"మామయ్యా ఇది మా స్వ విషయం. మీ జోక్యం అనవసరం. మా అమ్మని ఎవరు అవమానించినా వాళ్ళకి ఈ ఇంట్లో స్థానంలేదు. వచ్చినదార్నే వెళ్ళిపోండి!" అంది వర్ష.
అతను తల్లినీ కూతుర్నీ తిట్టి "మీ జీవితాలు ఎవరూ బాగుచెయ్యలేరు. బుద్ది బూరెలు తినమంటే రాత గాడిదలు కాయమంటోంది. ఏం చేస్తాం అనుభవించండి!" అని వెళ్ళిపోయాడు.
సంజయ్ వెళ్ళేముందు వర్షకి ఫోన్ చేశాడు.
"ఏం నిశ్చయించుకున్నావు?" అడిగాడు.
"సంజయ్......ఐవాంట్ యూ.....కానీ అమ్మనికూడా వదిలిపెట్టలేదు. ప్లీజ్.....నా కోసం ఉండిపో...." వర్ష ఏడుస్తూ అడిగింది.
"బై!" సంజయ్ కట్ చేశాడు.
మరునాడే అతను వెళ్ళిపోయినట్లు తెలిసి వర్ష దుఃఖాన్ని గుండెలోనే సమాధిచేసేసింది. అది బయటపడ్తే తల్లి సహించలేదని ఆమెకి తెలుసు!
మూడు సంవత్సరాలు గడిచాయి, వ్యాపారంలో తల్లినిమించిన దక్షతకలదానిగా వర్ష పేరు తెచ్చుకుంది. అందం, వయసూ, సిరిసంపదలూ అన్నీ వున్నాయి. లేనిదేమిటో ఆమె ఒక్కదానికే తెలుసు! ఒంటరిగా ఉన్నప్పుడు సంజయ్ తాలూకు ఆలోచనలు ఉప్పెనలా వచ్చి ఆమెని ఉక్కిరిబిక్కిరిచేస్తుంటాయి. ఒక్కోసారి గుక్కతిప్పుకోలేక ప్రాణంపోతుందేమోనని భయం వేస్తుంది.
విద్య చిన్న బిజినెస్ డీల్ మీద సింగపూర్ వెళ్ళింది.
తల్లికూడా దగ్గరలేని సమయంలో వర్షకి ఒంటరితనం దుస్సహంగా అనిపించింది. నెలరోజులూ వేల వేల సంవత్సరాలుగా అనిపించింది. ముఖ్యంగా గట్టిగా కట్టడిచేసి బంధించిన మనసు చిన్నభరణిలో పెట్టిన స్ప్రింగ్ లా మూతతెరవగానే పైకి వస్తోంది. తనని ఎదిరిస్తోంది. జవాబులేని ప్రశ్నలువేస్తోంది.
వర్ష టైం చూసుకుంది. తల్లి ఫ్లైట్ వచ్చేసమయం అవుతోంది. తెల్లవారితే క్రిస్టమస్!
ఆ శోభలు నగరమంతా పరుచుకుంటున్నాయి. ఎన్నో పండుగలు వస్తున్నాయి.....పోతున్నాయి .......తనుమాత్రం ఇలాగే! భుజంమీద నుండి జారుస్తున్న షాల్ ని సరిచేసుకుంటూలేచి నిలబడింది. కానీ అది ఆమె చేతికి అందక క్రిందకి జారిపోయింది. ఒంగి తీసుకుందామనుకునేసరికి ఎవరో ఒంగి దానిని తీసి అందించారు!
కృతజ్ఞతగా చూడబోయిన ఆమెకళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి.
ఎదురుగా సంజయ్!!!
"బావున్నావా?" చిరునవ్వుతో అడిగాడు.
"సంజయ్....." అని ఆశ్చర్యంతో విచ్చుకుంటున్న ఆమె పెదవులు అతనిపక్కన చూసి షాక్ కొట్టినట్లుగా ఆగిపోయాయి!
అతనిచేతిలో ఒక చిన్నారి చెయ్యి! నోట్లోవేలేసుకుని అమాయకంగా చూస్తున్న రెండేళ్ళపాప.
వర్ష గుండెల్లో ఎవరో చెయ్యిపెట్టి తిప్పినట్లయింది. శరీరం ఆపాదమస్తకం సన్నగా కంపించింది.
"నేనువచ్చి మూడునెలలు అవుతోంది. ఇదిగో వీళ్ళ అమ్మ వస్తోందని రిసీవ్ చేసుకోవడానికి వచ్చాను. అంజలీ.....ఆంటీకి చెయ్యి కలుపు!" పాపని ఎత్తుకొని వర్ష చేతికి ఆమె చెయ్యి అందిస్తూ అన్నాడు.
పాపముద్దుగా ఆపిల్ పండులా ఉంది. బహుశా వాళ్ళ అమ్మకూడా ఇలాగే ఉంటుందేమో! వర్షకి లావాలా హృదయంలోంచి ఈర్ష్య ఎగజిమ్ముతోంది. బైటికి దానిని రానివ్వకుండా ఆపి పాపకి చెయ్యి అందించి "హలో అంజలీ!" అంది.
మెత్తని ఆ చెయ్యి ఆమెలో అశాంతి రేపింది. అంతా సవ్యంగా ఉండి ఉంటే ఈ పాటికి తనూ.... సంజయ్ ఇలాగే పాపతో.....ఆపై ఆలోచించలేకపోయింది.
సంజయ్ వర్షని "పెళ్ళయ్యిందా?" అడిగాడు.
ఉలిక్కిపడి "వాట్?" అంది.
"మేరేజ్ అయిందా?" మళ్ళీ అడిగాడు.
"అయింది. ఒకసారి!" వ్యంగ్యంగా చెప్పింది.
"సారీ!" అన్నాడు.
"ఐయామ్ నాట్ సారీ!" ఉక్రోషంగా అంది. అసలు అక్కడే అతని కాలర్ పట్టుకుని ఇలా అపరిచితుడిలా నన్ను ప్రశ్నలు వెయ్యడానికి నీకు హృదయంలేదా? అని తిట్టి గోలచెయ్యాలనిపిస్తోంది!
"ఎవరువస్తున్నారూ?" అడిగాడు.
"అమ్మ" చెప్పింది.
"ఓ! నువ్వేం మారలేదు. వర్షా ఇలా చలిలో అమ్మకోసం ఎదురుచూస్తూ.....వెచ్చగా గడపాల్సిన వయసులో...." అని అర్దోక్తిలో ఆపేశాడు.
వర్షభరించలేనట్లు "నేను మీ పర్సనల్ విషయాల్లో ఆసక్తి చూపనట్లే మీరూ చూపకపోతే మంచిది!" అంది కటువుగా.
ఆ తిరస్కారం అతను పట్టించుకోనట్లు "నా కార్డ్ ఇదిగో ....."అని జేబులోంచి తీసి అందించాడు.
(సమాప్తం)
