Previous Page Next Page 
ఈ రేయి నీదోయి పేజి 19


        
    ఆమె షాకయ్యింది ఏమిటి ఇతని మనస్తత్వం? పూటకు గతిలేని వాడు కూడా పెళ్ళాం మీద అజమాయిషీ చేస్తాడు. తనకు చేతనైనంత వరకు బాధ పెట్టాలని చూస్తాడు. లేకపోతే అలా మాట్లాడగలడా?
    
    ఆమె మౌనంగా లోపలికి వెళ్ళిపోయింది. 

   

    ఆ రాత్రి ఆమె పక్కలోకి చేరాడతను.
    
    "ఇటు తిరుగు- నీకో విషయం చెప్పాలి. నాతోపాటు పనికి వచ్చే వనజ తెలుసుకదా. అది ఈరోజు మధ్యాహ్నం ఏం చేసిందో తెలుసా? మధ్యాహ్నం భోజనాలయ్యాక కడుతున్న ఇంట్లో రెస్ట్ తీసుకుందామని పడుకుంటే వచ్చి మీద పడిపోయింది. మగాడ్ని కదా- అలా మీదపడితే వూరుకుంటానా? నేనూ ఆపిల్లను పట్టుకున్నాను. గొప్ప సుఖం ఇచ్చిందిలే" అని చెప్పి గర్వంగా నవ్వాడు.
    
    ఆమెకైతే నవనాడులూ పగిలిపోయి రక్తం ఒలికిపోతున్నట్లు గిలగిల్లాడి పోయింది. ఇతరులకు బాధ కలిగించి ఆనందించే మనస్తత్వం అని ఆమెకి తెలిసిపోయింది.
    
    అలాంటప్పుడు కూడా ఏమీ చేయలేని తన నిస్సహాయతను నిందించుకుంది.
    
    ఆ పల్లెకు వెంకటగిరి చాలా దగ్గర. రెండు కిలోమీటర్లు కూడా వుండదు.
    
    రోజూ సాయంకాలం ఆ వూరు నుంచి చాలామంది వెంకటగిరి వెళ్ళొస్తుంటారు.
    
    వారానికో మారైనా అలా భర్తతో జాలీగా టౌన్ కి వెళ్ళి రావాలని ఆమె కోరిక. కానీ కాపురానికి వచ్చి ఆరునెలలయినా ఆ కోరిక తీరనే లేదు.

 

    మొదట్లో తన కోరిక బయటపెడితే రాఘవులు ఇంత ఎత్తున ఎగిరిపడ్డాడు.
    
    "ఆడది ఇంట్లోనే వుండాలి. టౌన్ కి వెళ్ళి తైతక్కలాడడానికి నువ్వేమైనా సాని పాపవా" అన్నాడు.
    
    టౌన్ కి వెళ్ళడం అంటే పాపమని తెలియని ఓ పిల్ల భోరున ఏడ్వడం మినహా ఏం చేయలేక పోయింది.
    
    మరికొన్ని రోజులకు ఓ కొత్త విద్య నేర్చాడు. అది కొట్టడం, చీటికీ మాటికీ హింసించడం ప్రారంభించాడు.
    
    ఆ పిల్ల ఎన్ని రోజులని పడుతుంది?
    
    ఓ రోజు ఘర్షణ మరింత ముదిరింది.
    
    ఆ రోజు అతని పెద్దమ్మ కొడుకు వచ్చాడు.
    
    "మా అన్న వచ్చాడు. ఈరోజు అన్నీ అదిరిపోవాలి. తలంటి స్నానం చేయించు. నేనలా వూర్లోకి వెళ్ళి కోడిని పట్టుకొస్తాను. పనిలో పని వడలు కూడా కాల్చు. వడలు-కోడికూర మంచి కాంబినేషన్" అన్నాడు రాఘవులు. మనిషి మాంచి హుషారులో వున్నాడు.
    
    సరేనని వాడు ఆర్డర్ వేసిన విధంగా అన్నీ చేయడం ప్రారంభించింది సుమతి.
    
    వాడు ఆజ్ఞలు జారీ చేశాడు గానీ ఇంట్లో అన్నీ వుండాలి గదా. చివరికి పొయ్యి మండడానికి కట్టెలు కూడా లేవు.
    
    అందుకే మొగుడ్ని పక్కకు పిలిచి "చుట్టాన్ని గమనించాల్సిందే కాదనను. కానీ ఇంట్లో ఏ వస్తువూ లేదు. అంగట్లో పట్టుకురా" అంది.

 

    "ఏమీ లేకపోవడమేమిటి- మొన్ననే కదా నూటయాభై రూపాయల సామాను తెచ్చాను"
    
    "మొన్నంటావేమిటి! నెలయింది"
    
    "అదంతా నాకు తెలియదు. నేను చెప్పినవన్నీ వండాల్సిందే" అని అదంతా ఆమె తప్పయినట్టు విసవిసా వెళ్ళిపోయాడు.
    
    భార్యను విసుక్కోవటానికి, లేదా కోపగించుకోవడానికి, కొట్టడానికి మగాడికి ఓ కారణం కూడా వుండక్కర్లేదు కాబోలు అనుకుంది.
    
    ఇంటింటికి వెళ్ళి కావాల్సినవన్నీ బదుళ్ళు తీసుకొచ్చింది.
    
    ఈలోపున రాఘవులు ఓ కోడిని పట్టుకొచ్చాడు. అది మరీ చిన్నపిల్ల. దాన్ని చంపి తినడానికి ఎలా మనసొప్పుతుందో అని బాధపడింది సుమతి.
    
    ఇదంతా ఏమీ పట్టించుకోని రాఘవులు ఇంటి వసారాలో దాన్ని కోయడం ప్రారంభించాడు.
    
    రక్తమంతా చింది చుట్టుపక్కల పడుతోంది.
    
    "ఏమిటీ వికారం? దూరంగా వెళ్ళి కోసుకోకూడదా" అని అడిగింది సుమతి.
    
    అది మహా తప్పయినట్టు రాఘవులు ఒక్క వుదుటున పైకి లేచాడు.
    
    "ఇక్కడ కోస్తే ఏమవుతుందే. నేను చూస్తూనే వున్నాగా మా చుట్టాలంటే నీకు పడదే అదే నీ తరపు బంధువులైతే నట్టింట్లోనే కోడిని కోయమనేదానివి. మా బంధువులు ఇంటికొస్తే చాలు ముఖాన్ని మాడ్చేస్తావు" అని జుట్టు పట్టుకుని వంగోబెట్టి వీపుమీద దబదబా బాదడం ప్రారంభించాడు.
    
    పాపం సుమతి ఎప్పుడూ అలా చేయలేదు. అదీగాక రెండువైపుల నుంచి వచ్చే బంధువులు కూడా చాలా తక్కువ. అందులోనూ ఇలాంటి పక్షపాతం చూపించాల్సిన అవసరం ఏముంది!
    
    "నాకలాంటి భేదభావం ఏమీ లేదు. ఇక్కడ రక్తం చింది అపరిశుభ్రంగా వుంటుంది అన్నానంతే" అని ఏడుపు మధ్య ఆమె చెబుతున్నా వాడు వినిపించుకోలేదు.
    
    చుట్టం భుజంపట్టి లాగుతున్నా వాడు పట్టించుకోలేదు. అలా కొడుతున్నప్పుడు ఆమె దవడ పగిలి రక్తం చిమ్మింది.
    
    అలా అలిసిపోయేవరకు వాడి విజ్రుంభణ ఆగలేదు.
    
    బంధువుముందు, చుట్టుపక్కల వారిముందు అంత అవమానం జరిగాక ఇక వుండలేకపోయింది సుమతి.
    
    ఒక సుఖం లేదు, సౌఖ్యం లేదు. పైపెచ్చు అలా గొడ్డును బాదుతున్నట్టు కొడుతున్న మగాడి దగ్గర ఏ ఆడదైనా ఎంత కాలం వుంటుంది?
    
    ఆ మధ్యాహ్నమే సుమతి బయల్దేరి తన పుట్టింటికి వచ్చేసింది.
    
    వాడు పెళ్ళాం కోసం చాలాసార్లు ఈ ఊరొచ్చినా వాడి అసలు రంగు తెలిసిన సుమతి పోనంటే పోనంది.
    
    ఓరోజు బంధువుల సమక్షంలో ఇద్దరి మధ్యా వున్న బంధం తెగిపోయింది.
    
    అలా పుట్టింట్లో సెటిలయిపోయింది సుమతి.
    
    భర్తను వదిలేసిన సుమతి అమ్మగారింటికి రావడంతోనే మరో కొత్త కథ మొదలైంది"
    
    "కొత్త కథా- ఏం జరిగింది?" లిఖిత అడిగింది.
    
    రంగనాయకి చుట్టూ చూసి "చీకటి పడిపోయింది. వెళుతూ చెప్పుకుందాం పద" అని బయల్దేరింది.
    
    లిఖిత, రంగనాయకి తిరిగి ఇంటికి బయల్దేరారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS