Previous Page Next Page 
శరన్మేఘం పేజి 18


    "చిక్కి పోనూ లేదు పాలి పోనూ లేదు. మీకు నా మీద ఉన్న ప్రేమ వల్ల అలా అనిపిస్తింది. అంతే - అది సరే కాని పొద్దుట డాక్టరు వచ్చి చూశారా ?....ఏమన్నారు?"
    "వారం పది రోజుల్లో చేస్తానన్నారు లంగ్ ఆపరేషన్. ఆ తర్వాత పది పదిహేను రోజులలో హాస్పిటల్ నుంచి డిస్ చార్జి చేస్తారట. రెండు మూడు నెలలు విశ్రాంతి తీసుకొంటే ఆ తర్వాత తిరిగి ఉద్యోగంలో కూడా చేరవచ్చట."
    "నిజంగా?" ప్రాణం లేచినచ్చినట్లూ. అన్నాళ్ళూ పడిన శ్రమంతా ఆ మాటతో పటా పంచలై నట్లూ. ఆనందోద్వేగంతో అంది.
    'అవును సునందా -- నీ కష్టాలు ఇంక దాంతో తీరుతాయి. ఇన్నాళ్ళ నుంచీ ఇంటికి , హాస్పిటల్ కి మధ్యన గంధపు చెక్కలా అరుగుతున్నావు. నా రోగం అంటే నాకేనా విసుగొచ్చింది. కాని నీకు మాత్రం ఏ విసుగూ రాలేదు. నాతొ పాటు హాస్పిటల్ లో జాయిన్ అయిన వాళ్ళెంత మందో. జబ్బు తగ్గి హాయిగా ఇళ్ళ కెళ్ళి పోతున్నారు ఒక్కొక్కరే. ఇన్నాళ్ళ యినా నేను ఇలాగే ఉన్నాను. చివరికి లంగ్ ఆపరేషన్ దాకా వచ్చింది పరిస్థితి. నన్ను బట్టి మీదందరూ కూడా ఆవస్తపడుతున్నారు."
    "అవస్తేమిటండి ...మీరల్లాగ అనకండి.... మీకు ఆరోగ్యం చేకూరితే అన్ని బాధలూ మరిచిపోతాం."
    "మరి ఆపరేషన్ కి అయిదారు వందలు కావాలి....ఎలా సర్దు బాటవుతాయి?"
    "ఆ విషయం మీ కెందుకు? నిశ్చింతగా ఉండండి మీరు" అంది. ఆ మాట అంటూన్నప్పుడు సునంద కి ఆ రాత్రి గోపాలం వెయ్యి రూపాయలు పట్టుకుని వచ్చిన దృశ్యం మనస్సు లో మెదిలి భయంతో వళ్ళు జలదరించింది.
    "అయిదులా పదులా.... వందల మీద అవసరం అవుతుంది. ఏం అవస్థ పడుతున్నారో గోపాలం. నువ్వూను, ఇద్దరి సంపాదనా ఇంట్లో ఖర్చులకీ, మండులకీ సరిపోదు.... మరి ఎలాగా?.... నాకోసం ఇంట్లో ముఖ్యం అయిన ఖర్చులే వైనా మానేసి పొదుపు కాని చేస్తున్నారేమిటి?"
    సునంద ఏం జవాబు చెప్పలేదు.
    "నాకోసం మీరంతా పస్తులుంటూన్నారన్న మాట. ఆ పొడుపులో ఒక భాగమేనా ఇవాళ నువ్వు ఇంత బాధలోనూ రిక్షా కట్టించుకోకుండా నడిచి రావటం రామ...రామ.... నేను కారణం గా ఎంత హింస పడుతున్నారు మీరంతా...."
    "మేమేం హింసపడడం లేదు. హాయిగా ఉన్నాం. మీరు అనవసరంగా మనస్సు పాడు చేసుకోకండి."
    "ఎందుకు నా దగ్గర అబద్దం చెప్తావు? నిన్ను చూస్తె తెలియడం లేదూ. నువ్వు ఎంత సుఖ పడుతున్నదీను.... నా కళ్ళల్లోకి చూసి నిజం చెప్పు. నువ్వు కడుపు నిండా అన్నం తిని ఎన్నాళ్ళ యిందీ?"
    సునంద కళ్ళనీళ్ళు ఆపుకోలేక పోయింది.  నిజమే ....రాజమ్మ గారు వచ్చిన తర్వాత తను కడుపు నిండా తిండికి, కంటి నిండా నిద్రకీ నోచుకోలేదు. అయితే అందుకు కారణం మానసికమైన సంక్షోభమే కాని శివరాం అనుకున్నట్లు ఆర్ధికమైన ఇబ్బంది కాదు. కాని అది శివరాం కి డబ్బు సంబంధం అయిన సమస్యగా అర్ధం అయింది. అతని మనస్సుకి అది రంపపు కోత అయి "భగవంతుడా నా ఒక్కడి కారణం వల్ల, ఇంతమంది హింస అనుభవించడమా.... నన్ను తీసుకుపోయి వీళ్ళని సుఖ పెట్టు తండ్రీ" అని తనలో తాను బిట్టుగా వాపోయాడు.
    శివరాం మనస్సులో ఏదో వ్యధ చెందుతున్నాడని గ్రహించి, "ఇవాళ బాబిగాడు పుట్టిన రోజండి. ఊళ్ళో అందర్నీ పిలిచి సరదాగా పండగ చేస్తున్నాం." అంది అతని ఆలోచనలని మళ్ళించి అతనిలో సంతోషాన్ని ఉత్సాహాన్ని కల్గించాలని.
    "అప్పుడే ఏడాది అయిందా వాడు పుట్టి? వాడినిప్పటికి చూడలేదు నేను. ఎలా ఉంటాడు? ఎవరి పోలిక. అల్లరి చేస్తాడా బాగా?" అంటూ అడిగాడు ఎంతో ఆసక్తిగా. వాడిని చూడాలని ఎంత కోరికగా ఉందొ పాపం, పోనీ గోపాలంతో ఒక్కమాటు తీసుకెళ్ళి మీ అన్నయ్య కి చూపించమని చెప్తే?
    "సునందా.... నీ దగ్గర చనువేనా వాడికి? మాటలు వచ్చాయా?.... 'పెద్దనాన్న ' అంటాడా? ఒక్కమాటు అంటే వినాలని ఉంది" అన్నాడు శివరాం మురిసిపోతూ. సునంద కి కళ్ళు చెమర్చాయి. తనకే ఒక కొడుకుంటే --
    "ఇంక నేను వెళ్తాను... మీకు కెరియర్ పంపించవద్దూ?" అంది సునంద.
    పంపిద్దుగానిలే . ఇప్పుడంతగా ఆకలి లేదు. ఊ....చెప్పు. బాబిగాడి కబుర్లేవైనా చెప్పు" అంటూనే సునంద కట్టుకున్న చీర కేసి పరిశీలనగా చూసి, మొహం చిట్లించి "ఈ..... ఛీ....ర...?" అంటూ ఆగిపోయాడు శివరాం.
    సునంద కళవ పడి కుంచించుకుని పోయి తల వంచుకుని నిలబడింది తప్పు చేసిన దానిలా. శివరాం ఆ తర్వాత ఏం మాట్లాడకుండా ఎటో చూస్తూ. ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు. సునంద ఇబ్బందిగా నిలబడి, ఎంతకీ శివరాం తనకేసి చూడక పోవడంతో. "నేను వెళ్ళి వస్తా" అని పొడిగా అనేసి, బయలుదేరింది. "డబ్బు కోసం చూడక ఈ మాటేనా రిక్షా కట్టించుకు వెళ్ళు" అన్నాడు కొంచెం విసుగ్గా శివరాం వెనకాల నుంచి.
    ఇంటికి బయలుదేరిన సునంద కి దారిలో గోపాలం కనిపించాడు బాబిగాడిని ఎత్తుకుని వస్తూ. "ఏమిటి ఇంతసేపు చేశారు? అదేది? అన్నాడు. "ఇంకా రాలేదా? మా మానేజరు గారింటికి వెళ్ళింది" అంది సునంద. "మరి నువ్వు?" అన్నాడు గోపాలం. "నేను హాస్పిటల్ కి వెళ్ళి వస్తున్నాను. నువ్వు అలా వెళుతున్నావేమో . బాబిగాడిని తీసుకెళ్ళి ఆయనకి చూపించు, పాపం ఆయనకి వీడిని చూడాలని ఉంది అంది. 'అలాగే" అని గోపాలం హాస్పిటల్ కేసి నడిచాడు.
    తీసుకువచ్చి బాబిగాడిని చూపించినందుకు శివరాం ఎంతగానో సంతోషించాడు. వాడిని కొసరి కొసరి ముద్దెట్టుకున్నాడు. కావాలని ఒకటికి పదిసార్లు "పేద నాన్నా" అని పిలిపించుకొని మురిసిపోయాడు. మనసారా దీవించాడు. అనందంతో కళ్ళ నిండా నీళ్ళు నింపుకుని ----
    ఆ తర్వాత అన్నాడు "ఇంట్లో డబ్బుకి ఇబ్బంది పడుతున్నారా?" అని -- "ఎందుకు అబద్దం చెప్తావు -- నాకోసం మీరంతా మీ మీ సౌఖ్యాలు వదులుకొని త్యాగం చేస్తున్నారు" అన్నాడు. "మీ వదిన ఆరోగ్యం ఆందోళన కలిగిస్తోంది. దగ్గుతూ, నడిచి రాకపోతే రిక్షా చేయించుకుని రాకపోయిందా?' రిక్షా డబ్బులు తగ్గి నంతట్లో అదా అవుతుందా గోపాలం!" అన్నాడు. "నా ఆపరేషన్ కి డబ్బు ఎలా వస్తుంది ఏం అవస్థలు పడతావు? నాకేం పాలు పోవడం లేదు." అన్నాడు.... ఇంకా ఏదో ఏదో అన్నాడు.
    గోపాలం ఆ మాటలన్నింటి కంటే . ఇంట్లో ఇబ్బంది సంగతి అన్నయ్య కి తెలిసింది. వదిన బాధపడుతూ వడిచి వచ్చ్గి అతనికి కష్టం కలిగించిందని చాలా నొచ్చుకున్నాడు. శివరాం కి నవ్వుతూ ఏదో సర్దిచేప్పేశాడే కాని సునంద మీద చెప్పలేనంత కోపం వచ్చింది గోపాలానికి. "వదిన ఇంట్లో సంగతులన్నీ అన్నయ్య కి ఎందుకు చెప్పాలి? వంట్లో అలా ఉన్నప్పుడు రిక్షా మీద వెళ్ళక నడిచి ఎందుకు వెళ్ళాలి" అనుకున్నాడు. హాస్పిటల్ లో కొంచెం సేపు ఉండి అక్కడ నుంచి సునంద మేనేజరు గారి ఇంటి కేసి బయలుదేరాడు గోపాలం బాబిగాడిని తీసుకుని. రత్నం ఇంకా అక్కడే ఉందొ" ఇంటికి బయలుదేరిందో చూడొచ్చు కదా అనే ఉద్దేశంతో....
    శాంతా, రమణమ్మ గారూ బాబిగాడికి ఇచ్చిన బిస్కెట్లూ , బిళ్ళల పెకేట్లూ పట్టుకుని రత్నం గోపాలం ఇంట్లో అడుగు పెడుతుంటే రాజమ్మ ఆదుర్దాగా ఎదురు వెళ్ళి "తలంటి నీళ్ళు పోసిన కుర్రాడిని తీసుకుని ఎక్కడికి వెళ్ళావు నాయనా" ఎండ వేళ?" అంది.
    "పిన్నిగారు ఆదుర్దా పడుతున్నారు." అంటూ మాట కలిపింది సునంద.
    "బాబిగాడిని అన్నయ్య కి చూపించి అశీర్వదించ మందాం అని....ఆదుర్దా పడుతుంటే ఆవిడకి చెప్పక పోయావా వదినా?"
    "ఏవిటి హాస్పిటల్ కి తీసుకు వెళ్ళావా పుట్టిన రోజు పూటా ఆ చంటి కూనని? నాయనా మీకూ, మీకూ ప్రేమలూ, అభిమానాలూ ఉంటె ఉండొచ్చు కానీ.... అలా ఎప్పుడూ తీసి కెళ్ళకు" అంది రాజమ్మ ప్తమాదం ఏదో జరిగిపోయినట్లు సునంద ఆశ్చర్యంగా చూస్తూ నిలబడింది.
    "ఏవిటి వదినా -- తెలియనట్టు అలా ఆశ్చర్యంగా చూస్తూ నుంచుంటావు? నీకు తెలియదూ నేను వాడిని హాస్పిటల్ కి తీసు కేళుతున్నట్లు? కంగారు పడుతున్నప్పుడు ఆవిడకి కొంచెం చెప్పక పోయావు?" అన్నాడు. గోపాలం .
    "ఏవిటీ తల్లీ....నీకు తెల్సా అయితే." అంది రాజమ్మ.
    "తెలియడం ఏమిటి ఆవిడే తీసి కెళ్ళమంది." అన్నాడు గోపాలం.
    "గోపాలం !" అంది సునంద. అ సంగతి రాజమ్మ కి తెలిస్తే ఇంకా ఎంత గొడవ అవుతుందో అనే భయంతో. సునంద వేసిన ఆ కేకని, గోపాలం ఇంకోలా అర్ధం చేసుకున్నాడు.
    "ఏవిటి? నువ్వూ కాదూ నన్ను తీసుకు వెళ్ళమన్నది? అన్నాడు రెట్టిస్తూ.
    సునంద నిస్సహాయంగా చూస్తూ నిలబడి పోయింది.
    'అవును గాని వదినా? ఇంట్లో సంగతులన్నీ నువ్వు అన్నయ్య కి ఎందుకు చెప్పావు?"
    "నేనా?"
    "నువ్వే చెప్పింది చాలక ఇంకా నటన కూడా ఎందుకు?' చాలా కఠినం గా అన్నాడు గోపాలం.
    ఎప్పుడూ లేంది గోపాలం కంఠం లో కొత్త కాఠిన్యం వినేసరికి. విద్యుద్ఘాతం తగిలినదానిలా నిస్తేజం అయిపొయింది సునంద.
    "దగ్గుతూ ....బాధపడుతూ హాస్పిటల్ కి నడిచి వెళ్ళడం.... చాలా యాతన పడుతున్నట్లూ రిక్షా డబ్బు లివ్వడానికి కూడా నేను మొహం చూసుకుంటున్నట్లు అన్నయ్య కి అర్ధం అయేలా ప్రవర్తించడం ...ఇవేం బాగోలేదు వదినా ..."
    ఈటేల్లా వచ్చి తగులుతూన్న మాటలకి నిర్జీవ ప్రతిమలా అలా నిలబడి ఉండిపోయింది సునంద.
    "మిట్టమధ్యాహ్నం వేళ భోజనాలకి లేవకుండా ఎందుకొచ్చిన రభస? అన్నం వడ్డిస్తాను. లేచి కాళ్ళు కడుక్కోనాయనా" అంటూ రాజమ్మ గారు గోపాలం మీద అభిమానాన్ని ప్రదర్శించబోయింది.
    "భోజనం తర్వాత చెయ్యొచ్చులెండి.... అవును కాని వదినా , అందరి ఇళ్ళకీ పిలుపు కి వెళ్ళినదానివి నువ్వు మీ మేనేజరు గారి యింటికి ఎందుకు వెళ్ళలేదు?
    సునంద ఏం సమాధానం చెప్పలేదు.
    "నువ్వు గడుసుదనంగా రానంటే అందులో రహస్యం ఏవిటో తెలిసి కోకుండా , పిచ్చి మొహం లాగా అది వెళ్లడమా ! దాన్ని అక్కడ కూచో బెట్టి వాళ్ళు , నానా మాటలూ అనడమా! నేను వెళ్ళాక నాతొ కూడా వాళ్ళు అవన్నీ చెప్పడమా?
    మాకు తల కొట్టేసినట్లు అనిపించడమా?.... అబ్బే.... ఇవేం బాగోలేదు సుమా!"
    తనని నుంచో పెట్టి గోపాలం ఏవిటిలా నిలువునా దులిపెస్తున్నాడు?... తను ఏం చేసుందని?
    "అయినా నువ్వు చిన్న పిల్లవా ఏవన్నానా? ఎవరేనా అలా ఉంటె చెప్పవలసిన దానివి. నువ్వే అలా ఉంటె .... జగపతి నీకు చీర కొని పెట్టడమా? నువ్వు అతనితో కలిసి కార్లో తిరగడమా?... అతను నీకు ఉత్తరాలు రాస్తూ ఉండడమా?... ఇవేమైనా మర్యాద అయిన పనులే? నాకే వింటే, తల కొట్టేసుకో బుద్ది వేసిందే అన్నయ్య కి తెలిస్తే.... ఇంకేమైనా ఉందా?.... ఇన్నాళ్ళూ నువ్వంటే నాకు ఎంతో గౌరవ భావం ఉండేది?"
    గుండెని మండించే ఒక్కొక్క మాటా, ముళ్ళ కత్తి లా తనని నిలువునా చీల్చేస్తుంటే తన దురదృష్టాన్ని తలుచుకుని కుమిలి పోసాగింది సునంద. తల తిరిగిపోయింది. నరాలన్నీ తోడేస్తున్నాయి. శరీరం తన వశం తప్పిపోతోంది. కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి. గొంతు లోంచి మాట పెకిలి రావడం లేదు. కళ్ళమ్మట ధారగా కన్నీళ్ళు కారిపోతుంటే నిస్సహాయంగా చూస్తూ, "నా గురించి....నువ్వూ.... నువ్వూ.... అలాగే.... అనుకుంటున్నావా గోపాలం?" అంటూ అస్పష్టంగా అరిచి స్పృహ కోల్పోయి చాప చుట్టగా పడిపోయింది సునంద.
    తర్వాత ఏం జరిగిందో . అలా ఎంతసేపు స్పృహ తప్పి ఉండి పోయిందో . బాబిగాడి పుట్టిన రోజు పండుగ పేరంటాళ్ళు అందరూ వచ్చి వెళ్ళారో లేదో. ఇవేం తెలియవు సునందకి.
    "దొడ్డమ్మా... అమ్ము....తిను" అని తన మంచం దగ్గరికి వచ్చి బిక్కమొహం వేసుకుని అంటున్న బాబిగాడి మాటలు వినిపించి, కళ్ళు తెరిచింది సునంద. వాడిని కౌగలించుకొని బావురుమంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS