Previous Page Next Page 
ఈ రేయి నీదోయి పేజి 18


    
    "ఒద్దు.... అలా రోడ్డు వరకు నడిచేవెళదాం"
    
    అక్కడికి తార్రోడ్డు కిలోమీటరు దూరం వుంటుంది. బస్సులు వెళ్ళే మెయిన్ రోడ్లన్న మాట. దానిప్రక్కనే రాళ్ళ కాలువ ప్రవహిస్తూ వుంటుంది.
    
    ఇద్దరు నడుస్తూ మాటల్లో పడ్డారు.
    
    జితేంద్ర విషయం అడిగితే తప్ప చెప్పకూడదనుకుంది లిఖిత. ప్రస్తుతానికి ఆ ఆలోచనలు రాకుండా వుండడానికే తాను బయల్దేరింది. కాబట్టి వూరి విశేషాలు అడగడం ప్రారంభించింది.
    
    "వూరన్నాక సవాలక్ష జరుగుతుంటాయి. రకరకాల ఇబ్బందులు రకరకాల సమస్యలు....అవన్నీ వింటుంటే మనిషి జీవితమెంత సంక్లిష్టమైందో తెలుస్తుంది"
    
    "నిజమే..."
    
    ఇద్దరూ బస్టాండ్ చేరుకున్నారు. అక్కన్నుంచి తూర్పుకి నడిస్తే రాళ్ళ కాలువ వస్తుంది.
    
    వాళ్ళు తార్రోడ్డు ఎక్కేటప్పటికి బస్సొకటి వచ్చి ఆగింది. ఓ పదిమంది దాకా దిగారు.
    
    "ఆ ఎర్రటి పిల్లెవరు?" లిఖిత అడిగింది. వూరొదిలి రెండేళ్ళు కావడం వల్ల ఎవర్నీ సరిగా పోల్చుకోలేకపోతోంది.
    
    "ఆ పిల్లా.... సుబ్బరామయ్య కూతురు.... సుమతి..... నేను పట్టిన రెండో కేసు ఆమెదే!"
    
    లిఖితకు ఇంట్రెస్ట్ పెరిగింది.
    
    "రెండో కేసా! ఎలా పట్టావ్? ఇంతకీ ఆ పిల్ల హిస్టరీ ఏమిటి?" అని క్యూరియాసిటీతో అడిగింది.
    
    "చెబుతాను ముందు బస్సు పోనీ!"
    
    జనం అంతా దిగగానే కండక్టర్ విజిల్ వూదాడు.
    
    బస్సు వెళ్ళిపోగానే ఇద్దరూ రాళ్ళ కాలవకేసి నడక సాగించారు.
    
    రంగనాయకి తను పట్టిన రెండో కేసు గురించి చెప్పడం ప్రారంభించింది.
    
    "సుబ్బరామయ్య.... పక్కనున్న టౌన్ లో పంచాయితీ గుమస్తా అని తెలుసు కదా ఆయనకి ఇద్దరూ కూతుర్లు. సుమతి పెద్దమ్మాయి. వసుమతి రెండో అమ్మాయి.
    
    సుమతి అందంగా వుంటుంది..... చూశావ్ గదా మంచి స్ట్రక్చర్, ముఖ్యంగా ఆ పిల్ల ఎద రెండు పనసపండ్లను చర్మం లోపల పెట్టి కుట్టేసినట్టు ఎత్తుగా ఉంటుంది. ఇక నడుం అయితే శిధిల భవనంలా కనిపిస్తుంది. చదివింది పదో తరగతే అయినా మంచి తెలివైన పిల్ల.
    
    అలాంటి పిల్లకు మొగుడిగా ఎలాంటి వాడ్ని కట్టాలి! చీఫ్ గా వస్తున్నాడు గదా అని వెంకటగిరి దగ్గరున్న ఓ పల్లెటూర్లో రాఘవులు అనే అతనికి ఇచ్చి కట్టబెట్టారు.
    
    అతను ఇళ్ళు కట్టే మేస్త్రీ పరమ నీచుడు.... ముఖ్యంగా స్త్రీల పట్ల పెళ్ళామంటే మనిషని గుర్తించని రకం పేదవాడి భార్యకు ఆకలితో పాటు అవమానాలూ తప్పవు. వాడు ఆమెను పనిమనిషి కంటే హీనంగా చూసేవాడు.
    
    ఆ పిల్ల కాపురానికి పోయిన మూడో వారంలోనో, నాలుగో వారంలోనో ఓ ఆదివారం పూట ఆ వూర్లో పొట్టేలు కోశారు.
    
    "ఈ రోజు మనింట్లో మటన్..." అని తెల్లారగట్టే ఓ స్టీలు గిన్నె పట్టుకొని వెళ్ళాడు రాఘవులు.
    
    రోజూ చింత తొక్కుడు పచ్చడి, కారం తినీ ఆ పిల్లకూ నాలుక బండ బారిపోయింది. అందుకే మటన్ అంటే నోట్లో లాలాజలం వూరింది.
    
    ఉదయం వెళ్ళిన మంసిహి పదిగంటలకి తిరిగొచ్చాడు. గిన్నెలో చూస్తేనే తెలిసింది అది పావుకేజీ కూరని.
    
    "పండు" అంటూ పెద్ద ఫోజుతో గిన్నెను ఆమె ముందుకి తోశాడు.
    
    తామిద్దరికీ రెండు పూటలకీ సరిపోతుందిలే అనుకుంటూ సుమతి వంట ప్రారంభించింది.    

 

    "వుడికిందో లేదోనని ఒక ముక్క, ఉప్పూ కారం పట్టిందో లేదో నని ఒక ముక్కా... ఇలా తినేశావ్. నేను ఎన్ని ముక్కలో లెక్క పెట్టాను మొత్తం పదహారు. వండిన తరువాత కూడా గిన్నెలో అన్నే ముక్కలుండాలి. లేకపోతే తాట వలిచేస్తాను" అని సీరియస్ గా పోతున్న వాడిని ఆమె అసహ్యంగా చూసింది.
    
    ఇలాంటివాడు దొరికాడేమిటి భగవంతుడా అనుకుంది మొదటిసారి మనసులో.
    
    కొంతసేపు అలా బయట తిరిగి పది నిముషాలకే తిరిగి తయారై పోయాడు.

    "మనసంతా మటన్ మీదే వుందే" అని పొయ్యి ముందు కూలబడి పోయాడు.
    
    "మరో పది నిముషాలకి వంట పూర్తయ్యింది. ఆవురావురుమంటూ కంచం ముందు కూర్చున్నాడు.
    
    ఓ నాలుగు ముక్కలు మాత్రం తను వుంచుకొని మిగిలిన కూర అంతా అతనికి వడ్డించింది.
    
    వాడు గిన్నెలో తొంగిచూసి "అదెవరికి?" అని అడిగాడు.
    
    ఆ మాటకి ఒళ్ళు మండింది సుమతికి.
    
    "నువ్వొక్కడివి తింటే చాలా?"
    
    "ఇంట్లో వుండే ఆడదానికి మటన్ ఎందుకే నేనంటే బయట తిరిగి పనులు చెయ్యాలి. బలముండాలి" అని మరో మాటకు తావివ్వకుండా గిన్నెలోని కూరంతా తన కంచంలోకి బోర్లించుకున్నాడు.
    
    ఆమెకి ఏం చేయాలో పాలుపోలేదు. భరించువాడు భర్తంటే అని ఎప్పుడో చిన్నప్పుడు మాస్టారు చెప్పింది గుర్తుకు వచ్చింది. భరించువాడు కాదు. బాధించువాడు భర్త అని అనుకుంది.
    
    ఆమెకది పెద్ద అవమానంగా తోచింది. మొత్తం గిన్నెంతా వాడి ముఖాన బోర్లించి పుట్టింటికి వచ్చేయాలనిపించినా నిగ్రహించుకుంది.
    
    వాడు మొత్తం తిని తృప్తిగా తేపుతూ లేచాడు.
    
    వాడి నిజస్వరూపం బయటపడుతోంది.
    
    ఇది జరిగాక వాడితో పెద్దగా మాట్లాడడం మానేసింది. అలాంటి వాడితో అభిమానంగా ఎలా మాట్లాడడం?
    
    ఇది జరిగిన రెండోరోజు కాబోలు వాడు పని ముగించుకుని సాయంకాలం ఇంటికి చేరుకున్నాడు.
    
    అలిసిపోయి ఇంటికి వచ్చాడు కదా అని గ్లాసుతో నీళ్ళు అందించింది.
    
    "ఇదేమిటి ఇంత చిన్న గ్లాసుతో నీళ్ళిస్తున్నావ్. పెద్ద చెంబుతో ఇస్తే నీ సొమ్మేం పోతుంది" అని విసుక్కున్నాడు.
    
    మరుసటి రోజు సరేలెమ్మని చెంబుతో నీళ్ళిచ్చింది. వాడు చెంబు వంకా, ఆమె వంకా ఎగాదిగా చూసి "చెంబుతో నీళ్ళిస్తున్నావ్ నేనేమన్నా రాక్షసుడినా గ్లాసుతో ఇవ్వు" అన్నాడు కోపంతో.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS