"అదే, పిన్నీ! అక్షరాల అంతే! మామకు తగ్గ కోడలు." కసిగా అన్నాను.
"ఏదో దారి చూడు, బాబూ! ఉద్యోగం త్వరగా దొరికినా బాగుండును. అంతవరకూ ఆమె ఇష్ట ప్రకారమే నాతొ చనువుగా ఉండటం తగ్గించు."
"పిన్నీ...."
"అంతే చెయ్యాలి మరి. తప్పదు. నేనేమీ అనుకోను. నీ మనసు నాకు తెలుసు. వాళ్ళే పిచ్చి వాళ్ళు. అసలు నీ మీద అధికారం చేసే కోడలు కావాలనే మీ నాన్నగారు ఆమె నెన్నుకొని నీకింత త్వరగా పెళ్ళి చేశారు."
"ఈ విషయం ముందే నాకెందుకు చెప్పలేదు, పిన్నీ?"
"ఆమె నవ్వి, "చెపితే ఏం చేసేవాడివి?" అన్నది.
"మళ్ళీ వెళ్ళి పోయేవాడిని. అక్కడి నుంచి ఉద్యోగం దొరికిందని బొంకి స్నేహితుల దగ్గర అప్పులు చేస్తూ నైనా గడిపేవాడిని."'
"మరైతే నీకు పెళ్ళి ఇష్టం లేదుగా -- ఆ పని ఎందుకు చెయ్యలేదు ? కేవలం నెపం నా మీద వేస్తున్నావంతే అయినా, గిరీ , ఆలోచనలో సులభ సాధ్యాలనిపించిన ఎన్నో విషయాలు ఆచరణ దగ్గరకు వచ్చేసరికి చాలా కష్ట మైపోతాయి. ఉదాహరణకు -- నా పట్ల నీకు సానుభూతి ఉంది. నాకోసం ఏమైనా చెయ్యాలని కనీసం రోజు కొకసారైనా అనుకుంటావు. కాని, ఏం చెయ్యగలుగుతున్నావు?"
"నిజమే, పిన్నీ!"
"అదే మనకు మిగిలింది. నీవు 'పిన్నీ' అని మనసుతో పిలుస్తున్నావు. నేను 'గిరీ' అంటూ ఆప్యాయత ఒలికిస్తున్నాను." ఆమె కళ్ళలో నీరు తిరిగింది. నేనూ బయట పడిపోయాను.
"ఛ! ఊరుకో! ఆమె వస్తుంది. వెళుతున్నాను--" వెళ్ళిపోయింది.
నీతీ, నిజాయితీలకు కూడా ఎంత భయం! నేను నిట్టుర్చాను.
ఆ మధ్యాహ్నం నాన్న నన్ను పిలిచారు. "గిరీ! ఏవో లంచాలు పెడితే ఉద్యోగం దొరుకుతుందని విన్నాను. ఆ ప్రయత్నాలు చేయరాదూ? ఆహా! నీవు ఉద్యోగం చేసి తీరాలని కాదు ఉన్న ఒక్క కొడుకూ కళ్ళ ఎదురుగా ఉండాలనుంది. నాకు, కానీ బి.ఏ క్లాసులో పాసై ఇంటి దగ్గరే గోళ్ళు గిల్లుకుంటూ కూర్చున్నావంటే నాకేలానో ఉంది" అన్నారు. "నీవు ఉద్యోగం చెయ్యకపోతే ఇల్లు గడవదా" అన్న వ్యక్తీ అయన.
"ప్రయత్నిస్తాను, నాన్నా. కానీ, మీఅరోగ్యం--"
"ఏం ఫరవాలేదు. అంత ముంచుకు వస్తే నీవు ఎదురుగా ఉన్నా చేసేదేమీ లేదు."
"అలా అనకండి, నాన్నా!"
"మరి మంచి రోజు చూసి సిద్దమవు! కోడలు ఇక్కడుంటుందో, పుట్టింటికి వెళుతుందో కనుక్కో!"
"అలాగే, నాన్నా" అంటూ నా గదిలోకి వచ్చేశాను. హాలుకు మరో వైపుఉన్న గదిని అందులో సామాను ఖాళీ చేసి పెళ్ళైన దగ్గరి నుంచీ నేను వాడు కుంటున్నాను.
విషయం విన్న కుసుమ -- "నేనూ వస్తాను మీతో" అన్నది.
"అదెలా?"
"ఏం? మా నాన్న ఎనిమిది వేల రూపాయల కట్నం ఇచ్చాడు. ఒక రెండు వేల రూపాయ లడగండి మీ నాన్నగారిని. సంవత్సరం దాకా హాయిగా గడుస్తుంది ఎక్కడున్నా. ఈలోపల మీకు ఉద్యోగం రాదా ఏం?"
నేను మాట్లాడలేదు.
"మీరు చదివింది బి.ఏ రెండు వందలకు కాస్త అటూ ఇటూగా జీతం వచ్చే ఉద్యోగమే తప్ప వేల రూపాయల ఉద్యోగం మీకోసం కాచుకుని లేదు. ఆరెండు వందలూ నెలనెలా నేను తెచ్చిన కట్నం లో నుంచి నేనిస్తాను. సరా?"
సాచిపెట్టి చంపలు వాయగోట్టాలనిపించింది. ఎంత అహంకారం!
"అలా వీల్లేదు." గట్టిగా అనేశాను.
"ఏం? ఎందుకు వీల్లేదు? మీ నాన్నగారి నడగటానికి మీకు భయమైతే నేనే అడుగుతాను. వేల రూపాయలు మీకు కట్న మిచ్చి పెళ్ళాడింది పుట్టింట్లో మగ్గటానికి కాదు."
"కుసుమా! నీ ఒక్కొక్క మాటతో మనమధ్య యోజనాల దూరం పెరిగిపోతోంది. జీవితంలో ఎన్నైనా సాధించవచ్చునేమో కాని, ఆ దూరాన్ని దగ్గరగా లాగలెం. ఆ విషయం గ్రహించి మాట్లాడు."
"బెదిరిస్తున్నారా? అయినా ఇప్పుడు నేనేమన్నానని? అంత అభిమానదనులు ఆ ఉద్యోగమేదో దొరికాకనే పెళ్ళి చేసుకోలేక పోయారా?"
ఇంక నిగ్రహం నా వల్ల కాలేదు. ఆమె చెంప చెళ్ళు మంది.
"ఇప్పుడర్ధమైంది అసలు సంగతి! నేను పుట్టింటికి వెళ్ళాలి. మీరు ఉద్యోగాన్వేషణకి వెళ్ళి నట్టే వెళ్ళి తిరిగి వస్తారు. పాత నాటకం యధా ప్రకారం సాగిపోతుంది. అసలు మీరు పెళ్ళెందుకు చేసుకున్నారు?" కుసుమ పెద్దగా అరుస్తూ అన్నది.
"నోర్మూయ్!" నేనూ అరిచాను.
"ఈ వేళ తిట్టో, కొట్టో నా నోరు మూయగలరు. రేపు లోకం నోరు మూయగలరేమో చూస్తాను." అంటూ ఏడవసాగింది కుసుమ.
మా కేకలు, అరుపులూ ఇల్లంతా వినిపించి ఉంటాయనడంలో సందేహం లేదు.
"గిరీ! మీ నాన్నగారు పిలుస్తున్నారు.' పిన్ని గుమ్మం బయటి నుంచే చెప్పి వెళ్ళింది. కుసుమ మంచం మీద బోర్లా పడుకుని ఏడుస్తుంది.
వెళ్ళాను.
"ఏమంటుంది కోడలు? తనూ వస్తానంటుందా?"
నాకు ఒళ్ళు మండిపోయింది. కళ్ళు మూసుకుని పాలు తాగే పిల్లికీ, ఆయనకూ ఏమీ తేడా లేదనిపించింది.
"మీరే అడగండి!"
"అరుంధతీ!' అంటూ పిలిచి, ఆమె రాగానే -- "కోడలిని పిలువు!" అన్నారు.
కొన్ని క్షణాలలో వచ్చి గుమ్మం దగ్గరే ఆగింది కుసుమ.
"అమ్మాయ్! వాడితో పాటు నీవూ వెళతావా? అంతేనా" అనడిగారు నాన్న.
ఒక క్షణం కుసుమ మాట్లాడలేదు. ఆ తరవాత "మీరంతా కలిసి నన్ను చంపెయ్యండి! పీడా వదులు తుంది." అనేసి గిరుక్కున తన గదిలోకి వెళ్ళిపోయింది.
ఒక నిమిషం నిశ్శబ్దం తరవాత నాన్న అన్నారు: "కాస్త మీరిద్దరూ దాని మనసు కనుకూలంగా నడుచుకుని ఉంటె బాగుండేది! పాపం, ఎంత క్షోభ పడి అంతగా రెచ్చిపోయిందో!"
"నాన్నా!" అంతకుమించిన నా నోట మాట రాలేదు. మనసు మాత్రం వెయ్యి గొంతులతో అరిచింది. "నాన్నా! ఈ అగ్నిని కావాలని సృష్టించింది నువ్వు! పైకి బాధపడ్డట్టు నాటకమాడుతున్నా, నిజానికి నీకిది ఎంతో ఆనందంగా ఉంది. దాదాపు మంచంలో పడబోతున్న వయసులో పెళ్ళాడిన నువ్వు పెళ్ళాన్ని సుఖ పెట్టలేక, కన్నకొడుకు మనసు గ్రహించలేక ఈ నరకాన్ని సృష్టించి రక్తం తాగే పిశాచి లా తృప్తి పడుతున్నావు." కాని ఆ వెయ్యి గొంతుల్లో ఒకటి కూడా నాన్నకు వినిపించేలా బయటపడలేక పోయింది. కాని, పిన్ని ఊరుకోలేదు.
"మేమేం చేశామండీ!" అన్నది నెమ్మదిగా. "ఇలా చేశామని చెపితే ఇక నుంచీ అలా జరక్కుండా దిద్దుకుంటాము."
నేను కృతజ్ఞతగా పిన్ని వైపు చూశాను.
"ఏదీ లేకుండా అదంత గొడవెందుకు చేస్తుంది?"
"మీ కోడలు కనక, అనేసి బయటికి వద్దామను కుంటున్నాను. కాని పిన్నిని ఆ స్థితిలో ఒంటరిగా వదలటం కన్నా ఘోరం లేదనిపించింది.
"అడగలేకపోయారా?" అన్నది పిన్ని.
"వెళ్ళిపోయిందిగా!"
"ఇంట్లోనే ఉంది. మీరు వెళ్ళి మాట్లాడవచ్చు. కోడలే గాని, పరాయిది కాదుగా? మీరిద్దరూ కొన్ని నిర్ణయాలు చేస్తే వాటికి కట్టుబడి ఉంటాము మేము. ఇప్పుడు మీరు వెనకాడితే అనక పంచాయితీ తయారవుతుంది."
"భార్యాభర్తల మధ్య కల్పించుకోను నేను. ఎన్ననుకున్నా చివరకు వాళ్ళు ఒకటవుతారు."
ఈ విసురు నా మీద అయినా నేనేమీ మాట్లాడలేదు.
"మరైతే విషయం తేలటం ఎలా?' అంది పిన్ని.
"అరుంధతీ! ఈ విషయాన్నింతటితో పోనీ ఇక. గోరంతలు కొండంతలు చేయకు. ఎవరైనా వింటే బాగుండదు."
"అలా చేస్తున్నదేవరో- వారు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. దేవుడు నోరిచ్చింది వాక్కు కోసమని గాని, ఏదో ఒక గాలి వదలటానికి కాదు."
"అరుంధతీ!"
"అరవకండి! ఇప్పుడు ఊరుకుంటున్నాను. మరొక సారి ఈలాంటి పరీస్థితి వచ్చిందంటే ఊరుకోను. స్వార్ధపరుల స్వార్ధానికి మరొక దారి లేక ఆహుతి అయ్యాను. ఇందు కేవరినీ నిందించక నోరు మూసుకుని ఊరుకోవడమే నేను మీకు చేస్తున్న మహోపకారం. అది చాలక నన్నింకా రెచ్చగొడతా రెందుకు?"
నాన్న ఏదో అనబోయి మాట పెగలక రోప్పసాగారు. దగ్గు, ఆయాసం, ఊపిరి కూడా సరిగా అందక ఆరాట పడసాగారు. క్షణాల్లో ఇంత ముంచుకు వచ్చింది. నేను డాక్టర్ కోసం పరుగెత్తాను.
28
తిరిగి వచ్చ్గేసరికి పిన్ని నాన్నకు వేడినీటి కాపటం పెడుతుంది. పరీక్షించిన డాక్టరు ఇంజక్షన్ ఇస్తానంటే నేను వంటింట్లోకి వెళ్ళాను కుసుమ కుంపటి కింద విసురుతుంది. ఒక్కమారు నన్ను చూసి ఆమె తన పనిలో పడింది.
"ఏమన్నారు డాక్టరు?"
"ఇంకా ఏమీ చెప్పలేదు" అంటూ గ్లాసు లో వేడినీరు తీసుకెళ్ళాను.
డాక్టర్ బ్లడ్ ఫ్రెషర్ చూశారు. "ఈయనకు బ్లడ్ ఫ్రెషర్ ఉంది. ఉద్రేకం , ఆవేశం రాకుండా చూసుకోవాలి. బహుశా షుగర్ కూడా ఉందేమో? యూరిన్ టెస్ట్ చేశాక చెబుతా నా విషయం . రేపు అయన తీసుకోవలసిన ఆహారమూ, మిగిలిన జాగ్రత్త లూ చెబుతాను.' అన్నారు డాక్టరు గారు.
నాన్న దెబ్బలు తిన్న పక్షిలా డాక్టరు గారి వేపు చూస్తున్నారు.
* * * *
మరునాడు డాక్టరు గారు షుగర్ కూడా ఉందని తేల్చారు. "పెద్ద వయసుకు సహజంగా ఉండే వ్యాధులే అవి. నరాల బలహీనతా, గుండె జబ్బులూ ఈనాడు సామాన్యమై పోయాయి. మీరేం కంగారు పడకండి!"
"లేదండీ!" అన్నాను నవ్వినట్లు కనిపించడానికి ప్రయత్నిస్తూ.
"మీ మేలు కోరి ఒక విషయం చెపితే ఏమీ అనుకోరు గద?"
"ఏమీ అనుకోను చెప్పండి!"
"శక్తి వంచన లేకుండా డాక్టర్లు రోగిని కాపాడాలనే ప్రయత్నిస్తారు. మీరు డాక్టర్ చెప్పిన వైద్యం చేయిస్తారు. మందులు కొంటారు. కాని, వయసు పెరిగిన కొద్ది ఆయుర్దాయం తగ్గుతుందనేది అందరూ ఎరిగిన విషయం. కనక వీలునామాలు, ఆస్తి పాస్తులకు సంబంధించిన పేరు మార్పులు అయన వల్ల కావలిసిన వేవో అవన్నీ చేయించుకోవటం మంచిది మీరు."
"డాక్టర్!"
"అయమ్ సారీ, మిస్టర్ గిరిధారీ! అయన జీవించినన్నాళ్ళూ చిన్న చిన్న బాధలు లేకుండా చేయటం తప్ప అయన్ను మరో కొత్త మనిషిని చేయలేను నేను."
థాంక్యూ, డాక్టర్!" నీరసంగా అని వెనక్కు తిరిగాను.
* * * *
నాన్న వారి అన్నం మానేసి గోధుమ ఆహారం తీసు కొంటున్నారు. డాక్టర్ సలహా ప్రకారం అతి నెమ్మదిగా తన పనులు తాను చేసుకుంటున్నారు. వీలైనంత విశ్రాంతి గా ఉంటున్నారు. ఆహారంలో ఉప్పూ, కారం బాగా తగ్గించి వేశారు.
అయన పిన్నిని సాధించటం మానలేదు.
"మొత్తానికి నాపై పగ తీర్చుకున్నావు, అరుంధతీ! అనేవారు.
"పగ ఏమిటండి!"
"నేనసలు పొరపాటు చేశాను! నిన్ను పెళ్ళి చేసుకోకుండా ఉండవలసింది."
'అలాంటి మాట లంటే నేను తృప్తి పడను. సంతోషం కలుగదు."
"నీ సంతోషమూ, తృప్తీ కోసం అనటం లేదు. నేను పోయాక నీవేం చెయ్యదలుచుకున్నావు?"
ఆమె ఆయన వంక ఒకసారి చూసి ఊరుకోవటం తప్ప ఏ సమాధానమూ చెప్పేది కాదు. లేదా అయన ఖాళీ చేసిన జావా గ్లాసో, ఎంగిలి కంచమో తీసుకుని బయట పడేది.
నాన్న అనారోగ్యం మూలంగా నా ఉద్యోగ ప్రయత్నం వెనకడుగు వేసింది. కుసుమ కూడా నన్ను సాధించటం తగ్గించింది. కాని పిన్ని పై ఆమె చూసే చూపులోనే ఒక కక్ష, పడని తనం కనిపించేది. పిన్నీ, నేనూ ఎదురుపడే సమయాలను జాగ్రత్తగా కాపలా కాసేది.
వారానికి ఒకసారో, రెండు సార్లో పల్లెలో వ్యవసాయం చూసి వస్తుండేవాడిని. రావలసిన పైకం తెచ్చి నాన్న కిచ్చేవాడిని. డాక్టరు నాతొ అన్న ప్రత్యెక విషయాన్ని మాత్రం నాన్నతో గాని, పిన్నితో గాని అనలేక పోయాను. అనకపోతే పిన్ని "నిరాధార" అవుతుందేమోనని భయంగా ఉండేది. కానీ, నేను బ్రతికి ఉండగా ఆమె 'అనాధ' ఎలా అవుంతుందన్న 'హామీ' నాలో నాకే ఉండేది.
ఆరోజు -- నాన్న పిన్ని మీద అరుస్తున్నారు. గుమ్మంలో కెళ్ళాను. అయన తాగే జావలో ఉప్పు వేశారుట.
"ఉప్పు-- ఉప్పెందుకు వేశావు పిన్నీ? డాక్టరు వద్దన్నారుగా?"
"అయ్యో రామా! నువ్వూ నన్నే అంటున్నావా, గిరీ! నేను వెయ్యలేదయ్యా! ఎలా జరిగిందో అంతు బట్టకుండా ఉంది."
"నేను బ్రతకాలని లేదే నీకు! నేను త్వరగా చస్తే పండుగ చేసుకుంటావు."
నాన్న పెద్దగా అరిచారు. ఆయనకు ఆయాసం మొదలైంది.
"ఆవేశపడకండి, నాన్నా!"
"ఒరేయ్! నువ్వు దాన్ని వెనకేసుకోస్తావురా" ఆ సంగతి నాకు తెలుసు!"
"గిరీ! నువ్వు అవతలికి వెళ్ళు, నాయనా" అంటూ పిన్ని నన్ను బయటికి నెట్టి వేసింది. "ఊరుకోండి! ఈసారికి క్షమించండి! మళ్ళీ ఇలా జరిగితే -- మీఇష్టం! ఏమైనా చేయండి!" అంది కన్నీళ్ళతో.
ఇంకొకనాడు -- నేను మధ్యాహ్నం నిద్రలేచి ముఖం కడుక్కోవాడానికీ సందుకు వెళుతున్నాను. పిన్ని నాన్న కోసం జావా కాచి చల్లార్చుతుంది. నేను తిరిగి వచ్చేటప్పుడు చూస్తె అంతా బయట పోరబోస్తుంది.
