"నీవల్ల కాదులే గానీ... నేను ట్రయ్ చేసేదా?" అనడిగింది.
"అక్కర్లేదు....బహుశా అతని స్కూటర్ బ్రేకులు పనిచేసి వుండవు" అన్నాడు. పైగా "నువ్వు మూస్తావా నోరు" అన్నాడు చిరుకోపంగా.
నోటికి చేతిని అడ్డు పెట్టుకుంది.
ఇంతలో మరో స్కూటర్ వచ్చింది. స్కూటర్ కు అడ్డంగా నిలబడ్డాడు స్కూటర్ ఆపమన్నట్టు అభినయ్.
స్కూటరిస్ట్ స్కూటర్ ఆపాడు.
"ఇఫ్ యూ డోంట్ మైండ్. కాసేపు మీ స్కూటర్ అరువిస్తారా? ఓ పావుగంటలో తిరిగొచ్చేస్తాను" చెప్పాడు అభినయ్.
ఆ స్కూటరిస్ట్ పిచ్చిచూపులు చూసి "స్కూటర్ అరువివ్వడమేమిటో ఆర్యూ మ్యాడ్" అడిగాడు.
అభినయ్ కు ఎక్కడో మండింది. అయినా కోపాన్ని తమాయించుకుంటూ.
"కాసేపు వర్షంలో అలా డ్రైవ్ చేయాలని కోరిక పుట్టింది" చెప్పాడు సాధ్యమైనంత కన్విన్సింగ్ గా అభినయ్.
"బిడ్డేం పుట్టలేదా? మీ కళ్ళకు నేనెలా కనిపిస్తున్నానేంటి? స్కూటర్ల దొంగవా?" అనుమానంగా అడిగాడతను.
ఆమాట దూరం నుంచి విన్న విరజకు ఒళ్ళు మండింది. కోపంగా పక్కనే ఉన్న చిన్న గులకరాయి తీసుకొని సరిచూసి ఆ స్కూటరిస్ట్ వైపు విసిరింది.
"చచ్చాన్రోయ్....స్కూటర్ దొంగల ముఠాలా వుంది" అనుకుంటూ స్కూటర్ స్టార్ట్ చేసి వేగంగా వెళ్ళి పోయేడు. వెనక్కి తిరిగి చూడకుండా!
విరజ పకపకా నవ్వింది.
"వాడినలా ఎందుకొట్టావ్? వాడు నన్ను మిస్సండర్ స్టాండ్ చేసుకున్నాడు" కోపంగా అన్నాడు అభినయ్.
"నీవల్ల కాదు అభీ! నేను ట్రయ్ చేస్తాను చూడు...." అంటూ రోడ్డుకి ఓ పక్కగా నిలబడింది.
వితిన్ సెకన్స్ లో రియాక్షన్ కనపడింది.
ఓ అయిదారు స్కూటర్లు ఆగాయి.
"ఫ్రెండ్స్ ఓ పావుగంట మీ స్కూటర్ కావాలి. మీ స్కూటర్ కు మా కారు గ్యారంటీ.... మీరలా మా కారులో కూచోవచ్చు. ఈలోగా నేనూ, మా హబ్బీ కలిసి అలా షికారుకెళ్ళి వస్తాం... పావుగంట మీ స్కూటర్ వాడుకున్నందుకు ఫైవ్ హండ్రెడ్. అక్షరాలా అయిదు వందలు యిస్తాను" అనౌన్స్ చేసింది విరజ.
అంతే....
క్షణంలో "మా స్కూటర్ అంటే.... మా స్కూటర్ తీసుకోమని" అరిచేసారు అందరూ. వీటికితోడు మరో నాలుగైదు స్కూటర్లు వచ్చి చేరాయి.
బాహాబాహీ మొదలై చివరికి అందరూ అయిదు వందలు పంచుకునే కండిషన్ మీద కాంప్రమైజ్ అయ్యారు.
* * *
"అభీ! ఇకా వర్షంలో జర్నీ చేయడం భలే బావుంది కదూ..."
"అవును.... రేపు రొంపచేసి, హచ్... హచ్... అంటూ హాయిగా ఇద్దరం తుమ్ముకుంటూ కూర్చుందాం."
"ఏం కాదులే... విక్స్ ఉందిగా నా చెంత..." అంది అడ్వ టైజ్ మెంట్ లోలా ఫోజ్ ఇస్తూ.
"అవునూ... పనిలోపని.... యిలానే హోటల్ వరకూ వెళ్దామా?" అంది తన తలని అతనివీపు మీద ఆన్చి...
"అంత దూరమా? వర్షంలో డ్రైవ్ చేయలేక ఛస్తాను" అన్నాడు అభినయ్.. పైకి అల అన్నా... అతనికీ ఈ అనుభవం మత్తుగా.... గమ్మత్తుగా వుంది. విరజతో అతనికేం చేసినా అబ్బురంగా అద్భుతంగానే వుంటుంది.
మరో పదిహేను నిమిషాల్లో వెనక్కి వచ్చేశారు. స్కూటరిస్టులు అందరూ "బై" చెప్పి చేతులు వూపుతుండగా కారులో బలల్దేరారు అభినయ్, విరజ మనసునిండా ఆనందంతో. కారు డ్రైవర్ మాత్రం ఇంకా షాక్ లోనే వున్నాడు. ఇలాంటి జంటను అతనింత వరకూ చూడకపోవడమే ఆ 'షాక్'కు కారణం.
* * *
హోటల్ కు వచ్చేసరికి సాయంత్రం ఆరున్నర దాటుతోంది. బాగా టైడ్ అయివుండటంవల్ల మంచానికి అడ్డంగా పడుకుండి పోయాడు అభినయ్.
విరజ అభినయ్ ను చూస్తూ అతని తలదగ్గర కూచుండి పోయింది.
సరిగ్గా గంట తర్వాత మెలకువ వచ్చింది అభినయ్ కు. కళ్ళు తెరిచి చూసేసరికి తన వైపే చూస్తూ కూచుని ఉన్న విరజ కనిపించింది.
"విరూ... నువ్వు నిద్రపోలేదా?"
"లేదు అభీ! నిన్ను చూస్తూ ఉండిపోయాను. నువ్వు నిద్రపోతున్నప్పుడు తల్లి ఒడిలో ఆదమరిచి నిద్రపోయే చిన్నపిల్లాడిలా వున్నావు. అలా నిన్ను చూస్తూ నన్ను నేనే మరచిపోయాను" అంది విరజ.
"మరీ యింత ప్రేమా?" అంటూ విరజను ముందుకు లాక్కొని ఆమె బుగ్గలమీద ముద్దు పెట్టుకున్నాడు.
* * *
పది నిమిషాల్లో తయారై ఆటోలో రామకృష్ణా బీచ్ కు బయల్దేరారు.
"ఏయ్ విరూ.... డౌన్ లో చూడు.... ఇక్కడ్నుంచి సముద్రం ఎలా కనిపిస్తోందో..." "ఒక్కడు చాలు" షూటింగ్ యిక్కడే తీశారు. పై నుంచి కారులు బారులు తీరి వస్తూ వుంటాయి. ఎదురుగా సముద్రం కనిపిస్తుంది".
"ఇప్పుడు మీ సినిమా పరిజ్ఞానపు దుకాణం కట్టేయండి మహాప్రభో" అంది విరజ.
ఆటో డ్రైవర్ కు పది రూపాయలు ఇచ్చాడు అభినయ్. ఆటో దిగి బీచ్ లోపలికి నడుస్తుండగా "అభీ!" పిలిచింది విరజ.
ఆగి ఏమిటన్నట్టు చూశాడు అభినయ్.
"ఓ నాలుగు రూపాయలివ్వు".
"యూ మీన్ ఫోర్ రూపీస్...!" అన్నాడు జేబులో నుంచి పర్స్ తీస్తూ.
"నో... ఐమీన్ నాలుగు రూపాయలు" అంది వళ్ళుమండి విరజ.
పర్సులో నుంచి యాభై రూపాయల కాగితం తీసి యిచ్చాడు.
"అబ్బ... నాలుగు రూపాయల ఛేంజ్ లేదా?" అడిగింది విరజ.
"నువ్వు నాకర్ధం కావు సుమా!" అనుకుంటూ వన్ రూపీ కాయిన్స్ నాలుగు జేబులో నుంచి తీసి యిచ్చాడు.
విరజ పరుగు పరుగున వెళ్ళి రెండు నిమిషాల్లో తిరిగి వచ్చింది.
ఆమె చేతిలో మల్లెపూల మాల వుంది.
"అయామ్ సారీ విరూ..." అన్నాడు అపాలజికల్ గా అభినయ్.
విరజకు పూలంటే ఇష్టం. తనతో ఎప్పుడూ బయటకు వచ్చినా పూలు కొనిపెట్టమని అడుగుతుంది. తనే మర్చిపోతుంటాడు.
ఇంట్లో నాలుగు మల్లెచెట్లు వున్నాయి. ఆ పూలు ఎప్పుడూ కోయగా చూడ్లేదు ఎందుకని అడిగితే....
"మల్లెపూలు నువ్వు కొనిస్తేనే నాకు ఇష్టంగా ఉంటుంది" అంటుంది.
అభినయ్ "వన్స్ ఎగైన్ సారీ విరూ..." అన్నాడు మరోసారి. "నీ హ్యాండ్ బ్యాగ్ ఏమైంది? అందులో ఎప్పుడూ కొంత డబ్బు వుంచుకోవచ్చుగా. క్రెడిట్ కార్డులు కూడా ఉన్నాయి. బ్యాగ్ దగ్గరుంటే మంచిది కదా! ఎప్పుడే అవసరం వస్తుందో!?"
దానికి విరజ చెప్పిన జవాబు...
"నాకవసరమైన ప్రతీపైసాని నిన్ను అడిగితేనే నాకు తృప్తి. క్రెడిట్ కార్డులు, అమెరికన్ కార్డులు, ఎ.టి.యమ్, కార్డులు యివన్నీ నాకు అనందాన్నివ్వని విషయాలు. నువ్వు నా పక్కన వున్నంత వరకూ నా అవసరాలు అన్నీ నువ్వె చూడాలి. అందులో వుండే ఆనందం నాకు మాత్రమే తెలుసు."
"ఒకవేళ నేను పక్కన లేకపోతే?"
"అప్పుడు అసలు నేను ఈ లోకంలోనే వుండనుగా" అంది.
చప్పున ఆమె నోటిని తన చేత్తో మూస్తూ "అలాంటి మాటలు అనకు అసురసంధ్య వేళ పైన తథాస్తు దేవతలు తిరుగుతారు" అన్నాడు అభినయ్.
"అబ్బో! యిలాంటి విషయాలు కూడా తెల్సా?"
"వూఁ! మరేం అనుకున్నావ్" అన్నాడు అతను మాట్లాడుతున్నా అతని కళ్ళు మాత్రం విరజని పరీక్షిస్తున్నాయి.
తెల్లటి షిఫాన్ చీరలో ముద్దొస్తోంది. పొడుగాటి వాలుజడలో విచ్చుకుంటున్న మల్లెలు.
ఎదపై సన్నటి చెయిన్... రెండు చేతులకీ గాజులు ఈ రాత్రి టెంప్ట్ కాకుండా ఉండటం కష్టమే. అనుకున్నాడు మనసులో.
