Previous Page Next Page 
మళ్ళీ వచ్చిన వసంతం పేజి 20

  

       "నువ్వు ఇవాళ వెళ్ళద్దు - అన్నయ్య, నువ్వు ఒకేసారి వెడుదురుగాని" రాజారావు గదిలో నుంచునే ఉన్నాడు. శారదకి ఏం చెప్పాలో తోచలేదు.
   
    'నాకు సెలవు లేదు మరి' నసిగింది.
   
    "అంటే - రేపు నేను చచ్చిపోతాను - నీకు సెలవు దొరకదా"
   
    శారద విస్తుపోయింది అంతకోపంగా నాన్నగారు ఎందుకు మాట్లాడుతున్నా అని ఎదురుగా వంటింటి గుమ్మంలో కనిపించింది. రాజమ్మ పిన్ని ఈ పిన్నిని ఇంటికి రానీయకుండా వుండాలి, అంతే' - మనసులో అనుకుంటూ లోపలకెళ్ళి పోయింది.
   
    వీధి గదిలో దినేష్ శారద మాట్లాడుకున్నారు.
   
    'మనం ఇంకో అరగంటలో వెళ్ళిపోవాలి' అంది ఖంగారుగా దినేష్ తో నేను రెడీ - నా పనులన్నీ అయినట్టే - కావాలంటే మళ్ళీ ఓ వారం రోజులయ్యాక ఒక్కడినీ వస్తాను" దినేష్ తలదువ్వుకుంటున్నాడు. సూట్ కేసు సద్దేసింది శారద. గడియారం ఎనిమిది గంటలు కొట్టింది.
   
    "అన్నయ్యా - నాకు సెలవులే దురా. ఇలా ఇష్టం వచ్చినట్టు సెలవులు పెడితే, అది ప్రయివేటు కంపెనీ, ఉద్యోగం తీసిపారేస్తారు" - అంది శారద.
   
    "ఆ ఉద్యోగం పోతే పోనీ - నువ్వు ఇక్కడే వుందువుగాని నా కొచ్చే ఆదాయం ఇద్దరం బతకటానికి చాలదా - అసలు నువ్వొక్కర్తివీ ఆ హైదరాబాదులో వుండటం అమ్మకి మొదట్నుంచీ ఇష్టంలేదు రాజారావు గదిలో అటు ఇటు తిరుగుతున్నాడు.
   
    ఇంట్లో పెద్దకోడలు, పిల్లలు, చిన్నకొడుకు కోడలు పిల్లలు అంతా ప్రయాణ సన్నాహంలో వున్నారు. భోజనాలు చేసి బయలు దేరుతారంతే సామాన్లు సర్దుకుంటున్నారు.
   
    శారద భుజాన బాగ్ వేసుకుంది. ఎదురుగా గోడకి అమ్మ ఫోటో వుంది. తల్లికి నమస్కారం చేసింది. వస్తాను నాన్నగారూ మనసులోనే అనుకుంది.
   
    పెద్ద అన్నయ్యతో చెప్పింది తను వెళ్ళిపోతున్నట్టు ఇంకెవరితోనూ చెప్పాల్సిన పనిలేదనిపించింది.
   
    వెళ్ళద్దు అంటే ఆగదు, నాన్న గారిమాట అంటే ఆయన ఛాదస్తం అంటుంది, పిన్ని అనుకుంటుందో అంటే ఏదో సోది కబుర్లులే అంటుంది. మరి ఇవన్నీ శారద నోటి నుంచి వస్తాయి. ఇంతేకాదు, నాపనులు నావి, శారద వాటితో మీకేంపని, నా యిష్టం - ఇవన్నీ ఖచ్చితంగా అంటుంది - తనెందుకు చెల్లెలిని వెళ్ళద్దనటం - కారు కదలిపోతుంటే గుమ్మంలో నిలబడి చూసాడు. వెంకటేశు కారు చప్పుడవగానే, దొడ్డి గుమ్మంలో నుంచుని చూసి ముక్కున వేలేసుకుని కలికాలం మరి అనుకుంది రాజమ్మ పిన్ని, కారు వేగంగా ఊరిపొలిమేరలు దాటి వెళ్ళిపోయింది.
   
                                    *    *    *
   
                                             8
   

    ఆ రోజు తాళం వేసున్న శారద ఇంటి నుంచి వస్తుంటే సందులో దినేష్ కనిపించి కారు ఆపటం, నేనే రామన్ ని - ఎవరికైనా తెలిసిందో ఏం జరుగుతుందో తెలుసుగా అని బెదిరించటం జరిగాక లలితకి వెంటనే ఇంటికెళ్ళాలనిపించలేదు. మనసుబాగాలేదు. అలానడుచుకుంటూ గుళ్ళోకెళ్ళికూచుంది లలిత. దసరా నవరాత్రుల అమ్మవారిని ఎంత అందంగా అలంకరించారో - కనులపండువుగావుంది విగ్రహం. "అయిగిరినందిని నందిత మోదిని విశ్వవినోదిని విశ్వనుతే జయజయహే మహిషాసురమర్ధని రమ్యకపర్ధిని రమ్యనుతే " రికార్డు పాట చెవిలో ఆగకుండా వినిపిస్తోంది - మహిషాసుర మర్ధిని - దుష్టశిక్షణ - శిష్టరక్షణ అనేవి ధ్యేయం. లలిత విగ్రహంకేసి చూస్తోంది. జనం తోసేస్తున్నారు. పూజలతో, హారతులతో, భక్తులసందోహాలతో గుడి కళకళ్ళాడిపోతోంది - లలిత గుడిమెట్లమీద కూచుంది. మనసుకి ప్రశాంతత కుదరటంలేదు. రామన్ రూపమే కళ్ళముందు కదులుతోంది. ఎంతమోసగాడు - దినేష్ - హ్దినేష్ - లోకంలో ఇన్ని చిత్రాలు జరుగుతుంటే మహిషాసురమర్ధిని చూస్తూవూరుకుంటోందేం ?" - దుష్టశిక్షణ చేయదా? తల్లీ, దుర్గా సన్మార్గులనికాపాడు, దుర్మార్గులను శిక్షించు - అదేనాకోరిక చేతులు మోడ్చినమస్కరించింది. ఆమెట్ల మీదకూచుని లలిత.
   
    ఎనిమిది గంటలు దాటింది. ఇంటికెళ్ళాలి. నాన్నకి అన్నం పెట్టాలి - మందులు వేయాలి. లలితకి ఇద్దరు అన్నలమీద చాలా కోపం వచ్చింది - ఏ నాలుగేళ్ళకో ఒకసారి వస్తారు చుట్టాల లాగ - నాన్న బాధ్యత అంతాతనదే - అయినా అదేమిటో నాన్న మాత్రం కొడుకులు, కొడుకులని మురిసిపోతాడు. ఒక్కనాడు వాళ్ళను ఏమీ అనడు. పున్నామనరకం నుంచి తప్పిస్తారట - అదేమినరకమోమరి - ఏదన్నా అంటే కొరివి పెట్టాల్సింది వాళ్ళేగా అంటాడు - ఏమిటో - దేవాలయం ముందు కూర్చుని ఈ ఆలోచనలేమిటి లలిత కళ్ళు మూసుకుని చెంపలు వాయించుకుంది.
   
    లలిత రోడ్డున నడుస్తోంది. శారద ఏదారిలో వెడుతోందో తనుగ్రహించలేక పోతోందేమిటి - శారదలో చాలా మార్పు వచ్చిన మాటనిజం - రామన్ అనే వాడే ఈ దినేష్ - పైగా తనగురించి చెప్పద్దని బెదిరించాడేమిటీ - ఏమన్నాకానీ,  తెలియక గోతిలోపడుతుంటే చూస్తూ వూరుకుంటామా - చేయిపట్టి పైకి లేవనెత్తాలి - ఎవరైనా కానీ - రామన్ చేసిన మోసం గురించి, ఆనాటి చిట్ ఫండ్ కంపెనీ గురించి, అన్నీ శారదకి చెప్పాల్సిందే అని నిశ్చయించుకుంది. శారద తన మాటలు నమ్మకపోతే, తన పెద్దనాన్నకొడుకు దగ్గరకి తీసుకెళ్ళి అన్నీ చెప్పిస్తుంది కావాలనుకుంటే కానీ శారద ఈ ఊబిలోంచి బయటకిరావాలి.
   
    ఇంటికెళ్ళేసరికి ముందుగదిలో తండ్రి, రామం కూచుని మాట్లాడుకుంటున్నారు. లలిత తిన్నగా లోపలకేల్లిపోయింది. వంటపని అరగంటలో పూర్తిచేసింది.
   
    నాన్నగారూ - రండి, అన్నానికి ఇప్పటికే ఆలస్యమయింది. డైనింగ్ టేబులు దగ్గర అన్ని సద్దింది.
   
    వెంకట్రామయ్య భోజనానికెళ్ళాడు.
   
    లలిత రామం వున్న చోట కొచ్చింది. రామంతో చెప్పాలా, వద్దా ఓ క్షణం ఆలోచించింది. చెప్తే రామం ఏం చేస్తాడూ! రామన్ ని ఎలాగైనా కలసి ఏదైనా బోధిస్తాడా - హెచ్చరిక చేస్తాడా - అయినా కోర్టులో విడాకుల కోసం కేసుపడేసిన శారదకి రామం మాటలమీద నమ్మకం విలువ వుంటాయా - తనుకూడా రామన్ సంగతి మరిచి పోవటమే క్షేమమేమో - నిజంగానే దుర్మార్గుడు - బాంబులు విసరడాలు, కిడ్నాపులు చేయటాలు కూడా ఈపాటికి నేర్చేవుంటాడు - తన్నుతాను ఎలా రక్షించుకోగలదూ అతని బారి నుండి - లలితకి భయమేసింది - కానీ అంతలోనే అనిపించింది, ఎవరికైనా ఈ విషయం చెప్పాలి - చెప్పకుండా తనమనసు ఆగటం లేదు ఏదైనా మేలు శారదకి జరగచ్చు కూడా - లలిత ఇలా అనుకుంటూ రామంవంక చూసింది. రామం ఆవులిస్తున్నాడు.
   
    'రామం, ఒకమాట చెప్పాలి నీతో - దాని మూలంగా లాభమేమిటో చెప్పలేనుకానీ, నా మనసుకి కొంత తృప్తి' అంది లలిత.
   
    ఏ విషయమైనా చెప్పు వింటా - శారద విషయం కాని, శారదకి సంబంధించిన విషయం గాని చెప్పద్దు - రామం గంభీరంగా అన్నాడు.

    లలితకి చిరాకనిపించింది. ఇంట్లోంచి బయటకి వచ్చింది. తిన్నగా శారద ఇంటి దగ్గరాగింది.
   
    "ఎక్కడా కనిపించడమే మానేశావు" గుమ్మంలోకెళ్ళగానే సుబ్బులక్ష్మిగారు పల్కరించింది లలితని.
   
    'నాన్నకి ఒంట్లో బాగుండటం లేదు. ఎక్కడికీ పోవటం లేదు లీలకొడుకు బావున్నాడా" అంది లలిత. ఎదురుగా ఉయ్యాల్లో పిల్లాడు కారుమన్నాడు. గబుక్కున ఎత్తుకుని గుండెలకి హత్తుకుంది. తల్లి నిద్రపోతోంది. పసికంధుని గుండెలకి హత్తుకుంటుంటే, ఏదో మధురానుభూతిని పొందింది లలిత. చిన్న పెదాలు, లేత బుగ్గలు ఎర్రని చిన్న చేతులు, చిన్న కాళ్ళు. లలిత పిల్లాడిని అలానే ఒళ్ళోపెట్టుకుంది. మాతృత్వం- ఓహో - ఈలీల ఎంత ధన్యురాలో - లీలకి ఒకకాలు కుంటి - అయితేనేం - ఆ పాటి కుంటివుంటే పెళ్ళికాదా - లీల పెళ్ళి ఎంతో వైభవంగా చేశారు. ఏడాది తిరక్కుండా కొడుకుని ఎత్తుకుంది లీల - లలితకి మొదటిసారి అనిపించింది - తనకు పెళ్ళవుతుందా! అసలు తన పెళ్ళి గురించి ఎవరు ఆలోచిస్తున్నారూ - అన్నయ్యలకి వాళ్ళ సంసారాలు తప్ప తన విషయం పట్టదు - తండ్రికి ఏ విషయమూ పట్టదు - తనకీ - తనకీ ఇంతవరకు తన భవిష్యత్తు గురించి ఆలోచనే రాలేదు - తను పెళ్ళిచేసుకుని స్థిరపడిపోవాలి - ఇలా అనుకుంటూ పసివాణ్ణి గుండెలకు హత్తుకుంది. అంతటితోనే లలితమ్మ చీరను తడిపి కేర్ కేర్ మని ఏడ్చాడు పసివాడు. 'శారద లేదా' అంది నెమ్మదిగా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS