Previous Page Next Page 
ముద్ద మందార పేజి 18

 

    పున్నమి చంద్రుడు నవ్వాడు.
    నా జీవితంలో మరోసారి ఆనందించబోయాను. అంతలోనే విధి వెక్కిరించింది.
    రాధ ప్రసవించి చనిపోయింది.
    సుశీల కాన్పు పోయింది.
    నా పాపానికిది మరో ఫలం.

                               *    *    *    *
    సుశీల మనస్సు నిమ్మదించడానికి పుణ్య క్షేత్రాలన్న చూద్దాం పద అని బయల్దేరతీశాను. ఒక నెల్లాళ్ళు తిరగవలసిన సప్త దేశాలనన్నీ తిరిగి, యింటికి చేరాము. సుశీలకి కొంత మనస్సు కుదుటపడింది. నాకు కుదుట పడడానికి వీల్లేదు కనుక పడలేదు.

                                                      *    *    *    *
    ఒకరోజు రాత్రి పడుకోబోయే ముందు "మిమ్మల్ని ఒక ప్రశ్నడుగుతాను కానీ, ఎమనుకోరు గదా" అంది. 'అడుగు" అన్నాను అడిగే విషయం వూహించలేక.
    "మీ అల్భం లో రాధాక్కయ్య ఫోటోలు అవీ అయ్యాక వో పల్లెటూరమ్మాయి ఫోటోలున్నాయి. ఎవరండీ ఆ అమ్మాయి? ఎంత అందంగా వుందో మీరు తీసినవే ఆ ఫోటోలు " అంది. నా పై ప్రాణం పైనే పోయింది.
    "మిమ్మల్నే ఏవిటా పరధ్యానం?" అంది. నేను సుశీల ముఖంలోకి చూడడానికి సాహసించ లేకపోయాను. మళ్ళీ ఎలాటి మలుపు తిరుగుతుందో నా జీవితం అని శరీరం భయంతో కుంచించుకు పోయి, మొండి దైర్యం వచ్చింది. ఏమైనాసరే చెప్పే తీరాలి. ఏం జరిగినా ఎదుర్కొంటాను. చేసిన పాపం చెపితే పోతుందంటారు. కానీ అది నిజమయితే బోలెడు పాపాలు చెయ్యచ్చు.
    నేను నా మనస్సులో ఏదో ఆరాట పడుతున్నట్టు గ్రహించింది సుశీల. తను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడం నా కిష్టం లేనట్టు వూహించి టేబులు మీది పుస్తకాలు సర్ధ నారంభించింది. నేను నిశ్చయించుకున్నాను.  
    చెప్పే తీరాలి.
    "సుశీలా మందారపువ్వు వెనక నాకో కధ వుంది. అదప్పుడు చెప్పలేనన్నాను. ఇప్పుడు చెప్తాను కూర్చో" అంటూ సుశీలను నా పక్కన కూర్చోపెట్టుకుని ప్రారంభించాను. చెప్పినంత సేపూ సుశీల బొమ్మలా కూర్చుని వింది. ఆమె వంక చూడకుండా చరిత్ర ముగించి, సుశీల ముఖంలోకి చూడడానికి ధైర్యం లేక తలగడ మీదున్న కుండలు బొమ్మ కేసి చూపులు మరల్చుకున్నాను.
    సుశీల కన్నీరు తుడుచుకుంది.
    "ఇది సుశీలా. రాధకి యీ గాధ చెప్పినప్పుడు ఆమె గర్భవతి. ఆమె మనస్సు గాయపడింది. నన్ను క్షమించలేక పోయింది. మానసికంగానూ, శారీరకంగానూ కృంగి కృశించి పోయింది. చివరికి పసికందును నాకోసం వదిలి, కడసారి చూసుకునే అదృష్టం కూడా లేకుండా యీ లోకాన్ని వదిలిపోయింది . చెప్పు సుశీలా. నువ్వు నన్ను క్షమిస్తావా" అన్నాను. ఆమె చేతులు నెమ్మదిగా నా భుజాన్ని తాకాయి. చూపులను భయంగా ఆమె కేసి తిప్పుకున్నాను. సుశీల నా కన్నీరు తుడుస్తూ "మీరింత బాధ పడవలసిన విషయమేమీ లేదు. దీనికా మీకింత మనోవ్యధ ?' అంది.
    నే నాశ్చర్య పోయి , "ఏవిటి నువ్వనేది? నిజమా" అన్నాను.
    "అవును. మానవుడేప్పుడూ దేముడవ లేడు. మానవుడి లో మంచితనం ఎప్పుడూ పరిస్థితుల మీదే ఆధారపడుతుంది. మీరు ఇంత బాధ పడనవసరం లేదు. కానీ....' అంది.
    "కానీ" అన్నాను ఆత్రంగా.
    "ఆవిడ -- సింహాచలం కొడుకు మీ కొడుకు కాదా! మీ సుఖం కోసం తన జీవితం అర్పించిన త్యాగమూర్తి. మనం ఆ వూరు వెళ్ళి, ఆమెను కలుసుకుని, వాళ్ళిద్దరనూ తీసుకు రావాలి. వాళ్ళూ మనతో పాటే వుండాలి. రామనైకి ఎంత హక్కుందో, అంత హక్కు ఆమె కొడుక్కి కూడా వుండాలి. మనం వెళ్ళి వద్దాము" అంది.
    "లేదు సుశీలా, నీకా అదృష్టం లేదు. ఆమె ఆచూకీ ఆ వూళ్ళో తెలియలేదు. పోయిన సంవత్సరం వ్యాపారం పని మీద వైజాగ్ వెళ్ళి, అక్కడ నుంచి వెళ్ళాను. వాళ్ళెవరూ లేరు. ఇక సింహాచలాన్ని వాళ్ళనీ చూడడం యీ జన్మకి జరగదు" అంటూ నేను గోపాల పూర్ వెళ్ళి సింహాచలం కోసం చూసిన సంగతి చెప్పాను.
    కాన్పు పోవడంతో సుశీల ఆరోగ్యం, పూర్తిగా దెబ్బతింది. అనేక రకాల ఆనారోగ్యాలు సుశీలని చుట్టూ ముట్టాయి. దగ్గూ, ఆయాసం విపరీతంగా వచ్చేది. డాక్టర్లు పరీక్ష చేయకుండా వుబ్బసం, అన్నారు. చేసి అవునన్నారు కానీ వుబ్బసం పెద్దరకం వ్యాధి కాదని, నూటికి నూటొక్క మందికి ఆ వ్యాధి వుంటుందనీ డాక్టర్లు నచ్చచెప్పారు. సుశీల కూడా నాతొ అదే అంది.
    కానీ నా పాపం నన్ను చివరి కంటా వెంటాడుతుంటుందనే భయం నాకుండనే వుంది.
    రోజులు గడిచి, నెలలను చేసిన కొద్దీ సుశీల ఆరోగ్యం క్షీణించసాగింది. సుశీల బ్రతకదని నాకు తెలుసు. నా పాపానికి యింత ఘాతుకంగా శిక్ష పడుతుందని నేనెన్నడూ అనుకోలేదు. నాలొ ఆవేశం పుట్టి దైవదూషణ కు దారితీసింది. దేముణ్ణి కసితీరా దూషించాను. సుశీల కన్నీటితో వారించింది. "నా మాట వినండి. దైవదూషణ మానవునికి శ్రేయస్సు కాదు" అంది సుశీల. ఆ రాత్రి సుశీల నిద్రపోయాక దేముడి పటం దగ్గరకు వెళ్ళినిలబడ్డాను. నాకు ధైర్యం మీద ఎన్నలేని కసి పుట్టింది.
    "నా పాపానికి నీ కిష్టమొచ్చిన శిక్ష విధించు. నేను అన్నిటికీ సిద్దంగా వున్నాను. సర్వనాశనానికయినా సిద్దమే! యీ పందెం లో నువ్వు వోడిపోతావో, నేనోడిపోతానో.... నేను శూన్యూడ్ని య్యాను. నా అన్న వాళ్ళందర్నీ తీసుకు పోయావు. సుశీలనీ తీసుకు పో.... రామాన్నీ తీసుకు పో.... నన్ను బికారిని చై.... కాలూ, కన్నూ తీసేయి..... అన్నిటికీ సిద్దమే' అని మండే గుండెతో అరిచాను.
    నెల తిరగలేదు. దేముడు నా సవాలు విన్నాడు.
    ఆనాడు మామిడి తోటలు చౌకగా వచ్చాయంటే మేనేజరుతో బయలుదేరి వెళ్లాను. నూజివీడు లో రెండ్రోజులుండి, బేరం పూర్తీ చేసుకుని, యింటికి వచ్చేసరికి "సుశీల పోయింది" అని తెలిసింది.
    నా గుండె పిడచ కట్టుకు పోయింది.
    సుశీల నిద్రపోతున్నట్టు మంచం మీద నిర్జీవంగా వుంది. నేను యాంత్రికంగా వెళ్ళి, ఆమె తల దిక్కున కూర్చున్నాను. సుశీల ముఖంలోకి చూశాను.
    "నాకోసం, నా ఆరోగ్యం కోసం దేవుడికి దండం పెట్టండి" అనే సుశీల నాకిక లేదు. దేముడికి దండం పెట్టమని నాకు బోధించడానికి ఎవ్వరు వుండ కూడదనే దేవుడు సుశీలని తీసుకు పోయాడు. నేనిక ఏకాకిని. ఒక్క రామం ఉన్నాడు.
    "రామం ఏడి?" అనడిగాను చచ్చి పోయాడని గనుక చెప్తే వినడానికి సిద్దపడుతూ. నరసమ్మ గారు రాధ తల్లి యింటికి తీసుకు వెళ్ళినట్లు పనివాడు చెప్పాడు.
    సుశీల నుదుట మున్గుర్లు సరిచేశాను.
    తలలో నుంచి పేలు బయటికి వస్తున్నాయి. ఇన్నాళ్ళూ మనిషితో వుండి, రక్తాన్ని పీల్చడానికి స్థావరం ఏర్పాటు చేసుకున్నవాటికి ఆనాటితో మనిషితో సంబంధం తీరిపోతుంది. మృతకళేబరం మీద అవి క్షణం వుండవు.
    మిగతా కార్యక్రమం అంతా అయ్యింది. రామాన్ని తనే పెంచుతానని సుభద్రమ్మ గారు ప్రాధేయపడింది. "మీదగ్గరే వుంచండి. నాదగ్గరయితే వాడూ దక్కక పోవచ్చు.' అని చెప్పాను. మకాం విజయవాడ నుంచి నూజివీడు మార్చేశాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS