ఫకాల్న నవ్వింది రమ్యశ్రీ అందరితోబాటు.
హిపోక్రసీ అలవాటుగా మారితే ఏ వ్యక్తికయినా ఎలా ప్రవర్తించేదీ తెలిసిన సుకృతి దూరంనుంచే యిదంతా గమనిస్తూ నవ్వాపుకోలేకపోయింది.
మూర్ఖులు తెలివయిన వాళ్ళనుకున్నప్పుడు మేధావి కాదని ఒప్పించలేడు.....తనూ మూర్ఖంగా నవ్వేస్తాడు.
"అయితే రమ్యశ్రీ నీ మీద దండయాత్ర ప్రారంభించిందట రాత్రి ఇంటికి రాగానే అడిగింది అలివేలు.
బడలికగా గోడకి జారగిలబడిన సుకృతి ఆశ్చర్యంగా చూసింది "నీకెలా తెలుసు?"
"ఇది జూనియర్ ఆర్టిస్టులేక్కువగా వుండే ప్రాంతం. అక్కడ చూసిన వాళ్ళు యిందాకే నాకు జరిగింది చెప్పారు."
"కోపం నామీద కాదనుకుంటాను ఆంటీ.....బహుశా ఆ అసిస్టెంటు డైరెక్టర్ మీద యింతకు పూర్వంనుంచీ."
"నీకు తెలీదే పిచ్చిపిల్లా......నిన్ను చూడగానే రమ్యశ్రీకి మతి పోయింది. తనకన్నా అందంగా వున్నావని. మేకప్ తో వయసుదాచుకుంటూ కాస్ట్యూమ్స్ తో అందాన్ని పెంచుకునే స్టార్స్ అలా తనకంటే బాగున్న వాళ్ళని భరించలేరు. ప్రేక్షకుల చూపంతా తనమీదకాక పక్కనున్న ఆర్టిస్టుమీదనే వుంటే తన ఇమేజ్ దెబ్బతింటుందని అలా చేయమంటారు.
లేడీ హీరోయిన్స్కె కాదు ఇలాంటి ఉక్రోషం. హీరోలకే ఎక్కువ. తనకన్నా బాగున్నట్టనిపించే మగ జూనియర్ ఆర్టిస్టుల్ని ఒక్కోమారు సినిమాల్లోనుంచే తప్పించేస్తుంటారు. మరీ తప్పదనుకుంటే అందంగా వున్నవాడ్ని ప్రేమ్ లో దూరంనెట్టి ఓ అనాకారిని తెచ్చి ముందు నిలబెడతారు....ఇది అక్కడ తరచూ జరిగేదే.
నిట్టూర్పుగా తలని వెనక్కి వాల్చిన సుకృతి గోడకి జారగిలబడి పోయింది. ఓటమిలో సైతం అణువంత తృప్తిని అందించిన ఆ మాయలు ఆనందాన్నిచ్చాయో లేక అందరికీ భిన్నంగా అనిపించిన శివ గుర్తుకు వచ్చాడో పెదవులు విచ్చుకున్నాయి మృదువుగా.
"ఏమిటి ఆలోచిస్తున్నావు" సుకృతి తల నిమురుతూ అడిగింది అలివేలు.
"చాలా చిత్రమయిన ఫీల్డు కదూ యిది?"
"ఈ సమస్య ఒక్క సినిమా రంగానికే సంబంధించింది కాదమ్మా. మన చుట్టూ వున్న సంఘంలోనూ వున్నదేగా? తన వీధిలోకి వచ్చిన మరో బలవంతుడ్ని ఆ వీధిగూండా అంగీకరించలేడు. తనకన్నా ఎఫిషియెంటైన పోలీసాఫీసర్ని అతడి బాసే సహించలేడు. అంతెందుకు..... తన పరిధిలో ఆనందంగా బ్రతికే పులిసైతం అక్కడితో కొత్త పులివస్తే తరిమేయాలనుకుంటుంది. ఉన్నవాడు లేనివాడ్ని దోచుకునేది అతడు లేనివాడిగా మిగలాలనే తప్ప అతడిమీద అంతకుమించి కక్ష వుండదు సుకృతీ. బూర్జువా వ్యవస్థకి చెందిన యీ సూత్రం సినిమారంగానికీ వర్తిస్తుంది."
మాట్లాడుతున్న అలివేలు టక్కున ఆగిపోయింది తననే గమనిస్తూ వున్న సుకృతిని చూస్తూ.
"ఏమైందమ్మా?"
"ఆంటీ" ఆర్ద్రంగా పిలిచింది సుకృతి. "నువ్వే లేకపోతే నేనే మయ్యేదాన్ని నేను ముఖస్తుతిగా మాటలనడంలేదు. ఎంత జీవితాన్ని నష్టపోయి నువ్వింత తెలివిని సంపాదించావో నాకు తెలీదు. ఈ రంగానికి సంబంధించిన ఓ ఉద్గ్రంధంగా మారటానికి ఎంత మానసికమైన సంఘర్షణకి లోనై వుంటావో అర్ధం చేసుకునే శక్తి నాకులేదు. కానీ నువ్వే యస్.....నువ్వు మాత్రమే అడుగడుగునా నన్ను గైడ్ చేయగలుగుతున్నావు. దేవుడు శాపంతోబాటు విముక్తికి మార్గాన్నీ చెబుతాడంటారే మార్గానివే నువ్వు."
అనడమేకాదు పసిపిల్లలా అలివేలుని చుట్టేసింది.
నిజమే.....మహల్లో కోకిలలా బ్రతకాల్సిన సుకృతి ఏ జన్మ దుషకృతానికి యీ కోవకి విసిరేయబడినాగాని అక్కడ వూపిరిగా మిగిలినది అలివేలు. కన్నతండ్రి కాదన్నా తన నిస్సహాయ స్థితిపై మొత్తం ప్రపంచమంతా ఆడుకుంటున్నా యిక్కడ నాకు మనిషి వుందన్న ఆలోచనకి ఉదాహరణ అలివేలు.
"పిచ్చిపిల్లా" అలివేలు గొంతూ గాద్గదికమైపోయింది. "పద్మం బురదలో పుట్టినందుకు బురద ఆనందిస్తుందిగాని ఆ బురద పద్మానికి అందాన్నివ్వదమ్మా అయినా యీ ఆంటీని అభిమానిస్తున్నావూ అంటే దురదృష్టంలో నేను కోరకూడని అదృష్టానివి నువ్వు. నాలాంటి వాళ్ళు ఎందరినో అదుకోవాల్సిన స్థాయిలో బ్రతికిన నువ్వు యీ స్థాయికి దిగినందుకు ఎందరినో ఆదుకోవాల్సిన స్థాయిలో బ్రతికిన నువ్వు యీ స్థాయికి దిగినందుకు నేనెంత కుమిలిపోతున్నానో నీకెలా చెప్పేది."
ఆ రాత్రి తనే అన్నం తినిపించింది అలివేలు. ఆ తర్వాత సుకృతి అలివేలుని కావలించుకునే పడుకుంది. ఉన్నదాంట్లో సంతృప్తి పడటము ఏమిటో అర్ధమైనట్టు ఆ రాత్రి చాలా రాత్రుల తర్వాత ఆనందంగా వుండిపోయింది సుకృతి.
డబ్బు కోసం దిగజారి మళ్ళీ డబ్బు సంపాదించటానికి ఎంత దిగజారాలో తెలీని సుకృతి వూహించి వుండదు సినీరంగం పతనంపై మనిషినెంత వేగంగా నెట్టేదీ.
ఆ మరుసటి రోజే అర్దమైంది ఆ విషయం కూడా.