
22
ఆకాశమంతా చీకట్లు అలుముకున్నాయి. ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. ఉన్న కాంతిని మరింతగా చూపుతూ వెలుగునివ్వాలని ప్రయత్నిస్తున్నాయి బుడ్డి దీపాలలాంటి వీధిలైట్లు. ఎక్కడోతప్ప ఎక్కువ జనసంచారం లేదు.
నీలిరంగు పట్టుచీరమీద జరీ బుటాలాగా అక్కడ డక్కడ మెరుస్తున్న నక్షత్రాల వంక చూస్తూ మౌనంగా ఆలోచనానిమగ్నుడయ్యాడు శ్రీనివాస్. అతని పక్కనే కూర్చుని అతని కదలికలు గమనిస్తూ కూర్చుండిపోయారు కృష్ణమూర్తిగారు.
"ఆ రోజున నేనన్న మాటలు నీకు బాగా కోపం తెప్పించినట్లున్నాయి."
"అదేం లేదండీ. అప్పటి కోపం అప్పుడే తగ్గిపోయింది. ఇంతకీ ఎందుకు కబురుచేశారు?"
"ఏం లేదు. నీతో ఈ విషయాలు మాట్లాడదామని."
"ఈ విషయం ఫోనులో చెబితే సరిపోయేది కదా!"
"అవుననుకో! అయినా ముఖస్థంగా మాట్లాడినట్లుంటుందా?
"........."
"నేను నీ వ్యక్తిగత విషయాలలో జోక్యం కలగచేసుకుంటున్నానని అనుకోకు. కాని నీ స్వంతవిషయాలు వినాలని ఉంది."
"ఏమున్నాయండీ వినేందుకు? మీకు చాలాభాగం అనూరాధద్వారా తెలిసే ఉంటాయి. నిజానికి అంతకన్నా చెప్పేందుకు ఏమీ లేవు."
"అవుననుకో. ఇంతకీ ఏం చేద్దామనుకుంటున్నావు?"
"ఆ విషయం ఇదివరకే చెప్పాను కదా! దానికి మార్పు చెయ్యడం ఇష్టంలేదు."
"నీ నిర్ణయం విన్నాననుకో. కాని మరోసారి ప్రయత్నించడం మంచిపనేమో అని తోస్తూంది."
"......."
"ఏమంటావు?"
"ఏముంది అనేందుకు? ఒక డాక్టర్ గా మీకు నేను చెప్పవలిసిన వాణ్ణి కాను. అనుభవజ్ఞుడుగా మీకు తెలియనివి లేవు. మెడిసిన్ పూర్తిచేసి, డాక్టరై నిలిచేందుకు కావలిసిన మనస్సు స్థైర్యం, నిశ్చయం మీకు తెలుసు. అన్నీ తెలిసి మీరు మళ్ళీ వన్నీ రొంపిలోకి ఎందుకు దింపేందుకు ప్రయత్నిస్తున్నారో అన్నదే నాకు అర్ధం కాదు."
"డాక్టర్ గా నాకు తెలియనివి లేవంటున్నావు. నిన్ను తిరిగి డాక్టర్ అవమనడానికి అదె కారణం ఏమో! నిరాశ ఆవరించిన రోగికి ధైర్యాన్నిచ్చి, ఆశ చిగురింప చేయడం డాక్టర్ ధర్మం. అత్యవసరమయితే అబద్దమాడి అయినా రోగికి ధైర్యం కలగచెయ్యడం డాక్టర్ విధి. ఆశలేని మానవుడికి జీవించేందుకు తావు లేదు. ఒక డాక్టర్ గా నీకు లేని ధైర్యాన్ని కలిగించాలని చూస్తున్నాను. సాటి స్నేహితుడుగా నీలో మరుగునపడిపోయిన కోరికను పైకి తియ్యాలనుకుంటున్నాను."
"మీరు నన్ను తప్పుగా అర్ధంచేసుకుంటున్నారు. నాలో మరుగునపడ్డ కోరికను బయటపడెయ్యాలనుకోవడం వృథా శ్రమ. నా కసలా కోరిక లేదు. నాకు ఆ నమ్మకం లేదు."
"శ్రీనివాస్, ఒక్క విషయం చెపు. నీ చదువు ఎంతకాలంలో పూర్తి శావు?"
"దానికి, దీనికి సంబంధం ఏముంది? మామూలు నిర్ణీత కాలంలోనే."
"అయిదేళ్ళుగా నువ్వు చదివావు. వైద్యవిద్య ఎంత కష్టమయినదో నీకు తెలుసు. ఒక్క సంవత్సరంకూడా తప్పకుండా పాసయ్యావంటే..."
"అందుకు కారణం మా నాన్నగారిని నిరుత్సాహపరచడం ఇష్టంలేక పోవడమే. అంతేగాని ఆ విద్యమీద అంతులేని ఆసక్తితో కాదు, ప్రతి సంవత్సరం పాసయ్యేందుకు ప్రయత్నించింది, ఆ కాలేజీ ఆవరణకు దూరంగా పారిపోదామని."
"కావచ్చు. మెడిసిన్ అంటే ఇదేం హిస్టరీ, సివిక్సు కాదని నీకూ తెలుసు ముక్కున పట్టి పరీక్షల్లో గీకితే పాసవడానికి. ప్రతి ఒక్క సంవత్సరం పూర్తిచెయ్యాలంటే ఎంత శ్రద్ధ వహించాలో, ఎంత కృషి చెయ్యాలో నీకు తెలియనిది కాదు. నీలో ఆ విద్యంటే గౌరవం, కుతూహలం లేకపోతే అది సాధ్యంకాదు."
"......"
"నీకు తెలియకుండా, నీలో అంతర్గతంగా ఆ కోరిక నాటుకుపోయింది. ఆ కోరికే నీలో నీకు తెలియని ఉత్సాహాన్ని కలగచేసి ఉత్తీర్ణున్ని చేసిందేమో!"
"నాలో వైద్యం చదవాలని ఎప్పుడూ లేదు, కేవలం మా నాన్న కోరిక తీర్చాలన్న ఉద్దేశంతప్ప. అంతేకాని విపరీతమైన అభిమానం ఎప్పుడూ లేదు. ఆయన కోరిక ప్రకారం డాక్టరీ చదివాను కాని, డాక్టర్ని మాత్రం కాలేను. అదీకాక ఆయన కోరిక తీరిందో లేదో చూడటానికి ఆయన ఎలాగూ లేరు."
"పెద్దవారి అడుగుజాడల్లో నడిచేందుకు, వారి అభీష్టాలను తీర్చేందుకు వారెల్ల కాలం ఉండరు. అది మనం గుర్తుంచుకుని ఆచరణలో పెట్టాలిగాని..."
"....."
"పోనీ నీ అంతట నువ్వు స్వంతంగా నిలబడి, - ఎదురయ్యే ఫలితాలను ఎదుర్కోలేననుకుంటే నాదొక సలహా. మరొక సంవత్సరం హౌస్ సర్జనుగా చేరు. ఇంకొక సంవత్సరం పెద్ద డాక్టర్ల సూపర్విజన్ లో పనిచెయ్యి. నీకప్పుడు పోయిన నమ్మకం కలగవచ్చు."
"నా బ్యాక్ గ్రౌండ్ తో నాకు సీటు రాదు."
"వాటి విషయాలు తరవాత. ముందు నిర్ణయంకానీ. నీకు ముందు కలగబోయే అవసరాలకు నా సహకారం ఎప్పుడూ ఉంటుంది."
"ఆలోచిస్తాను. మీ సలహాలకు చాలా థాంక్సు."
"అసంభవం" అన్న శ్రీనివాస్ "ఆలోచిస్తాను" అనేవరకు వచ్చాడు. అతని ఆలోచనలకు స్థిరత అంటూ లేకుండాపోయింది. బహుమార్గాలలో కనుపిస్తున్న భవిష్యత్తు ఏ మార్గంలో స్వీకరించాలో అర్ధం లేకుండా ఉంది. అతను తనలో లేదనుకున్న కోరిక ఉన్నదన్న నమ్మకం కలిగించటంలో కొంత వరకు సఫలీకృతులవుతున్నారేమో అనూరాధ, కృష్ణమూర్తిగారు.
"ఏమిటిది? .... ఖచ్చితంగా నిర్ణయించుకున్న మనస్సులో మళ్ళీ ఏమిటీ వెర్రి ఆలోచనలు? తను మారిపోతున్నాడా? ఉహూఁ... అలా ఎన్నటికి జరగదు. ఇక జీవితంలో ఒకరి ప్రభావం తనమీద పడకూడదని తీసుకున్న నిర్ణయం మాత్రం మారదు!....లేదు.....తను డాక్టరెలా అవగలడు? ఆ రోజు...ఆఖరి రోజు. ఆ పిల్లను ఓదార్చగలిగే స్థితిలో కూడా నిలబడలేకపోయిన తను తిరిగి ఆ వృత్తి ఎలా స్వీకరించగలడు? తనలో లేని ధైర్యాన్ని ఇతరులకు ఎలా చెప్పగలడు? ఈ విద్య తనకు సరిపడదని తెలిసికూడా తిరిగి ఎందుకు ఆలోచించవలసి వస్తూంది?"
'అనూరాధ తనంటే ఎంత అభిమానం? తన అభివృద్దికోసం, తనలో ఈ కోర్కె తిరిగి స్థిరమవ్వాలని ఎంత ఆశిస్తూంది! ఆమె ఏ విధంగా చెప్పబోయినా, తను అడ్డు తగులుతున్నాడు. ఆ రోజు సాయంత్రం "పోనీ, డాక్టరుగా మీకిష్టం లేని పనులు చెయ్యలేకపోతే, ఏ మెడికల్ కాలేజీనైన చేరి లెక్చరర్ గా పని చెయ్యండి" అని సలహా ఇచ్చింది. తనేమన్నాడు? "ఛ. అది నా కిష్టంలేదు, అనూరాధా. పిరికివాళ్ళు పాఠాలు నేర్పకూడదు. వాళ్ళు నేర్పగలిగేది పిరికితనమే గాని..." అన్నాడు. తను పిరికినాడా? జీవితంలో ఏది చూచి తను భయపడి పారిపోవాలి? అనూరాధ దృష్టిలో కూడా తను దుర్బలుడేనా? అది పోగొట్టాలనేనా ఆమె ప్రయత్నం? ఛ అలా అయి ఉండదు. ఆమె తనతో స్నేహం మొదలుపెట్టేసరికి ఈ విషయాలు చూచాయగాకూడా తెలియవు. అందుకే తన విషయాలలో కుతూహలం సూచిస్తూంది. ఆమె చేస్తున్నదంతా అభిమానంతో అంటే, తను భరించగలడుకాని, జాలితో అయితేమాత్రం తను సహించలేడు. ఒకరి జాలి, దయమాత్రం తన కనవసరం లేదు. ఒకరి కోర్కెలను తీర్చలేనంతమాత్రాన తన కోర్కెలనుమాత్రం చంపుకోలేడు.
'అనూరాధ అంటే తనమీద అభిమానంతో, తన జీవితంలో భాగం పంచుకునే ముఖ్య వ్యక్తిగా ఉత్సాహం చూపుతూ, ప్రోత్సాహమిస్తూందేమో! కాని కృష్ణమూర్తి గారికేం అవసరం? ఆయనకు తనంటే ఎందుకు ఇంత శ్రద్ధ, వాత్సల్యము? కొద్ది నెలలక్రితం ఆయనకు, తనకు ఎటువంటి పరిచయము లేదు. అటువంటిది ఈ రోజు తన ముఖ్యులలో - ఆప్తమిత్రులలో - ఒకడుగా భావించుకుంటున్నాడంటే ఆయనకు తనంటే ఎంత ఇష్టమయి ఉండాలి? తనను ప్రోత్సహించమని అనూరాధ కోరిందేమో! అయినా ఒక డాక్టరై ఉండి, అందులోని కష్టనిష్ఠూర్యాలు అన్ని తెలిసి తననీ పనికి ప్రోత్సహిస్తున్నారంటే - ఆయనకు తనలో నమ్మకం ఉండితీరాలి! తను నమ్మలేనిది ఆయన నమ్ముతున్నారు. అంటే ఆయనకు తను అర్ధంకాలేదా? లేక తనే తనను అర్ధంచేసుకోలేకపోతున్నాడా? ఒక అనుభవమున్న డాక్టరు ఎందరికో మార్గదర్శి. ఆయనే తన్ను ప్రోత్సహిస్తున్నారంటే, తనకీ కోరిక, ఆయన అన్నట్లు నిద్రాణమయిన శక్తి నిజంగానే ఉన్నాయేమో! తను ఊహించుకుంటున్నదంతా భ్రమేమో! ఒక ప్రఖ్యాత డాక్టరుకు తనమీద ఇంతటి అభిప్రాయం కలిగినప్పుడు తేలికగా తీసి పారెయ్యడమా? ఎంతమందినో చూచిన ఆయనకు తన బలహీనత ప్రత్యేకంగా కనిపించి ఉండకపోవచ్చు. తనలాంటివాళ్ళు ఇంకా చాలామంది ఉండిఉంటారేమో! ఆయనకు అందుకే తనమీద ఇంత నిండునమ్మకం కలిగింది. అనుభవమున్న ఒక డాక్టరు అభిప్రాయం కంటే తన భయాలు, నమ్మకాలు ఎక్కువా?'
శ్రీనివాస్ ఆలోచనలు పట్టాలు తప్పాయి. అనూరాధ ఉద్దేశ్యాలు కృష్ణమూర్తిగారి సలహాలు మెల్లిగా పచెయ్యడం మొదలుపెట్టాయి. అతని లోని మార్పు అతనే గ్రహించలేనంతగా అతని ఆలోచనలు ముందుకు సాగాయి. నిలకడ తప్పుతున్న అతని నిర్ణయానికి అసలు కారకులు అనూరాధో, కృష్ణ మూర్తిగారో తెలుసుకోకుండానే మారాడు. శ్రీనివాస్ మారాడు, ఊహించ లేనంతగా.
23
తలుపుదగ్గిర చప్పుడయ్యేసరికి వెళ్ళి తెరిచి చూచింది లలిత.
"నమస్తే" అని చిరునవ్వునవ్వాడు.
"నమస్తే, రండి లోపలకు." ఆహ్వానించింది లలిత కృష్ణమోహన్ ను.
"నమస్కారమండీ... ఎలా ఉంది మీ ఒంట్లో?"
లలిత తల్లిని అడిగాడు.
"ఏదో బాగానే ఉంది. మీ దయ"
"మధ్య నా దయ ఏమిటి?" నవ్వుతూ అన్నాడు.
"ఇదిగో టానిక్కు ప్రతిరోజూ తీసుకోండి" అని బల్లమీద పెట్టాడు. లలితవైపు తిరిగి "మీరేమిటి బాగా తగ్గినట్లు కనిపిస్తున్నారు? పరీక్షలకు ఎక్కువగా చదువుతున్నారులా ఉందే!" అన్నాడు.
"ఏమో బాబూ! ఏం చదువులో, ఏం రోజులో! మీ నాన్నగారికి కబురు చేయించాను ఏదైనా సంబంధం చూడమని. ఏ రోజుల్లో జరగవలసినవి ఆ రోజుల్లో జరగాలిగాని, ఈ కాలం పిల్లలకు ఏం చదువో, ఏం లోకమో! మనిషేమో నీరసించిపోతూంది. నాకేం తోచడంలేదు. మీ నాన్నగారికి లేనిపోని శ్రమ ఇస్తున్నాం."
లలిత తల్లి నిట్టూర్చింది.
"ఇందులో శ్రమ ఏముంది? అయినా మీ రివన్ని మనసులో ఉంచుకుంటే మీ ఆరోగ్యం ఎలా బావుపడుతుంది? మీకు .... లలితకు ఆ సంభాషణ అట్టే రుచించక అక్కడనుండి లోపలికి నడిచింది.
లలిత తెచ్చిన కాఫీ అందుకుంటూ "మీరో?" అన్నాడు.
"నేనిప్పుడే కాలేజీనుంచి రాగానే తీసుకున్నాను."
"శనివారం సాయంత్రం కాలేజీయా?"
"ఈమధ్య జరిగిన సమ్మెలమూలంగా స్కూళ్ళు మూసేశారు కదా! అవన్నీ పూర్తిచెయ్యడానికి ప్రయివేట్ క్లాసులు మితంలేకుండా పెడుతున్నారు."
"మీరూ బాగా టైర్డ్ అయినట్లున్నారు. నేనూ ఇప్పుడే హాస్పిటల్ నుండి వస్తున్నాను. అలా కాసేపు వెడదాం, వస్తారా?" అడిగాడు మెల్లిగా, కాఫీకప్ బల్లమీద ఉంచుతూ. కప్పు తీసుకుని లోపలికి వెళ్ళింది జవాబియ్యకుండా. అయిదు నిమిషాలలో తిరిగివస్తూ "పదండి" అంది.
"ఇదని మీరు చెప్పలేదేం? మా నాన్నగారికి పని కలిగించటం అన్నారే ఆ రోజు?"
"మీరు నన్ను చెప్పనిచ్చారా?.... ఇంతకీ కోపం తగ్గిందా?"
"కోపం కాదండీ."
"పోనీకాని క్షమాపణ స్వీకరించా రనుకుంటాను." మౌనంగా ఉంది లలిత.
"మీరు మరీ ఎక్కువగా చదువుతున్నారులా ఉంది. అయినా ఇంత తీవ్రంగా తీసుకుంటే ఎలా? టేకిట్ ఈజీ" అన్నాడు మాట మార్చేందుకు.
"తీవ్రంగా తీసుకోకపోతే ఎలా? ఇంత చదివినా పూర్తి అవుతుందో అదో అని భయం. ఈ ఒక్క సంవత్సరం గడిచిపోతే ఇంక పరీక్షల గోల ఉండదు."
"అదేమిటి? ఇంక చదవరా?"
"ఊఁహూఁ."
"అప్పుడే ఇంటరెస్టు తగ్గిపోయిందా?"
"ఒక్క ఇంటరెస్టు ఉంటే సరిపోదు కదండీ చదువు పూర్తి అవడానికి?"
"...." విచిత్రంగా చూచాడు.
"...."
"నేను మళ్ళీ మీ స్వంత విషయాలలో కల్పించుకుంటున్నాననిమాత్రం భావించవద్దు. ఒక్క డబ్బుమూలంగా మీ చదువు ఆగడం నా కిష్టంలేదు. అదే కారణం అయితే మీ రా విషయం గురించి ఆలోచించక్కరలేదు. మరోవిధంగా అనుకోకూడదు కూడా."
అతని మాటల్లో ఉద్దేశాన్ని గ్రహిస్తూ అంది: "థాంక్యూ కాని నాకూ ఇష్టంలేదు. రిజల్ట్సు రాగానే ఉద్యోగానికి ప్రయత్నిస్తాను. నేననుకున్నవన్ని సక్రమంగా నెరవేరితే నైట్ కాలేజీలో చదువుతాను."
"కాని అది మరీ శర్మ అవుతుంది మీకు. పగలు ఉద్యోగం, రాత్రి చదువు. అవసరమయితే అమ్మగారికి సేవ...ఇన్ని మీ ఒక్కరివల్ల అవుతాయంటారా? నన్నడిగితే ముందు చదువు పూర్తిచెయ్యడం మంచిదంటాను."
"దీనికి పూర్తి అనేముందండి! ఎమ్. ఎస్ సి. అయితే పి హెచ్. డి. చెయ్యాలనిపిస్తుంది. నా కింతకాలం మా అమ్మ మీ నాన్నగారికి కబురుచేసినట్లు తెలియదు. అయినా నాకు తెలిసినా పెద్ద చెయ్యగలిగేది ఎక్కువ ఏమీ ఉండదనుకోండి. మీ నాన్నగారిని ఆ విషయంలో ఏమీ శ్రమ పడవద్దని చెప్పండి. అందుకు నా సమ్మతిమాత్రం లేదు" అంది అధోవదనురాలై.
"ఏం, జీవితమంతా ఇలాగే ఉండిపోవాలనుకుంటున్నావా?" అన్నాడు చిరునవ్వుతో. అతని నవ్వులో ఆమెకు అనేక అర్ధాలు గోచరించాయి. మౌనంగా దృష్టి పక్కకు సారించింది.
"ఇలాంటి విషయాల్లో మన అనుమతి ఎల్లప్పుడూ పెద్దవాళ్ళు స్వీకరించరు. ఒక్కొక్కసారి వాళ్ళ అభిప్రాయాలకు ఒప్పుకోవాలి" అన్నాడు. ఆమెనుండి జవాబులేకపోవడంతో ఇంక ఆ విషయాలు మాట్లాడడం ఆమెకు ఎక్కువ ఇష్టంలేదని మౌనంగా ఊరుకున్నాడు.
పార్కుదగ్గిర కారాపుతూ, "కాస్సేపు లోపలికి వెడదామా?" అని అడిగాడు.
అతని ముఖంలోకి కళ్ళెత్తిచూచి, కారు దిగి ప్రక్కగా నడవసాగింది.
"శ్రీనివాస్ విషయం మీదాకా వచ్చే ఉండాలే!"
"ఆఁ! ఏం అలా అనుకున్నారు?"
