Previous Page Next Page 
సంపెంగలూ - సన్నజాజులూ పేజి 18

 

    'అతడు మన మనుకున్నంత సంస్కారం లేని వాడులా నాకేం కనిపించలేదు.' నేను తెల్లబోయాను.
    'చాలా మర్యాదగా మాట్లాడాడు. కాఫీ అదీ యిచ్చేడు.'
    'అతడు చేసిన మర్యాదకు మైమరచి, ఆ కాఫీ కాస్తా ఊసబట్టి వచ్చేశారు కాబోలు అంతేనా?'
    'నిజమే . వేషాలతోనూ, మొహమాటలతోనూ బతుకుతున్న మన కృత్రిమ నాగరికతలో ఎదుటి వాడు చేసిన తప్పును ఎత్తి చూపడమనేది అన్నిటిలోకి కష్టమైన పని. ఎలా మొదలెట్టాలో ఒక పట్టాన తోచలేదు నాకు. అదిగాక అతడు నవ్వుతూ సరదాగా మాట్లాడుతున్నాడాయే.'
    'అప్పుడప్పుడు మిమ్మల్ని పొగడుతున్నాడాయే' అయన నవ్వేశారు.
    కాఠిన్యంతో పాటు మోసం కూడా ఉంటె ఇంక అతడు బాగుపడ్డట్టే.'
    'సరే, జరిగిందివిను. ఆమాటా యీ మాటా అయిన తరువాత నెమ్మదిగా అసలు విషయంలోకి మరల్చాను. ఆడది పువ్వులాటి వస్తువనీ ఆ సాకుమార్యం చెదరకుండా ఆ సౌమనస్యం కలగకుండా ఆ సౌందర్యం నలగకుండా అతి అప్యాయానురాగాలతో వాడుకోవాలని చిన్న ఉపన్యాసం లాంటిది యిచ్చాను.'
    నేను చప్పట్లు కొట్టెను. నిజానికీ ఆయన్ని ప్రశంసించి పరావశించింది నా హృదయం. తెలిసి తెలిసి కాస్త పొగడ్తతో ఎందుకిలా ఉప్పొంగి పోతామో మా ఆడవాళ్ళం అర్ధం కాదు. అంతలో తేరుకుని అడిగాను.
    'చెప్పింది తమరు ఎంతవరకూ ఆచరణలో పెట్టేరు.' వెంటనే అయన అడ్డం ఒకటి తెచ్చి నా చేతిలో పెట్టేరు. 'నువ్వే తెలుసుకో' అంటూ, నా ప్రతి బింబాన్ని చూసుకుంటే చెప్పలేని సిగ్గు నాకు ముంచుకొచ్చింది. ఎనిమిదేళ్ళయి కాపురానికి వచ్చినా చెక్కు చెదరలేదు చక్కని మా దాంపత్యశోభ. నేనలా చూసుకుంటుంటే అద్దంలో అప్పుడే బడి నుండి వచ్చిన మా మధురిమ కూడా మొహం పెట్టడం కనిపించింది. దాన్ని అయన ఎట్టుకునో ముద్దెట్టుకున్నారు.
    'ఒకటి విరసిన పువ్వు. రెండవది తొడగిన మొగ్గ. నిలుపుకోగలగాలి గాని చెరిగే ఆనందం కాదిది.'
    'నిలుపుకో గలగాలి గాని' అనే మాట నాకు నచ్చలేదు.
    'ఎవరు?'
    'ముఖ్యంగా నువ్వే!'
    'మీరు?' అయన మాట మార్చేశారు.
    'అయితే అక్కడ ఏం జరిగిందో పూర్తిగా వినవన్న మాట.'
    'ఉండండి మధురిమకు టిఫిన్ ఇచ్చి ఆటకి పంపించి వస్తాను' మరొక పది నిమిషాల్లో నేను మళ్ళీ వచ్చాను.
    ప్రేమతో మీద చెయ్యి వెయ్యడం వేరు కోపంతో చెయ్యి చేసుకోవడం వేరు . సామదానబేధ దండోపాయాలలో కొట్టడం అనే దాని స్థానం ఆఖరిది. ఆ మాట గ్రహించని మొగవాడు పశుతుల్యుడు. మీరేమంటారు?' అని అడిగాను. అయన మోహంలో మొహం పెట్టి. అతడు తొణకలేదు, బెణకలేదు. మీరన్నది నూటికి నూరు పాళ్ళు నిజం' అన్నాడు పైగా. ఇంకేం చెప్పాలో నాకు తోచలేదు.'
    'అందుకని మాటాడకుండా వచ్చేశారా? మొత్తానికి భలేవారే! వెళ్ళింది దేనికి , చేసుకు వచ్చింది ఏమిటి? అందరిలాగే అతని కెదురు చెప్పలేక పొతే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంతసేపు కూచుని రావడం ఎందుకూ? మీకు కాలక్షేపం కాక అక్కడికి వెళ్ళలేదుగా! ఏమైతే అయిందని అడిగేయవలసినది- ఇలా కొడుతున్నావని తెలిసింది నీకే మొచ్చింది అని - మీక్కూడా వాడంటే భయం కాబోలు అవునా?'
    నేనిలా అడుగుతుండగానే సరళ వేసిన పెద్ద పెద్ద కేకలు వినిపించాయి. ఇద్దరం డాబా మీదకు పరిగెత్తెం. ఆ చివర్నించి చూస్తె వాళ్ళ పెరటి గదిలో కిటికీ లోంచి కొంత భాగం కనిపిస్తుంది.
    అతడామెను తోలు బెల్టుతో కొడుతున్నాడు! 'ఎవడే వాడు? నీకేమవుతాడు? జరిగిన విషయాలన్నీ వూరి వాళ్ళతో చెప్పుకుంటే నిన్ను ఉద్దరిస్తారటె? ఎప్పుడొస్తుందే నీకు బుద్ది?' ఇదీ నేనామెకు చేసిన ఉపకారం!
    ఆమె ఏమీ ఎరగనని గోల పెడుతుంటే రెండు చేతుల్నీ ఎడం చేత్తో పట్టుకుని కుడి చేత్తో మరొకటి వేశాడు. మేం చూస్తున్నామని గ్రహించి కిటికీ తలుపు భళ్ళున వేసేశాడు. అయన ఇంక సాగించలేదు. గబగబా ఎదురింటికి బయలుదేరారు. వెనుక నేనూ పరిగెత్తాను. ఎంత కొట్టినా వాళ్ళు వీధి తలుపు తీయలేదు. నేను సందులోంచి వెళ్ళి వీధి తలుపు తీసేశాను.
    అయన నారాయణని ఒక్క తోపు తోశారు. నేను సరళకి అడ్డంగా నిలబడ్డాను. 'మళ్ళీ ఆ పిల్ల ఒంటి మీద చెయ్యి వేశావో మాట దక్కదు. ఇందాక నువ్వు నాకు చెప్పిన నీతులు ఇవేనా?' అన్నారు.
    'నా పెళ్ళాన్ని కొట్టుకుంటాను. నరుక్కొంటాను . నేనేవడిని? నువ్వేవడివి? దానికీ నీకూ ఏమిటి సంబంధం?'
    'నేనా? మనిషిని. నువ్వా పశువ్వి. మా ఇద్దరికీ సంబంధమా? ఇదివరకు లేదు. ఇవాళ నుంచి ఆ అమ్మాయి మా కుటుంబంలో ఒక వ్యక్తీ. ఇకముందు ఇలాటి పని చేశావో ముందు నీకు దేహశుద్ది తప్పదు. అలా చూస్తావేం మంజూ ముందు ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళు. ఇంకాస్త ఆలశ్యం చేస్తే ప్రాణాలు తీసేసును పాపిష్టి వాడు.'
    సరళ రానంటున్నా నేను బలవంతాన మా ఇంటికి నడిపించుకు వెళ్ళెను. అతడూ అడ్డు పడునేమో గాని అప్పటికే జరిగిన గొడవకి అయిదారుగురు అక్కడ చేరడం చూసి వీధి తాళం వేసుకుని కోపంతో ఎక్కడికో వెళ్ళిపోయాడు.
    తగిలిన దెబ్బలకి ఒళ్ళంతా పచ్చి పుండులా తయారై ఆ రాత్రికి సరళ మంచం మీంచి అటూ ఇటూ తిరగలేని స్థితికి కూడా వచ్చేసింది. దెబ్బలాడి కొంచెం మజ్జిగన్నం పిసికి త్రాగించగలిగాను. వేన్నీళ్ళ కాపడం పెట్టెను. బాగా జ్వరం కూడా వచ్చేసింది. ఏం చెప్పాలో తెలియక మొదట డాక్టర్ని పిలవలేదు గాని తరువాత తరువాత తప్పలేదు. అయన వచ్చి ధైర్యం చెప్పేక గాని మా గుండె దిటువు పడలేదు. పైగా ఒకటే పలవరింతలు. అస్తమానూ యింటికి వెళ్ళి [పోతానని పేచీ. వీటన్నిటినీ మించి 'అమ్మా ఆవిడ కేమైందే?' అని మా మధురిమ యక్ష ప్రశ్నలు. అదక్కడ్నించి పొమ్మంటే పోదూ!
    'నన్నిలా రక్షించలేరు. నా కాపురం బాగుపడే మార్గం ఇది కాదు. నన్నింకా ఆయనకి దూరం చేస్తున్నారు. నన్ను మా ఇంటికి పంపించెయ్యండి' అనేది సరళ.
    'తిరిగి తిరిగి అయన అలసి పోయి వస్తారు. ఆకలితో వస్తారు. ఆవేళకు ఆయనకు కావలసినట్టు చెయ్యకపోతే మరెందుకు నా బ్రతుకు?' ఆ మరునాడు ఉదయం కూడా నారాయణ మా ఇంటికి కాదు గదా వాళ్ళింటికి కూడా రాలేదు. మర్నాడు సరళ పట్టుదల మరీ ఎక్కువైపోయింది. ఆయనకి విసుగెత్తింది.
    'వద్దు వద్దని చెబుతుంటే అనవసరంగా నన్ను పంపించావ్. మనకెందుకు వచ్చిన తంటసం.ఇది చెప్పు? పోనీ దీనివల్ల మనమా అమ్మాయికి చేసిన ఉపకారం ఏమయినా ఉందా అంటే అదీ కనబడదు. అతడేమయ్యాడో కనపడడు. నువ్వెళ్ళి ఆ అమ్మాయిని దిగబెట్టేసిరా.
    'బాగుందండి ఈ మాత్రానికే మీరు కంగారు పడితే ఎలా? ఆ అమ్మాయి దంతా అదో పిచ్చి రకం. అలా వెర్రెత్తిపోబట్టే అన్ని విధాల హింసించబడుతోంది. చూస్తూ వూరుకోలేక గదా ఇందులో మనం ప్రవేశించాం. మనం చేసిందేం తప్పు పని కాదు. ఆపైన భగవంతుడున్నాడు. మీరెందుకలా తొందరపడతారు? అతడేమైపోతాడో అన్న భయం అసలనవసరం. అంతగా తెలుసుకోవాలంటే వాళ్ళ ఆఫీసు మీరు ఎరగందికాదు గదా! పోతురాజుని కబురంపండి.' అ మాట ఆయనకి నచ్చినట్టుంది. వెంటనే వాళ్ళ ఆఫీసులో పని చేస్తున్న ఈయన స్నేహితుడు గోపాలానికి కబురు పంపించారు. మరో అరగంట లో అతడు కొట్టుకోచ్చాడు.
    'అయితే మీకు తెలియనే తెలియదా ఏమిటి?' అనుకుంటూ సరళ దగ్గిర రంగిని కూచోపెట్టి నేనూ అయన గదిలోకి వెళ్ళెను. ఆతృతతో ఏమిటేమిటి అంటూ.
    'మా ఆఫీసరు గురించి మీకు తెలుసునా?'
    చండ శాసనుడని విన్నాను.'
    'విన్నారు గద, అతగాడి దగ్గిర నారాయణ గుమస్తా. ఇక మా ఆఫీసరు గురించి మరింత వివరిస్తాను. కాల్చుకు తినడం లో అలాంటి చెయ్యి ఆ చుట్టూ పక్కల ఉండదు. మరి ఏ మానసిక రోగంతో బాధపడుతూ ఉంటాడో గాని ఎప్పుడూ వేగుతున్న పేలాల గింజలా ఎగురుతూ మొరుగుతూ ఉంటాడు. ప్రతి చిన్న విషయానికీ అంత గందరగోళం చేసేవాళ్ళని మరి చూడ్డం. రంధ్రాన్వేషణలో డాక్టరేటు ఇవ్వవలసిన మూర్తి అది. ఇక మన నారాయణ ఎలాంటి వాడంటే స్వతహా తెలివి తేటలు కాస్త స్థాయి తక్కువలో ఉన్న మనిషి. పైగా ఆ ఉద్యోగానికి అతని తగిన కాలిఫికేషన్ లేదు కూడా. కేవలం రికమెండేషన్ మీద వచ్చాడేమో. ఆఉద్యోగం ఎక్కడ వూడిపోతుందో అని భయం. ఇన్నిటితో పని చేస్తున్నవాడు సాధారణంగా నిర్వర్తించవలసిన విధిలో పొరపాట్లు చెయ్యడం సహజం. ఎక్కడేనా తప్పు దొరుకుతుందా ఓ దులుపు దులుపుదామా అని చూసే మా ఆఫీసరు గారికి నారాయణ కామధేనువుగా గోచరిస్తాడు. దానితో ఉగ్రుడయిపోతాడు. అతణ్ణి తిడితే బాధలేదు. నల్లి కోసం మంచాన్నంతా బాదినట్టు అందర్నీ ఎత్తి పెడతాడు. 'ముందు రెండంగుళాల మేర జాగా ఉంచి టైపు చెయ్యమని ఎన్ని సార్లు చెప్పాలి? క్రింది కొంచమే నా ఖాళీ ఉంచకపొతే నా సంతకం ఎక్కడ అఘోరిస్తాననుకున్నావ్? పోనీ ఇదే మొదటి సారేమో అంటే ఒక్కొక్కడికి అరపుష్కరం తక్కువ లేదు సర్వీసు. జీతం పట్టిగెళ్ళేటప్పుడు ప్రతి నయాపైసా సరిగా ఉందొ లేదో చూసి పట్టుగేళ్ళడం తెలుసు గాని ప్రతి క్షణమూ సరిగా డ్యూటీ చెయ్యాలని తెలియదూ? మళ్ళీ ఏమైనా అంటే ఒక్కొక్కడికి ఇంతింత పొడుగున వస్తుంది కోపం. అంతమాట పడని మానధనులు ఐతే కాస్త ఒళ్ళొంచి మరి కాస్త బుద్దుంచి ఎవళ్ళ పని వాళ్ళు చేసుకుపోతే ఎవరడుగుతారు? అలా చేసుకుపోతే నేనిలా గొంతుకచించుకోవలసిన అవసరం ఎందుకొస్తుంది? అలోచించి చూస్తె నాచేత ఇలా వాగించడమే మీ ఉద్దేశమనిపిస్తుంది. ఎందుచేతంటే మాటలు మనుషుల్ని కొట్టవూ, రెండోది మీ జీతం ఒక్క నయా పైసా తగ్గదూ. కోపం వస్తే కళ్ళెర్ర జెయ్యడమే గాని చూసి చూసి నా చేత్తో నేను ఎవరికీ బ్లాకు మార్కు పెట్టేలేననే సంగతి ఆసరాగా తీసుకుని మీరందరూ ఏకమై నాటకమాడుతున్నట్టు కనిపిస్తుంది. నేను మాత్రం ఎన్నాళ్ళు సహించగలను గనక! ఏమోయ్ నారాయణరావ్, వింటున్నావా.'
    'చిత్తం : అంటాడు నారాయణ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS