Previous Page Next Page 
స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్ పేజి 18

 

    "తాళాలు చెక్కుచెదరలేదు, ఇనుప ఊచల్తో తీశారు. అలా తీయగలిగింది వాళ్ళొక్కరే-"    
    "ఎక్కడ తాళాలు చెక్కుచెదరకుండా తీయబడినా అది స్టూవర్ పురం దొంగల పనే అన్న నీ నిర్ణయం మెచ్చుకోదగినదే కానీ- రెండు సంవత్సరాల క్రితం రామస్వామి కూడా అలాగే ప్రయత్నించాడు కదా! మరి అతడెందుకు విజయం సాధించలేక పోయాడు?"    
    యస్సై జవాబు చెప్పకుండా అక్కడనుంచి వెళ్ళిపోయాడు.    
                                               *    *    *    
    రాత్రి ఎనిమిది కావొస్తూంది.    
    వెన్నెల గుడిసెలమీద, ఇళ్ళమీద సమానంగా పడుతూంది. కొందరు పిల్లలు గుడిసెల ముందు ఆడుకుంటున్నారు. కొందరాడవాళ్ళు పక్కనే వంట చేసుకుంటున్నారు. అప్పుడే పొలాల నుంచి వచ్చినవాళ్ళు మంచాలమీద పడుకుని వున్నారు పిల్లల అరుపులు, మాటలు తప్ప అక్కడంతా నిశ్శబ్దంగా వుంది.    
    ఆ నిశ్శబ్దంలోంచి దూరంగా మోటారు శబ్దం వినిపించింది. ఒకటి కాదు. .....నాల్గయిదు వాహనాల చప్పుడు.    
    "పోలీసులొస్తు....న్నా...ర్రో.... య్..." ఎవరో అరిచారు. క్షణాల్లో అక్కడి ప్రశాంతత బ్రద్దలైంది.    
    వ్యాన్లు నాలుగు వైపులనుంచీ చుట్టుముట్టాయి. పిల్లలు ఏడుపులు, ఆడవాళ్ళ కేకలు-మొగవాళ్ళు పరుగెడుతున్నారు. వృద్దులు చూస్తున్నారు. అంతా గందరగోళంగా తయారైంది. నాలుగు వైపులనుంచీ పోలీసులు చుట్టుముట్టడంతో ఎటు పారిపోవాలో తెలియలేదు. దొరికినవాణ్ణి దొరికినట్టు బాది వ్యాన్ లో పడేస్తున్నారు.    
    అరగంటలో అంతా పూర్తయింది. మొగవాడు అన్నవాడెవడూ ఆ స్టూవర్టుపురంలో మిగల్లేదు. ఆడవాళ్ళు ఏడుపులు మిగిలాయి. ఊహ తెలిసిన పిల్లలు ఏడుస్తున్నారు. ఊహ తెలియని వాళ్ళు చిత్రంగా చూస్తున్నారు.    
    వ్యానులో జనాన్ని తీసుకొచ్చి స్టేషన్ లో పడేశారు. అందరికీ లాకప్ రూమ్ సరిపోలేదు. కాళ్ళకి గొలుసులు కట్టి కొంతమందిని స్టేషన్ బయట చెట్టుక్రింద వుంచారు. ఇంటరాగేషన్ ప్రారంభమయింది.    
    ఇంటరాగేషన్ అంటే ఎక్కువ ప్రశ్నలేమీ లేవు. "నగలేం చేశావో చెప్పు-" అంటూ బాదటం. "వాడు నాకేమీ తెలియదు బాబో" అంటూ ఏడవటం, వాడికి శోషవచ్చి పడిపోగానే మరొకడ్ని తీసుకెళ్ళి బాదటం....    
    ఇలా తెల్లవారే వరకూ సాగింది.    
    రాణా ప్రొద్దున్నే వచ్చి చూసేసరికి ఆ దృశ్యం హృదయవిదారకంగా వుంది. పోలీసు దెబ్బలు అవి. బయటికి కనపడవు. కానీ వాటి బాధ అతడికి తెలుసు. ఎన్నడూ రానంత కోపం యస్సైమీద వచ్చింది.    
    "ఏమిటది? ఎందుకలా చేశావ్?" అన్నాడు.    
    "మనం ఎంత తొందరగా ఈ కేసు తేల్చగలిగితే అంత మంచిది...."    
    "దానికీ ఈ కొట్టటానికీ సంబంధం ఏమిటి?"    
    యస్సై తబ్బిబ్బై చూశాడు.    
    "పోలీస్ స్టేషన్ లో కొట్టటం తప్పు కాదు సర్-" ఇది మీకు కొత్తగా వుందా- అన్నట్టు అడిగాడు.    
    "ఒక దొంగచేత వివరాలు చెప్పించటానికీ, మన ఇన్వెస్టిగేషన్ సులువు అవటానికీ, థర్డ్ డిగ్రీ ఉపయోగించవచ్చు సుధాకర్, కానీ ఎవరు దొంగలో తెలియకుండా ఈ లాకప్ లేమిటి?"    
    "వాళ్ళు క్రిమినల్స్ సర్-"    
    "ఇప్పుడు కాదు ఒకప్పుడు...." అన్నాడు రాణా. "వాళ్ళు పది సంవత్సరాలు, పన్నెండు సంవత్సరాలు శిక్ష అనుభవించి జైళ్ళనుంచి బయటకొచ్చారు. వాళ్ళు మారటానికి సిద్దంగా వున్నారు. వాళ్ళని సెటిల్ మెంట్ గ్యాంగ్ గా ప్రకటించి ప్రభుత్వం ఇళ్ళ స్థలాలు ఇచ్చింది. పొలాలు పంచింది. వాళ్ళ జీవితాల్లో ఆశాకిరణం ప్రతిబింబించే సమయంలో తిరిగి మనం లాకప్ లో పెడుతున్నాం. 'మీరు క్రిమినల్స్ రా! మీరు మారటానికి వీల్లేదు' అని తిరిగి చావబాదుతున్నాం. ఒక రకంగా మళ్ళీ మనమే వాళ్ళని పాతదారుల్లోకి తోసివేస్తున్నాం."    
    "వాళ్ళని వదిలి పెట్టెయ్యమంటారా?"    
    సుధాకర్ మాటల్లో వ్యంగ్యం ఏదైనా వుందేమో అని చివుక్కున తలెత్తాడు రాణా. అటువంటిదేమీ కనపడలేదు. మీ ఇన్ స్ట్రక్షన్స్ ఏమిటో చెప్పండి- అని పై అధికారి సూచన్లకోసం వేచివున్నట్టు నిలబడ్డాడు యస్సై.
      అంతలో డియస్పీ హడావుడిగా వచ్చాడు. "ఏమిటి, ఏమైంది? ఏమైనా విషయం తెలీదా? వాళ్ళు నోళ్ళు విప్పారా?" అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు.    
    సుధాకర్ రాణావైపు చూశాడు. జవాబు చెప్పవలసిన బాధ్యత తనమీద వున్నట్టు రాణా లేచి నిలబడ్డాడు. "వాళ్ళు కాదు అసలు దొంగలు."    
    "మరెవరు?"    
    రాణా జవాబు చెప్పలేదు. డియస్పీ అతనివైపు చిత్రంగా చూశాడు. "రెండ్రోజుల్లో మనం దొంగల్ని పట్టుకోకపోతే మినిష్టర్లకి జవాబు చెప్పుకోవలసి వుంటుంది తెలుసా?"    
    రాణా దానికీ జవాబు చెప్పలేదు.    
    డియస్పీ అతని దగ్గిరగా వచ్చాడు. "నువ్వొక నెలరోజులు సెలవుమీద వెళ్తే బావుంటుందేమో చూడు రాణా" అన్నాడు.    
    అంతకన్నా అవమానం ఏ పోలీసు అధికారికీ వుండదు. తమాయించుకున్నాడు. "నాకో రెండు రోజులు టైమివ్వండి సార్. నేను అసలు దొంగల్ని పట్టుకొగలననే అనుకుంటున్నాను" అన్నాడు.    
    డియస్పీ అతని దగ్గిరకొచ్చాడు. "నువ్వు చాలా గొప్పవాడివి అని అనుకుంటూంటే మాకేమీ అభ్యంతరం లేదు రాణా. కానీ మా పనికీ, మా విధానానికీ మమ్మల్ని వదిలిపెట్టు" అని అక్కన్నుంచి వెళ్ళిపోయాడు.    
                                            *    *    *    
    అతడు దాదాపు నాలుగ్గంటల నుంచీ తాగుతున్నాడు. తాగుడు మనిషిని యుద్దానికి ఆయత్తం చేయదు. తనలో తాను కృంగిపోయేలా చేస్తుంది. ఆ విషయం అతడికీ తెలుసు. కానీ గుండెల్లో బ్రద్దలవుతూన్న అగ్నిపర్వతపు లావాని ఆర్పటానికి తాగుడినే ఆశ్రయించక తప్పలేదు.    
    రాత్రి పదకొండింటికి - ఇంకా అతడి గదిలో లైటు వెలుగుతూ వుండటం చూసి అలక్ నంద ఇక వుండబట్టలేక ఆ పోర్షన్ లోకి వచ్చింది. ఏదో జరుగుతూందాని తెలుసుకానీ, ఏం జరుగుతూందో తెలియక ఆమె ఆ రోజంతా కాలుకాలిన పిల్లిలా తిరుగుతూ వుండిపోయింది. ఆమె అతడి ఆకారం చూసి భయపడి పోయింది. అతడి కళ్ళు అగ్నిగోళాల్లా వున్నాయి. మనిషిలా లేడు మూర్తీభవించిన దైన్యం క్రౌర్యం మిళితమైన వాడిలా వున్నాడు. అతడిని ఆ విధంగా చూడటం అదే ప్రధమం. "ఏమండీ- ఏమిటండీ ఇది" అని అడిగింది భయంగా.    
    "నన్ను కొంచెంసేపు ఒంటరిగా వుండనివ్వు" అన్నాడు కర్కశంగా ఆమె కళ్ళనీళ్ళు పెట్టుకుంది. అతడు తమాయించుకుని "నీకు తెలీదు అలక్ నందా- నా బాధ నీకు అర్ధంకాదు" అన్నాడు.    
    "ఏమైందండీ."    
    "గుడి నగల దొంగతనం విషయంలో పోలీసులు స్టూవర్ట్ పురం దొంగల్ని చావబాదుతున్నారు."    
    "అవును వాళ్ళని జైల్లో పెట్టారట. చెప్పుకుంటున్నారు."    
    "కానీ వాళ్ళు ఆ దొంగతనం చేయలేదు. చేసింది ఎం.పీ. కొన్ని రోజుల క్రితమే వాళ్ళతో అతను బేరం పెట్టాడు. వాళ్ళు దానికి వప్పుకోలేదు. అతడు వేరే రకంగా ఆ దొంగతనం చేయించాడు. నేరం వాళ్ళమీద పడింది. ఈ విషయం వాళ్ళు స్వయంగా నాతో చెప్పారు."    
    ఆమె మాట్లాడలేదు.    
    "రెండు సంవత్సరాల క్రితం ముందొకసారి ఈ ప్రయత్నం జరిగింది తెలుసా? గుడి గార్డులనీ, పూజారి కొడుకునీ చంపేశారు."   
    "అవును రామస్వామి అని స్టూవర్ట్ పురం గ్యాంగ్ వాడే ఈ హత్యలు చేశాడట-"    
    "కాదూ...." రాణా గట్టిగా అరిచాడు. "రామస్వామి ఈ మర్డర్లు చేయలేదు. ఎందుకంటే.... ఎందుకంటే... రామస్వామి నా తండ్రి కాబట్టి."    
    ఆమె స్తబ్దురాలై చూసింది.                                             

                                                     *    *    *

    "ఎక్కడ ప్ర్రారంభమైన మనిషి జీవితం ఎక్కడ అంతమవుతుందో చెప్పటానికి నేనే ఉదాహరణ. నా తండ్రి ఒక స్వాతంత్ర్యయోధుడూ, దేశంకోసం సర్వం త్యాగం చేశాడు- అనుకుంటూ గర్వపడుతూ వుండే నాకు, నా అసలు తండ్రి ఒక స్టూవర్ట్ పురం దొంగ అని తెలిసినప్పుడు తల్లడిల్లిపోయాను. ఒక కేసులో పన్నెండు సంవత్సరాలు శిక్ష అనుభవించి, జైలునే ఇల్లుగా చేసుకున్న నా తండ్రి, నన్ను చిన్నప్పుడే ఒక సర్వోదయ నాయకుడికి అప్పజెప్పాడు.    
    కామందుల నుంచి భూసేకరణోద్యమం ద్వారా మిగులు భూముల్ని సంపాదించి పేదలకు పంచటం వినోభాబావే శిష్యుల ఆశయాల్లో ఒకటి. అలా సేకరణ కోసం వెళ్ళినప్పుడు  నా తండ్రి పసిగుడ్డుగా వున్న నన్ను ఆ సర్వోదయ నాయకుడి పాదాలదగ్గిర పడుకోబెట్టి బాధ్యత స్వీకరించమని వేడుకున్నాడు. ఆయన్నే నా తండ్రిగా భావిస్తూ నేను పెరిగాను.    
    స్టూవర్ట్ పురం దొంగలకి ప్రభుత్వం పొలాలు ఇచ్చింది. మామూలు పౌరులుగా బ్రతకటానికి సాయపడింది. చెంబల్ లోయలో బందిపోట్లు వినోభాబావేకి లొంగిపోయినట్టే, స్టూవర్ట్ పురంలో కొందరు దొంగలు మంచి వ్యక్తులుగా మారటానికి నిశ్చయించుకున్నారు. అందులో నా తండ్రి ఒకడు.    
    నా పెంపుడు తండ్రి మరణిస్తూ నా అసలు తండ్రి అయిన రామస్వామి దగ్గరకు నన్ను పంపాడు. స్వాతంత్రయోధుడైన నా పెంపుడు తండ్రి బోధనలు నన్ను ఎంతో ప్రభావితుడిని చేశాయి. "ఒక మనిషి గత చరిత్ర చూసి ద్వేషించనవసరంలేదు. ప్రేమించటం కన్నా గొప్ప వారం ఇంకొకటి లేదు....." ఇలాంటి భావాలతో స్టూవర్ట్ పురం వచ్చిన నాకు న తండ్రి తిరిగి పోలీస్ స్టేషన్ లో వున్నాడని తెలిసింది.    
    ఆ రాత్రి నాకు బాగా గుర్తు.    
    బాగా వర్షం కురుస్తూంది. హోరుగాలి రివ్వున వీస్తూంది.    
    ఉరుముల ధ్వనిని అధిగమిస్తూ పోలీస్ స్టేషన్ నుంచి నా తండ్రి ఆర్తనాదాలు బయటకు వినిపిస్తున్నాయి.    
    పోలీసులు నా తండ్రిని చావబాదుతున్నారు.    
    కారణం చాలా చిన్నది ఎక్కడో ఏదో దొంగతనం జరిగింది. ఆ సందర్భంగా ఎవరో ఎవర్నో హత్య చేశారు. అనుమానం మీద నా తండ్రిని తీసుకువచ్చి కొడుతున్నారు. నేరం వప్పుకొమ్మని బలవంత పెడుతున్నారు.    
    పోలీస్ స్టేషన్ లో యస్సైతో నేను బాగా గొడవపడ్డాను. యస్సై నన్ను బెదిరించాడు. రామస్వామి కొడుకునంటే, "ఆ చిన్న కారణం చాలు నిన్ను కూడా పడేసి కొట్టటానికి" అంటూ హేళన చేశాడు.    
    రక్తపు ముద్దలా పడివున్న నా తండ్రిని పొదివి పట్టుకుని ఇంటికి తీసుకొచ్చాను. "మా జీవితాలు ఇంతే బాబూ. మారదామన్నా మారనివ్వరు మమంల్ని నువ్వు పోలీసువై మా వూరు తిరిగిరా మా స్టూవర్ట్ పురం వాళ్ళని ఉద్దరించు" అని వేడుకున్నాడు నా తండ్రి. అంతవరకూ తిరిగిరానని నాతో ఒట్టు వేయించుకున్నాడు.    
    తిరిగి నేను పట్నం వచ్చాను. కష్టపడ్డాను. పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం వచ్చింది. నా తండ్రికి ఉత్తరం వ్రాశాను. "నాన్నగారూ! మీరు కోరినట్టే ఇన్ స్పెక్టర్ నయ్యాను. మనవూరు ట్రాన్స్ ఫర్ చేయించుకోవటానికి ప్రయత్నిస్తాను. నాకు చేతనయినంతలో అక్కడి పరిస్థితులు మార్చటానికి కృషి చేస్తాను" అని వ్రాశాను. నాకెందుకో నా కన్న తండ్రి అంటే అంతులేని అభిమానం ఏర్పడింది. ఏ పరిస్థితుల్లో ఆయన దొంగ అయ్యాడో తెలీలేదు కానీ కన్న కొడుకునే సర్వోదయ నాయకులకి అప్పగింఛాడంటే, జీవితంలో ఆయన ఎంత ఇన్ సెక్యూరిటీ ఫీలింగ్ అనుభవించాడో ఊహించగలను. పోలీసులు కొడుతున్నా - రాజకీయ నాయకులు వత్తిడి తెస్తున్నా ఆయన తిరిగి దొంగగా మారలేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS