ఒక్కక్షణం నిశ్చేష్టులయ్యారు శ్రీపతిగారు. మెల్లిగా తేరుకొని 'బావా! అంతేనా? మీ నిర్ణయానికి తిరుగులేదా?' కన్నీరు నిండిన కళ్ళతో సుందరరామయ్య గారి వైపు నీరజవైపు దీనంగా చూస్తూ అన్నారు శ్రీపతిగారు.
'మీరు బాధపడతారని నాకు తెలుసు. చూస్తూ, చూస్తూ అమ్మాయిని ప్రభాకరానికి యివ్వలేను. మీరు ఏవిధంగా భావించినా మంచిదే! అమ్మాయికి అసలు యిష్టంలేదు బంగారు కత్తి అని మెడ కోసుకోలేము కదా!' మిన్ను విరిగి మీద పడినా తన నిర్ణయం మారదన్నట్లుగా ఉన్నాయి అతని మాటలు.
హతాశులయ్యారు శ్రీపతిగారు నీరజ వైపు చూస్తూ 'నీవల్లనైనా వాడు బాగుపడతాడను కున్నాను, నా ఆశలన్నీ అడియాసలయ్యాయి. నీవు యిష్టపడడం లేదని నాకు కోపం లేదు తల్లీ!ఎంత మేనకోడలినైనా నీవు చదువు. సంస్కార మున్నదానవు. యుక్త వస్కురాలవు. బలవంతం చేయడం నాకూ న్యాయంకాదు. పోనీ ప్రభాకరాన్ని వివాహం చేసుకోకపోతే మానే, ఈ యింట్లోనుండి మాత్రం వెళ్ళిపోకండి. నలుగురు యింట్లో ఉండడం నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది.' భుజంపై ఉన్న కండువాతో కళ్ళు తుడుచుకుంటూ అన్నారు శ్రీపతి గారు.
'లేదు. ఎక్కడ ఉండవలసిన వాళ్ళు అక్కడ ఉండడం మనందరికీ మంచిది. నీవే చెప్పావుకద మామయ్యా! పాపం! దిక్కులేని ఆ అమాయకురాలు శారదపై ప్రభాకరం దొంగతనం అంటగట్టాడని! అటువంటి ప్రయత్నం ఒకటిరెండుసార్లు నాపట్లకూడా జరిగింది. తెలివిగా తప్పించుకున్నాను. నీకు చెబితే యింకా బాధపడతావని నీకు చెప్పలేదు. అలా చెప్పి యిద్ధరి మధ్య కలతలు పెంచడం నాకిష్టం లేదు చూస్తూ ఊరుకోవడానికి అంతకన్నా మనసొప్పడంలేదు. ఆటువంటప్పుడు నేనేం చేయగలను? నీకు ఏవిధంగానూ ఈ విషయంలో తోడ్పడలేక పోతున్నాను మామయ్యా!' తన అసహాయతను వ్యక్తం చేస్తున్నాయి ఆమె మాటలు.
'మంచిది తల్లీ ...! ఈ విషయంలో యిక నేను బలవంతపెట్టను. మీరు వేరే ఉన్నా నీవుమాత్రం తరచుగావచ్చి మమ్ములను కాస్త కనిపెడుతూ ఉండాలి' దుఃఖంవల్ల మాటలు తడబడ్డాయి. వణకుతున్న చేతులతో కన్నీరు తుడుచుకుంటూ నీరజముఖంలోకి తన అసహాయ తతో నిండిన కళ్ళతో చూశారు శ్రీపతిగారు.
వారి పరిస్థితికి బాధవల్ల నీరజ కళ్ళు కళ్ళుకూడా చెమ్మగిల్లాయి.
'ధైర్యంగా ఉండు మామయ్యా! ఆ దేవుడిపై భారం వేయడంకన్న మనమేం చేయగలం?'
'అంతకన్న చేయగలిగింది మాత్రమే ముందమ్మా! అంతా వాడిలీల. వాడి చేతిలో కీలుబొమ్మలం. ఎలా జరుగవలసి ఉంటే అలా జరుగుతుంది.' దీర్ఘంగా నిట్టూరుస్తూ అన్నారు శ్రీపతిగారు.
* * *
సుందరరామయ్యగారు నీరజ శ్రీపతి గారి యింటినుండి వెళ్ళిపోయారు. వారం రోజులనుండి ప్రభాకరం ఇటు డబ్బు చేతిలో అందక అటురోజా కోరికలు తీర్చలేక చికాకు పడుతున్నాడు. రోజా ప్రవర్తన లో వచ్చిన మార్పును ఆరుమాసాల నుండి గమనిస్తూనే ఉన్నాడు. తనవద్ద పుష్కలంగా డబ్బు ఆడనందుకు, రోజాను తృప్తిపరచలేనందుకు ఎంతో బాధపడుతున్నాడు. అక్కడికి ఒక వేయి రూపాయల వరకు నలుగురైదుగురివద్ధ అప్పుచేశాడు. అంతకుమించి అప్పుదొరకడంకూడా సాధ్యపడలేదు. ఏమీతోచక నిప్పులో ఉప్పువేసినట్లు చిటపట లాడుతున్నాడు ప్రభాకరం. రోజా తనను నిర్లక్ష్యం చేయడాన్ని సహించలేక పోతున్నాడు. నీరజ సుందర రామయ్యగారు తమ యింటినుండి వెళ్ళిపోవడంతో హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. అయినా తన తండ్రి డబ్బు యిస్తాడన్న ఆశమాత్రం అతనికిలేదు.
ప్రభాకరం ఒకరోజు సాయంత్రం నాలుగు దాటిన తర్వాత చీకాకుపడుతున్న మనస్తత్వంతో 'ఫ్రెండ్స్ సర్కిల్' క్లబ్బుకు వెళ్ళాడు. ఆ క్లబ్బు ప్రభాకరం, అతని స్నేహితులు ఏర్పరచుకున్నది. దానికి ప్రధాన పోషకుడు ప్రభాకరం. కొన్ని నెలల క్లబ్ బిల్డింగుకిరాయి, కరెంటు ఛార్జీలు కట్టాలి. కరెంటు చార్జీలు కట్టక పోవడంవల్ల కరెంటు డిస్కనెక్ట్ చేశారు. అందుకని క్లబ్బు ప్రస్తుతం సాయంత్రం ఆరుగంటలవరకే పనిచేస్తూ ఉంది. చీకటి పడబోయేముందు క్లబ్బుకు తాళం వేస్తున్నారు.
ఆరోజు ఆదివారం. శలవు. ప్రభాకరం క్లబ్బుకు వెళ్ళేసరికి క్లబ్బంతా కోలాహలంగా ఉంది. ఒక టేబులు దగ్గర కూర్చొని రోజా నలుగురితో పేకాడుతూ ఉంది. మరొక టేబులు దగ్గర యిద్దరు అబ్బాయిలు, యిద్దరు అమ్మాయిలు కారమ్సు ఆడుతున్నారు. వేరొక టేబులు దగ్గర మరొక స్నేహితుడొకడు అతని స్నేహితురాలితో చెస్ ఆడుతున్నాడు. సిగరెట్ల పొగ, డ్రింకులతో నిండిన గాజు గ్లాసుల గలగలలు, వాతావరణమంతా సందడిగా ఉంది. అక్కడ ఖాళీగా వున్న ఒక కుర్చీలో కూర్చుని ఒక న్యూస్ పేపరు చదువుతూ ఉన్నట్లు నటిస్తూ రోజావైపు రహస్యంగా చూడసాగాడు. ఎవరి సందడిలో వారుండి ప్రభాకరాన్ని ఎవ్వరూ గమనించలేదు.
పేకముక్కలు కలిపి అందరికీ పంచింది రోజా. అలా పంచడంలో చేతులనూ తాకుతూ, అందరినీ క్రీగంట చిరునవ్వుతో పలకరిస్తూ, అందరి మతులనూ పోగొడుతూ వుంది. అందరూ తమ తమ ముక్కలను ఎత్తి వరుసలో పెట్టుకున్నారు. ఆట ప్రారంభమైంది. అయిపోయింది. రోజా గెలిచింది. అందరూ ఆమెకు ఇవ్వవలసిన దానికన్న ఎక్కువే యిచ్చారు. ఎక్కువగా ఇచ్చామన్న ధైర్యంతో ఒకరు రోజా అందాన్ని, మరొకరు ఆమె అందానికి ముఖ్య కారణమై ఒంపు తిరిగిన ఆమె పెదిమలను, వేరొకరు ఎర్రగా ఉండి చూపరులను రెచ్చగొడుతూన్న ఆమె బుగ్గ లనూ, ఇంకొకరు ఆమె చిలిపి కళ్ళను పొగుడుతూ ఉన్నారు. ఆమె అందరికీ థ్యాంక్సు చెప్పి, ఒకరితో చేతులు కలుపుతూ మరొకరికి తన చేతిని ముద్దెట్టుకోవడానికి అనుమతిస్తూ, యింకొకరికి కన్ను కొడుతూ ఎంతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వుంది. ఆమె ప్రవర్తనతో ప్రభాకరం హృదయం అగ్గిమీద గుగ్గిలం చల్లినట్లు భగ్గుమంది. రోజా ఆమె హృదయాన్ని అతని ఒక్కనికే అర్పించిందనీ, తనతో తప్ప మరొకరితో చనువుగా ఉండడం లేదనీ అనుకుంటూ వచ్చాడు. ఒక రిద్దరు ఈ విషయంలో హెచ్చరించినా నమ్మలేదు. ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాడు. ఇంకా ఏం జరుగుతుందో నని ఆదుర్దా పడసాగాడు. అతని కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి. ఆవేశంతో వొణికిపోతున్నాడు.
ఆ నలుగురిలో ఒకడు రోజా బుగ్గగిల్లాడు. వాడివైపు చిరునవ్వుతో చూస్తూ. చిరుకోపం నటిస్తూ 'యూ సిల్లీ బోయ్! వాటీస్ దిస్ ఎడ్వంచర్?' అంది.
'అదీ ఒక ఎడ్వెంచరే?' అని మరొకడు రోజాను దగ్గరకు లాక్కుని ఆమె బుగ్గలను సున్నితంగా ముద్దెట్టుకున్నాడు. ఇంకొకనికి కన్ను గీటుతూ యిక నీవంతు అన్నట్లు చూసింది రోజా! వాడు కూడా ఏదోఒక చిలిపి పని చేశాడు. నాలుగవ వాడు మాత్రం 'డియర్ రోజా! ప్రభాకరం చూస్తాడన్న భయం లేదూ?' కాంక్షను కళ్ళల్లోనే మరుగు పరుస్తూ అన్నాడు. అతను ప్రభాకరానికి కొద్దిగా సన్నిహితుడు.
'అతని స్నేహానికి విడాకులిచ్చేశాను డియర్!'
'కారణం?'
'ఏమీ లేదు. అతనిలో సరదా చచ్చిపోయి చాలా కాలమైంది. రసం పోయిన పిప్పిలా అయ్యాడు. ఆ ముఖం చూస్తేనే డోకు వస్తూవుంది. పూర్ క్రీచర్.' అని ఏదో పెద్ద జోకు చేసినట్లు పెద్దగా నవ్వింది. ఆమెను సంతోష పెట్టడానికి మిగతా నలుగురూ ఆ నవ్వులో తమ నవ్వు కలిపారు.
ఇక ఆగలేకపోయాడు ప్రభాకరం. తను కూర్చున్న చోటునుండి లేచాడు. కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ, పిడికిలి బిగించి, బరువుగా పెద్ద పెద్ద అడుగులు వేస్తూవారు కూర్చున్న ఆ టేబులువైపు నడిచాడు. అతనిని ఆ రూపంలో చూసిన ఆ నలుగురు మిత్రులూ టేబులు దగ్గరినుండి జారుకున్నారు. రోజామాత్రం, తొణక కుండ, బెణకకుండా అలా కూర్చుంది. ఆమె ధైర్యం అతనిని మరీ రెచ్చగొట్టింది. టేబులు ముందుకు వెళ్ళి రోజాను నమిలి మ్రింగేసేలా చూస్తూ 'రోజా!' అని బిగ్గరగా కేకేవేసి తనకున్న బలమంతా వినియోగించి బల్లపై గ్రుద్ధాడు. పేక ముక్కలన్నీ చెల్లాచెదురై పోయాయి. గ్లాసులు క్రిందపడి పగిలిపోయాయి.
ప్రభాకరం కళ్ళలోకి చూసిన రోజా ఒక్కక్షణం భయంతో వణికిపోయింది. తడబడింది. వెంటనే నిలద్రొక్కుకొని 'ప్రభాకర్! ఏం జరిగింది? ఇలా ఉన్నా వేమిటీ? నాన్నగారితో ఏమైనా పోట్లాడావా ఈరోజు?' కవ్వించేకళ్ళతో ప్రభాకరాన్ని చూస్తూ అడిగింది రోజా.
'చాలు! నీవేషాలు కట్టిపెట్టు. అరగంటనుండి నీ ప్రేమ కలాపాలు చూస్తూనే ఉన్నాను. నన్ను యిక మభ్యపెట్టలేవు. ఇందుకు నీసంజాయిషీ ఏమిటి?' సింహంలా గర్జించాడు ప్రభాకరం.
'నీకు సంజాయిషీ యివ్వవలసిన అవసరం నాకులేదు. అయినా నీవు నామెడలో తాళిగట్టిన భర్తవా? అసలు నన్ను బెదిరించడానికి నీవెవరు?' ఎర్రబడిన ముఖంతో కోపంగా అంది రోజా.
'ఛీ...! బజారు స్త్రీలుగూడా నీలా ప్రవర్తించరు. బుద్ది గడ్డి తిని పెద్దవారిని నిర్లక్ష్యం చేసి గుడ్డిగా నిన్ను నమ్మాను. పయోముఖ విషకుంభానివని తెలుసుకోలేకపోయాను తగిన శాస్తిచేశావ్?' చలిజ్వరం వచ్చినవాడిలా ఆవేశంతో ఒణికిపోతున్నాడు ప్రభాకరం.
'ఏమిటీపీడ? మిష్టర్! అసలు నీకునాకు ఏమిటి సంబంధం? మర్యాదగా మాట్లాడు. నేనసలే మంచిదాన్నికాదు. మర్యాద యిచ్చి పుచ్చుకోవాలి' చండ్ర నిప్పుల్లాంటి కళ్ళతో ప్రభాకరాన్ని చూస్తూ అంది రోజా...
'హుఁ....నీ బుద్ధి చూపించావ్! అనవసరంగా మాట్లాడి నన్ను రెచ్చగొట్టకు."
'ఏం చేస్తావు? అయినా నీతో యింతసేపు మాట్లాడడం నాదే బుద్ధితక్కువ' ముఖం చిట్లిస్తూ అంది రోజా.
'రోజా!'
ఆగావు కేకతో అక్కడున్న వారంతా ఉలిక్కిపడ్డారు. రోజా చావు మూడిందని అంతా అనుకున్నారు. ప్రభాకరానికి కోపం వస్తే ఎవరినైనా సరే లెక్కచేయడు. కాని అలా జరుగలేదు.
'ఛీ....యిక నీముఖం చూడను' అని చేయి ఎత్తినవాడల్లా ఎత్తినట్టే దించేసి తల ఒంచుకొని అక్కడ ఉన్న కుర్చీలో కూలబడి ఆలోచనలో పడ్డాడు. 'రోజాను కొట్టి లేనిపోని గొడవలు ఎందుకు తెచ్చి పెట్టుకోవాలి? ఒక ఆడదాన్ని కొట్టానన్న అపఖ్యాతి నాకెందుకు? ఎవరి మంచి చెడ్డలూ వారివెంటే ఉంటాయి. బోగం దానికన్న అసహ్యంగా ప్రవర్తిస్తూ ఉంది ఈరోజా. వాళ్ళకు కట్టు బొట్లూ నియమాలూ ఉంటాయి. దీనిలా ఒకేసారి నలుగురిని కవ్వించరు వాళ్ళు. హుఁ....దీనిననవలసిన పనిలేదు. పై మెరుగులు, తళుకుబెళుకులు చూసి మోసపోయాను. 'డబ్బు లేకపోతే బోగంది తల్లి వరుస' అని నాన్నగారు అంటూ ఉండే సామెత యిప్పుడు గుర్తుకు వస్తా ఉంది. రోజా నా జీవితంలో ప్రవేశించి బెల్లమున్నంతసేపు ఈగలు ముసిరినట్లు నాచేతిలో డబ్బులు ఆడినంతసేపు నేను తాన అంటే తను తందాన అంది. నా దగ్గర డబ్బులు ఆడకపోవడంవల్ల శూలాలవంటి తన మాటలతో నా హృదయాన్ని గాయపర్చింది. కాలికి ముల్లు గుచ్చుకుంటే తీసి అవతల పారేసి నట్లు ఈమెనుకూడా విసర్జించాలి. అవును-దుష్టుల స్నేహాన్ని డబ్బిచ్చి వదిలించుకోవాలనీ, మంచివారి స్నేహాన్ని డబ్బిచ్చి పొందాలనీ అంటారు. అది నా పట్ల నిజమైంది. ఈ నాటితో శని విరగడయింది. ఇంతకాలం రోజా స్నేహంతో డబ్బు. అంతకన్న విలువైన కాలం అన్నీ వృధా అయ్యాయి.' పై విధంగా ఆలోచిస్తున్న ప్రభాకరానికి రోజా మెల్లగా అడుగులు వేస్తూ వెళ్ళడం కనుపించింది. ఆవేశం తగ్గిపోయింది.
