శీలం!
రాజారావు తన పెళ్లామంటే చచ్చిపోతాడు. అంత అందంగా అంత మరిపెంగా వుంటుంది సుశీలకూడా.
ఒకరోజు రాజారావు నాతో అన్నాడు 'నా పెళ్లాం శీలానికి పరీక్ష పెట్టాలోయ్' అని.
"ఇదేం వెధవబుద్ది" అన్నాను.
కాదు - నువ్వు నాకు తెలియకుండా ట్రయల్స్ వేయమన్నాడు. వాడే వాడి ఇంటికి ఎదురుగా వున్న మేడమీద రూం ఇప్పించాడు.
ఆ రూం నుండి చూస్తే రాజారావు బెడ్ రూం ....... బాత్ రూమ్... వెనకా అంతా కన్పిస్తుంది.
సుశీలకు నేను రాజారావు స్నేహితుడనని తెలియదు. రాజారావుకన్న నేను చాల అందంగా వుంటాను. అన్నిట్లో అధికుడ్ని కూడ.
రాజారావు ఉద్దేశ్యం ఏమంటే - తన పెళ్లాం శీలం ఎంత గట్టిదో - పరీక్షించాలని.
సరె, సగటు ప్రేమికుడిలాగ - నేను సుశీలకు ఫోజులు కొట్టడం ప్రారంభించాను.... నేను ఫోజులివ్వటం సాగించిన వారం వరకు రాజారావు చాల సంతోషంగా వున్నాడు.
'ఏమని!' అడిగాను.
"నీవు చేసే వెధవ చేష్టలన్నీ సుశీల నాకు ఎప్పటికప్పుడు చెప్తూనే వుంది. నీకు వార్నింగ్ కూడా ఇమ్మంది...." అని నవ్వేడు...
మరో పదిరోజులు గడిచాయి.... ఈ పదిరోజుల్లో చివరి అయిదురోజులు ఆనందించటం నావంతయ్యింది. ...ఎందుకంటే సుశీలనుండి మార్పులు రాసాగాయి. అయితే భయపట్టం కూడా నా వంతే అయ్యింది....
సుశీల... మారిపోతుందా..... పరీక్షలో ఓడిపోతుందా..... అనే దిగులు పట్టుకొంది. అయినా నా ట్రయల్స్ నిరాటంకంగా సాగుతూనే వున్నాయి....
ఆ రోజు ఆఫీస్ లో రాజారావు నా దగ్గరకు వచ్చి.,... 'సుశీల గట్టిదోయ్' అన్నాడు. నను ఆశ్చర్యంగా చూస్తుండిపోయాను.
'ఇక నీగురించి చెప్పటం మానేసింది మొన్నటినుంచి. అసలు నీ వునికినే పట్టించుకోవటం లేదు' అన్నాడు.
మౌనంగా కూర్చుండిపోయాను.
ఇంట్లో వున్నంతసేపు తనని గమనిస్తూనే వున్నాన్నేను. ఏమైనా నా సుశీ నిప్పు!' గర్వంగా చెప్పాడు.
నేనూ... .'ఇంకేం - గది ఖాళీచేస్తాను...' అన్నాను.
'చేసెయ్' అనేసి వెళ్లిపోయాడు....
నేను రూంకి వచ్చాను. ఆఖరిసారిగ ట్రై చేద్దామని చూశాను....
అంతే!
ఆహ్వానం వచ్చింది...
అవకాశం జారవిడుచు కోవటం నా అభిమతం కాదు....
గబ గబ ఎవ్వరూ చూడకుండా వెళ్లాను....
సుశీల స్వర్గాన్ని చవి చూపించింది. .. సుశీల ఓడిపోయిందనీ, స్నేహితుడికి ద్రోహం చేస్తున్నాననే తలంపు బాధించినా - సుశీల అందం, మురిపెం నన్ను ఆమె వొడిలో వాలిపొమ్మని లాలించాయి.
అంతా అయింతర్వాత అడిగాను.
'మీ ఆయనకు తెలిస్తే....'
'నీవా రూం లో చేరిన దగ్గరనుండి పదిరోజుల వరకు నువ్వు చేసే కోతివేషాలు, నీవుచేసే ప్రతి వెధవపని ఆయనకి చెప్తూనే వున్నాను. ఆయనలో చలనం లేదు... నీకు గట్టిగా బుద్దిచెప్తాడని అనుకొన్నాను. అదేం లేకుండా శుద్ద బుద్దావతారంలా ఇంట్లో కూర్చుంటున్నారు... దాంతో నాకు విసుగుపుట్టి ఆయనతో చెప్పటం మానేశాను. కానీ నిన్ను చూస్తుంటే.... నీ బాధ చూస్తుంటే.. .జాలివేసి... ఈ రోజు ఈ ఆనందాన్ని నాపరం చేసికున్నాను...' అంది నన్ను గుండెలకు హత్తుకుంటూ.
నేను వణికిపోయాను ఆ సమాధానానికి.
ఆ మర్నాడు గది ఖాళీచేసి వెళ్లిపోయాను. తర్వాత ట్రాన్స్ ఫర్ చేయించుకొని ఆ వూరినుండే వెళ్లిపోయాను.
కొన్నాళ్లకు రాజారావునుండి ఉత్తరం వచ్చింది...
'మా సంసారం దివ్యంగా వుంది. సుశీలను అనుమానించటం - నిన్ను ట్రయల్స్ వేయమని చెప్పటం - సుశీలనే అవమానించినట్లుగా భావిస్తున్నానిప్పుడు. నా సుశీల నిప్పు. ఓ రోజు నీగురించి అడిగాను.... 'దరిద్రం వదిలింది. వాడూ - వాడి వెధవచూపులూ - ఎర్రగా బుర్రగా వుండగానే సరా! సంస్కారం వుండక్కర్లా!' అంది. క్షమించు - సుశీలకు నీ మీద అలాంటి అభిప్రాయం కలుగజేసినందుకు. ఇప్పుడు గర్బవతి. చాలా ఆనందంగా వుంది. ఆ రూం ఇంకా ఖాళీగానే వుంది. అసలు విషయం నేను సుశీలకు చెప్పనేలేదు. చెప్తే నా మీద వున్న గుడ్ ఇంప్రెషన్ పోతుందని భయం. వుంటాను....
నీ రాజారావ్.
ఆ ఉత్తరం చదువుకొని ఆలోచనల్లో పడిపోయాను....
బుర్ర వేడెక్కిపోయింది.
"చాయ్" కోసం రూం తాళం వేసి బయలుదేరాను....
"శీలం నా తలపై పొడుస్తుంది అంకుశంలా.
(ఈ రచనను ఇన్సిపిరేషన్ ఇచ్చింది. కె. రవీంద్రప్రసాద్ గారు. ఆయనకు నా కృతజ్ఞతలు - రచయిత)
*
