నాగభూషణం మనస్సు ఎందుకో గతుక్కు మన్నది. పెద్ద కొడుకు లిద్దరూ ఆ తీరుగా తనను వదిలి వెళ్ళిపోయారు. మూడో వాడు రమేష్ నాలుగయిదేళ్ళ నుంచీ పోరుగూళ్ళో ఉండి చదువుకుంటున్నా, సెలవులలో వస్తూ పోతూ ఉండడం నుంచి అదో తీరుగా ఉండేది. ఇప్పుడు రమేష్ ఉద్యోగ రీత్యా ఊరు విడిచి పోతానంటే ఆయనకు కడుపులో దేవినట్ల యింది. ఈ రీత్యా రమేష్ తనకు దూరమవుతున్నాడను కోగానే ఆయనకు కళ్ళంట నీళ్ళు తిరిగినాయి. పోనీ, రమేష్ తో బాటు గానే అ ఉద్యోగపు ఊళ్ళో నే ఉందామంటే , ఆయనకా పల్లెటూరు వదిలి పెట్టి ఈ పెద్ద తనం లో వెళ్ళటానికి యిష్టం లేదు. అరవై ఏళ్ళు దాటిన తరువాత చదువుకోక మట్టి గోట్టుకోవా అన్నట్లు, జీవితమంతా ఆ పల్లెటూళ్ళో గడిపి, వృద్ధాప్యం లో బస్తీ చేరీ , పొరుగు పంచ ల్లో, అద్దె యిళ్ళల్లో ఆ కాస్త ప్రాణం గుటుక్కు మంటే బజార్లో కి ఈడుస్తారని అయన భయం. అందుకనే ప్రసాదపురం వదిలి వెళ్ళటానికి అయన యిష్టపడలేదు.
"అరవై ఏళ్ళకు పైగా ఈ పల్లెటూళ్ళోనే ఉన్నానురా. పెద్ద మడిమాన్యాలు లేకపోయినా గౌరవంగానే కాలం గడుపుతున్నాను. ఈ గడ్డ మీద పుట్టి పెరిగిన పాదిని, ఈ గడ్డ మీదనే పోవటం మంచిది. నాకు మనస్పూర్తిగా అదే కోరిక. నాకు వండి పెట్టటానికి అక్కయ్య ఉన్నది. నాకేం యిబ్బంది లేదు. నువ్వు ఉద్యోగం చేసుకుంటూ నీ భార్యతో సుఖంగా ఉండటం కన్నా నాకు కావలస్సిందేమీ లేదు. నాకోసం నువ్వు ఉద్యోగం మానుకోవద్దు. ఈ పల్లెటూరి అనుభవాలూ, పట్టింపు లూ నాతోనే అంతమవనీ. నువ్వా, పల్లెటూళ్ళో ఉండి చెయ్య గలిగింది లేదు. తండ్రి అనే అపేక్ష అంతః కరణ ఉంచి, అప్పుడప్పుడూ వచ్చి చూసి పోతుంటే చాలు" అన్నాడు.
ఆవేదనతో ఆయన మనస్సు బరువెక్కింది. దుఃఖం పొంగి పొర్లుకు వచ్చింది. ఒకవైపున కొడుకును ఉద్యోగానికి మనస్పూర్తిగా పోమ్మందామనే సంతోషం. మరో ప్రక్కన భార్య వ్యామోహంలో పడి తనను మరచిపోతాడే మోననే దిగులు. ఇదివరకు రమేష్ పోరుగూళ్ళో ఉండిచదువు కున్నా ఆయనకు ఏ భయమూ ఉండేది కాదు. అతని మనస్సు కు తన వైపు కు తిప్పుకోగల వ్యక్తీ యింకొకరు లేరు. పెద్ద కొడుకు లిద్దరూ కూడా భార్యలు కాపురానికి రాగానే తండ్రితో భాగం పంచుకున్నారు. కోరిన పిల్లను చేసుకున్నాడు గనక రమేష్ కూడా అతీరునే అవుతాడే మోనని అయన దిగులు.
ఉత్తరీయం తో కళ్ళు తుడుచుకుని, "నన్నింత మట్టిచేసే బాధ్యత నీదేరా! నా ఆశలన్నీ నీమీదనే పెట్టుకున్నాను. ఇన్నేళ్ళూ , ఈ ఇంట్లో ఈ వూళ్ళో జీవితం గడిపి, ఆఖరు రోజుల్లో ఆ బస్తీల్లో , ఆద్దె యిళ్ళల్లో పోవడం నాకు యిష్టం లేదు. నువ్వు లక్షణం గా కులాసాగా ఉద్యోగం చేసుకుంటూ నీ భార్యతో సుఖంగా ఉండు. ఇంతకన్న నే చెప్పెడెం లేదు" అన్నాడు.
తండ్రి ఈవిధంగా అంటుంటే రమేష్ ఏమీ చెప్పలేక పోయాడు. కామాక్షి కూడా అదే అభిప్రాయాన్ని వెలి బుచ్చింది.
విద్యార్ధి జీవితం లో కాలేజీ లో గాని, హైస్కూల్లో గాని పాఠ్య గ్రంధాల లో ఎక్కడా , చదువు తరువాత విద్యార్ధులు పెద్దవారయ్యాక చెయ్యబోయే ఉద్యోగాల విషయాలు గాని, చెయ్యవలసిన పద్దతులు గాని చెప్పరు. విద్యార్ధులకు కూడా చదువు పూర్తయిన తరువాత ఏం చేయాలో ఇదమిత్టంగా తోచదు. విద్యార్ధి జీవితం వింత వింత ఫలాల్ని కాయించే ఫల వృక్షం వంటిది. ఆ పండిన పళ్ళల్లో పుష్టిగా , సమృద్దిగా ఆహారాన్నిచ్చేవీ ఉండవచ్చు. ఎన్నాళ్ళు చూసినా పండని కసుగాయాలూ ఉండవచ్చు. ఉడుకు మోతు పిందెలు గానూ ఉండవచ్చు. పూత లోనే రాలిపోవచ్చు. ఆ పూత , కాయ, పండ్లు ఏ తీరుగా, ఏ రకంగా ఉంటాయో ఇదమిత్థంగా చెప్పగలగటం కష్టం. కొంతమంది చదువు విజ్ఞానాన్ని పెంపొందించుకోవటానికే అంటారు. మరి కొంతమంది ఉద్యోగాలు చెయ్యటాని కంటారు. ఉద్యోగం దొరక్కపోతే కూడా విజ్ఞానం పెంపొందుతుంది. ఈ సంఘం లో ఏ తీరుగా చెలామణి కావచ్చునా అని ఆత్మ పరిశీలన చేసుకోవచ్చు.
వసుంధర ను ప్రసాద పురం లోనే ఉంచి రమేష్ ఉద్యోగన్వేషణ కు బయల్దేరాడు . అయినవాళ్ళ నూ, కాని వాళ్ళనూ అందర్నీ ఆశ్రయించారు. చివరకు హైదరాబాదు లో ఒక పెద్ద ప్రైవేటు కంపెనీ లో ఉద్యోగం దొరికింది. నెలకు నూట యాభై రూపాయల జీతం. ఉద్యోగానికి అయిదు వందలు ధరావతు కట్టాలి. అన్ని పద్దతులూ ఒప్పుకుని ఆర్డరు తెచ్చుకున్నాడు.
రమేష్ ఊళ్ళో లేని ఆ వారం పది రోజుల్లో వసుంధర కు ఏమీ తోచలేదు. పల్లెటూరి పని నీకు తెలీదని కామాక్షి వసుంధరను ఏ పనీ చేయనిచ్చేది కాదు.
ఉదయం ఐదు గంటల కల్లా కామాక్షి నిద్ర లేచేది. పనిమనిషి పనులు చేస్తుంటే , పాలేరు చేత పాలు తీయించి వసుంధర నిద్ర లేచేసరికి కాఫీ కాచి సిద్దం చేసేది. వసుంధర నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకుని కాఫీ త్రాగి స్నానం చేసి కూర్చునేది. ఏ పని చేయటానికి ఏమీ తెలిసేది కాదు. ఏవో పుస్తకాలు చదువుకుంటూ ఉండేది. ఇంటి పని, వంట పనీ కామాక్షి చేసేది. వసుంధర మనస్తత్వం కామాక్షి కి తెలియలేదు.
"ఎమ్మా , వసుంధరా -- బస్తీ పనులకూ, పల్లెటూరు పనులకూ తేడా చూస్తున్నావా? నాకు సరిగ్గా కాఫీ అయినా కాయటం చేత కాదు. మీరు ఫిల్టరు కాఫీ తాగుతారు. ఈ గుడ్డ కాఫీ నీకు బావున్నదో లేదో మరి?" అన్నది కామాక్షి.
"కాఫీ లో ఏముంది వదినా? ఎవరి పద్దతులు వాళ్ళవి" అన్నది వసుంధర.
"మరి వంట బావుంటున్నదా?"
"నాకా మాత్రం వంట చెయ్యటం చేత నయితే గా వంక పెట్టటానికి? మొన్నటి వరకూ పరికిణీ, జాకెట్టూ , ఓణీ వేసుకుని చిన్న పిల్లగా స్కూల్లో చదువుకున్న నాకు ఒక్కసారిగా వంట చెయ్యాలంటే నిజంగా భయం వేస్తున్నది, వదినా. ఆడదాని జీవితంలో ఒక్కసారిగా ఇంత మార్పు రావటం ఆశ్చర్యంగానే ఉంది" అన్నది వసుంధర నవ్వుతూ.
"అయితే మా తమ్ముడు వంట చెయ్యటం చేతకాని పిల్లను చేసుకున్నాడన్నమాట! ఎంత పొరబాటు, ఎంత పొరబాటు!" అన్నది కామాక్షి యెగతాళి గా నవ్వుతూ.
"మీ తమ్ముడు , నాకు వంట వచ్చునో రాదో అడిగి తెలుసుకోలేదు. పనిపాటలు వచ్చునో లేదో అసలే అడగలేదు. వసుంధరా, నన్ను చేసుకోవటానికి యిష్టమేనా అన్నారు. నేను మాట్లాడలేదు. మౌనం అర్ధాంగీకార మనుకున్నారు. మా నాన్నగారు కూడా సంబంధం వెతకటం తప్పింది కదా అని ఒప్పేసుకున్నారు." అన్నది వసుంధర.
"అట్లాగా, పాపం! చాలా అన్యాయమే చేశారు. అంత యిష్టం లేని పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నావమ్మా?"
"అంతా నా అదృష్టం వదినా. ఏదో చిన్నతనం వల్ల ఎగతాళి గా మాట్లాడాను వదినా. ఏమీ అనుకోకండి. మా మనస్సులూ , హృదయాలూ కలిసినయ్యి. ఒకరి నోకరం అర్ధం చేసుకున్నాం. ఇంతకన్నా పెళ్ళికి కావలసిన ఆదర్శం ఏముంటుంది చెప్పండి? వంట చెయ్యటం నాకూ వచ్చు. కాకపొతే ఎక్కువ నేర్పు లేదు. నేనేమయినా పారబాటుగా మాట్లాడితే క్షమించండి వదినా" అన్నది వసుంధర.
"నాకు నచ్చిన మరదలు వచ్చినందుకు నేను చాలా సంతోష పడుతున్నానమ్మా. ఏ పొరపొచ్చాలు లేకుండా ఆదర్శ జీవితం గడపడమే నాకు కావాల్సింది. పట్నం లో కాపురం ఉండబోతున్నా, ఈ ముసలి మామగార్ని, ఈ దీనురాలూ, నిర్భాగ్యురాలూ అయిన కామాక్షి వదిన నీ మరిచిపోకు. ఎప్పటికయినా నా జీవితం మీ చేతుల్లో వెళ్లి పోవలసిందే." అన్నది కామాక్షి.
వదిన గారి మానసిక ఉద్వేగాన్ని వసుంధర అర్ధం చేసుకోలేక పోలేదు. "మీకు ఏ కోరతా లేకుండా చూసుకునే బాధ్యత మాది వదినా. ఈ యిల్లూ , ఈ కుటుంబమూ మీది. నేను యివాళ కొత్తగా వచ్చిందాన్ని. వసుంధర చదువుకున్న పిల్ల, కొత్త సంబంధం అనుకోవచ్చు. వాళ్ళతో నేను ఎట్లా ఉండగలనా అనుకోవచ్చు. అంతర్యాలు కలిస్తే ఏ మనస్పర్ధలూ ఉండవు. మీకన్నా చిన్నదాన్ని. ఇంతకన్నా చెప్పలేను. మామగారు అందరికీ ప్యూజ్యులే" అన్నది వసుంధర.
కామాక్షి మనస్సు ఉప్పొంగి పోయింది. వసుంధర యింత ఆదరాభిమానాలు చూపగల ఆత్మ సౌందర్య వంతురాలని అనుకోలేదు.
ఆశ ఉన్న చోటనే నిరాశ ఉంటుంది. నిరాశ కలిగినప్పుడు మనస్సులో బాధపడే కన్నా సంతృప్తి అనే పదానికి సరైన అర్ధం తెలుసు కోగలిగితే ఏ యిబ్బందు లూ ఉండవు. కామాక్షి ఈ కోవకు చెందిన వ్యక్తీ.
హైదరాబాదు నుంచి రాగానే తన ఉద్యోగం సంగతీ, కట్టవలసిన ధరావతు సంగతీ తండ్రికి చెప్పాడు రమేష్. కొడుకు దూరమవుతున్నందుకు నాగభూషణానికి కష్టంగా ఉన్నా ఉద్యోగం విషయం కనక ఆయనా మనస్సు సరిపెట్టుకుని ఒప్పుకోక తప్పలేదు.
అప్పటికి యింకా ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడలేదు. హైదరాబాద్ రాష్ట్రంగానే ఉంది.
రమేష్ వసుంధర తో బాటు హైదరాబాద్ ప్రయాణమై నాడు. హైదరాబాదు లో గుంటూరు స్నేహితుడొకతను ఉన్నాడు. ఇల్లు దొరికే వరకూ వారం పది రోజులు ఆ స్నేహితుడు వాళ్ళ యింట్లో నే ఉండమన్నాడు. ఆ ఏర్పాట్ల న్నీ చేసుకునే రమేష్ ఉద్యోగం లో చేరటానికి ప్రయాణ మైనాడు.
కొడుకూ, కోడలూ వెళ్ళుతుంటే నాగభూషణం కళ్ళు చేమర్చినాయి. మనస్సులో దుఃఖం పెల్లుబికింది. వచ్చే దుఃఖాన్ని మనస్సులోనే దిగమింగి, "ఆమడలు దూరమైనా అంతః కరణలు దూరం కాకూడదురా. ఇంతకన్నా నేనేం చెప్పేది లేదు." అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ.
"వారానికో ఉత్తరం రాస్తుండు. మా ఆశలన్నీ నీమీదనే పెట్టుకున్నాం. ఉత్తరాలు రాయడం మానేస్తే , మాయందు యిష్టం లేక మమ్మల్ని మరిచి పోయినట్లుగానే అనుకోవలసి వస్తుంది. నువ్వయినా వాడికి చెప్పి ఉత్తరాలు రాయించు వసుంధరా" అన్నది కామాక్షి.
