7
పల్లె సమీపానికి రాగానే, చుట్టూవున్న తమ వరిచేలను, మీరకు చూపించసాగాడు శాము. పొలాల్లో పని చేస్తున్న రైతులు, పని మానేసి కొత్త అమ్మగారి దర్శనార్ధం బండి వెనుకనే నడవసాగారు. మీర సిగ్గుతో కుంచించుకుపోయింది.
పల్లె చేరేసరికి మధ్యాహ్నం పదకొండు గంటలయింది.
ఆ పల్లెకంతా శాము ఇల్లే పెద్దది. ఆ పెద్ద భవంతికి కాంపౌండుకు మారుగా ముళ్ళ తీగెను ఇంటి చుట్టూ అల్లారు. పారిజాతాలు, సన్నజాజులు, మల్లె, చేమంతి చెట్ల పుష్పాలు తమ యజమానురాలికి సౌరభపు కానుకను అర్పిస్తూ, స్వాగత మిచ్చాయి.
ఇంటిముందు ఆడవారు పిల్లలు పెద్ద గుంపుగా చేరారు. బండి రాగానే శాము భార్యను చూడాలన్న కుతూహలంతో అందరూ ముందుకొచ్చారు.
బండిలోనుండే అంతమందిని చూసి, వూ-
"అబ్బో ఎంతమంది! బయటికి ఎలా రాను! సిగ్గేస్తూంది నాకు" అంది.
'సిగ్గెందుకూ? వాళ్ళంతా వచ్చింది నిన్ను చూట్టానికే మరి."
"నేనేమి జూలో జంతువునా అలా చూడడానికి?"
"ఇప్పటికంతే అనుకోవాలి మరి."
శాము క్రిందికి ఉరికాడు. పండు ముత్తయిదువ ఒకామె,
"కులాసాగా శామన్నా?" అనడిగింది.
"ఇదిగో ఇలా ఉన్నానవ్వా"
"నీ భార్యను చూపించు నాయనా, అందుకే కాచుకున్నాం."
మీర తను వేసుకున్న మఖమల్ స్లిప్పర్సు తీసి, కింద పడవేసింది. కొంగు నడుముకు బిగించి దేముడిమీద భారం వేసి, క్రిందికి దూకింది. మీర దిగగానే అందరూ ఆమెను చుట్టుముట్టారు.
"అత్తింటి నగలు ఏవి?"
"పుట్టింటివారు ఏం పెట్టారు?"
"కట్టుకున్న చీర ధర ఎంత?" అని ప్రశ్నల వర్షం కురిపించారు అమ్మలక్కలు.
అవధానిగా రమ్మాయి, వెంకూ, అర్చకులమ్మాయి శారద మీరకు హారతిచ్చారు. ఇంకొకామె కొబ్బరి కాయ దిష్టి తీసి పగల గొట్టారు.
అవధానిగారి భార్య సాకమ్మగారు,
"ఎంతయినా బస్తీపిల్ల పీలగానే ఉంది" అన్నారు.
"అయితే మాత్రమేం సాతక్కా, ఆ రంగు చూడు. మొహంలో కళ చూడు. బంగారు బొమ్మలా ఉంది."
"సర్లే పనీ పాటా లేక ఇంట్లో అలాగే ఉంటుంది మరి. మనూళ్ళో చెరువునుండి నీళ్ళు మోయటం పొలాలకు తిరగటం చెయ్యనీ! ప్పుడు అసలు రంగు బయటపడుతుంది."
"చాల్లే ఆమెందుకు నీళ్ళు మోస్తుంది? రాజాలాంటి భర్త శామన్న. నీళ్ళు మోయనిస్తాడా? రాణీలా చూసుకుంటాడు."
మీర నెమ్మదిగా అందరిని తప్పించుకొని ఇంట్లోకి అడుగు పెట్టింది. అంత పెద్ద భవంతిని ఆశ్చర్యంతో చూడసాగింది. వెళ్ళగానే పెద్ద వరండా. రెండు వేపులా రెండు గదులు, సుమారు రెండు వందలమంది భోజనాలు చేయదగ్గ విశాలమయిన హాలు. దానికి రెండువేపులా వరసగా గదులు. మండువా వెనుక లోగిలిలో ఎనిమిది స్తంభాలు అటువేపున నుయ్యి. గుడ్డలుతికేరాయి. లోగిలి దాటి వెడితే విశాలమైన భోజనాల గది, దేవుని గది, వంట గదులు ఇంటి వెనుక భాగంలో పశువులపాక. అందులో కామధేనువుల్లాటి ఆవులు, దూడలు, గేదెలు ఒక వేపున వంద బస్తాలు పట్టే నాలుగు పాతరలు.......
మీర మైసూరులో నాజూగ్గా వున్న ఇళ్ళనే చూసిందిగాని ఇలాటి పెద్ద ఇల్లని చూసి ఎరుగదు.
సందడి తగ్గే దాకా మీర వంటగదిలోకూర్చుంది. శాము హాల్లో కూర్చుని అందరి ప్రశ్నలకూ సమాధానం చెపుతూ, అవధానిగారి చిన్న కుర్రాడిని ముద్దులాడుతున్నాడు. అందరూ ఇళ్ళకు వెళ్ళి పోయాక వెంకమ్మగారు,
"చేతులు కాళ్ళూ కడుగుకొని దేవునికి నేతిదీపం వెలిగించి దండం పెట్టమ్మా" అన్నారు.
మీర చేతులు, కాళ్ళు కడుక్కొని వచ్చేసరికి వెంకమ్మగారు వెండి ప్రమిదల్లో నెయ్యి వత్హువేసి సిద్ధంగా ఉంచారు. దేవుని గది అంద చందాలు చూసి, ఆశ్చర్యపోయింది మీర. ఎంత కలత చెందిన మనసునయినా, శాంతపరచే ప్రశాంతత ఉందక్కడ రక రకాల పూల వాసన, అగరవత్తులూ, కర్పూరాల పరిమళ మిళితమయిన సౌరభం మనసుకు ఆహ్లాదాన్నిచ్చాయి. మీర దీపాలు వెలిగించి కొంగును మెడ చుట్టూ వేసుకొని నమస్కరించింది.
"ఇక భోజనానికి లేవండి. శామన్ననూ పిలు తల్లీ."
మీర దేవుని గదినుండి బయటికివచ్చి చూసింది. శాము ఎక్కడా కనుపించలా.
"ఆయ నెక్కడా కనిపించటం లేదే?"
"ఇంకెక్కడికి పోతాడు? దూడలతో కబురు చెపుతూంటాడు, పాకలో"
మీర వేనుకవేపునుండి పశువుల పాకలో వెళ్ళింది. శాము మనుషులతో మాట్లాడినట్టుగానే, ముద్దొచ్చే తెల్లటి దూడతో మాట్లాడుతున్నాడు. మీర దూరంగానే నుంచొని, ఆ సుందర దృశ్యాన్ని చూస్తోంది.
దూడ, తన నల్లటి మెరుస్తున్న కళ్ళతో చూస్తూ కూర్చున్న శాము జబ్బమీద మెడ సాచింది కొమ్ములులేని దాని తల నిమురుతూ :
"ఏం కావాలమ్మా, ఏం కావాలీ?" అంటున్నాడు శాము. దూడ చెప్పేదేదో అతనికి అర్ధమవుతూన్నట్టే ఉంది. తెల్లటి ముద్దొచ్చే డూడను చూస్తూ ముందుకు వచ్చింది, మీర. కాళ్ళకింద చల్లగా, మెత్తగా తగిలినట్టయి, బెదిరి క్రిందికి చూసింది. క్రింద పడిన పేడమీద ఆమెఅడుగుల గుర్తు స్పష్టంగా కనుపించాయి. చుట్టూ చూసింది.
అక్కడక్కడ పడిన పేడరాశిని ఈగలు ముసురుతున్నాయి. పేడ, గడ్డి, వీటితో మురికి వాసన వేస్తోంది. ఆ వాసన మురికి, ఈగలు వీటినిచూసి అసహ్యించుకుంటూ దూరంగానేనుంచుంది. కాని శాము మాత్రం వీటన్నిటిని గమనించకుండానే, ఆ మురికి మధ్యలోనే కూర్చొని, ఆ దూడను తన బిడ్డను ముద్దులాడినట్టు ముద్దులాడుతున్నాడు. అతని రెండు వేపులా పేడ రాశి పడి ఉంది. వాటికి ముసురుకున్న ఈగలు అప్ప్డుడప్పుడూ అతనిమీద కూడా వాలుతున్నాయి. ఆ మురికివల్ల అందంగా ఉన్న దూడ కూడా అసహ్యంగా కనిపించింది మీరకు.
దూరంగా నుంచుని, "భోజనానికి" రండి అంది.
శాము తలెత్తి, సంతోషంతో, "ఇలా రా మీరా ఎంత బావుందో చూద్దువుగాని రా" అన్నాడు.
"నాకు అసహ్యం వేస్తోంది. లోపలికి రాలేను. మీరేరండి."
శాము ఆశ్చర్యపోయాడు. ఎంత రాతి గుండె. పాల నురుగులాటి చర్మంగల చక్కటి దూడను చూస్తే ఇంత అసహ్యమా?
"లోపలికి ఎంచేత రాలేవు?"
మీర చుట్టూ చూపిస్తూ, "ఎంచేతనో చూడండి. పశువుల పాక ఇంటినుండి దూరంగా ఉంటే ఇంటికి క్షేమం."
శాము ఉక్కులాటి తన జబ్బులను చూపిస్తూ "ఇప్పుడయినా, పశువుల పాకనుండి అపాయం లేదని గ్రహించు" అన్నాడు.
