం మెహతా కూతురి సహాయంతో కొండ యేక్కాడు. విచిత్రం -- తనకు ఆయసమే అనిపించలేదు. ఆ కొండ పై నుంచి చూస్తె బొంబాయి నగర మంతా కనిపించింది. కొండ పై ఒక పడిపడిన పోర్టు గీసుల కాలం నాటి చర్చి వుంది. చర్చి గోడలే మిగిలి వున్నాయ్. పాడుపడిన చర్చిలోనూ చుట్టూ రకరకాల అడివి మొక్కలు పూలతో నిండి వున్నాయ్. అందులో కాలు పెట్టగానే యెక్కడ లేని ప్రశాంతి. ఎన్నో గుడి గంటలు దూరాన మ్రోగుతున్నట్లు చప్పుడైంది. ఈ ప్రశాంతం లో విశాల వుంటే? ఆ తలపును వెంటనే మార్చుకున్నాడు. ఎంత తుడిచి పెడతామన్నా ఆ ప్రతిబింబం ఒకోసారి తనలో మెరసి పోతోంది.
క్రిందకు దిగాడు. సెలయేరు మెల్లగా పారుతోంది. అందులో గలగలలు విశాల హృదయం కొట్టుకున్నట్లే వున్నాయ్. విశాల ఈ సరికి ఒక బిడ్డను అడ్డాలలో వేసుకుని వుంటుంది. ఆమె గురించి తలచు కోడానికి తనకేం హక్కు లేదు. ఇంటికి వచ్చేసరికి మెహతా, అతని భార్య లత తోటలో వున్నారు. వాళ్ళే మొక్కలకు నీరు పోస్తున్నారు. భాభి యెంతో అభిమానంగా సూర్యాన్ని చూస్తోంది. తను మొగమాటస్తుడని ఆమె యిట్టే పోల్చుకుంది. భోజనం దగ్గర నించి అన్ని విషయాల్లోనూ చొరవ చేసుకుని తినేటట్లు చేస్తోంది. ఆమె యింటికి శుభ్రంగా వుంచే తీరు, పిల్లల నిద్దరనూ పెంచే శ్రద్ధ అతని కెంతో నచ్చింది. అమెకు సిగ్గు పడటం అలవాటు లేదు. బాహాటంగా మాట్లాడేది. సూర్యం కు చదువుకున్న భార్య ల యందు ఒక విధంగా నున్న ఏవగింపు కొద్ది కొద్దిగా తగ్గసాగింది . కొన్ని పనులు మాత్రం అతనికి నచ్చెవు కావు. మూతి నిండా లిప్ స్టిక్ రాసుకుని గంటల తరబడి సింగారింపు కు ఎవగించుకొనేవాడు.
ఒకరోజు సాయంత్రం వరండా లో తన గది ముందు వాలు కుర్చీ వేసుకుని పేపరు చదువుతున్నాడు. మధ్య మధ్య పూల తోట వేపు తన దృష్టి వెళ్తోంది. తోట ఫెన్సింగ్ మీద చిన్న రామచిలకలు గుంపులు అరుస్తున్నాయ్. తోట నింపుగా రకరకాల పూలు విరబూసి వున్నాయ్. ఆ మనోహర దృశ్యం చూస్తుంటే యెర్రగా గాడీ రంగు చీర కట్టుకుని, కట్ జాకెట్ వేసుకుని లత వరండా లో ప్రత్యక్ష మైంది. మూతి నింపు గా లిప్ స్టిక్ రాసి వుంది. ఈ మధ్య ఆమెతో చనువుగా మాట్లాడితే గానీ ఆమె ఒప్పుకోవటం లేదు. మెహతా వూర్లోకి వెళ్లి యింకా రాలేదు.
"ఏం భాభీ....ఎక్కడికి బయలు దేరారు?' అన్నాడు.
"ఎక్కడికి లేదు..'
'ఎక్కడికి లేదా?'
