"మా విషయంలో కల్పించుకునే హక్కు మీకు లేదు!" వేలుపెట్టి బెదిరిస్తున్నట్లుగా అన్నాడు.
"నాకు నా కూతురి గురించీ, ఆమె బాగోగుల గురించీ మాట్లాడే హక్కు లేదా? నిన్నకాక మొన్నవచ్చిన నీకు సంపూర్ణ అధికారం వచ్చేసిందా?" అడిగింది విద్య.
"అమ్మా......సంజయ్......ఆపండి! అందరికీ వినోదంగా తయారవుతోంది మన కీచులాట! ఎవరూ తగ్గరేంటీ?" అంది వర్ష.
"మీ ఆయనకీ చెప్పు. నాకూతురి మీద నాకు ఏ హక్కులేదని మాట్లాడితే నేను ఊరుకోను. అందరిలా పెంచలేదే నిన్నూ, అన్నీ నేనే అయి నాకు లోకమేనువ్వనుకుని పెంచాను. ఆయనగారికి అర్ధమయ్యేటట్లు చెప్పు!" కన్నీళ్ళు తుడుచుకుంటూ అంది విద్య.
"మీ అమ్మకి ఎంత ప్రేమున్నా మన స్వంత విషయాల్లో కలుగజేసుకోకూడదని చెప్పు!" వ్యంగ్యంగా అన్నాడు సంజయ్.
"ఏమిటి నీ స్వంత విషయం? ఏం కలుగజేసుకున్నానూ?" అడిగింది.
"ప్రొద్దుట నాకు బ్రేక్ ఫాస్ట్ వరమ్మని పెట్టమన్నారు. మా అక్కకి ఒంట్లో బాలేకపోతే వరమ్మని పంపించారు. కొన్నాళ్ళకి నా భార్య నాకు సంబంధించినపనులే చెయ్యకూడదంటారేమోననీ!" అన్నాడు.
"మాటమాటకీ నాభార్యా నా భార్యా అంటావేంటి? అది నా కూతురు కూడా!" భరించలేనట్లుగా అంది విద్య.
"మీకూతురని నాకు గుర్తుంది. కానీ ఆమె ఇప్పుడు ఇంకో ఇంటికోడలనీ ఇంకొకడి భార్య అనీ మీకే గుర్తుండటం లేదు" నిష్టూరంగా అన్నాడు.
వర్ష అతని చెయ్యి పట్టుకుని "సంజయ్......ప్లీజ్! ఇంక ఆపెయ్......పద లోపలికి" అని పైకి తీసుకెళ్ళిపోయింది.
విద్యవరమ్మతో "అది......అది నాకేం కానట్టు, అన్నీ హక్కులూ నేనే అతనికి ధారబోసినట్టూ అలా మాట్లాడ్తాడేంటీ? నేను మధ్యలోకి రాకూడదంటాదేమిటి? నేను......మధ్యలో దాన్నా? ఆ రోజు వర్షతో సమానంగా చూడమన్నాడు! ఈ రోజు ఒక్కమాటన్నా విపరీతార్ధాలు తీస్తున్నాడు. ఇలాగితే ఎలా? ఇదెక్కడికి దారి తీస్తుంది? నా చిన్న తల్లిని లోపల ఎన్ని మాటలంటున్నాడో? అదెలా భరిస్తుందో? దానికి ఇలాంటి మాటలూ, అవీ అలవాటు కూడా లేదు!" అంటూ బాధపడ్తూనే ఉంది.
వర్షమత్రం సంజయ్ మెడ ఒంపులో తలదాచుకుని "నా మీద ప్రేముంటే ఆవిడ చేసే పనులనీ, మాటల్నీ పట్టించుకోకు సంజయ్! ఏం చెప్పాలన్నా నాతో గదిలో చెప్పు! నేను నీ ఇష్టప్రకారమే నడుచుకుంటాగా!" అంది.
"ప్రామిస్!" అనుమానంగా చూస్తూ చెయ్యి జాపాడు.
ఆమె అతని చేతిలో తన చెయ్యి ఉంచి "అమ్మకి నేనంటే పిచ్చి ప్రేమ, ఒట్టిపిచ్చిది సంజయ్" అంది.
"అవును తెలుస్తూనే ఉంది!" అన్నాడు సంజయ్.
ఆ తర్వాత ఆమెవైపు తిరిగి "నీ కోసం భరించక తప్పదు వర్షా! బికాజ్ యూఆర్ ప్రెశక్...." అని తమకంగా కౌగలించుకున్నాడు. అతని చేతులకి పరవశిస్తూ వర్ష కిలకిలానవ్వసాగింది.
క్రింద విద్య కూతుర్ని అల్లుడేమీ బాధ పెద్తున్నాడో అన్న దిగులుతో ఆరాత్రంతా నిదురపోలేదు.
* * *
"వర్షా.......వర్షా......" సంజయ్ ఆనందంగా లోపలికి వచ్చాడు.
విద్యతోబాటు ఎకౌంట్స్ చూస్తున్న వర్ష "హాయ్.....ఏమిటంత ఉషారు?" అడిగింది.
అతను చేతిలోని స్వీట్ బాక్స్ ఓపెన్ చేసి "ముందు స్వీట్సు ఆంటీకీ, వరమ్మకీ అందరికీ ఇవ్వు. తర్వాత చెప్తా....." అన్నాడు.
వర్ష అతను చ చెప్పినట్లే చేసింది.
"ఇప్పుడు చెప్పు!" అంది.
"అబ్బాయికి కూడా పెట్టు" అంది విద్య.
వర్ష సంజయ్ నోటికి స్వీటు అందిస్తే అతను సగం కొరికి మిగతాది ఆమె నోట్లోపెట్టాడు.
"ఏమిటి విషయం?" అన్నట్లు సైగ చేసింది నోటినిండా స్వీటున్న వర్ష.
"నన్ను మా కంపెనీ వాళ్ళుమూడేళ్ళకోసం అమెరికా పంపిస్తున్నారు. ఇటువంటి ఛాన్స్ ఇంతత్వరగా నాకు వచ్చినందుకు అందరూ తెగ కంగ్రాచ్యులేట్ చేసారనుకో!" అన్నాడు.
"మూడేళ్ళా?" వర్ష అరిచింది.
"ఔను ఏం?"
"నేను నిన్ను వదిలిపెట్టి ఉండాలా?" అంది.
"ఎవరన్నారూ? నువ్వు నాతో వస్తావు" చెప్పాడు సంజయ్.
ఈసారి విద్య షాక్ అయి చేతిలో స్వీటు జారవిడిచింది.
"ఏం మాట్లాడ్తున్నావు సంజయ్? అమ్మని వదిలి మనం అమెరికా వెళ్ళాలా? అలా అని వాళ్ళతో ఒప్పుకున్నావా?" అడిగింది.
"ఆ! వ్రాసిచ్చేశాను కూడా.....బాండ్!" అన్నాడు.
"ఎంతపని చేశావూ? నన్ను అడగక్కర్లేదా?" ఉక్రోషం, కోపం కలగలిసి రాగా అతని చేతులు పట్టుకుని ఊపుతూ అడిగింది వర్ష.
"ఇందులో అడిగేందుకేముంది? ఇట్స్ ఏ లక్కీ ఛాన్స్!" భుజాలు కుదించితేలిగ్గా చెప్పాడు.
"అవునయ్యా......నీకులక్కీ ఛాన్సే! నా కూతుర్ని నా నుండి ప్లాన్ ప్రకారం విడదీసి నన్ను ఒంటరిదాన్ని చేయడం నీకు లక్కీనే! కానీ నేనేం కావాలి? దాన్ని వదిలి ఒక్క క్షణం కూడా బ్రతకలేనినేను ఇంత విషం పుచ్చుకునిచావమంటావా?" కోపంగా ముందుకువచ్చినిలదీసింది విద్య.
"అన్నింటికీ బోన్ లో నిలబెట్టి ముద్దాయిని ప్రశ్నించినట్లు ప్రశ్నిస్తారేంటి? మీ ప్రేమలకోసం నేను నా భవిష్యత్తునీ, కెరీర్ నీ పాడుచేసుకోవాలా? ఏం.....ఖర్మ ఉద్యోగరీత్యా ఫారిన్ వెళ్తుంటే అతనితో కలిసి వెళ్ళడం భార్య డ్యూటీకాదా? దానిని నేను నిన్ను అడిగి పర్మిషన్ తీసుకుని ఆఫీస్ వాళ్ళకి నా అంగీకారం తెలియబర్చాలా? నేను ఓ వాజమ్మలా నీకూ మీ అమ్మకీ కనిపిస్తున్నానా?" అతను ఉద్రేకంగా అరిచాడు.
"నేను అనుకుంటూనే ఉన్నాను. ఇలాంటిదేదో చేస్తావని! ఇల్లరికానికి ఇష్టపడని నువ్వు కామ్ గా ఈ ఇంట్లోకి పెట్టే బేడాతో వచ్చినప్పుడే ఇలాంటి దురూహలేవో నీ మెదడులో ఉన్నాయని అనుమానించాను. కానీ ఇంత త్వరగా అవి రూపుదాలుస్తాయనీ నీలో ఇంత కుటిలత్వం ఉందనీ కనుక్కోలేకపోయాను! ఎంత దెబ్బ కొట్టావు....." విద్య వలవల ఏడుస్తూ సోఫాలో వాలిపోయింది.
వర్ష ఏడుస్తున్న తల్లిని సముదాయిస్తూనే సంజయ్ తో చెప్పింది. "ఇట్స్ నాట్ ఫెయిర్ సంజయ్.....నువ్వు ఏం చేసినా నేను ఒప్పుకుంటానని అనుకోకు! అమ్మని వదలి నేను రాను. నీకు అంతగా ఫారెన్ కంట్రీస్ చూడాలని ఉంటే అదో పెద్ద ప్రాబ్లం కాదు. మనం ఎప్పుడైనా వెళ్ళచ్చు!"
