Previous Page Next Page 
అందరూ దొంగలే పేజి 17

    గజదొంగ మంగులు డెన్.

    మంగులు హుంకరిస్తూ  అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు.

    "బాస్....కొవ్వొత్తులు వెలిగించి తేనా  బాస్?!" ఉత్సాహంగా  అడిగాడు వీరూ.

    "ఏంటి నా చేతులు కాల్చెయ్యడానికి  నీకంత కంగారు? కాసేపు కుదురుగా నన్ను పచార్లు చేస్కోనియ్యవా?" మండిపడుతూ అన్నాడు మంగులు.

    "ఎలాగూ మీరు కొవ్వొత్తి  వెలిగించి పట్రమ్మని  అడుగుతారు కదా- మీరు అడగకముందే  నేనే అడిగితే  నన్ను శభాష్ అని మెచ్చుకుంటారనీ...." నసిగాడు వీరూ.

    "అధిక ప్రసంగం చెయ్యకు....నోర్మూస్కో" అంటూ మళ్ళీ పచార్లు కొనసాగించాడు  మంగులు.

    "బాస్!" అంటూ మరో దొంగ పిలిచాడు.

    మంగులు పచార్లు ఆపి ఏంటన్నట్లు వాడివంక  చూశాడు.

    "మీరు పాత పేపర్లు  ఏరుకునేవాడి గెటప్ లో వెళ్ళడం మాకు నచ్చలేదు  బాస్" అన్నాడు వాడు.

    "మరి మారువేషం వేస్కో పోతే అందరూ నన్ను గుర్తుపట్టరా  తొట్టినాయాలా?" చికాగ్గా మొహంపెట్టి అన్నాడు మంగులు.

    "అది నిజమే బాస్! మా ఉద్దేశం అదికాదు....మీరు చిత్తుకాగితాలు ఏరుకునే  వాడిలా కాకుండా సూటూ  బూటూ  వేస్కుని, టై కట్టుకుని దొరబాబులా వుండే గెటప్  వేస్కుంటే  బాగుండేది  కద  బాస్?" అన్నాడు వాడు.

    "అవును  బాస్....మీరు ఎంత గొప్ప గజదొంగై తే మాత్రం ఏంటి? ఎంత సంపాదిస్తే  మాత్రం ఏంటి? ఊరి  చివర రాళ్ళగుట్టల  మధ్య....ఈ మురికి డెన్ లో నలిగిన బట్టలు  వేస్కుని  చేతులు  కాల్చుకుని  ఏడుస్తూ పచార్లు చెయ్యడమే కదా బాస్? కనీసం ఇలా బయటికెళ్ళేప్పుడైనా కాస్త మంచి బట్టలేస్కుని రిచ్  గెటప్ లో వున్న మారువేషం వేస్కుంటే బాగుంటుంది కద బాస్?" అన్నాడు  ఇంకో  దొంగ.

    మంగులు గబ గబా  గోడ దగ్గరికి వెళ్ళి గోడకేసి తల కొట్టుకోడం  మొదలుపెట్టాడు. వీరూ పరుగున వెళ్ళి మంగుల్ని పట్టి ఆపాడు.

    "బాస్....మీరు జీవితంలో ఇంకా కొన్ని వేలసార్లు చేతులు కాల్చుకోవాలి  సార్....అలాంటిది  అప్పుడే  తల బద్దలు  కొట్టుకుని చచ్చిపోతే  ఎలా సార్?" అన్నాడు  వీరూ  బాధగా.

    "మేం తప్పుగా అనుంటే  సారీ  బాస్!" అన్నాడు  ఇందాక సలహా చెప్పిన  దొంగ.

    "తప్పు కాదురా....మీకు వచ్చిన ఈ మంచి ఆలోచన నాకు రానందుకు బాధ కలిగి తల బాదుకుంటున్నా" దీర్ఘంగా  నిట్టూరుస్తూ  అన్నాడు  మంగులు.

    "బాస్....మీ పచార్లు ఇంక అయిపోయినట్టేనా?" అడిగాడు వీరూ.

    "అయిపోయినట్టే ....ఏం?" సందేహంగా  అడిగాడు మంగులు.

    "ఏం లేదు బాస్....మీరేదైనా  శపధం  చేసేదుంటే  త్వరగా చేసెయ్యండి....మాకు ఆకలిగా వుంది....భోంచెయ్యాలి."

    మంగులు వీరూని  చికాకుగా  చూసి  "సరే....కొవ్వొత్తి  వెలిగించి పట్టుకురా" అన్నాడు.

    వీరూ ఓ లావుపాటి కొవ్వొత్తి  వెలిగించి  గజదొంగ మంగులు దగ్గరికి  తీస్కొచ్చాడు.

    "ఆహా! మనకి మళ్ళీ కమ్మటి  చీకుల వాసనొస్తుంది!" ఒక దొంగ పక్క దొంగ చెవిలో  ఆనందంగా గుసగుసలాడాడు.

    మంగులు కొవ్వొత్తి మీద చెయ్యి పెట్టి ఇలా ప్రతిజ్ఞ  చేశాడు.

    "పాపని కిడ్నాప్ చేసి తీసుకొస్తుంటే అడ్డుపడి నా కిడ్నాప్ ని భంగపరిచిన  ఆ రాంబాబు గాడినీ, చిన్నారావ్ గాడినీ చంపుతా."

    చేత్తో కొవ్వొత్తి ఆర్పి, చెయ్యి కాలి ఘొల్లుమన్నాడు  మంగులు.


                                                                                 7

   
    డిప్పల్లో  నర్సింగ్ హూం....

    ఉదయం 8 గంటలైంది.

    రాంబాబు, చిన్నారావ్ లు ఇద్దరూ ఓకేసారి  కళ్ళు తెరిచారు. ఇద్దరూ పక్కపక్క  బెడ్ ల మీదున్నారు.

    రాంబాబు మెల్లగా  తలతిప్పి ఆ ప్రక్కకి చూశాడు. అదే సమయంలో చిన్నారావ్ తలత్రిప్పి ఈ ప్రక్కకి చూశాడు.

    ఇద్దరి చూపులూ  కలిశాయి.

    "మనిద్దరం బతికే వున్నామా?" అడిగాడు రాంబాబు.

    చిన్నారావ్ మళ్ళీ ఆ వైపుకి  తలత్రిప్పి  చూశాడు. వార్డు ఆ చివరదాకా  పేషంట్లు పడుకుని వుండడం అతనికి కనిపించింది.

    ఇటు తిరిగి రాంబాబుతో  అన్నాడు.

    "బతికే వున్నామనుకుంటా....అదిగో మనతో బాటు మిగతా పేషంట్లు కూడా వున్నారుగా?"

    "అయితే  ఆపరేషన్ సక్ససేనన్నమాట!" అన్నాడు రాంబాబు.

    "ఏమో మరి....ఆ విషయం  తెల్సేది  మనం ఈ మంచం దిగి మామూలుగా నడిచినప్పుడు" అన్నాడు చిన్నారావ్.

    ఇద్దరూ సైలెంట్ గా తలలు త్రిప్పి వార్డులోని  మిగతా వారిని గమనించసాగారు.

    ఓ బెడ్ మీద మంచానికి అతుక్కుపోయి  ఓ పేషంట్ వున్నాడు. మాసిన గెడ్డంతో, కళ్ళు లోతుకుపోయి చాలా  నీర్సంగా  వున్నాడతను. అతని ప్రక్కనే కూర్చుని వున్న అతని భార్య చేతిలో బిస్కెట్ పాకెట్ వుంది. అందులోంచి ఒక్కో  బిస్కెట్ తీస్కుని  పరపర నమిలెయ్యసాగింది  ఆమె. ఆమె భర్త ఓ నిముషంపాటు ఆమెవంక  నిశ్చలంగా  చూసి తర్వాత నీర్సంగా అన్నాడు. "అప్పుడప్పుడూ  నాక్కూడా  ఓ బిస్కెట్ ఇవ్వవే....అబ్బాయ్  వాటిని నా కోసం  తెచ్చాడనుకుంటా."

    "వద్దు....మీరు తినకూడదు. తింటే కక్కుకుంటారని  నా భయం!" అంది ఆవిడ ఆయన మొహం చూడకుండానే.    


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS