ఆ రోజు అంతా ప్రయాణపు సందడిలో వున్నారు - ఎల్లుండి పిల్లలకి స్కూళ్ళు తెరుస్తారు కనుక ఇక బయలుదేరాలని అన్నయ్యలు వదినలు నిశ్చయించుకున్నారు.
అన్నయ్యలిద్దరూ కూడబలుక్కుని తండ్రి దగ్గర కొచ్చారు. రాజారావు చిన్నరేడియో చెవి దగ్గర పెట్టుకుని వార్తలు వింటున్నాడు.
లోకం చాలా మారిపోయింది. కొత్త కొత్త విధానాలు చాలా వచ్చేస్తున్నాయి అన్నిట్లోనూ మనం పూర్వంలాగ మన డబ్బు బాంక్ లో వేసుకోటమో, వడ్డీకి తిప్పటమో ఇంక చేయటం అనవసరం. ఇప్పుడు కొత్తపద్దతి వచ్చింది - ప్రపంచమంతా దాని వెంటపరిగెడుతోంటే, మనం ఇంకా పాత పద్దతులతో వెళ్ళడం అవివేకం - అందుకని మీతో ఒకమాట చెప్పాలనుకుంటున్నాం - అసలు పెద్ద నాన్న కొడుకులు ఎప్పట్నుంచో కంపెనీలో షేర్సు కొనటం తెలుసుకుని, బాగుపడ్డారు మనం కూడా షేర్సు కొందాం. మీరు మీ డబ్బు కూడా కొంత షేర్స్ లో పెట్టండి" రాజారావుకి షేర్సు విషయం ఎప్పుడో చెప్పాడు అన్నగారూ. మద్రాసులో రాజారావు అన్నగారు సినిమా డిస్ట్రిబ్యూటరు - సినిమాల్లో పెట్టమని, షేర్స్ లో పెట్టమని ఈ మధ్యకూడా రాజారావుకి రాశాడు ఉత్తరం. కానీ, ముందు కొబ్బరితోటలు అమ్మద్దనుకున్నాడు రాజారావు తర్వాత అమ్మడానికి సిద్దపడ్డాడు - ఆ వచ్చే డబ్బు ఎలా సద్వినియోగం చేయాలి అనే ఆలోచన రోజూ చేస్తున్నాడు - అనుకోకుండా వచ్చిన దినేష్ షేర్స్ విషయమై అందరినీ ప్రోత్సహిస్తున్నాడు.
'సరే - మీరంతా ఏం నిర్ణయిస్తే అదే. ఆ వ్యవహారాలన్నీ మీరే చూడాలిమరి. నేను లేచి తిరిగే ఓపికలో లేను కదా - అమ్మపోయాక నాకు అసలు జీవితం మీదే ఉత్సాహం లేదు - కాకపోతే మిమ్మల్ని, పిల్లల్ని చూస్తూ కాలక్షేపం చేస్తున్నా' అన్నాడు రేడియో చెవిదగ్గర పెట్టుకుని.
అన్నదమ్ముల ముఖాలు వికసించాయి. ముసలాయన అడ్డం కొడతాడనుకున్నారు. ఈ షేర్స్ వ్యవహారం ప్రపంచమంతా ఎప్పుడోవచ్చేసింది. మనమే వెనక పడ్డాం అనుకున్నారు అన్నతమ్ములు.
శారద విశేషాలు పెద్దగా తెలియని ఊళ్ళో వాళ్ళు దినేష్ గురించి ఏమీ పట్టించుకోలేదు. అయినా ఎక్కువ ఆసక్తి చూపించే అవకాశం లేకుండా, దినేష్ వాళ్ళందరినీ ఆకర్షించేస్తే వాళ్ళ షేర్స్ కొనటంపైన, ఆకంపెనీల నుంచి వచ్చేలాభాలపైన, ఆ లాభాలతో కట్టాల్సిన బిల్డింగ్స్ పైన, కొనాల్సిన తోటలపైన వాళ్ళ మనసంతా నిండిపోయివుంది. కనక దిఎంష్ గురించి అతను ఎక్కడివాడు అనే విషయం గురించి పట్టించుకోలేదు.
తెల తెలవారుతోంది. రాజారావు నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకున్నాడు. దొడ్లో మామిడి చెట్టు దగ్గర అట్నుంచి ఇటు తిరుగుతున్నాడు. అది అతని మార్నింగ్ వాక్ - మోకాళ్ళ నొప్పుల వల్ల రోజూ అలాకాసేపు పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం తిరుగుతాడు అది అతను అలవాటు చేసుకున్నాడు. అలా తిరక్కపోతే తోచదు.
రాజమ్మ పిన్ని గుమ్మంలో నిలబడింది. బావగారితో ఏదో మాట్లాడాలనే ప్రయత్నంలో వుంది. 'మీతో ఒక్కమాట చెప్పాలని' నసిగింది రాజమ్మ 'చెప్పు రాజమ్మ ఆ మామిడి చెట్టు దగ్గరున్న చిన్న గట్టుమీద కూచున్నారు. ఆ సిమెంటు గట్టు శాంతమ్మ కట్టించింది. ఊరమిరపకాయలు ఆరచెట్టుకుందుకు, మాగాయి ముక్కలు ఆరబెట్టుకుందుకూ, అప్పడాలు వత్తుకుంటే ఆరేసుకుందురూ అవసరం అని.
'ఏమిటమ్మా..' అన్నాడు రాజారావు రాజమ్మకి అత్తకొడుకు కూడా - పైగా అక్క మరణించాక ఈ కుటుంబంలో పెద్ద దిక్కయింది. ఆమె భర్త మరణించాక, పిల్లలు ఇద్దరు విదేశాల్లో వున్నాక, ఇద్దరూ కూతుళ్ళ మధ్య తిరుగుతూ కాలక్షేపం చేస్తోంది రాజమ్మ.
'ఇలా దగ్గిరారండి' అంది గట్టుమీద కూచున్న రాజమ్మ "మనం అలా చూస్తూ ఊరుకోటం బాగాలేదు" -
'అంటే - ఏ విషయం రాజారావు గొంతుతగ్గించాడు.
"అదే - మన పిల్లదానిగురించే - ఓ పక్కనేమో కోర్టులో కాగితాలు, కేసులు వున్నాయి - మరోవైపు ఇతగాడితో తిరుగుతుంటే - పాపం, మా అక్కయ్య ఎప్పుడూ దీని గురించే బెంగపడేది - అసలు ఆ బెంగతోనే అది వెళ్ళిపోయిందీ - రాజమ్మ కళ్ళుతుడుచుకుంది.
'నీతో అదే పేచీ విషయం చెప్పకుండా ఏడుస్తావ్! చిరాగ్గా అన్నాడు రాజారావు.
'అదేబావ వారం రోజులుగా నా మనసు మనసులో లేదు. పిల్లని అలా చూస్తుంటే ఒకటే బాధ - మంచో చెడ్డో ఆ సంబంధం వదలుకుందా. ఈ గొడవేమిటో మరి. నాకు మా సుబ్బలక్ష్మి చెప్పింది - వీడికి అసలు గొంతు తగ్గించింది రాజమ్మ - భార్యవుందేమోనని అనుమానం కూడా - అయినా మనకి అవన్నీ అనవసరం - మన పిల్ల పక్కదారి తొక్కకుండా కాపాడుకోవాలి' - రాజమ్మ బావకేసి చూసింది.
'ఊ' - అన్నాడు రాజారావు అంతలోనే ఎవరో వస్తున్న అడుగుల చప్పుడు.
శారద దొడ్లో లైటు వేసింది.
అదేమిటి ఇక్కడేం చేస్తున్నారిద్దరూ అంది ఆవులిస్తూ అదేనే అమ్మా. మీనాన్నకి పిల్లలంతా వెళ్ళిపోతున్నారు అని బాధ మరి ఎవరి ఉద్యోగాలకోసం వాళ్ళు వెడతారు బెంగపడితే ఎలా బెంగపడవద్దని, రావాలంటే నీ దగ్గరకి రావచ్చు. వచ్చి ఓ రెండు నెలలు వుండవచ్చు అని చెప్తున్నా.
రాజమ్మ మాటలలో చాలా అర్ధాలుంటాయని శారదకి తెలుసు "నేనూ ఎనిమిదయ్యే సరికి బయలుదేరుతాను' అంది తండ్రి వినేలా. మనసు రాజమ్మ మాటలతో బెదిరిపోయింది. నా పెళ్ళి నా యిష్టం" అని ఎవరినీ లక్ష్య పెట్టకుండా ఆనాడు రిజిస్టరు పెళ్ళిచేసుకుంది. అదెందుకు పాడయిపోయిందో ఎవరికీ తెలియదు. ఇది ఇట్లా వుండగా ఇప్పుడు ఇతనితో స్నేహం శారదపై చాలా కోపమొచ్చింది రాజారావుకి కోపమొస్తే క్షణాలలో బయట పడిపోతుంది.
'ఒరేయ్ పెద్దాడూ' - కేక పెట్టాడు. పిల్లలందరిలో పెద్దకొడుకంటే చాలా నమ్మకం ఏపనైనా సమర్ధవంతంగా చేసుకురాగలడని మొదటి నుంచీ ఆయన అభిప్రాయం.
'ఏమిటి నాన్నగారూ 'సామానులు సద్దుతూ వచ్చాడు వేంకటేశు.
"నువ్వురెండురోజులు ప్రయాణం ఆపుకో - ఒక ముఖ్య విషయం మాట్లాడాలి" - గంభీరంగా వుంది తండ్రిగొంతు - నాన్నగారు ఉండమంటున్నారంటే ఏదోముఖ్యమైన విషయమే వుండి వుంటుందని అర్ధమైంది పెద్దబ్బాయికి.
'ఓ పనిచేస్తానాన్నగారూ - పిల్లలకి స్కూళ్ళు తెరిచారు అందుకని వేంకటేశు అంటుంటే,
'అందుకని వెళ్ళిపోవాలంటావ్. అంతేనా' అరిచాడు రాజారావు.
'వినండినే చెప్పేది - అందుకని పిల్లల్ని, మా ఆవిడని పంపేస్తాను - నేను లీవు పంపుతాను వాళ్ళతో" అన్నాడు మెల్లగా.
'శారదా' పిలిచాడు తండ్రి
విరబోసుకున్న జుట్టు గబగబా రెండుపాయలు జడగా అల్లుకుంది మొఖాన బొట్టుపెట్టుకుంది. నాన్నగారూ ఏదో ఆవేదనపడుతున్నారని గ్రహించింది శారద.
'ఏమిటండీ' అంది.
