గుట్ట అంచుకు చేరుకుంది. ఓ నలబై మెట్లెక్కి పరిసరాల్ని పరికించింది.
అలికిడి లేదు.
అప్పుడు నిద్ర లేచింది ఆమె అహం.
నరనరాల్లో జిర్ణించుకుపోయిన స్వాతిశయం క్షణంలో ఉక్రోషమై, క్రమంగా క్రోధంగా మారి, తనెంత దిగజారిపోయింది అన్న ఆలోచనను రేపి, ఇంకా కనిపించని రాఘవ ఉహ క్షణంలో బుతద్దమై ఆమెను అపహాస్యం చేసినట్లయింది. ఇక కారేక్కేదే.
"హల్లో!" వినిపించింది రాఘవ కంఠం.
చాలా హడావుడి పడి అప్పుడే వచ్చినట్టు అతడి నుదుట స్వేదం స్పష్టం చేస్తోంది.
ఆపాద మస్తకం ఏకాగ్రతగా చూసిన కిన్నెర క్షణంపాటు రెప్పవేయటం మరిచింది.
వెనువెంటనే తనకన్నా ముందొచ్చి తన కోసం ఎదురు చూడని అతడిపై అనూహ్యమైన కోపం వచ్చింది కూడా.
అది కూడా నిగ్రహించుకుందేమో కాని, రాఘవ పెదవులపై మెరిసి మెరియని చిన్న నవ్వు అతడి ఆహాంగా అనిపించింది.
"మిస్టర్ రాఘవ! మీ కోసం నేను వచ్చి చాలా సేపైంది."
అడుగుతున్నట్లు లేదు అడ బాస్ ఆఫీసులో శాసిస్తున్నట్టుగా ఉంది.
"మీ కన్నా ముందు వచ్చేవాడినే మిస్ కిన్నెరా! కాని స్కూటర్ ట్రబులిచ్చింది."
ఆచివరి వాక్యం వినిపించలేదామెకు. "మీకు నా పేరు తెలుసా?"
"సిల్లీ!" మృదువుగా నవ్వాడు."వెన్నెలేలా ఉంటుందో చెప్పగలరా అన్నట్టుంది మీ ప్రశ్న."
సగం చల్లబడిపోయిందామె.
"మాటల చమత్కారం మానండి మిస్టర్ రాఘవా! నేనెలా తెలుసు?"
అరా క్షణం నిశ్శబ్దం తర్వాత "ఫేయిరెస్ట్ ఆఫ్ క్రియేషన్ లాస్ట్ అండ్ బెస్ట్ ఆఫ్ గాడ్స్ వర్క్స్, ఇది నా కవిత కాదు. జాన్ మిల్టన్ "పేరడైజ్ లాస్ట్" లో అన్నది నిజమే అనిపించే సౌందర్యం మీది ఒక్కసారి చూస్తే మాత్రం ఎలా మరిచిపోగలను?"
పూర్తిగా వివశాత్వానికి లోనైంది కాని తన వ్యక్తిత్వానికే విరుద్దమనిపించడంతో సర్కాస్టిక్ గా అంది -"నేను అందరి అమ్మయిల్లాంటి దాన్నే అనుకుంటే మీరు పోరబడినట్లే మిస్టర్ రాఘవా!"
"కాదని ఇప్పుడే ఇంగ్లీషులో ఓ కొటేషన్ చెప్పానుగా!"
"అది అందరికి వర్తించే సూక్తి."
"కాదు, కేవలం మీ లాంటి అందగత్తేకు మాత్రమే వర్తించే నిజం."
"ఇలా నన్ను మాటలతో జోకొట్టకండి!"
అసాధారణమైన ఆమె సౌందర్యాన్ని కాదు, దాన్ని మింగేస్తున్న అహాన్ని చూశాడు రాఘవ. "అర్ధం కావడం లేదు మిస్ కిన్నెరా! ఎందుకు పిలిచినట్టు? ఇప్పుడు మీరిలా ఎందుకు ప్రవర్తిస్తున్నట్టు?"
"నాకు కవితలు రాసి పంపడానికి మికేన్ని గుండెలు?" సీరియస్ గా పాయింట్ కి వచ్చింది. "మీ గురించి మీరేమనుకుంటున్నారు? ప్రతిరోజూ లైబ్రరీ నవలల్లో కవితల్ని మీరెందుకుంచారు?"
"అంటే?" సాలోచనగా అన్నాడు - "ఇది అడగటానికా మీరు నన్ను పిలిచింది?" విషయం బోధపడింది.
"అవును, మిస్టర్ రాఘవా! నేను మరోలా వ్యవహరించి ఉంటే మీరి పాటికి ఆకారం లేకుండా అయిపోయేవారు కాని, జాలిపడి పిలిచాను ఎందుకో తెలుసా? ఇంకోసారి ఇలాంటి పిచ్చిపని చేసి ప్రాణం మీదకు
తెచ్చుకోవద్దని హెచ్చరించటానికి."
ఇక్కడ కిన్నెర ఉద్దేశం అతడు కాస్త భయాన్ని ప్రకటించి తనపై చేయకూడని ప్రయోగం చేసినందుకు పశ్చాత్తాపపడాలనే!
కాని మృదువుగా నవ్వాడు రాఘవ. "మీరు ఊరికే హెచ్చరించాలి అనుకుంటే ఫోన్ లోనే ఆ పని చేసేవారు కిన్నెరా! మీ ఉద్దేశం నిజానికి అది కాదు."
"మరేమిటి?"
"అది మీకు తెలియాలి" వెనక్కు మరలబోయాడు.
"మిస్టర్ రాఘవా!" అతడి నిర్లక్ష్యం ఆమె భరించలేకపోయింది. మీరలా వెళ్ళినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు."
"పరిష్కారం కావటానికి అసలు ఓ సమస్యంటూ ఉంటేగా?"
"ఏమిటి మీ ఉద్దేశం?" కలియబడిపోవాలన్నంత ఆవేశం ముంచుకొచ్చిందామెకు. "మీ చేతి రాతతో వున్న కవితలు ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి."
"అలాగే! అదే చేతి రాతతో ఉన్న నా కవితలు చాలా పత్రికాఫీసుల్లో ఉన్నాయి. అంతమాత్రం చేత అందమైన అడ సబ్ ఎడిటర్స్ అవి ప్రేమ లేఖ అనుకుంటారా? చూడండి మిస్ కిన్నెరా! మామూలు లేఖల్లాగే ప్రేమ లేఖకు సంభోధనలు, చివర ఓ సంతకము ఉంటాయి. అందుచేత అదేమీ లేని నా కవితల కాగితాలు పట్టుకుని ప్రేమలేఖలంటే ప్రపంచం ఒప్పుకుంటుందా? చూపించండి ప్రపంచానికో, మీ నాన్నగారికో, అయినా ....." చివరిగా అన్నాడు రాఘవ ఆమె మీద అణువంత జాలిని ప్రదర్శిస్తున్నట్టుగా --" మీ పిచ్చి గాని కిన్నెరా! పెళ్ళయి, ఇద్దరు పిల్లల తండ్రిని, నాకీ ప్రేమలేఖ లేమిటి చెప్పండి?"
పెళ్ళయిందా? ఎక్కడో నభోమండలం పగిలిన చప్పుడు.
మెదడు పొరలు పెటేల్మని చిట్లినంత బాధ.
ఎన్ని కోట్ల లిప్తల పాటు ఆలోచించింది ఈ వ్యక్తీ గురించి అసలు ఇంతవరకూ రానిచ్చిందేం?
దూరంగా స్కూటర్ పైన వెళ్ళిపోతున్న రాఘవ పెళ్ళయిన వ్యక్తిగా ముందే తెలిసి ఉంటే ఎంత బాగుండేది? కనీసం మంగనైనా తను అడగలేదేం?
నిస్త్రాణంగా కారెక్కింది.
వికలమైన మనసుతో కిన్నెర కారులో ఎంతసేపు కూర్చుందో ఆమెకు గుర్తులేదు కాని, దూరంగా పొలంలో నుంచి చూసిన ఓ ఆకారం మాత్రం స్పష్టంగా గుర్తు పెట్టుకుంది.
వీర్రాజుకు బద్ద శత్రువైన భోజరాజు పాలేరు నర్శిగాడు.
