పంచాయితీ ఎన్నికలు చాలా ఉదృతం గానే జరిగాయి. పోలింగ్ ముందు రోజున , పోలింగ్ రోజున చిన్న చిన్న ఘర్షణలు కూడా జరిగాయి. కానీ మొత్తం మీద ప్రకాశం నిగ్రహం వల్ల శాంతంగానే జరిగింది.
రెండవ రోజున ఓట్లు ఎంచారు. వెయ్యి ఓట్లు మెజారిటీ తో విశ్వనాధయ్య గారు గెలిచారు. జగన్నాధం పూర్తిగా కృంగి పోయాడు. అతనిలోని కోపం, క్రౌర్యం అన్నీ ఇంకిపోగా కళ్ళలో నీళ్ళు పెట్టుకున్నాడు.
"పోన్లే నాన్నా! ఏం చేస్తాం! కర్మ. కానీ ఇల్లాలకగానే పండుగ కాదుగా?" అని ఇందిర తండ్రిని ఓదార్చింది.
ప్రకాశం సంతోషంతో పున్నమ నాటి సముద్ర మై పోయాడు. విశ్వనాధయ్య గారు చిన్నగా నవ్వారు. విషాదం కాస్త కలియడం వల్ల మ్లానంగా ఉందా నవ్వు. సుందరమ్మ ఈ ఆనందాన్ని ఆలంబనగా చేసుకొని దుఃఖాన్ని దిగామ్రింగే ప్రయత్నం చేస్తూ ఉంది. ఆవిడ దృష్టి లో ఈ విజయం మామయ్యగారిది కానే కాదు. అచ్చంగా ప్రకాశందే ఈ విజయం!
భానుమూర్తి కూడా చాలా ఆనందంగానే ఉన్నాడు. కానీ అతడు ఈలోగా కాస్త ఏదో ఆలోచనల్లో మునిగి ఉన్నట్లుగా కనిపిస్తున్నాడు. ఆ ఆలోచనేమో ఇందిరకూ, ప్రకాశానికి తప్ప మరొకరికి తెలీదు. ఎన్నికల ఫలితం ప్రకటించిన రోజు విశ్వనాధయ్య గారిని ఘనంగా ఊరేగించారు. ఆరోజు ఊరు వదిలి చిత్తూరు కు వెళ్ళి పోయాడు జగన్నాధం. ఆ మరునాడు మధ్యాహ్నం ప్రకాశం గదిలో కూర్చొని చదువు కొంటుంటే భానుమూర్తి వచ్చాడు.
"రేపట్నుంచి మాకు సెలవులు" అన్నాడు. విషయం ప్రకాశానికి స్పురించింది.
"ఉత్తరం పంపావా?' అని అడిగాడు.
"ఓ! నాలుగు రోజులైంది. జవాబు కూడా అందింది. అల్ ఓ కే . సర్వం సిద్దం!"
"కానీ జాగ్రత్త...."
'అలాంటి భయాలకు చోటు నహీ! మన ప్లాను అర్జునుడి బాణం లాంటిది. గురీ బరీ తప్పదు."
"ఎప్పుడు ప్రయాణం?"
"రేపు ఉదయం."
"జంటగానేనా?"
"కాదు. ఒంటరిగానే."
"జంట?"
"చిత్తూరు లో భేటీ అవుతుంది."
"విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. కానీ మమ్మల్ని మరిచిపోకు" ప్రకాశం తమాషాగా నవ్వాడు.
రెండవ రోజు ఉదయం భానుమూర్తి వెళ్ళి పోయాడు. ఆరోజు మధ్యాహ్నానికి ఇందిర కనపడటం లేదని తెలిసింది జగన్నధానికి. ఎక్కడో వెళ్ళింది లెమ్మనుకున్నాడు మొదట. భోజనాల సమయానికి కూడా రాకపోయే సరికి పొలం వద్ద ఉంటె పిలుచుకు రమ్మని రాముణ్ణి పంపాడు. ఇందిర అక్కడ లేదని తిరిగి వచ్చాడు రాముడు. అప్పుడు జగన్నాధం మనసులో అలజడి ప్రారంభమయింది. జగన్నాధం భార్యా, బావులూ, చేరువులు వెదికించడం ప్రారంభించింది. సాయంకాలం చిత్తూరు బస్సు డ్రైవరు ఒక ఉత్తరం ఇచ్చి పంపాడు. చించి చదివాడు జగన్నాధం. ఆ ఉత్తరం ఇందిర వ్రాసింది.
నమస్కారాలు. నేను క్షేమంగా ఉన్నాను.భయపడకండి. ఈ విషయాలన్నీ అమ్మకు తెలిపేది.
నేనూ, భానుమూర్తి గారూ ఇప్పుడే తిరుపతికి బయలుదేరుతున్నాము.
మీకు నేనొక ముఖ్య విషయాన్ని తెలుపుతున్నాను. ఇది బహుశా మీకు నచ్చకపోవచ్చు. అందుకు నేను చేయగలిగింది లేదు.
నేనూ, భానుమూర్తి గారూ కాలేజీ లో ఉండగానే ప్రేమించుకున్నాము. భానుమూర్తి గారు బి.టి.పూర్తి చేసి నాకోసమూ, ప్రకాశం అన్నయ్య కోసమూ మన ఊరొచ్చారు. నాన్నా, వారు నా మనస్సుకు నచ్చిన వ్యక్తీ. వారి జీవిత దృక్పధం నాకు చాలా యిష్టం. హిమాలయం మీద పడ్డా చిటికెన వేలితో అవతలికి మీటేయగలనన్న విశ్వాసం ఉంది వారికీ. నిజంగా వారంత సమర్ధులు! ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండేవారి హృదయం లోతు నాకూ, ప్రకాశం అన్నయ్య కూ మాత్రం తెలుసు. వారి చిరునవ్వే నా జీవితానికి వెలుగు.
ప్రతి తండ్రికి తన కూతురు సుఖ పడాలనే ఉంటుంది. నాకు సుఖం, శాంతీ భానుమూర్తి గారి వద్ద లభిస్తాయన్న విశ్వాసం ఉంది. అందువల్ల మీరు మా వివాహానికి దయచేసి అంగీకరించండి. అందువల్ల నాకు మరింత శాంతి లభిస్తుంది. ఇందులో మీకు ప్రతిష్ట పోవడం అంటూ ఏమీ లేదు. మరొక్క మాట! కాలం మారితోంది. కాలం కంటే వేగంగా మానవుని మనస్తత్వం మారితోంది. మీ తత్త్వం, మారుతున్న ప్రజామనస్తత్వానికి సరిపడదు. మీరు మారాలి!
మే నన్నెండవ తేదీ దివ్యమైన ముహూర్తం ఉందిట. భానుమూర్తి గారి నాన్నగారు రాశారు. ఆరోజే తిరుచానూరులో పద్మావతి దేవి చరణ సన్నిధి లో మా పెళ్ళి, మీకోసం అమ్మ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటాను.
మీ కుమార్తె,
ఇందిర.
"హమ్మయ్య! నా బిడ్డ క్షేమంగా ఉంది. అంతేచాలు" అంది జగన్నాధం భార్య.
ఒక్కసారిగా తనలోని కోపమంతా భార్య మీదికి పొర్లింది జగన్నాధానికి. భార్యను కొప్పు పట్టుకొని పిడిగుద్దులతో వీపు పగల కొట్టాడు. అతడికి కోపం వచ్చినప్పుడెల్లా భార్యను చితక బాదటం పరిపాటే. కానీ ఇంత క్రూరంగా ఏనాడూ హింస పెట్టలేదు. ఇంతైనా జగన్నాధం కోపం చల్లారలేదు. అంతకూ కారణం ప్రకాశం. వాడికి తెలీకుండా ఇది జరగలేదు. తనను అన్ని విధాలుగా అవమాన పరుస్తున్నాడు. గ్రామం లోని అన్ని వ్యవహారాల్లోనూ తలదూరుస్తున్నాడు. తాను పాలకొండ కింద నేరేడు మాన్లు కొట్టిస్తే రిపోర్టు చేయించి తనకు వెయ్యి రూపాయలు జాల్మానా పడేలా చేశాడు. ఇందిర కూడా సిగ్గు లేకుండా వాణ్ణి అన్నయ్యా అంటూ వాడి వెనక తిరుగుతుంది. కక్ష కట్టి విశ్వనాధయ్య ను నిలబెట్టి నన్ను ఎన్నికలలో ఓడించాడు. ఎవడో వెధవ తన కూతుర్ని లేవనేత్తుకుపోయేలా చేశాడు. ఇది తన పరువు మర్యాదలకు పెద్ద దెబ్బ! ఈ దెబ్బకు తానూ ఎదురు దెబ్బ కొట్టాలి.
"రాముడూ!' పిలిచాడు.
'అయ్ గోరూ!"
"ప్రకాశం వడ్లమార్పిళ్ళు పూర్తిచేశాడా?"
"నంబరోడ్లు పూర్తీ చేసినాడయ్యా. అలీసెంగా నాటిన సన్నోడ్లు ఇంకా కుప్ప కొట్టలా."
"వామి ఎక్కడేశాడు?"
"నక్క బండ మీద."
"కావలి ఎవరుంటున్నారు?"
"తెలీదయ్యా."
"రేపు రాత్రికి నువ్వు ఆ కుప్పకు నిప్పు పెట్టాలి. దాన్ని బూడిద చేసెయ్యాలి."
'అయ్ గోరూ! నా వల్ల కాదండి."
"నామాట కాదంటే బ్రతకలేవు. జాగ్రత్త.పని పూర్తి చేసి తీరాలి. ఇదో, ముందుగానే ఇస్తున్నాను వంద రూపాయలు."
వంద రూపాయల నోటు చూసేసరికి రాముడికి నోట్లో నీళ్ళూరాయి. ఒక్క నిమిషం పనికి వంద రూపాయలు! అసలు బండ మీద ఎవరూ కావలి ఉండటం లేదల్లె ఉంది. ప్రకాశం పాలేరు ఎప్పుడో పదకొండు గంటలకు వస్తాడు. ఆలోగానే పని పూర్తి చేస్తే సరి. వంద రూపాయల నోటు అందుకున్నాడు.
