కళ్ళు మూసుకొని ఆ దెబ్బల్ని సహిస్తూనే ఉన్నాడు రాజీవ్.
లక్ష్మి పరుగున వచ్చి, "జానకీ!" అంటూ ఆమెను తొలగించి, "బాబూ!" అని రాజీవ్ ను చేతుల్లోకి తీసుకొంది.
జానకీదేవి ఏడుస్తూ, "ఎందుకు నా మీద ఇలా కక్ష సాధిస్తున్నారు?" అంది.
"జానకీ! అనవసరంగా ఏడవకు. వాడికి నచ్చింది ఆ అమ్మాయి! నీవు లక్షల కట్నంతో తెచ్చే పిల్లని చేసుకొంటానని ఎప్పుడైనా అన్నాడా నీతో? కట్నమేగా నీకు కావలసింది. నా కున్నదంతా ఈ క్షణం నుంచి వీణది!" చిన్నగా, గంభీరంగా పలికింది లక్ష్మి.
'నీవే వాణ్ణి చెడగొట్టింది. చిన్నప్పుడే నా కొడుకుని చేరదీసి తల్లికీ, కొడుక్కీ కాకుండా చేశావు' అని అనాలనుకొంది జానకి. కాని, లక్ష్మిని ఎదిరించి ఎప్పుడూ మాటలాడలేకపోయేది. ఇప్పుడూ అంతే. విసురుగా వెళ్ళిపోయింది జానకి.
వాళ్ళ ఏడ్పు, వాళ్ళ సంభాషణ వింటూ పెద్దగా నవ్వాలనుకొంది వీణ.
ఆ క్షణంలో వీణవైపు చూసిన లక్ష్మికి లేశమైనా ప్రేమ వీణలో ఉన్నట్లు కనపడలేదు.
'రాజ్! బాబూ! ఎందు కీ వలయంలో చిక్కుకున్నావురా!' అనుకొంటూ, లోలోన బాధ పడుతూ రాజీవ్ ని తన గదికి తీసుకొనిపోయింది లక్ష్మి.
* * *
ఎన్నెన్నో వేడుకలతో మొట్టమొదటి పెళ్ళి ఎంతో గ్రాండుగా, తరతరాలు చెప్పుకొనే విధంగా చేద్దామనుకొంది జానకీదేవి. కాని...
అనుకొనేది దగ్గర ముహూర్తంలో అతి సామాన్యంగా రాజీవ్, వీణల వివాహం జరిగిపోయింది.
టెలిగ్రామ్ అందుకొన్న ఓంకారి సహదేవ్ తో వచ్చేసింది.
"అమ్మలూ! ఏమిటమ్మా ఇదంతా?" అంది.
"నాన్నమ్మా! ఇప్పుడేమీ చెప్పను. ఈ పెళ్ళికి అడ్డు చెప్పకమ్మా!" అంది.
"తల్లీ! నీ కిష్టమైతే మా కందరికీ ఇష్టమే! కాని, అనుకోలేదు. మీ నాన్నతో సంప్రదించలేదు."
నాన్నమ్మ ఒళ్ళో తల పెట్టుకొని పడుకొంది.
"నా కిష్టంలేని పెళ్ళి, నాన్నమ్మా!"
"ఆఁ ? ?"
"అవును! మీ అందరి కోసం- మనం బ్రతకాలని ఈ పెళ్ళి చేసుకుంటున్నాను."
"అమ్మలూ! నాకేదో భయంగా ఉంది. అర్ధమయ్యేలా చెప్పు."
"ఇంతకంటే ఇప్పుడు నే నేమీ చెప్పలేను, నాన్నమ్మా నన్ను నమ్ముతావా, నే నెప్పుడూ ఏ తప్పూ చేయలేదని?"
"నమ్ముతాను, తల్లీ!"
"నాన్నమ్మా, చాలు!" ఎన్నాళ్ళో దాచుకొన్న దుఃఖ మంతా ఆనాడు బయటికి వచ్చేసింది.
అలమేలు మంగాపురంలో పెళ్ళి జరిగింది. దగ్గర బంధువులు, స్నేహితులు వచ్చారు. మెడికల్ కాలేజీ అంతా ఆ నాడు పెళ్ళి పందిట్లోనే ఉంది.
దేవకన్యలా పెళ్ళి బట్టల్లో మెరిసిపోతున్న వీణను చూచి రాజీవ్ అదృష్టానికి ఈర్ష్య పడనివారు లేరు. పెళ్ళి హాలంతా కలియచూసింది వీణ.
గోడకానుకొని ఎవ్వరినో చాటు చేసుకొని కూర్చుంది సోఫియా.
చూపులను వెంటనే తిప్పేసుకొంది.
పెళ్ళి ముహూర్తానికి కృష్ణారావు-వీణ తండ్రి-వచ్చి చేరుకొన్నాడు. నాగలక్ష్మి రాలేదని చెప్పాడు.
మూడు ముళ్ళు పడి ఎక్కడి వాళ్ళక్కడకు వెళ్ళి పోయేవరకు జుబేదా వీణను అంటి పెట్టుకొనే ఉంది.
జానకీదేవి బంధువులు, స్నేహితులు ఆడపెళ్ళివారిని భోజనాల వేళలోనైనా అల్లరి చేద్దామనుకొన్నారు. కాని, ఆజానుబాహువైన సహదేవ్ పంక్తి పంక్తికి తిరుగుతూ, మనిషి మనిషిని పరామర్శిస్తూ అన్నీ వడ్డిస్తూ, వడ్డింప చేస్తూ ఉంటే అతని పర్యవేక్షణలో అందరు తృప్తిగా తిని లేచారు. ఇవ్వవలసిన కానుకలతో కొరత చేయలేదు.
'తనవారి కష్టం అంతా వేస్ట్!' అనుకొంది వీణ.
భోజనాలు ముగిశాక ముందు కారులో రాజీవ్ ను, వీణను తిరుమల కొండకు వెళ్ళమన్నారు.
వీణ పోను నిరాకరించింది. "అందరం కలిసి వెళదాం, నాన్నమ్మా!" అంది.
"వీణ నీ దన్నావు. అలాగే పంతం నెరవేర్చుకొని నీరసంగా ఉన్నావేం, పెళ్ళికొడుకా!?" అని స్నేహితులు ఎగతాళి చేశారు.
దైవ దర్శనానంతరం గ్రామానికి బయలుదేరారు, మూడు నిద్రలు చేయటానికి.
రాజీవ్ తో ఎవ్వరూ రాలేదు. తాను పోతానన్న కుమార్ ను స్కూలు పోతుందని మద్రాసుకు పంపేసింది జానకి.
ఒక్క పూట ముందే చేరుకొన్న సహదేవ్ అన్నీ అమర్చాడు. పైనున్న గది చక్కగా అలంకరించాడు కొత్త దంపతుల కొరకు. గ్రామంలోకి రానున్న వారిని బాండుమేళాలతో ఎదురేగి, ఊరేగింపుతో ఇంటికి తీసుకొని వచ్చాడు.
అన్నయ్య ఇంత ఘనంగా ఏర్పాటు చేస్తాడని అనుకోలేదు వీణ.
ఓంకారి సంతోషం పట్టలేక ఏడ్చేసింది.
ఆ రోజు గ్రామంలో చిన్నా, పెద్ద కుల మత భేదాలు లేకుండా పెళ్ళివిందు చేశాడు సహదేవ్. ఖర్చు అంతా అతనిదే. అతణ్ణి ఎవ్వరూ విమర్శించను సాహసించలేదు. ఆ గ్రామానికి ప్రెసిడెంటుగా ఎన్నుకోబడ్డాడు.
రాజీవ్ ని ఆప్యాయంగా చూచిన నాగలక్ష్మికి అతడు ఎప్పటినుండో ఎరిగి ఉన్నాడనిపించింది.
చాటుగా నిలబడిన నాగలక్ష్మి- "బాబూ! ఎప్పటి పుణ్యమో మరి! నిన్ను పొందిన అమ్మలు అదృష్టవంతురాలు. ఆ అదృష్టాన్ని కలకాలం నిలిచేలా చెయ్యి" అంది.
వీరి నిరాడంబర ప్రేమ, నిర్మల హృదయాలు అతనిని ఎప్పుడో ఆకట్టుకొన్నాయి. వీణ అందుకే పవిత్రంగా పెరిగింది... ఇకపై ఆలోచించలేక పోయాడు! ఆ దుష్టఘడియ తన జీవితంలో రాకుండా ఉండి ఉంటే?!
ఓంకారి వీణను చక్కగా అలంకరించింది. పూలజడ బరువనిపించినా, నాన్నమ్మ కోరికను కాదనలేకపోయింది. అలంకరణ పూర్తయినాక తన ప్రతిబింబం చూసుకొంది. తన కళ్ళను తనే నమ్మలేకపోయింది. గుండెల్లో ఇంత ఆవేదన ఉన్నా, ముఖంలో అంత అందం ఎక్కడి నుంచి వచ్చిందో! విష్ణుమూర్తి రెండు నేత్రాలులా జంట మంగళసూత్రాలతో మెరుస్తూ పసుపుతాడు, నల్లపూసలు కంఠానికి నిండుదనం, సరికొత్త అందం ఇస్తున్నాయి.
తనకు పెళ్ళయిందా? గుడ్ గాడ్! కొన్ని నెలల్లో తల్లి కాబోతూంది! ఇదంతా నిజమా? కల కాకూడదా!
గదిలోకే వెళ్ళే ముందు సహదేవ్ పాదాలకి నమస్కరించింది. కన్నీళ్ళతో, "తాతయ్యలేని లోటు తీర్చానన్నయ్యా! నీ ఋణం ఎలా తీర్చుకోను?" అంది.
"ఆడుకోవటానికి అల్లుణ్ణివ్వమ్మా, చాలు" అన్నాడు.
మోటు సరసోక్తులాడనున్న అమ్మలక్కల నందరిని గద్దించింది వీణ.
"ఈ కాలం వాళ్ళకి పనికిరావులే, అమ్మా!" అంటూ వెళ్ళిపోయారు.
పెళ్ళిలోగాని, ప్రయాణంలోగాని కళ్ళెత్తి రాజీవ్ ని చూడలేదు- ఒంటరిగా అతనితో గదిలో గడపాలి!
గదిలోకి వచ్చిన వీణను ముగ్ధుడై చూశాడు. పక్వాశయం ఎత్తుగా కనుపించింది. మనస్సు మూలిగింది.
"వీణతో గడపాలన్న ఈ క్షణం కోసం ఎలా ఎన్ని రోజులు, ఎన్ని రాత్రులు కలలు కన్నాడు! తానేమి చేస్తే ఆ చెడుకాలాన్ని తుడిపివేయగలడు? ఏ దుష్టశక్తి అలా.... ఆమె మనస్సును ఎలా జయించగలడు?' తనలో రేగుతున్న దుర్భలత్వాన్ని పారద్రోలి రెండు చేతులు చాపి పూర్ణ హృదయంతో ఆహ్వానించాడు.
వ్యంగ్యమైన చిరునవ్వును ఆమె పెదాలపై చూచాననుకొన్నాడు.
వీణ బల్ల దగ్గరకు వెళ్ళింది. జడ కున్న పూలన్నీ తీసింది. కిటికీలోనుండి రెండు కొబ్బరి చెట్లు దంపతుల్లా నిండుగా కనుపించాయి. తనలో ఏవేవో కొత్త భావాలు తల ఎత్తుతున్నాయి.
తన హృదయాన్ని చేతుల్లో పెట్టి ఆహ్వానించాడు. తిరస్కరించింది. వీణమీద ప్రేమను చంపుకోలేక పోతున్నాడు. ఇంత బలహీనుడా తను!
వీణ దగ్గరగా వెళ్ళి భుజంపై చెయ్యి వేశాడు.
"రాజీవ్! నీవు మనిషివైతే, నీ తల్లి, తండ్రి మంచి వాళ్ళయితే నన్ను తాకవు! ఐ హేట్ యు! తాళికట్టినంత మాత్రాన నా మనస్సును జయించలేవు."
రాజీవ్ పిడికిళ్ళు బిగుసుకొన్నాయి. రెండు భుజాలు గుచ్చి తన వైపుకు తిప్పుకొన్నాడు ఏదో చెప్పాలని. వీణ కళ్ళలోకి చూసి, పడకమీదకు వెళ్ళి దిండులో ముఖం దూర్చుకొన్నాడు. అతని ఒళ్లంతా కదిలిపోతూ ఉంది. ఏడుస్తున్నాడని తలచింది.
'నీ కదే కావలసింది.' కోపంగా అనుకొంది వీణ.
* * *
