Previous Page Next Page 
అయిదు రెళ్ళు పేజి 17

 

    జానకమ్మ "పిల్లలు ఒక్కల్లె ఉంటారు...." మీరు తొందరగా ఇంటి కోస్తూ ఉండండి.... అని రామయ్య గారికి అప్పగింతలు పెట్టింది.
    అమ్మాయి లిద్దరూ కయ్యాలాడు కోకుండా ఇల్లు జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది.
    రైలు ప్లాట్ ఫారం దాటేంత వరకూ ఉండి రామయ్య గారు, గీత, ఉష ఇంటికి తిరుగు ముఖం పట్టారు.
    బెజవాడ లో సుధాకర్ విదిపోవలసి వచ్చింది.... ఎవరూ చూడకుండా చూసి "మీ బావ ధ్యాసలో నన్ను మర్చిపోతారా?' అనడిగాడు సుధాకర్ కళను భారంగా.
    కళకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి... మౌనంగా ముఖం మరో వైపుకు తిప్పింది.
    జానకమ్మ అమ్మాయిలతో చెప్పి సుధాకర్ ప్లాట్ ఫారం వదిలాడు. సుధాకర్ దూర మవుతున్న కొద్దీ కళ చెంపల మీద కన్నీళ్లు చరచర పరుగులు దీశాయి.....

                                 7
    రైలు వైజాగ్ చేరుకుంటుందనగా శారద జానకమ్మ నడిగింది--
    "స్టేషను కు బావస్తాడమ్మా? లేక పొతే మనమే వెతుక్కుంటూ వాళ్ళింటికి వెళ్ళాలా?'
    "వస్తాడమ్మా... నాన్నగారు ఉత్తరం రాశానన్నారు!" అని చెప్పింది జానకమ్మ.
    "బావ ఏమన్నా మారాడో లేదో? ఇంకా పీలగానే ఉన్నాడో లేక బలిశాడో?' అన్నది చిత్ర చేతులతో అభినయిస్తూ.
    జానకమ్మ నవ్వింది. శారద నవ్వింది... కళ మాత్రం తన ధ్యాస లో తానున్నది.
    రైలు వైజాగ్ చేరుకునే సరికి సాయంత్రం అయిదు దాటింది. కిటికీ లో నుంచి ప్లాట్ ఫారం నంతటినీ కలయ జూస్తూ "బావ వచ్చినట్టు లేడమ్మా!" అన్నది శారద.
    రైలు పూర్తిగా ఆగక ముందే కూలీలు పెట్టె లోకి జొరబడి గబగబా సామాన్లు చేతుల్లోకి తీసుకుంటున్నారు. ప్రయాణీకులు సందడిగా, సంతోషంగా క్రిందకు దిగి సామాన్లన్నీ సరిగా ఉన్నాయో, లేవో సరి చూసుకుంటున్నారు. వాళ్ళను రిసీవ్ చేసుకోవటానికి వచ్చిన వాళ్ళు ఆప్యాయంగా కుశల ప్రశ్నలు వేస్తున్నారు. ప్లాట్ ఫారం కళకళ లాడుతున్నది.
    జానకమ్మ శేఖర్ కనబడక పోయేసరికి అయోమయంగా చూస్తూ నిలబడింది.
    "బావోస్తాడెమో... కాస్సేపు చూస్తేనో?" అన్నది ఆఖరికి.
    "నువ్వు ముందు కిందికి దిగి నించో అమ్మా... సామాన్లు దింపేద్దాం...." అంది కళ.
    జానకమ్మ ను చెయ్యి పట్టి క్రిందకు దింపింది శారద. భుజానికి ఎయిర్ బేగ్ తగిలించుకుని చేత్తో ప్లాస్టిక్ బుట్ట పట్టుకుని తనూ దిగింది. కళ చిత్ర సాయం పట్టి రెండు పెట్టెలూ, క్రిందికి దించారు. అందులో ఒకటి ట్రంకు పెట్టె, మరోకటి తోలు పెట్టె, రెండూ నిండుగా, బరువుగా ఉన్నాయి. అందులో ట్రంకు పెట్టె మరీని.... క్రిందకు దించాక కళ, చిత్ర ఎర్రగా కందిపోయిన అరచేతులనువూదుకున్నారు. నిమిషంలో ప్లాట్ ఫారం ఖాళీగా నిలబడింది. అంతా ఎవరి దారిని వారు వెళ్ళారు....
    "దాహంగా ఉన్నది....' అంది కళ జానకమ్మ తో.
    "నేను వస్తాను పద...అలా వెళ్ళి మంచి నీళ్ళు తాగొద్దాం...." అని బయల్దేరింది చిత్ర.
    కళ, చిత్ర వెళ్ళిన కాస్సేపటికి గళ్ళ చొక్కా, తెల్ల ఫాంటు , నల్లని చాయ , ఒక మాదిరి పొడుగూ -- సన్నగా చలాకీగా కనబడే ఆకారం ఆదరా బాదరా పరుగెత్తు కుంటూ జానకమ్మ , శారద నిలబడి ఉన్న చోటికి వచ్చింది.
    'అత్తా! ఎలా ఉన్నావ్?.... వెధవ రైలు! రోజూ ఆలస్యంగా వస్తుంది కదాని ఈరోజు కాస్త ఆలస్యం చేస్తే మామూలు టైం కే వచ్చేసింది. హలో కళా! కులాసా! బాగా నల్లబడి పోయావే?"
    మంచినీళ్ళు త్రాగి తిరిగొస్తున్న చిత్ర బావ మాటలు విని అంత దూరం నించే కిలకిల లాడింది.
    దగ్గర కొచ్చి "బావా! నీ బుద్ది ఏ మాత్రం ఎదగలేదు! అయిదేళ్ళ క్రితం చొక్కా పరికిణీ వేసుకున్నదని ఇంకా అలానే ఉంటుందనుకున్నావా? అది కళ కాదు శారద.... ఇదీ కళ!" అంటూ తన వెనకాలే నిలబడ్డ కళను చెయ్యి పట్టి ముందుకు లాగింది.
    శేఖర్ కళను చూసి వెంటనే మళ్ళా శారద కేసి విస్మయంగా చూపులు సారించాడు.
    అయిదడుగులకు మించని ఎత్తు, చామన చాయ, చెంపకు చేరడేసి కళ్ళు, పొడవైన ముక్కు , సన్నగా విడిపోతూ చిరునవ్వు చిందించే పెదాలు నున్నగా మెరిసే చెంపలు.... అందమైన కోలా ముఖం లో చక్కని దోస గింజ బొట్టు.... ముదురు నీలం పట్టు పరికిణీ , తేలిక నీలం జాకెట్టు, దాని మీద వయ్యారంగా జారుతున్న నీలం నైలాన్ వోణీ.... వెనుక నుండి ముందుకు కొద్దిగా తొంగి చూస్తున్న వాలు జడలోని పూలు.... అందమైన పదహారేళ్ళ పడుచు....!
    సన్నగా నాజూగ్గా రెండింతలు పెరిగిపోయింది బాపురే! మునుపటి శారద కాదు!
    కళ ఫకాలు మంది.
    "బావా! వూచ పట్టుకుని నిలబడు.... కళ్ళు బైర్లు కమ్మి కింద పడిపోగలవు!"
    శేఖర్ విస్మయం నుండి తేరుకునే సరికి కళ కూలీలను పిలుస్తున్నది... మరదళ్ళు కాదు వడగళ్ళు అనుకున్నాడు శేఖర్.
    ఉన్నవి నాలుగు సామాన్లు. అందులో రెండు చేత్తో మోసుకు పోయేవే.....
    "వీటికి కూలీ ఎందుకు? బోలెడంత అడుగుతాడు...!" అన్నాడు శేఖర్ వంగి తోలు పెట్టె మీద చేయ్యేస్తూ.
    "మరి మనమే నెత్తిని పెట్టుకుని పోదామంటావా?' అని నవ్వింది చిత్ర.
    కూలీవాడు పెట్టెలు మీది కెత్తబోతున్నంతలో "ఎంత కావాలో ముందే అడగవోయ్! మళ్ళా అనక పేచీ పెడతారు.... మీరేం సామాన్యులు కారు...!" అంది జానకమ్మ ముందు జాగ్రత్తతో.
    "బెడ డబ్బులకు బేరమేమిటమ్మా?... అబ్బో! సాలా బరువుగా ఉన్నాయే? మూడు పావలా లిచ్చేయ్యండమ్మా..." అన్నాడు కూలీ నెత్తి మీద పెట్టెలు పెట్టుకుంటూ.
    "హెడ్ లోడ్ కి పావలాయే కదయ్యా! నీ ఆశకు అంతున్నట్టు లేదు.. .దించు ! దించు!" అని తగువులాడాడు శేఖర్.
    "సరే! అర్ధరూపాయి చేసుకొండమ్మా...." అంటూ కూలీ సామానుతో వెళ్ళబోతున్నాడు.
    "పావలా కోస్తేరా, లేకపోతె కింద పెట్టి వెళ్ళు! మేమే తీసుకు పోగలం...." అన్నాడు శేఖర్ కూలి వాడిని బెదిరిస్తూ.
    కూలీవాడు కోపంగా చూస్తూ "అలాగే ఎత్తుకెళ్ళవయ్యా ? మా కడుపులు కొట్టి మీ బాబు మేడలే కట్టుకుంటాడో, మిద్దేలే కట్టు కుంటాడో? పావలా డబ్బుల కాడ మొకం చూసుకుంటున్నాడు...." అంటూ దభీమని వాటిని కింద పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు.
    జానకమ్మ నొచ్చుకుంది.
    "వీడి నోరు పడిపోను....! నిష్కారణంగా ఎన్ని మాటలన్నాడు?' అంది బాధ పడుతూ.
    "నువ్వూరుకో అత్తా! ఏ కూలీ వాడూ అక్కర్లేదు...ఎవరో ఒకళ్ళు నాతో రండి.... రెండూ ఒక్కసారే మోసు కెళ్ళటం కష్టం.... ఒక పెట్టె రిక్షా లోకి చేరవేశాక మరొకటి తీసుకు రావచ్చు...." అంటూ తోలు పెట్టి చంకలోకి తీసుకున్నాడు శేఖర్.
    చిత్ర శేఖర్ వెంట వెళ్ళింది.
    బైట రెండు, మూడు జట్కా బళ్ళు, నాలుగైదు రిక్షాలు ఉన్నాయి. రిక్షాలు , బళ్ల వాళ్ళు శేఖర్ ను చూడగానే గబగబా పరిగెత్తుకుని వచ్చారు. ఒక రిక్షా వాడు ఇటు, మరొక జట్కా వాడు అటు పెట్టెను పట్టుకు లాగారు.
    "రిక్షా ఎక్కండి బాబు....! సామాను రిక్షాలో పెట్టేస్తాను...."
    "జట్కా లో ఎక్కండి బాబు! ఏగిరం తీసుకు కెళ్ళి పోతాను...." తోలు పెట్టె కాస్తా ఇద్దరి మధ్యా అప్పడం లా అణిగి పోతున్నది.
    "వెళ్ళండి! వెళ్ళండి!' అంటూ శేఖర్ ఇద్దరి చేతుల్ని త్రోసి పారేశాడు.
    "తోలు పెట్టె కాస్తా ఎలా నొక్కుకు పోయిందో" అంది చిత్ర బాధగా తోలు పెట్టెను సరి చేస్తూ.
    శేఖర్ పెట్టె క్రిందికి దించి "నువ్విక్కడే ఉండి చూస్తుండు.... నేనా పెట్టె మోసుకొస్తా...." అని చెప్పి లోపలి కెళ్ళాడు.
    శేఖర్ ఫాట్ ఫారం మీది కొచ్చేసరికి జానకమ్మ సిమెంటు బెంచీ మీద కూర్చుని ఉంది. కళ, శారద ప్లాట్ ఫారం కొలుస్తూ నిలబడ్డారు.
    "ఇంక పదండి....!" అంటూ శేఖర్ ట్రంకు పెట్టె మీది కెత్తబోతే అది లేవలేదు....ముగ్గురమ్మాయిల బట్టలు మోస్తున్న పెట్టె కాబోలను కున్నాడు శేఖర్....
    "మరో పావలా వాడి ముఖాన పారేస్తే వాడే తిప్పలు పడేవాడు.... పాపం? ఇప్పుడు బావ సత్తువెంతో తెలిసిపోయింది..?" అంది కళ పరిహాసం చేస్తూ.
    జానకమ్మ కూలీ వాడెవడైనా కనబడతాడెమో నని అటూ, ఇటూ చూసింది. నీలం చొక్కా వేసుకున్న వాడు ఒక్కడు కూడా కంటికి కనబడలేదు.
    కళ మాటలతో రోషం వచ్చి శేఖర్ బలవంతంగా పెట్టెను తీసి చంకలో పెట్టుకున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS