"ఓహో! మీ అమ్మగారి దయతోనా.....నా స్వయం ప్రతిభా, సామర్ధ్యం అన్నీ మట్టిగొట్టుకుపోవల్సిందేనన్నమాట! నీకు మీ అమ్మ ముఖ్యమైతే ఇక్కడే పడి ఉండు. నా నిశ్చయంలో మార్పులేదు. నే వెళ్తాను. కానీ తిరిగి వస్తానని ఆశలు పెట్టుకోకు!" బెదిరిస్తున్నట్లుగా అన్నాడు.
వర్షకికూడా ఉద్రేకం ఆగలేదు. లేచి వెళ్ళి అతని కాలర్ పట్టుకుని" ఏంటి నీ ఉద్దేశం? పెళ్ళికి ముందు ఓ మాటా, పెళ్ళయ్యాక ఓ మాటామారుస్తుంటే ఈ ఒంటరిఆడవాళ్ళు ఏమీ చెయ్యలేరు. నా ఇష్టారాజ్యంగా అధికారంచలాయిద్దామనుకుంటున్నావా? నువ్వు నాతో చెప్పిందేమిటీ? చేస్తున్నదేమిటీ?" అంది.
సంజయ్ ఆమె చేతులు తిరస్కారంగా తోసేస్తూ "శభాష్.....ఆ తల్లికి తగ్గతనయవి అనిపించావు! నీకు పెళ్ళి చెయ్యడమే అసలు మీ అమ్మకి ఇష్టంలేదు. ఏదో లోకం ఆనుకుని పోతుందని విధి లేక చేసింది. పెళ్ళయినా నీ భర్తతో కాపురం చేయనిస్తుందని ఆశపడడం నా పొరపాటు! ఆ పొరపాటు దిద్దుకుంటాను. ఆఖరిసారిగా చెప్తున్నాను నీకు నీ తల్లి కావాలో.....నీసంసారం కావాలో తేల్చుకో!" అన్నాడు.
విద్యబాధగా "వర్షా......లోకంకోసం నీ పెళ్ళి చేశానా? మీ ఇద్దరూ సుఖంగా ఉండాలని నేను అనుకోలేదా? చూడమ్మా ఎంతలేసిమాటలంటున్నాడో? ఇన్ని మాటలు ఎవరిచేతైనా ఈ విద్య జీవిత కాలంలో పడిందా?" అంది.
వర్ష సంజయ్ తో "అమ్మా నా కోసం ఏమేం త్యాగాలు చేసిందో, మోడులా ఎలా బ్రతికిందోనీకు నేను చెప్పినా అర్ధం చేసుకోలేకపోయావు. ఇంక వ్యర్ధప్రయత్నంచెయ్యను. ఆమెని ఆమె ఖర్మకి వదిలేసినీతో వచ్చేసి ఆ సౌఖ్యాలని అనుభవించడానికి నేను అంత స్వార్ధ జీవినికాను. ఇప్పటికే ఆవిడనా వల్ల చాలా దుఃఖం పొందింది. ఇంకచాలు! నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో! నేను మాత్రం ఎక్కడికీ రాను. నేనుకావాలనుకుంటే నువ్వు ఇక్కడే ఇదేఇంట్లో ఉండవలసిందే" అని తన నిర్ణయం చెప్పేసింది.
"వర్షా......మరోసారి ఆలోచించుకో! నీ జీవితంకూడా మీ అమ్మలా అలా ఏ ఆనందం లేకుండా గడిచిపోతుంది. నీకు ఓ కూతురు కూడా లేదు. ప్రయోగాలు చెయ్యడానికి!" హేళనగా అన్నాడు.
"అక్కర్లేదు సంజయ్.....నన్ను నువ్వేం బెదిరించక్కర్లేదు" అంది.
విద్యకోపంగా "నీకు మా వర్ష కంటే ఆ ఉద్యోగం, ఆ ఫారెన్ టూర్ అవే ముఖ్యమైతేపో.....కానీ దాని జీవితం మోడువారిపోయిందనీ, వసివాడిపోతుందని భ్రాంతి పడకు! డైవోర్స్ ఇప్పించి వెంటనే రాజాలాంటి కుర్రాడ్నితెచ్చి పెళ్ళిచేస్తాను!" అంది.
సంజయ్ రెండు చేతులతో చప్పట్లు కొట్టి "వెరీగుడ్! మీ చరిత్రచూసి ఆశపడి కక్కుర్తి వెధవైనా నీ కూతుర్ని చేసుకోవడానికి వస్తేవాడ్ని ఆ వరండాలో బంగారు గొలుసుతో కట్టెయ్యి......నేవస్తా.....బై గుడ్ బై...." అని వెళ్ళిపోయాడు.
ఏడుస్తున్న వర్ష వీపు మీద చెయ్యివేసి- "వర్షా..... అతను వస్తాడు......చూస్తుండు!" అంది విద్య.
కానీ అతను రాలేదు. ప్రయాణానికి కావల్సిన ఏర్పాట్లు చేసుకున్నాడు.
ఒకరోజు వసుంధర వచ్చి విద్యతో కూతురి జీవితంలో నిప్పులుపోస్తున్నావంటూ నిష్టూరంగా మాట్లాడింది. వర్ష రెచ్చిపోయి తల్లిని ఏమైనా అంటే ఊరుకునేది లేదనీ, అంతగా అయితే తమ్ముడికి నచ్చచెప్పుకోమనీ అరిచింది.
"తొందరపడ్తున్నావు. మీ అమ్మ ఏమీ అనుభవించలేదు. అందుకే నిన్నూ ఏమీ అనుభవించకుండా చేస్తోంది. చేతులుకాలాక ఆకులు పట్టుకుని ఏడ్చి లాభం లేదు. వాడు మగాడు. ఇంకో అమ్మాయి మెళ్ళో తాళి కట్టేశాక నువ్వేం చెయ్యలేవు!" అంది.
"ఫరవాలేదు నాకు అమ్మే ముఖ్యం" అంది వర్ష.
విద్య ఆ రాత్రి ఏడుస్తూ "వర్షా నీ జీవితం నీది! నాకోసం నాశనం చేసుకుంటున్నావన్న అపప్రధ వద్దు! అతనితో వెళ్ళిపో.....నేను నీ జ్ఞాపకాలతో ఎలాగో బ్రతికేస్తాలే" అంది.
"ఎందుకు వెళ్ళాలి? అతను నీకంటే నాకు ఎక్కువా? నాకోసం ఏం చేశాడూ?" అడిగింది వర్ష.
"నేను ఇవ్వలేని సుఖాలు అతను ఇవ్వగలడు. అతనితో ఉంటే నీకు బిడ్డా, పాపా కలుగుతారు. నీ సంసారం నీకు ఏర్పడ్తుంది! ఈ ఒంటరితనం బాధాఉండవు!" అంది.
"అలాంటి సుఖాల కోసం నువ్వుచూసుకుని ఉంటే నీకేం కొరతా? అప్పుడు నా పరిస్థితి ఏమయ్యేది? చెప్పమ్మా? నువ్వన్నిత్యాగాలు చేసి అహోరాత్రులూ కష్టపడి నన్ను పెద్దచేస్తే, నేను ఇప్పుడు స్వార్ధం చూసుకుని నిన్ను విడిచిపెట్టిపోవాలా.....నేనలా చెయ్యలేనమ్మా సారీ! ఇంకేం చెప్పకు...." అంది వర్ష.
వసుంధర కబురు చేస్తే విద్య అన్న త్రిమూర్తివచ్చాడు.
"భలేపని చేశారు తల్లీకూతుళ్ళిద్దరూ ఇప్పటికైనాబిడ్డకి పెళ్ళిచేసి మానమర్యాదలతో బ్రతుకుతున్నావని సంతోషపడ్డాను. ఆ అబ్బాయిని అనరాని మాటలని ఇంట్లోంచి తరిమేసిపైగా అమ్మాయికి ఇంకో పెళ్ళిచేస్తానంటావా? అడిగేవాళ్ళూ, ఆపేవాళ్ళూ ఎవరూ లేరనా?" అని చెల్లెల్ని దులిపేశాడు.
