Previous Page Next Page 
మళ్ళీ వచ్చిన వసంతం పేజి 18

 

    వెంటనే గుర్తొచ్చింది దినేష్ విషయం - అయ్యో - అదేమిటి - అలా ఎలా మరచిపోయిందీ. ఏమనుకుంటున్నాడో - అదేమిటో అలాగ, తను అతని విషయం మరచిపోవటం - పరిగెత్తి కారు దగ్గర కెళ్ళింది - కారుంది కానీ అందులో దినేష్ లేడు - ఎక్కడి కెళ్ళినట్టు - తనపై కోపగించుకుని ఎక్కడ ఎటైనా వెళ్ళాడా - ఊరుకొత్త - శారద మనసు ఉడికిపోయింది - ఎవర్నడిగితే ఏంబావుంటుంది - ఎవరితో చెప్తే ఏం బావుంటుంది - శారద అటూ ఇటు చోసాయింది ఖంగారుగా లోపల కొచ్చింది - ఆశ్చర్యానికి హద్దులులేవు - దినేష్ హాల్లో అందరితోకూచుని పేకాట ఆడుతున్నాడు నవ్వాలో ఏడ్వాలో తెలియలేదు శారదకి.
   
    'ఇక్కడున్నావా అన్నయ్య, ఇతను' - శారద చెప్పబోయింది 'నా పేరు దినేష్, నేను శారద ఫ్రెండునని చెప్పేసానులే. "ఇక వెళ్ళు" దినేష్ పేకాటలో మునిగిపోయాడు. శారదకి చాలా ఆశ్చర్యమేసింది. ఎంత త్వరగా మనుషులతో కలసిపోతాడితను అనే విషయం తల్చుకుంటుంటే - జాతిమతకులభాషా భేదాలతో ఏ సంబంధమూ లేకుండా క్షణాల్లో స్నేహితుల్లా కలసిపోయే గొప్ప సుహృద్భావం పేకాటకే వుందంటే అతిశయోక్తి కాదు! దినేష్, భోజనం, నిద్రకు ఏర్పాటు మొదలైనవన్నీ అన్నలే చూసుకున్నారు ఆ రాత్రి శారదకు నిద్ర పట్టనేలేదు.
   
    తెల్లవారింది అందరూ తలోపనిలోనూ హడావిడిగా వున్నారు. దినేష్ షేర్ మార్కెట్ గురించి, షేర్స్ గురించి, వాటిపై వచ్చే లాభాల గురించి అక్కడున్న వారందరితో చెప్తున్నాడు. పొలం దున్నే ఈరిగాడి దగ్గరనుంచి వంద ఎకరాల ఆసామి రాములయ్యవరకు అంతా ఆసక్తిగా దినేష్ మాటలు వింటున్నారు. శారదకి మాత్రం చాలా ఉక్కిరిబిక్కిరిగా వుంది.
   
    శారద స్నానం చేసింది పిన్ని శారద దగ్గరగా కూచుంది. "అతగాడేనా" - అంది నెమ్మదిగా.
   
    'ఏమిటీ' - శారద దువ్వెనకున్న జుట్టు తీస్తోంది.
   
    "అదేలే మా పిన్నితోడికోడలి చెల్లెలు - అదే హైదరాబాదులో మీ ఇంటావిడ సుబ్బలక్ష్మి - చెప్పిందిలే ఇరవైరోజులనాడు విజయవాడలో ఓ పెళ్ళిలో కలసినపుడు"
   
    "ఏమిటీ -" అర్ధంకాలేదు శారదకి.
   
    'ఏమిటీ సిగ్గు - సుబ్బలక్ష్మి అంతా చెప్పింది - అవును కానీ కోర్టులు కేసు తేలిపోయినట్టేనా" - పిన్ని రహస్యంగా అంటున్నమాటలు వింటూంటే తలతిరిగిపోతోంది - ఈ పల్లెటూళ్ళో కూచున్న ఈవిడకి ఇన్ని వివరాలు తెలుసా. ఇన్ని ఆరాలు కావాలా శారదకి కోపం వచ్చింది "ఆవిడేం చెప్పిందో, నువ్వేం విన్నావో నాకేంతెలియదు. విసురుగా లోపలకెళ్ళి పోయింది శారద.
   
    'అంతకోపం దేనికే - ఉన్నమాటంటేనూ - పైగా ఊరంతా అనుకుంటున్నదే నేనూ అన్నాను' - గొంతు హెచ్చించింది పిన్ని.
   
    ఆ ఊరికరణం గారితో కలసి తోటలు దొడ్లు చూడటానికి వెళ్ళిపోయాడు దినేష్. తను అతన్ని ఈ ఊరుతీసుకొచ్చినట్టేలేదు అతని ప్రవర్తన. రెండురోజులయింది దినేష్ తోమాట్లాడితను - పైగా ఊరంతా అతనికోసం వస్తున్నారు షేర్ మార్కెట్ గురించి తెలుసుకోవాలి. ఎంత డబ్బు పెట్టచ్చు అని ఒకరడిగితే ఎంత లాభం వస్తుందని మరొకరు స్టాక్ బ్రోకరు అంటే ఎవరూ అని అడుగుతున్న చిన్నన్నయ్య శారదకి మతిపోతోంది- తను ఒక్కర్తీ వెళ్ళిపోయినా దినేష్ హాయిగా ఇక్కడవుండిపోగలడనిపించింది.
   
    "ఏమమ్మా - శారదమ్మా - కులం, గోత్రం ఏవైనా చూసుకున్నావా - అదీ అక్కర్లేదా' పెద్దవదిన కాఫీ అందిస్తూ అడిగింది.
   
    శారద సమాధానం చెప్పలేదు క్షణం కానీ వెంటనే అంది మీరంతా ఎందుకిలా మాట్లాడుతున్నారో తెలియటం లేదు- మన ఊరుచూస్తానంటే తీసుకొచ్చాను - నా స్నేహితుడంతే చిరాగ్గా అంది శారద "ఎవరయితే మాకేంలే" వదిన మూతి తిప్పింది.
   
    ఈ ఊరు వచ్చిన తర్వాత దినేష్ లో చాలా మార్పుకనిపించింది శారదకి. వారంరోజులూ రెండుమూడు సార్లు కన్న ఎక్కువ మాట్లాడలేదు శారదతో. అతనికి కావలసినవన్నీ పాలేరు ఈరిగాడు చూస్తున్నాడు శారద అన్నగార్లు దినేష్ ను చాలా గౌరవంగా చూస్తున్నారు. వాళ్ళందరికీ తమపాలిట అదృష్టదేవత ఈరూపంలో వచ్చిందనే నమ్మకం కలిగింది దినేష్ మాటల వల్ల "ఒక ఊరా ఊరూరా తిరుగుతున్నా. దేనికి, మీ లాటి వాళ్ళంతా నాలుగు డబ్బులు సంపాదించుకుని బాగుపడాలని. మీరు డబ్బులు ఎంతసేపు దాచుకోటం తప్ప మరోకటి చేయరు. బాంక్ లోవేస్తారు- కాని డబ్బు వున్నదానికన్నా వందలవేల రెట్లు అధికలాభం రావాలి అంటే కంపెనీలో షేర్లు కొనుక్కోవాలి. ఇప్పుడునేనేకొన్ని కంపెనీలు పెట్టాను. మా హైదరాబాదులో అందరూ మాకివ్వండిషేర్సు, మాకివ్వండని నా వూపిరి సలపటంలేదు.....బొంబాయిలో మా పిన్నిగారి కంపెనీలలో ఎందరో షేర్ హోల్డర్స్ - ఎందుకు చేరతారూ - వాళ్ళకి లాభం వస్తుందని తెలియబట్టి - ఈ విషయాలన్నీ మీకెవరూ చెప్పరు - అందుకే నేను మీ అందరి బాగుకోరి, ఈ బాధ్యత నా నెత్తిన వేసుకున్నాను - లేకపోతే, దేశవిదేశాలు తిరిగిన నేను ఇక్కడకెందుకొచ్చానూ- నలుగుర్ని బాగుచేస్తే దేముడు మెచ్చుతాడని - దినేష్ మాటలు వింటూ అక్కడ చాలా మంది మంత్ర ముగ్ధులలా కూర్చున్నారు.
   
    'బాబూ - తమరు ఇంకా ఊంటారా ఊళ్ళో" ఒక అరవైఏళ్ళు నిండిన బుగ్గమీసాల ఆసామి అడిగాడు. 'నేను నిన్ననే వెళ్ళిపోవాలసింది.....పక్క ఊరునించి కొందరు వస్తారని, వాళ్ళకి షేర్స్ కు సంబంధించిన వివరాలు కావాలని అంటే వున్నాను. నిజానికి ఇవాళ రాత్రి వెళ్ళాలనుకుంటున్నా. రేపు రాత్రి బొంబాయి ఫ్లైట్ " దినేష్ సిగరెట్టు ముట్టించాడు.
   
    'ఒక్కమాట - నా భార్య దగ్గర చాలా నగలున్నాయండి - అవి ఎప్పుడు పెట్టుకోవాలన్నా భయమేనండీ - దొంగల ఊరు అయిపోయింది కదండీ - అవి అమ్మేసి తమరు చెప్పినట్లు షేర్స్ కొంటానండి - షేర్స్ మీద లాభాలొస్తాయి కానీ, నగలు దాచుకుంటే ఏమొస్తాయండి. తమరు సలహా చెప్పండి" ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాడు ముసలాడు దినేష్ చెప్పే సమాధానం వినాలని.
   
    "చూడండి - నగలు అమ్మద్దండి - ఎందుకంటారా, నగలంటే ఆడవాళ్ళకి మహాయిష్టం - అవి అమ్మినదగ్గర నుంచీ, ఇంట్లోకలహాలు మొదలవుతాయండి. అందుకని దినేష్ ముసలాడి వంక చూసాడు.
   
    'ఇంట్లో కలహాల గురించి ఆలోచించకండి. బాబూ - అది ఒట్టివెర్రి బాగుల్ధండీ. నగలన్నీ అమ్మీ నీపేర పొలం కొంటానంటాదండి - దాని విషయం మీరు ఆలోచించకండి - కానీ నేనేమిటంటే ఆ పనిచేసి డబ్బుతెచ్చి మీరు చెప్తున్నా కంపెనీలలో షేర్స్ కొనటానికి కొంత టైముపడుతుంది కదండీ మరి మీరేమో రేపే వెళ్ళతానంటే ఎలాగ అని చూస్తున్నాను.
   
    దినేష్ చిరునవ్వునవ్వాడు.
   
    'మీ సమస్య అర్ధమయింది - మీ పని అయేవరకు వుంటాను ఇక్కడే సరేనా - మీరంతా నన్ను అర్ధంచేసుకుని, కంపెనీ షేర్స్ కోసం ఎగబడుతుంటే నాలుగు రోజులువుండాలంటే వుంటాను.
   
    ముసలాడికి చాలా ఆనందంకల్గింది - శారదకి దినేష్ పైన చాల కోపంగా వుంది.....ఊరుచూస్తానని వెంటపడి వచ్చిన అతను తీరా వచ్చాక షేర్ మార్కెట్, షేర్స్ ఇదే గొడవ - అసలు హైదరాబాదు వెళ్ళే మాటేలేదేమిటి - పైగా సరదాగా గడుపుదామనుకున్నటైము, ఇక్కడ అన్నయ్య కొడుకు వడుగు హడావిడితో మొదలై, ఇప్పటికి ఇంకా చుట్టాల గొడవ పూర్తిగా తగ్గలేదు. శారద తండ్రికి ఇంటినిండా చిన్న పెద్ద తిరుగుతూ సందడిగావుంటే ఎంతో బావుంది. దినేష్ కు ఎంత ఎక్కువమంది షేర్స్ కొంటామని వస్తుంటే అంత ఆనందంగా వుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS