Previous Page Next Page 
సంధ్యాకళ్యాణం పేజి 17

    "తలుపులు తీసేసి వచ్చావా?"

    "అవునత్తమ్మా!"

    "బాగుందే నీ ధైర్యం!" నర్సమ్మగారు వెళ్ళి తలుపులు మూసి తాళంపెట్టి వచ్చింది.

    "ఎల్లమ్మ కొడుకు కనిపించాడా, అత్తమ్మా?"

    "నాకెవరూ కనిపించలేదే?"

    ఈ సంఘటన జరిగిన తరువాత సంధ్య నర్సమ్మగారి దగ్గర ఉండడానికి ఒప్పుకొంది ఊళ్ళో కొందరు పెద్దవాళ్ళుకూడా, "వయసొచ్చిన పిల్లవి, ఆవిడ నీడలో తలదాచుకోవడం నీకే క్షేమం" అని సలహా ఇచ్చారు కూడా.

                         *        *        *

    నర్సమ్మగారికి దాదాపు ఏభై ఏళ్ళదాకా ఉంటాయి. ఆవిడకి సింహం అని పిలువబడుతున్న నరసింహం అన్న కొడుకున్నాడు. అతడు పుట్టిన నెలరోజులకే నర్సమ్మగారికి వైధవ్యం ప్రాప్తించింది. సింహం సింహంలా ఉండడుగాని, తొండం తక్కువైన వినాయకుడిలా ఉంటాడు. చేష్టలకి ఆంజనేయుడిలా ఉంటాడు. అతడికిప్పుడు పాతికేళ్ళు ఉంటాయి. ఇప్పుడే మాటలు నేర్చిన బాలుడిలా మాట్లాడతాడు. వెకిలివేషాలు ఎన్ని వేయాలో అన్నీ వేస్తాడు.

    అతడినింకా పసిపిల్లాడిలాసాకుతూ, అతడితో వేగుతూ బ్రతుకు ఈడ్చుకు వస్తూన్న మనిషి నర్సమ్మగారు. అయితే ఆస్తిపాస్తులకి లోటేమీ లేదు. దండిగా ఉన్నాయి. పెద్దలుకారం మెతుకులు తింటూ, నడుముకు అంగవస్త్రం మాత్రం చుట్టుకొంటూ ఆస్తిపాస్తులని అభివృద్ధి చేశారని ప్రజలు చెప్పుకోవడమే కాదు, నర్సమ్మగారింట్లో పెద్దలు పాతిపెట్టిన బంగారు, వెండికడ్డీలున్నాయని కూడా చెప్పుకొంటారు.

    ఇప్పుడు నర్సమ్మగారి జీవితం కూడా చాలా నిరాడంబరంగానే గడుస్తూందని చెప్పాలి.

    నర్సమ్మగారికి మడి దడీ కొంచెం ఎక్కువే కనుక వంట వార్పు ఆవిడే చూసుకొనేది. పైపనులు సంధ్య చేసేది. అమ్మా నాన్న లేరన్న బెంగతప్ప సంధ్యకి రోజులు సాఫీగా గడిచిపోతున్నాయి.

    సంధ్యకి పొలంమీద వచ్చిన కాస్తడబ్బునీ ఒకరోజు నర్సమ్మగారి చేతిలో పెట్టబోయింది. ఆవిడ తీసుకోలేదు.

    "ఇంత బ్రతుకు బ్రతికి నేను పూటకూళ్ళమ్మినికానా? నీకు పెట్టిన పిడికెడు మెతుకులకి డబ్బుతీసుకోనా? తీసుకోను!" అని ఖచ్చితంగా చెప్పేసింది.

    "ఈ డబ్బుని నేను మాత్రం ఏం చేసుకోను, అత్తమ్మా?"

    "పిచ్చి మొగానివి! డబ్బుని ఏం చేసుకోవాలంటావేమిటే? దాచుకో! నీ పెళ్లికి వస్తుంది!"

    సంధ్య ముఖంలో సంతోషానికి బదులు నీలినీడలు క్రమ్ముకొన్నాయి.

    "ఏమిటే, ముఖం అలా దించుకొన్నావు? నాకెవరు పెళ్ళిచేస్తారు అనా? పుట్టించిన ఆ దేవుడే చేస్తాడు! నీ మగణ్ణి పుట్టించాకే నిన్ను పుట్టించి ఉంటాడు తెలుసా?"

    ఆ తరువాత ఆవిడ వాళ్ళదగ్గరా, వీళ్ళ దగ్గరా సంధ్య పెళ్లి ప్రస్తావన తెచ్చి సంబంధాల గురించి ఆరా తీయసాగింది.

    "నీ కొడుక్కి పెళ్లిచేయాలని క్రిందా మీదా పడిపోతున్నావుగా? ఆ పిల్లకి పై సంబంధం చూడడం ఎందుకు?" అని, ఆవిడకు లేని ఊహను ఆవిడలో నాటారు కొందరు.

    "ఆ వెర్రి వెధవను, ఏ వంకాలేన ఆ పిల్ల పెళ్ళి చేసుకొంటుందా?" ముందు ముందు అంది నర్సమ్మగారు.

    "నీ పంచన చేరిన మనిషి నీ మాట కాదంటుందా? కాదని ఏ రాజకుమారుడిని చేసుకొంటుందో చూడమ్మా?"

    'నిజంగా ఏ రాజకుమారుడో వలచి ఎత్తుకుపోయేట్టుగా, కుందనపు బొమ్మలా ఉంటుంది సంధ్య' అనుకొంది నర్సమ్మగారు.

    నర్సమ్మగారు తనవెర్రిబాగుల కొడుక్కి పెళ్ళి చేయాలని తపన పడడం నిజమే! వంశం నిలువాలని ఆవిడ తాపత్రయం! తను గుటుక్కుమంటే తన వెర్రిబాగుల కొడుకుని ఎవరు చూస్తారని బెంగ ఒకటి అదంతా అలా ఉంచి వాడికి అప్పుడప్పుడు ఆడధ్యాస తిరుగుతూ ఉంటుంది. ఆ ధ్యాస తిరిగినప్పుడు తల్లినే లాగిన సంఘటనలున్నాయి.

    ఏ పేదింటి పిల్లనో డబ్బుకైనా సరే కొని తెచ్చి చేయాలని ఆవిడ చాలా రోజులనుండి ప్రయత్నిస్తూంది.

    కాని, సంధ్యని వాడికి చేయాలంటే ముందు ఆవిడకి మనసు కుదరలేదుగాని, రోజులు గడిచిపోతుంటే ఆవిడ మనసు మారిపోసాగింది!

    తనపంచన పడిన పిల్ల తన మాట కాదని పోగలదా? సంధ్య అయితే చిన్నప్పటినుండి సింహాన్ని ఎరుగును! వాడి వెర్రిబాగులతనం ఆ పిల్లకి బాగా తెలుసును! క్రొత్తగా చూసేవాళ్ళకి వింతగా ఉంటుంది గాని, రోజూ చూసేవాళ్ళకి ఏముంటుంది? పెళ్లికి ఒప్పుకొని, చేసుకొంటేనా పెళ్ళయ్యాక లేచిపోతుందన్న భయం ఉండదు. ఎవతెనో ముక్కు మొహం ఎరగనిదాన్ని తెచ్చి చేస్తే అది వీడి వెర్రిబాగులతనం చూసి, మూడురోజులకే ముఖం త్రిప్పి చూడకుండా పారిపోయే ప్రమాదం ఉంది. సంధ్యని చేసుకొంటే ఆ ప్రమాదం లేదు. పైగా డబ్బిచ్చి ఆ పిల్లని కొనుక్కునే అవసరం లేదు.

                           *        *        *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS