13
హాస్పిటల్ కి వెళితే అక్కడ శివరాం ముభావంగా ఉంటున్నాడు. ఇంటికి వస్తే ఇక్కడ ఒక్కళ్ళూ తనని పలకరించి మాట్లాడకుండా తటస్థంగా ఉంటున్నారు. చనువుగా వచ్చే బాబిగాడిని కూడా తన దగ్గరికి రాకుండా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. రత్నం గోపాలం ఒకళ్ళ నొకళ్ళు వేళాకోళాలు చేసుకుంటూ సరదాగానే ఉంటున్నారు. రాజమ్మా రత్నం కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూనే ఉన్నారు. గోపాలం కూడా వాళ్ళు అన్నాలు తింటుంటే గడప మీద కూర్చుని ఆఫీసు కబుర్లు లోక వ్యవహారాలు ముచ్చటిస్తూ అత్తగారితో కూడా ఆప్యాయంగానే ఉంటున్నాడు. ఇంక ఎటొచ్చి తనతో మాత్రం వాళ్ళు విస్తారం మాట్లాడడం లేదు. ఒక వేళ వాళ్ళు కబుర్లు చెప్పుకుంటున్న చోటుకి తను కనక వస్తే చట్టున తను కబుర్లు మానేసి ఒకళ్ళ కేసి ఒకళ్ళు చూస్తూ మౌనంగా వుండి పోతూన్నారు. ఇంట్లోనూ హాస్పిటల్ లోనూ కూడా తనని ఎవరో పరాయిదాని లాగ వేరుసుగా చూస్తూంటే , సునంద భరించ లేక పోతోంది. ఎవరూ లేకుండా ఏకాంతంగా వున్నప్పుడు "ఏవిటీ శిక్ష నాకు? ఎందుకు వీళ్ళందరూ నన్నిలా హింసిస్తారు?' అంటూ మౌనంగా ఏడవ సాగింది.
రత్నానికి నెలలు నిండాయి. ఇంట్లో అంతగా ఇటూ అటూ కదలడం లేదు. సునంద కి దగ్గూ గుండెల్లో పోటుతో బాటు తరుచు జ్వరం కూడా తగులుతోంది. ఆదరణ లేక సరిగా అన్నం సహించక, రాత్రిళ్ళు నిద్ర పట్టక చిక్కి శల్యం అయిపొయింది. దానికి తోడు మానసిక క్షోభ కూడా కలిసి, లేస్తే కళ్ళు తిరిగి పడిపోయేటంత నీరసం ఏర్పడింది వంట్లో. ఆఫీసుకి వెళ్ళడమే గగనం అయిపోతోంది. ఎలాగో అలాగా ప్రాణాలు ఉగ్గబట్టుకుని రోజులు దోర్లించుకు వస్తుంటే , రాజమ్మ సాధింపు ఎక్కువ కావొచ్చింది. "అంతా మహారాణులే మంచాల మీంచి దిగరు. వీళ్ళ ఇంటికి చాకిరీ చెయ్యడానికి దాసీ పీనుగుని నేనొక్కదాన్ని దొరికాను" అంటూ అటు రత్నం ఇటు సునందా కూడా ఇంట్లో ఏ పనీ చెయ్యక పోవడంతో మొత్తం బరువంతా గోపాలం నెత్తి మీద పడింది. ఇంట్లో చిన్న చిన్న పనులు చెయ్యడం, బాబిగాడికి నీళ్ళు పొయ్యడం. అత్తగారికి నీళ్ళు తోడి పెట్టడం, ఇల్లు సర్దుకోవడం. పది అయ్యేటప్పటికి ఆఫీసు కి పరిగెట్టి . సాయంత్రం అయ్యేసరికి అలిసి పోయి విసుగ్గా ఇంటికి వచ్చి అందరి మీద కేకలు వెయ్యడం, బాబిగాడిని కొట్టడం యిలా ఇల్లంతా అసహ్యంగా రణగొణ ధ్వనిగా తయారైంది. లేని ఓపిక తెచ్చుకొని ఎప్పుడేనా సునంద బాబిగాడిని తియ్యడానికి కాని, గోపాలానికి సాయం చెయ్యడాని కికాని ప్రయత్నించ బోతే గోపాలం ఆమె మీద విసుక్కుని చీదరించుకుంటున్నాడు. అలాంటప్పుడు సునంద ప్రాణం చచ్చి పోయినట్లు చిన్న బుచ్చుకుని "తమ్ముడిలా ఆప్యాయంగా ఉండే గోపాలం ఎలా మారిపోయాడు?' అనుకుంటూ తనలో తను తలుచుకు తలుచుకు ఏడ్చేది.
ఎంతో గౌరవంతో చూసేవాడు తనని గోపాలం. ఏ చిన్నవిషయం అయినా తనతో ప్రస్తావించకుండా చేసేవాడు కాదు. ఆఫీసు వ్యవహారాలూ, ఇంట్లో డబ్బు ఇబ్బందులూ, అన్నీ తనతో చెప్పి అరమరికలు లేకుండా వ్యవహరించే వాడు. ఆయనకి కాదు తమ్ముడు . తనకి అనుకునేది. అంత ఆప్యాయంగా ఉండే గోపాలం ఎందుకిలా అయిపోయాడు? అయన లంగ్ ఆపరేషన్ ఎప్పుడు నిర్ణయం చేశారు? డబ్బు ఉందా? తక్కువ అయితే ఏమిటి చెయ్యడం? ఈ మధ్యన రాత్రిళ్ళు కూడా ఆఫీసు కి వెళ్ళి వస్తున్నాడు ఏదో బెదిరిపోతున్నట్లు, కంగారుగా, భయం భయంగా ఉంటున్నాడు. ప్రతి పూటా ఎవళ్ళేవళ్ళో వస్తున్నారు. వాళ్ళందరి తోటి ఆదుర్దా పడుతూ యేవో రహస్య మంతనాలు చేస్తున్నాడు. ఏవైంది? ఇవి ఏం చెప్పడం తనకి? తననిలా పరాయిదాన్నిగా చూస్తూ హింసిస్తుంటే ఎంత బాధగా వుంటోంది తన మనస్సుకి?
అక్కడ హాస్పిటల్ లో ఆయనా అంతే! పలకరిస్తే ఆప్యాయంగా మాట్లాడరు. "ఒంట్లో ఎలా ఉందండీ" అంటే "ఎలా ఉంటె ఏంలే?" అంటూ వెటకారంగా సమాధానం చెప్తున్నారు. మనస్సు ఉండబట్టలేక ఎప్పుడేనా వంటి మీద చెయ్యి వేస్తె వెంటనే విసుక్కుని చెయ్యి తోసేస్తున్నారు ఇంత క్రితం తన మీద ఉన్న జాలీ ప్రేమా ఏమందో! అప్యాయమైన పలకరింపుకీ, ఆదరణ అయిన చూపుకి మొహం వాచింది తను.
ఎందుకిలా మారిపోయారు అంతా.
తనని ఎందుకు అందరూ చిత్రహింస పెడుతున్నారు ఇలా?
తనేం మహాపరాధం చేసింది?
తన మీద ఎందుకు కోపం?
ఏం చేసిందని ఈ ఈసడింపు అసహ్యం తన మీద!
ఏమిటి?....ఎందుకు.....ఎందుకు!
సునంద ఒరాత్రి ఇలా మంచం కోడుకి తల కొట్టుకు కొట్టుకు ఏడుస్తుంటే , ఎదురుగుండా దండెం మీద, జగపతి తనకు పెట్టిన చీర లైటు వెలుగులో అపహాస్యంగా తనని చూసి నవ్వుతూ కన్పించింది. దాంతో సునంద కి అంతా అవగతం అయిపొయింది. జరిగిన సంఘటనలన్నీ ఒకదాని తర్వాత ఒకటి చిత్ర తోరణం లా జ్ఞాపకం వచ్చి, ఓహో.. ఇదా కారణం? ఇన్నాళ్ళూ నేను దీన్ని పెద్ద ప్రాముఖ్యం అయిన విషయం గా చూడలేదు.... ఇదే వీళ్ళందరి కి ఎంతో ముఖ్యం అయినదిగా తోచి నన్ను అసహ్యించుకుంటున్నారన్న మాట! చూశావా జగపతీ! నువ్వేదో కుర్రతనం లో వెర్రి పని చేశావు. అది నా మెడకి పాము అయి చుట్టుకుంది. "నా మనస్సు మంచిది. నేను సదుద్దేశ్యం తో చేశాను అనుకుంటే సరిపోయిందా నాయనా?.... చుట్టూ లోకం ఉంది.... సంఘం ఉంది.... అది అనుకోవాలి. నీది సదుద్దేశం అవునో కాదో- అంతా -- ఒక మార్గంలో ఆలోచించడానికి అలవాటు పడినప్పుడు ఆ మార్గం తప్పు అంటే వింటారా? మారుతున్న సమాజానికి అనుగుణంగా ఆలోచన మార్గం కూడా మార్చండి అని శాసించదానికి నువ్వెవరు? నే నెవరు? ప్రస్తుత సమాజం. సంబంధం లేని స్త్రీ పురుషుల మధ్య నున్న ఆత్మీయతని ఒక తుచ్చ సంబంధంగా మాత్రమే ఆలోచిస్తుంది. అది గమనించకుండా నువ్వు నాకీ చీర పెట్టావు.... నాతొ చనువుగా ఉన్నావు.... నాకు ఉత్తరాలు రాశావు.... నేనూ ఉదాసీనంగా ఉంటూ నీ మనస్సు కష్ట పెట్టడం ఎందుకులే అని ఊరుకుంటూ వచ్చాను... పసివాడా? ...చివరికి ఏమైందో చూడు! ఇక్కడ మా వాళ్ళు నన్ను ద్వేషిస్తున్నారు. అక్కడ శాంతా మీ అత్తగారూ నిన్ను అనుమానిస్తున్నారు. అనుమానించినా నువ్వు వాళ్ళకి అర్ధం అయేలా అన్ని సంగతులూ చెబితే ఇంత అల్లరి అయేది కాదు... పవిత్రమైన నీ భావాల్ని, కలుషితంగా అర్ధం చేసుకుంది అని అలిగి, శాంత ని కాపురానికి తీసి కెళ్ళకుండా వెళ్ళి పోయావు.... బాధపడుతూ నాకు ఉత్తరం రాశావు కాని, అదే శాంత కి రాస్తే ఎంత బాగుండేది.?.....నా పాటి ప్రపంచ జ్ఞానం కూడా తెలియని వెర్రి వాడివి నువ్వు..... నువ్వు కష్టాలలో పడ్డావు....నన్ను ఇబ్బందిలో పట్టావు...నీ కోపం శాంత ఎంత కుమిలి పోతోందో! ...మన ఇద్దరి చుట్టూ ఎంత అన్యాయమైన అపవాదు అల్లుకు పోతోందో అక్కడున్నావు....నీకేం తెలియడం లేదు...కాని తెలియాలి-- నీకు తెలియ జెప్పాలి... ఇన్నాళ్ళూ ఉదాసీనంగా ఊరుకున్నాను...కాని ఇంక ఊరు కోడానికి వీలు లేదు...నీకు అన్ని సంగతులూ రాస్తాను ....పరిస్థితులు తెలియ జెప్తాను.... శాంత ని క్షమించి ఆదరించమని ఆదేశిస్తాను... నా ఆదేశాన్ని నువ్వు కాదనవు.... నాకు తెలుసు... శాంతా నువ్వూ ఒకటి కావాలి.... మీ కోసం కాకపోయినా నాకోసం. ఈ దీనురాలయిన సోదరి బతుకు మీద వాలిన ఈ అపవాదం నీడ తొలిగి పోవడం కోసం, నిశ్చింతగా పరిపూర్ణమైన తృప్తి తో అయన పాదాల దగ్గర వాలి హాయిగా నేను ప్రాణాలు విడవడం కోసం. ఇందుకోసం అయినా నువ్వు శాంత ని ఆదరించు నాయనా! ఆమె మూర్ఖత్వాన్ని, అర్ధం లేని అసూయనీ, అనర్ధం అయిన అపార్దాన్నీ అన్నీ క్షమించి దగ్గిరికి తీసుకో...అవును... జగపతీ ...నువ్వు నా మాట విను... అక్కయ్య చెప్పింది వినవూ?.... ఆమె ఆఖరి క్షణాలు హాయిగా గడపటం నీకు ఇష్టం లేదూ?

ఇలా ఎక్కడో ఉన్న జగపతి ని ఉద్దేశించి తన మనస్సులో ఉన్నదంతా వెళ్ళబోసుకుని, మంచం మీంచి లేచింది సునంద కళ్ళు తుడుచుకుంటూ. జగపతి కి ఒక సుదీర్ఘమైన లేఖ రాయడానికి నిశ్చయించి.
ఎదురుగుండా టేబిల్ మీద ఫైళ్ళు - గుట్టలుగా పడి ఉన్నాయి. ఎప్పుడూ ఒక్క ఫైలైనా అలా పెండింగ్ గా ఉండేది కాదు. తన టేబిల్ దగ్గర కొచ్చిన అరగంట లో ఆ ఫైల్ చదివేసి, రాయవలసిన దేదో రాసేసి ఆయా సెక్షన్లకి పంపించేసేది సునంద. అందుకే సునంద దగ్గర ఆలస్యం ఏవీ ఉండదని ఆఫీసులో అందరూ అనుకుంటుంటారు. అందరి సెక్షన్ హెడ్స్ కీ తెలుసు, ఆఫీసు పనిలో సునంద ఎప్పుడూ "అప్ టు డేట్ " గా ఉంటుందని.
అలాంటిది, వారం పది రోజుల నుంచి ఒక్క ఫైలు చూడడం లేదు. ఎంతసేపటి కి టేబిల్ కేసి చూస్తూ కుర్చీలో కూర్చుని ఆలోచించడం, కళ్ళ నీళ్ళు వస్తే ఎవరూ చూడకుండా మధ్య మధ్య పైట తో కళ్ళు ఒత్తుకోవడం, ఇలా గంటలు రోజులూ గడిపేస్తోంది కాని ఒక్క ఫైలు ఓపెన్ చెయ్యడం లేదు. అందువల్లే టేబిల్ మీద ఫైళ్ళు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. విపరీతంగా చిక్కిపోయి ముఖంలో రక్తం లేక పాలిపోయి, కళ్ళు లోతుకు పోయి, చెప్పలేనంత నీరసంగా కనిపిస్తున్న సునంద ని చూసి, ఆఫీసు లో పనిచేసే తోటి గుమాస్తాలు "అయ్యో అని జాలి పడుతున్నారు. "ఏమిటి అలా ఉన్నారు? ఒంట్లో బాగుండడం లేదా అని అడిగిన వాళ్ళకి జవాబుగా ఒక నీరసమైన నవ్వు నవ్వుతోంది. అంతకంటే ఏం చెప్పడం లేదు. అందువల్ల మౌనంగా పాపం! అని ఊరుకుంటున్నారు అందరూ. ఆమె ఫైల్స్ చూడకపోయినా, పని చెయ్యక పోయినా, ఫైళ్ళన్నీ ఆమె టేబిల్ మీద గుట్టగా పడి ఉండి పోయినా , ఎవరూ విసుక్కోవడం లేదు. అంతగా అర్జంటయితే ఆ ఫైల్ తీసుకొని, ఆ పనేదో తామే చేసుకుని సర్దుకుంటున్నారు. అంతా తన పట్ల అలా సానుభూతిగా ఉంటున్నారన్న సంగతి సునంద కి తెలుసు. తన చుట్టూ ఆవరించుకున్న దురదృష్టాల్లో ఇది ఒక్కటే అదృష్టం అని అనుకోని, వాళ్ళందరికి మనస్సు లోనే కృతజ్ఞ తలర్పించుకొంటుంది.
