Previous Page Next Page 
సౌజన్యసాహితి పేజి 20

           
    
                            'ప్రేమకు చివర?'(మినీకథ)


                                                                              ---- పసుపులేటి వెంకటరమణ.
     నేను కాలేజీ చదువుకోసం వచ్చిన దగ్గరనుంచీ హరితో నాకు పరిచయమేర్పడింది. నా రూం దగ్గరలోవున్న పార్కులో రోజూ సాయంత్రం కాలక్షేపం చేయడం ఇద్దరి దినచర్యలోనూ ముఖ్యమైనది. పార్కులో కూర్చున్నంత సేపూ  వాడి ప్రేమపురాణం చెబుతుండేవాడు. నాకు ఆ అనుభవం యింతవరకు లేకపోవడంతో వాడు చెప్పే ప్రతి విషయాన్నీ శ్రద్దగా వినేవాడిని.
     హరి ప్రేమించిన కరుణది అతనికులం కాదు. ఆర్దిక వ్యత్యాసాలు కూడా యిద్దరిమధ్యా  చాలా వున్నాయి. అయినప్పటికీ అవేవీ తమ పెళ్లికి అడ్డు రావనేవాడు. కరుణని ఒకసారి చూపించాడు. సన్నగా, నాజూగ్గా వుంది. బాగావుంది.
     ఒకరోజు మధ్యాహ్నం నా రూంకి వచ్చాడు హరి.మనిషంతా ఆనందంతో తడిసివున్నాడు. రెండుస్వీట్లు నోట్లో వేసి 'గుడ్ న్యూస్ బ్రదర్' అన్నాడు. చెప్పమన్నాను.
     'కరుణతో పెళ్లివిషయం మాట్లాడాను'
    'ఏమంది' 'ఒప్పుకుంది'
    'మరి మీ ఇంట్లో ఒప్పించగలవా' సందేహంగా అడిగాను.
     ఒప్పిస్తాను, లేకుంటే ఎండ్రిన్ త్రాగి చస్తానుగానీ యింకో అమ్మాయిని చేసుకోనురా' చాలా దృఢంగాగానూ, ఆవేశంగానూ అన్నాడు.
     'అంతపనెందుకురా, మేమంతా లేమా' అన్నాను వాడి ధైర్యానికి మెచ్చుకుంటూ.
     డిగ్రీ రెండో సంవత్సరం పరీక్షలవగానే మా వూరెళ్లి పోయాను. హరినుండి అప్పుడప్పుడూ లెటర్స్ వచ్చేవి. ఓ పదిరోజుల ఆలస్యం తర్వాత ఓ శుభలేఖ అందుకున్నాను. వరుడు హరి, వధువుమాత్రం కరుణకాదు. చాలా ఆశ్చర్యమేసింది.
     తల్లీ తండ్రీ విషంత్రాగి ఛస్తామన్నారనీ, కులాంతర వివాహం చేసుకుంటే చెల్లెలికి పెళ్లికాదనీ... ఇలాగే తన్ను సమర్దించుకొనే కారణాలతో ఓ జాబుకూడా జతచేసాడు నా వ్యక్తిగత కారణాలవల్ల పెళ్లికి వెళ్లలేక పోయాను 'గ్రీటింగ్స్' మాత్రం పంపాను.
     కాలేజీ తెరిచిన నాల్గోరోజు మళ్లీ పట్టణం చేరుకున్నాను. ఆరోజు సాయంత్రం హరి కలిశాడు. పదిహేను వేలు కట్నం యిచ్చారట. చెల్లెలి పెళ్లికి దిగుల్లేదు అన్నాడు. డిగ్రీ పూర్తవగానే  వుద్యోగం కూడా మామగారే యిప్పిస్తాన్నార్ట.
     వుండబట్టలేక కరుణ విషయం నేనే కదిపాను. కాసేపు ముభావంగా వున్నాడు. 'నా పెళ్ళిరోజున ఎండ్రిన్ త్రాగి చచ్చిపోయింది' అన్నాడు ఎలాటి భావంలేని ముఖంతో. కరుణతో పెళ్లికాకుంటే ఆత్మహత్య చేసుకుంటానన్న హరి కనిపిస్తాడేమోనని ఆ ముఖంలోకి చూశాను. అటువంటి హరి నాకు కన్పడలేదు.
     ఆ తర్వాత నేను ఎప్పుడూ హరితో మాట్లాడడానికి ప్రయత్నించలేదు.     
                                        *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS