"ఇంటికి వెడితే వాళ్ళు నాకు దొరుకుతారా?" అన్నాడు కులభూషణ్.
"నీకోసమే వెళ్ళారు. నీకెందుకు దొరకరు ...."
కులభూషణ్ అక్కడ్నించి పరుగెత్తాడు. స్కూటర్ మీద ఇల్లు చేరడానికి అతడి కెంతో సేపు పట్టలేదు.
ఇంట్లో తోటమాలి ఉన్నాడు.
సీతమ్మకు జబ్బు చేసినప్పట్నించి అవసరమైనప్పుడల్లా అతడింటికి కాపలాగా ఉంటున్నాడు.
సాయంత్రం మాత్రం రోజూ ఇంటికి వెళ్ళిపోయేవాడు. నిన్న జలజ వచ్చి వెళ్ళడంతో అతడి రోజు తోటమాలిని రాత్రికిక్కడే ఉండిపొమ్మని చెప్పాడు.
"బాబులిద్దరూ వచ్చేశారు. మీకోసం క్లబ్బుకు వెళ్ళారు" అన్నాడు తోటమాలి.
అకారణంగా కులభూషణ్ తోటమాలిని తిట్టి క్లబ్బుకు వెళ్ళాడు. వాళ్ళక్కడ్నుంచి నర్సింగ్ హోం కు వెళ్ళినట్లు తెలిసింది.
కులభూషణ్ లో ఉద్వేగం ఆగడం లేదు.
అతడు నర్సింగ్ హోం కు వెళ్ళాడు.
అక్కడ గుమ్మంలోనే ఎదురయ్యాడు వేదాంతం.
"నువ్వు చాలా తొందరగా తిరిగొచ్చేశావు" అన్నాడు కులభూషణ్.
"విశ్వనాద్ ను కూడా తొందరగానే వెనక్కు తెచ్చాను కదూ!" అన్నాడు వేదాంతం గంభీరంగా.
"నువ్వేం మాట్లాడుతున్నావో నాకర్ధం కావడం లేదు" అన్నాడు కులభూషణ్.
"నీతో అర్జంటుగా కొన్ని విశేషాలు మాట్లాడాలి. లాన్లోకి పద' అన్నాడు వేదాంతం ముందడుగు వేస్తూ.
"విశ్వనాద్ ఎక్కడ ?" అన్నాడు కులభూషణ్ అసహనంగా.
"అన్నీ చెబుతా .....' అంటూనే వేదాంతం ముందుకు నడిచాడు.
నర్సింగ్ హోం ముందున్నదొక పార్కు.
అది అందమైనది, విశాలమైనది.
కులభూషణ్ లో ఉత్కంట ఆగడం లేదు. అతడు పార్కులోకి పరుగున చేరాడు. వేదాంతం అతడ్ని కలుసుకుందుకు రెండు నిమిషాలు పట్టింది.
వేదాంతం తను కూర్చుని అతడ్ని కూర్చోమన్నాడు.
"నేను కూర్చోలేను. త్వరగా జరిగిందేమిటో చెప్పు ...."
"ఏమీ జరుగలేదు. నేను, విశ్వనాధం " క్షేమంగా అమెరికా నుంచి తిరిగి వచ్చాం. దీనికి నువ్వు సంతోషించడానికి బదులు కంగారు పడుతున్నావని అమ్మ చెబితే విషయమేమిటో తెలుసుకుందామని నీకోసం ఎదురు చూస్తూ నర్సింగ్ హోం గుమ్మంలో నిలబడ్డాను...."
"విశ్వనాద్ ఏమయ్యాడు ?"
'అమ్మతో మాట్లాడుతున్నాడు...."
"మరి వాడు చచ్చిపోలేదా?"
"మేమిద్దరం కూడా చచ్చి బ్రతికాం..."
"నిన్న రాత్రి నువ్వు నాకు చెప్పిన విశేషం ?"
"నిన్న రాత్రి నేనీ ఊళ్ళో లేందే నీకు విశేషమేం చెప్పాను.'
కులభూషణ్ తెల్లబోయి వేదాంతం వంక చూసి "నిన్న రాత్రి నువ్వింటికి వచ్చావు....' అన్నాడు.
వేదాంతం కులభూషణ్ ముఖంలోకి గంభీరంగా చూసి "నువ్వు నిజమే చెబుతున్నావు . సందేహం లేదు " అన్నాడు.
"అబద్దం చెప్పాల్సిన అవసరం నాకేముంది?"
'అవును , అదీ నిజమే! అయితే నాకు వచ్చిన కలలాంటిదే వచ్చి ఉంటుంది?" అన్నాడు వేదాంతం మళ్ళీ.
"కలా ?" ఆశ్చర్యపోయాడు కులభూషణ్.
'అవును. నేను నిన్న రాత్రి నిన్ను కలుసుకున్నాను. విశ్వనాద్ చనిపోయాడని నీతో చెప్పాను. అలౌకికానంద స్వామి వద్దకు వెళ్లి విశ్వనాద్ ను బ్రతికించుకుని వస్తానని నీ దగ్గర వీడ్కోలు తీసుకున్నాను. నువ్వు నాతొ కలిసి వస్తానంటే వారించాను ....'
"ఇది కల కాదు, నిజంగా జరిగింది...."
'అవును, నాకూ అలాగే అనిపించింది....' అన్నాడు వేదాంతం.
"ఒరేయ్ నో జోక్స్ ప్లీజ్ !" అన్నాడు కులభూషణ్.
"జోక్స్ కాదు. నీ మాటలు వింటుంటే నాకొకటనిపిస్తుంది. ఇద్దరికీ ఒకే సమయంలో ఒకేలాంటి కలలు వస్తే ఆ కలలు నిజంగా జరిగినట్లే ఉంటాయట. మన విషయంలో అదే జరిగింది ...."
'అయితే నీ కలలో తర్వాతేం జరిగిందో చెప్పు ....' అన్నాడు కులభూషణ్ కుతూహలంగా.
"ఏం చెప్పను ? మెలకువొచ్చి చూస్తె ఎదురుగా విశ్వనాద్ ఉన్నాడు. మేమిద్దరం ట్రయిన్ లో ఉన్నాం...."
"అబద్దం !'
"వేదాంతం చిరాగ్గా ముఖం పెట్టి "నాలుగేళ్ల తర్వాత అమెరికా నుంచి తిరిగి వచ్చిన సోదరుడ్ని ఆదరించే పద్దతిదేనా ?" అన్నాడు.
కులభూషణ్ చలించలేదు. "నువ్వు నిన్న రాత్రి నాతొ మాట్లాడేవు. అది కల కాదు. నేను ఖచ్చితంగా చెప్పగలను" అన్నాడు.
'అయితే విశ్వనాద్ చచ్చి పోయాడంటావ్?" అన్నాడు వేదాంతం.
"నేననలేదు , నువ్వన్నావు...."
"ఇంకా సేపుంటే నేనూ చచ్చిపోయాననీ -- మేమిద్దరం దయ్యలై తిరిగొచ్చామని అన్నా అనగలవు నువ్వు ' అన్నాడు వేదాంతం భాధగా.
కులభూషణ్ నొచ్చుకున్నాడు కానీ తను కలగన్నానని ఒప్పుకోలేదు.
వేదాంతం అతడ్ని నమ్మించడానికి తన ప్రయాణం వివరాలు చెప్పాడు.
"కళ్ళారా చూసిన నిజం కాదని ఎలా చెప్పను?" అన్నాడు కులభూషణ్.
"అయితే ఒక రుజువుంది. ఈరోజు నుంచి నువ్వు ఉదయను గమనించు. కొద్ది రోజుల్లోనే ఆమె మామూలు మనిషవుతుంది .'
"మంత్రాలకు చింతకాయలు రాలవు. ఉదయ మాములు మనిషి కావడం అసాధ్యం.' అన్నాడు కులభూషణ్.
"నేను మంత్రం వేశానని ఎవరన్నారు? అమెరికా నుంచి ఆమె కోసం ప్రత్యేకమైన మందు తెచ్చాను." అన్నాడు వేదాంతం.
"నేనమెరికాలో ఉండకపోవచ్చు కానీ వైద్యశాస్త్రం ప్రపంచంలో ఎక్కడ రానంత ప్రగతిని సాధించినా నాకు తెలుస్తుంది. ఉదయ నిప్పుడున్న స్థితి నుంచి కాపాడే మందు ఈ ప్రపంచం లోనే లేదు......"
'ఒక్కసారి ఉదయను పరిక్షీంచి అప్పుడు మాట్లాడు. ఆమె నా మందు తినడమూ మెరుగు పడడమూ నీకు తెలిసేక -- నిన్న రాత్రి మనం కలుసుకున్నది భ్రమే అని గ్రహించగలుగుతావు ' అన్నాడు వేదాంతం.
"సరే -- నువ్విక నాకు నిజం చెప్పవు. ప్రస్తుతానికి నేను నీ అబద్దాన్ని నమ్ముతాను. కానీ గుర్తుంచుకో -- ఏదో ఒకరోజున నీ అబద్దానికి ఋజువు సంపాదిస్తాను....." అన్నాడు కులభూషణ్.
'సరే -- అంతవరకూ నిన్న మనం కలుసుకున్న విషయం మరిచిపోలేనని మాటివ్వు ' అన్నాడు వేదాంతం చేయి చాపుతూ.
కులభూషణ్ అతడి చేతిలో చేయి వేశాడు.
"నిజంగా నువ్వు మాట మీద నిలబడాలి?" అన్నాడు వేదాంతం.
"ఇక నువ్వా విషయం మరిచి పో" అంటూ కులభూషణ్ వేదాంతాన్ని లేచి నిలబడ మన్నాడు. అతడు లేవగానే ఒక్కసారిగా బలంగా కౌగలించుకుని "ఎన్నాళ్ళయింది రా మనం కలుసుకుని" అన్నాడు.
వేదాంతం అమెరికన్ స్టయిల్లో మిత్రుడ్ని బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు.
పద --- అర్జంటుగా విశ్వనాద్ ని చూడాలి ' అన్నాడు కులభూషణ్.
వేదాంతం కదిలాడు కానీ పరుగున వెడుతున్న కులభూషణ్ ని అందుకోలేక పోయాడు.
కులభూషణ్ నర్సింగ్ హోం లో సీతమున్న గదిలోకి వెళ్ళాడు.
అక్కడ విశ్వనాద్ కనిపించాడు.
సీతమ్మ చెప్పినట్లే విశ్వనాద్ మిసమిసలాడి పోతున్నాడు.
అతడు తల్లితో మాట్లాడుతున్నాడు. గుమ్మం దగ్గరున్న కులభూషణ్ ని చూడలేదు.
సీతమ్మ కులభూషణ్ ని చూసింది.
'అదుగోరా భూషణ్ !" అంది.
విశ్వనాద్ కులభూషణ్ ని చూశాడు.
అతడి ముఖంలో ఏ విధమైన భావమూ లేదు. ఒక అపరిచిత వ్యక్తిని చూస్తున్నట్లు చూశాడు.
కులభూషణ్ అది గమనించలేదు.
మరి లేడనుకున్న మిత్రుడు, మరి రాడనుకున్న బంధువు, మరి చూడలేనను'కున్న ఆప్తుడు -- విశ్వనాద్ -- ఇప్పుదతడి ఎదుట వున్నాడు.
అప్పుడు కులభూషణ్ తలపులో వేదాంతం చెప్పిన కలగానీ, నిన్న జరిగిన విశేషం గానీ లేదు.
తన ప్రాణంలో ప్రాణం విశ్వనాద్ ......ఎదురుగా .... తననే చూస్తున్నాడు.
"విస్సీ...." అంటూ అతడు రెండంగలు వేసి విశ్వనాద్ ను బలంగా కౌగలించు కున్నాడు.
