తర్వాత ఇంకో కాగితం తీసుకొని వరలక్ష్మి పెట్టే ఖర్చు వివరాలు వ్రాసుకొచ్చాడు ఓపికగా.
ఉదయం ఆవిడ ఆఫీసుకి వెళ్లడానికి రిక్షాకోసం పెట్టేఖర్చు.
పిల్లలని చైల్డ్ కేర్ సెంటర్లో విడిచిపెట్టడానికి. మళ్లీ సాయంత్రం తీసుకురావడానికి వరలక్ష్మి మొగుడికయే ఖర్చు.
చైర్డ్ కేర్ సెంటర్ లో ఇద్దరు పిల్లలకి నెలనెలకి కట్టాల్సిన మొత్తం.
సాయంత్రం వరలక్ష్మి మొగుడు టిఫిన్ కోసం పెట్టే ఖర్చు.
ఆఫీస్ కి వెళ్లడానికిగాను వరలక్ష్మి నెలకి పౌడర్, స్నోలలాంటి కాస్మాటిక్స్ కోసం పెట్టేఖర్చు. ఇంట్లో వుంటే ఆ ఖర్చు తప్పుతుంది కాబట్టి అమరేంద్ర అవీ తీసుకొన్నాడు లెక్కకి.
ఈ విధంగా వరలక్ష్మి ఇంట్లోలేకుండా బయటికి వెళ్లి వుద్యోగం చేసి రావడానికి ప్రత్యేకంగా చేసే ఖర్చుల వివరాల జాబితా వ్రాసి వాటిని కూడాడు.
చేతికివచ్చే జీతంలోంచి ఆ ఖర్చుని తీస
రెండువందల ఇరవైనాలుగు జమన కనబడింది.
ఉద్యోగంలో చేరినవరలక్ష్మి కొన్న కొత్తచీరలు గుర్తు తెచ్చుకొని, వాటి ఖరీదులు షుమారుగా వేసి మళ్ళీ కూడాడు తర్వాత చిన్నగా నిట్టూర్చాడు.
సాయంత్రం తన మిత్రుడు వచ్చాక అన్నాడు అమరేంద్ర కసిగా, కోపంగా.
'వీళ్లకి బుద్దిలేదు'
'ఎవరికి?"
'ఎవరో అందరూ? అందరికీ?
"మొదట భర్తలకి"
"అదేం?"
'వాళ్లకి వుద్యోగాలుండగా మళ్లా పెళ్లాలని వుద్యోగాలకి పంపుతున్నందుకు. వాళ్ల జీతం సరిపోతుందిగా? అయినా ఆశ. తర్వాత వుద్యోగాలిచ్చే వాళ్లకి. భర్త వుద్యోగం చేస్తూండగా మళ్లా ఆ అభ్యర్దికి వుద్యోగం ఇవ్వటం నిజంగా అన్యాయం.'
"ఏం?
'నాలాంటి నిరుద్యోగులం, నీలాంటి ధర్మాత్ముల గదుల్లో వుచితంగా వుంటూ వుద్యోగ ప్రయత్నాలు జీవితాంతం చేసుకోవాల్సి వస్తున్నందుకు. భర్తలకి చక్కటి వుద్యోగాలున్న ఆడవుద్యోగుల్ని ఇంటిదగ్గర పనులుచేసుకొండి పొండి, అని పంపేస్తే కొన్ని వేలమంది నిరుద్యోగులకు వుద్యోగాలు దొరుకుతాయి వెంటనే ఆ ఖాళీల్లో'
'వాళ్లమీదగా పోతుందే నీ కోపం?'నవ్వుతూ అడిగాడు అమరేంద్రని అతని మిత్రుడు.
"వరలక్ష్మి వల్లే నాకు - లేదా నాలాంటి మరో నిరుద్యోగికి వుద్యోగం రాలేదు. ఈవిడ చేసే వుద్యోగంలో చేతికి వచ్చేది రెండువందల ఇరవైనాలుగు రూపాయలే. ఆ డబ్బు కూడా చీరలకి, నగలకి ఖర్చుపెడతారు సాధారణంగా. ఇంత హైరానాపడి, పిల్లల్ని పరాయిపంచన కూలివాళ్లదగ్గర పారేసి వీళ్లు సాధించేది ఇంటినిండా చీరలు, కొద్దిపాటి సామాను. ఆ చీరలు సామాను లేకపోయినా వాళ్ల సంసారం సుఖంగా సాగిపోతుంది?"
కాని బ్రదర్. మాలాంటి నిరుద్యోగులకే ఆ వుద్యోగం దొరికితే వాళ్ళా బ్రతికే అవకాశం వస్తుందిమాకు. కొంత మంది ఆకలిని తీర్చగలం!!
ఆలోచనగా చూశాడు అమరేంద్ర వంక అతని మిత్రుడు.
'అవును! ఇక్కడ మేం ఉద్యోగం లేక, కూటికి గతిలేక బాధపడుతుంటే, వాళ్లు నగల, చీరలలు కూడా బెట్టుకొంటున్నారు. ఇది నిజంగా సాంఘిక దురన్యాయం. ఆర్దిక అసమానత్వానికి దారితీయించే కారణం.'
'మేడమెట్లు అటు పైకెళ్లి వరలక్ష్మి దగ్గర చెప్పు ఇదంతా.'
'పిచ్చివాడి ననుకుంటుంది. నే చెప్పిందాట్లో నిజం లేదంటావా?'
"ఉంది"
"లెటర్స్ టు ది ఎడిటర్ కి రాయనా?"
'రాయి'
'అయితే ఓ ఇరవై అయిదు పైసల కవరు అప్పివ్వలు బ్రదర్' అన్నాడు అమరేంద్ర నవ్వుతూ.
* * * *
అమరేంద్రకి రెండుసంవత్సరాల తర్వాత వుద్యోగం వచ్చింది. ఆ తర్వాత ఆరునెలలకే పెళ్లి అయింది. పెళ్లయిన ఆరునెలలకి అమరేంద్రని అతని భార్య ఓ రోజు.
"ఏమండీ? మీరు పనిచేసే చోట ఏదయినా పోస్ట్ ఖాళీవుంటే అప్లై చెయ్యనా? నాకు వుద్యోగం చేయాలని వుంది."
"నే బ్రతికుండగా నువ్వు వుద్యోగంచేస్తే సహించలేను" కోపంగా చెప్పాడు అమరేంద్ర.
అమరేంద్ర ఏల్. డి. సి. గా పనిచేస్తున్నాడు ఆర్టీసీలో. అదేచోట. అదే సెక్షన్ లో వరలక్ష్మి ఇప్పుడు యం. డి. సి గా పనిచేస్తోంది.
వరలక్ష్మికి యు. డి. సి. గా ప్రమోషన్ వచ్చి ఖాళీ అయిన ఆమె సీట్ లో చేరాడు అమరేంద్ర.
*
