నళిని వెళ్ళిపోగానే రత్న రమేశుడివైపు తిరిగి:
"నళిని అదోమాదిరిగా ఉంది" అంది.
"అలాగా నేను గమనించలేదు."
"మీరు ఆమె నేమి నొప్పించలేదు కదూ?"
"ఛా నేనామెతో మాట్లాడితే కద" అని తనను తాను సమర్దించుకున్నాడు రమేశ్.
నళినికి అంతకన్నా మరో అవమానం ఏముంది?
"మీ రెందుకు మాట్లాడలేదు? మాట్లాడితే ముత్యాలు రాలుతాయనా? మీరు మాట్లాడించ లేదనే ఆ అమ్మాయి చిన్నబుచ్చుకుంది. పాపం! ఎందుకలా చేశారు మీరు?"
రమేశ్ అపరాధిలా తల వంచుకుని:
"ఏమని మాట్లాడించాలో నాకు తెలిలేదు" అన్నాడు.
"నా దగ్గర గంటలకొద్దీ మాట్లాడుతారు కదా. నళినితో మాట్లాడటానికేమీ తోచలేదూ?"
"మీరు నళిని కాదు; రత్న."
"ఎవరైతే నేం! మీ రామెను మాట్లాడించకుండా చాలా తప్పుపని చేశారు."
"ఏమని మాట్లాడించాలి?"
"నువ్వు చాలా అందంగా ఉన్నావు అని చెప్పాల్సింది."
"ఇది మరీ బావుంది. అందంగా ఉన్నవాళ్ళను అందంగా ఉన్నా వనటంలో విశేషం ఏముంది? అన్నంతిని, కంచం కడుగుతున్నవారిని 'భోంచేశారా?' అని అడిగినట్టు ఉంటుంది."
"పొండి. నేను మీతో మాట్లాడను" అంది రత్న కోపంగా.
తమిద్దరి మధ్య ఆశ ఉండకపోయినట్టయితే...అనుకున్నాడు రమేశ్.
తలుపుకు వేసిన తాళాన్ని చూసి రత్న కనుబొమలు ముడిపడ్డాయి.
"ఆశా! దేశాయిగా రింటికి వెళ్ళి తాళంచెవి తీసుకురా" అంది రత్న.
ఆశ వెళ్ళగానే రమేశ్:
"కోపం చేసుకోకండి. నళినిని ఏమని పలకరించాలో నాకు తెలియలేదు. ఈసారికి క్షమించండి" అన్నాడు.
పశ్చాత్తాపంతో నిండిన అతని మొహాన్ని చూసి రత్న కోపమంతా కరిగిపోయింది. కాని, దాన్ని కనపడనీయకుండా మౌనంగానే నిల్చుంది.
"సాయంత్రం మెట్రో వెడదామా?"
"ఉహుఁ. నేను రాను."
"నే నింకా ఆ థియేటర్ చూడలేదు."
"వెళ్ళి చూసి రండి."
"ఒక్కడినే వెళ్ళటాని కిష్టంలేదు."
"అయితే నళినిని పిలవండి."
రమేశ్ ఉత్సాహంతో "అలాగే దారిలో నళినిని కూడా తీసుకునే వెడదాం" అన్నాడు.
ఆశ తాళంచెవి తీసుకుని వచ్చింది. రత్న తాళం తీసి ఇంట్లోకి అడుగు పెట్టింది.
శేషగిరి చిన్న చీటీ రాసిపెట్టాడు టేబుల్ మీద.
"నాకోసం భోజనానికి కాచుకోకండి."
రత్న-మొహం వాడిపోయింది.
"ఏం జరిగింది?" అన్నాడు రమేశ్.
"ఏమీలేదు. ముందు మీరు కాళ్ళు కడుక్కోండి."
"డాక్టర్ని రానివ్వండి."
"కాచుకోవద్దని రాశారు."
భోజనాలయ్యేసరికి రత్న మనస్సు కాస్త కుదుట బడింది. రత్న ప్రసన్నంగా ఉండటం చూసి రమేశ్.
"సాయంత్రం మెట్రో వెడదాం" అన్నాడు.
"మీరే నళినితో చెప్పండి" అని రిసీవర్ రమేశుడి చేతి కిచ్చింది. ఇష్టంలేకపోయినా ఫోన్ చేశాడు రమేశ్.
"సాయంత్రం నాలుగింటికి వస్తాం. మెట్రోకి వెడదాం."
ఒక క్షణం ఊరుకుని "క్షమించండి. నేను రాలేను." అని ఫోన్ పెట్టేసింది నళిని.
రమేశ్ రెండుమార్లు హలో అని జవాబు రాక పోయేసరికి ఊరుకున్నాడు.
"ఏమంది?" కుతూహలంగా అడిగింది రత్న.
"రాదట."
"అయితే నేనూ రాను."
"నాకు మెట్రో చూపించరా?"
"మీకు నేను చూపించట మేమిటి? మీరే వెళ్ళి చూసిరండి."
రమేశ్ లో ఆమెతో బాగా దెబ్బలాడా లనిపించింది. కాని, ఆశ దగ్గర్లోనే ఉండటంతో ఊరుకోవాల్సివచ్చింది.
నాలుగ్గంటలవుతూంటే, రమేశ్ నిలవలేకపోయాడు.
ఆఖరికి స్థిరంగా, మౌనంగా కూర్చున్న రత్న దగ్గరకు వెళ్ళి:
"వెడదామా?" అన్నాడు.
"ఎక్కడికి?"
"మెట్రో."
"క్షమించండి. నేను రాలేను."
"రత్నా! ఎందుకు నన్నిలా ఏడిపిస్తున్నారు?"
"ఈరోజు నేను రాలేను. ....." అంటూండగానే ఫోన్ మ్రోగింది. శేషగిరి ఫోన్ చేశాడు.
"స్నేహితులతో సినిమాకు వెడుతున్నాను. రాత్రి రావటం ఆలస్యమవుతుంది. నాకోసం కాచుకూర్చోకండి."
రత్న రిసీవర్ క్రింద పెట్టి రమేశుడివైపు తిరిగి:
"వస్తాను" అంది.
ఆనందంతో రమేశుడి మొహం వికసించింది.
రత్న ఆశకు గుడ్డలు మార్చి తనూ అలంకారం చేసుకుంది. ఇంటికి తాళంవేసి తాళంచెవి ఆశచేతికిచ్చి:
"మంజూ తల్లికి ఇచ్చేసిరా" అంది.
"ఉన్నట్టుండి మనస్సు మార్చుకున్నారేం."
"కారణ మేమీలేదు. వెడదాం రండి."
"నళిని-వాళ్ళింటికి వెళ్ళి పిలుద్దామా?"
"వద్దు" అంది రత్న ముక్తసరిగా.
మెట్రోలాంటి భవ్యమైన థియేటరును అంత వరకూ చూసి ఎరుగడు రమేశ్. అలాంటి థియేటర్ లో కూర్చుని ఎంత చెత్త-పిక్చరయినా చూడవచ్చు అనిపించింది రమేశుడికి.
క్రింద పరచిన రత్నకంబళి, కుషన్ కుర్చీలు, అద్దాలు, హితమైన వాతావరణం, అతడిని వేరే లోకంలోకి తీసుకువెళ్ళాయి.
కుర్చీలో కూర్చుని రమేశ్ రత్నతో:
"బొంబాయిలో చూడదగినవి మూడున్నాయి" అన్నాడు.
"ఏవేవి?"
"సముద్రం, మెట్రో, మీరు."
రత్న-కళ్ళు చెమర్చాయి. రుద్ధకంఠంతో:
"రమేశ్! నేను మామూలు స్త్రీని. నన్నెందు కింత ఉన్నతస్థాయిలో కూర్చోపెడతారు? మీరిలా మాట్లాడితే నాకు బాధకలుగుతుంది" అంది.
రమేశ్ కాస్సేపు ఊరుకుని.
"రత్నా! నన్నెపుడు ఊరికి పంపిస్తారు?" అన్నాడు.
రత్న అదిరిపడింది. రమేశ్ తమ ఇంటికి అతిధిగా వచ్చినవాడు. కొద్దిరోజులుండి వెళ్ళిపోతాడు అనే విషయం అపుడే గుర్తుకొచ్చిందామెకు.
తరువాత..... తరువాత...... తను....... ఎలా?
"ఊరికి వెళ్ళే మాటతో నన్ను భయపెట్టకండి రమేశ్."
"అయితే ఇక్కడే ఉండిపొమ్మన్నారా?"
"ఊఁ మీరు వెళ్ళిపోతే నాకేం తోచదు."
"ఏం?"
"మీరు వెళ్ళిపోతే తరువాత ఇంత ప్రేమగా, స్నేహంగా నన్నెవరు చూస్తారు?"
రమేశ్ చీకట్లో చటుక్కున ఆమె చేతిని పట్టుకుని:
"రత్నా! ఇపుడు నన్నేం చేయమంటారో చెప్పండి" అన్నాడు. అలా అంటున్నట్టుగానే అతడి ధ్వని భారమైంది. ఉద్వేగంతో వేగంగా ఊపిరి వదులుతున్నాడు.
"అంటే?"
"నాకు ఏం చెయ్యటానికి తోచటంలేదు..మీరు ఎలా చెబితే అలా చేస్తాను. నేనిక్కడికి వచ్చిన ఉద్దేశమే వేరు. దుఃఖపు వలనుండి తప్పించుకుందామని ఇక్కడికి పారిపోయి వచ్చాను. కాని ఇక్కడ ఇంకో వలలో చిక్కుకున్నాను. రత్నా...... నేనేం చేయను?"
దారితప్పిన పసిపిల్లాడిలా, అసహాయుడై "ఏం" చేయను" అని తన్నడుగుతున్న రమేశుడిని తన హృదయానికి హత్తుకోవాలనిపించింది రత్నకు.
థియేటరులో ఉన్నది మసకవెల్తురే అయినా, చుట్టూ ఉన్న మనుష్యులను చూసి తన కోర్కెను లోలోపలే అణుచుకుంది రత్న.
"ఏం చేయను రత్నా?"
"నేనూ మీలాగే అసహయురాలిని రమేశ్. మీరీ ఊరికి అసలెందుకొచ్చారు? మీరు రాక మునుపు నేను నిశ్చింతగా ఉండేదాన్ని."
"కాని, సంతోషంగా ఉండేవారా?"
"అవన్నీ అడగరాని ప్రశ్నలు.....మీ రెందు కొచ్చారు?"
"తరువాత చెపుతాను నే నెందు కొచ్చానో....."ఇద్దరూ సినిమా చూడటంలో మునిగిపోయారు.
10

ఇంటికి వచ్చి భోజనాలవటమే ఆలస్యం; రత్న అడిగింది:
"బొంబాయికి ఎందుకొచ్చారు?"
ఆశా! "అమ్మ! పక్క వేయమ్మా." రత్న పక్కవేసి ఆశను నిద్రపుచ్చింది.
రమేశ్ అన్నాడు:
"ఇపుడు నా కనిపిస్తోంది; నే నిక్కడికి రాకుండా ఉండాల్సిందని. అక్కడే ఉంటే బాగుండి పోయేది. ఇక్కడికి రావటమే మొదటి తప్పు. మీతో ఆత్మీయత పెంచుకోవటం రెండవ తప్పు..రత్నా! నేను వెళ్ళిపోతాను. నన్ను పంపించేయండి. ఇహ ఇక్కడుంటే నాకు పిచ్చిపట్టక మానదు.."
"పిచ్చా?"
"ఊఁ; రత్న-పిచ్చి. నా మనసు నా అధీనంలో ఉండటంలేదు. నే నిక్కడే ఉంటే, ఏం జరుగుతుందో నేను చెప్పలేను రత్నా! నన్ను పంపించేయండి."
"ఎలా పంపను?"
"మెడపట్టి గెంటేయండి."
"అది నా చేతకాని పని."
"చేతనయ్యేలా ప్రయత్నించండి. రత్నా! నేనో ప్రశ్న అడుగుతాను దాచుకోకుండా జవాబు చెపుతారా?"
"అడగండి"
"నన్ను మీరెందుకింతగా పట్టించుకున్నారు?"
"ఇంతగా అంటే?"
"చాలా."
"కొన్ని విషయాలను వివరించి చెప్పటం కష్టం-మొదట్లో మిమ్మల్ని చూసినపుడు కుతూహలం కలిగింది. క్రమేణా కుతూహలం జాలిగా మారింది. జాలినుండి స్నేహం, ఆత్మీయత......ఇలాగే....కాని, రమేశ్! మీరు నా గురించి అదే పనిగా ఆలోచించకండి. నాకు భయమేస్తుంది....."
"ఎందుకూ?"
"మీరు సుఖంగా ఉండాలంటే, నన్ను మరచి పోవాలి. కాలమే అన్నిటినీ మరిపించగలదు."
"అయితే నన్ను పంపించేయండి."
"కాని, ఎలా పంపను? మిమ్మల్ని పంపించటానికే నాకు మనసు-రావటంలేదు. అలా అని మిమ్మల్ని ఇక్కడే కట్టివేసుకోలేను. మీ స్నేహం నాకు కావాలి. కాని, దానినుండి మీకే హాని కలగరాదు."
"మరి మీకో?"
"నా విషయం వదిలేయండి. ఎలాంటి పరిస్థితినైనా నేను నవ్వుతో ఎదిరించగలను. నాకు మిమ్మల్ని గురించే బెంగ."
"ప్రేమ గుడ్డిది."
"కాని, ప్రేమకు విచక్షణా జ్ఞానం ఉండాలి. నేను పగిలిన అద్దాన్ని. అందులో మొహం చూసుకోవాలని, దాన్ని అతికించాలనే సాహసం మీది. ఇదేం లాభం లేదు రమేశ్! ఈ విధమైన ఆత్మవంచన వల్ల ఇద్దరికీ సుఖంలేదు.
రమేశ్, ఆమె మాటలు వింటూ కూర్చున్నాడు. వాళ్ళిద్దరి మాటలకూ మూగసాక్షిగా గడియారం టిక్కుటిక్కు మంటోంది.
