అనంతమైన వికీర్ణమైన ఈ లోకంలో భిన్న విభిన్న జీవకోటికి మధ్య తాను.
"ఎవరీ పధికుడు? ఈతని ధ్యేయమేమిటి? ఎక్కడికి ఈ యాత్ర? ఈతని పధం ఏది? ఇన్ని ప్రశ్నలు.
యుగయుగాల క్రిందట పద చలనాల్లో తోలి పదచలనం ఎవరిదో ఎలా గుర్తు పట్టటం?
తను స్త్రీ. ఈ యుగంలో నీతి అని నీతుల కీకారణ్యం లో ఒంటరి బాటసారి. దారి కొత్తది. ఇతర స్త్రీల దారికి భిన్నమైనది.
తనలో ఉన్న భిన్నమైన ఏదో ఊహ ఈ కొత్తదారి తీసి తనను పధ విహీనను చేసింది.
తను అనాదిగా ఇలాగే ఉందా? ఈ ఒంటరితనం అనంత కాంతి యొక్క తోలి ఉషస్సు నుంచీ తనను వేధిస్తూనే ఉన్నదా?
తన చుట్టూ ఉన్న జగత్తును మరిచిపోయి కిటికీ నానుకుని నిలబడింది చిట్టి. జగననాధం పుస్తకాలు అమ్ముకుని తినగా మిగిలినవి చాలా చదివింది ఆమె. ఆమెకు ఆలోచించే శక్తి మరింత అధికమయింది.
ఒక్కసారి మనో నేత్రంతో గత కాలంలో స్త్రీ జీవితాన్ని సమీక్షించా లనిపించింది. చిట్టి మధ్య మధ్య అలా నిలబడి పోవటం జగన్నాధానికి అలవాటే. జయప్రదరావు తెల్లబోయి చూస్తున్నాడు. ఆమె కళ్ళు మూసుకుని అలాగే నిలబడి ఉంది. సంధ్య ఆమె సుందర వదనాన్ని రాగ రంజితం చెయ్యాలని వ్యర్ధ ప్రయత్నం చేస్తున్నది.
అర్ధ రాత్రుల తమోమయ నృత్యం -- భయంకరమైన ఒంటరితనం -- ప్రాణం తాలూకు నిరంతర సంఘర్షణ -- లోకం తన నాలుక సాచి ఆకలి నివారణ చేసుకోవాలని చేస్తున్న బుస -- ఘోరమైన దాహం.
ఒకరి చలనం మరొకరికి మరణం. ప్రతి జీవికి తన నీడలో నిద్రనిచ్చే మరణం. జీవి అనుభవాలు ఆధారంగా సాలెగూడు అల్లే మరణం.
ఏనాటిదో అయిన ప్రాచీన నిశీధం లో ఈ పధ విహీన తోలి నీడ ఉన్నది. అప్పటి నుంచీ ఆ అభాగిని యాత్ర ప్రారంభ మైంది. శతాబ్దాల అగ్ని శిఖరాల మీద అడుగు వేస్తూ , యుగ యుగాల భూకంపాల నెరియాల్లో ఇరుక్కుపోతూ, విధి భ్రమణపు "గిలోటిన్" లో బలి అవుతూ ఆమె యాత్ర సాగుతూనే ఉంది.
కాలం ఈ పురాతన పాందురాలి పధాన్ని గురించి ఎప్పుడూ చెపుతూనే ఉంది. ఆమె చెవిలో గతాన్ని భవిష్యత్తు ను కూడా జ్యోతిషం చెపుతూనే ఉంది. అయినా ఆమె వినిపించుకోదు.
యుగ యుగానికి ఆమె అడుగులో కొత్త చలనం, కొత్త రకంగా లేస్తున్న పాత తప్పటడుగు , ఈ భిన్న విభిన్న జీవనమే నారీ జీవన గాధలో మొదటి నుంచీ వస్తున్నది. దీనికి సమాప్తం లేదు. అంతు అసలే లేదు.
ఎక్కడో ఉరిమింది. చిట్టి ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. జయప్రదరావు తెల్లపోయి తననే చూడటం గమనించి అక్కడి నుంచి లోపలికి వెళ్లి కుంపటి వెలిగించింది చిట్టి జయప్రదరావు ఆమె వెనకాలే లోపలికి వచ్చి నసుగుతూ నసుగుతూ మంచి నీళ్ళడిగి , త్రాగి , అడగలేక అడగలేక --
"నువ్వెవరివమ్మా" అన్నాడు చిట్టిని.
చిట్టి సమాధానం చెప్పలేదు. కొన్ని క్షణాలు సమాధానం కోసం ఎదురు చూసి రాకపోయేసరికి వాకిట్లో కి వచ్చి నులక మంచం మీద పడి నిద్ర్ట పోయినాడు అతను. ఆ నిద్రలో ఏదో ఆలాపన.
ఎన్ని యుగాల మూగతనం నుంచి మాట్లాడటానికి మానవుడు మూలుగుతున్న మూలుగు -- కాలం యొక్క ఒరపిడి కి వికసించిన అతని మేధస్సు -- అతన్ని గాభరా పెడుతున్న తెలివితేటలూ -- అన్ని నశించినవి.
అంధత్వం ఆక్రమించింది.
మనోనేత్రం రెప్పలు మూసుకుంది.
ఎన్నో కన్నీళ్ళు కలకాలం కార్చిన అనంతరం అందులో అంధకారం తనను తాను తడిసి ఎండ వేసుకుంటూన్నది.
ప్రాచీన నిశీధం లోకి తిరిగి ప్రయాణించాడతను. తుఫానుల మధ్య త్రుళ్ళి పడుతూ గత కాలంలోకి తిరోగమిస్తున్నా డతను. అతని ప్రయాణం ముందు మరణం ఓడిపోయి రాజీ కోస్తున్నది.
"బావగారూ , నిద్రపోయినారా?" అన్నాడు జగన్నాధం వంకాయల సంచీ ఈ చేతిలోంచి ఆ చేతిలోకి మార్చుకుంటూ . జయప్రదరావు సమాధానం చెప్పలేదు. నిజంగానే అతను నిద్ర పోయినాడు.
చాలా రోజుల తరువాత జగన్నాధం వ్యాసం వ్రాయటానికి ప్రయత్నిస్తున్నాడు. లోపలి నుంచి వంకాయ కూర తాలుకూ కమ్మని వాసన కాలాన్ని సాగానీయటం లేదు. కలం కింద పారవేసి --
"ఇహ లాభం లేదు " అనుకున్నాడతను.
"ఎందుకని లాభం లేదు జగ్గూ" అంది చిట్టి.
"నువ్వెప్పుడోచ్చావు?"
"ఎక్కడి కెళ్ళాను నేను? వంటింట్లో నుంచి వసారా లోకి రావటం పెద్ద రావటమా ఏమిటి ? ఇంతకూ వ్రాయలేదెం?"
"వ్రాయటం నాకు చేతకాదు."
"ఇదివరకు ఎలా చేతయింది?"
"పొరపాటు . రచయితలు ఉన్మత్త కల్పన లో కలలు గనే తెలివి తక్కువ వాళ్ళు. మళ్ళీ ఆ తెలివి తక్కువ వాణ్ణి కాలేను."
చిట్టి నిట్టూర్చి లోపలికి వెళ్ళింది.
* * * *
సృష్టి అంతస్శాలల వాకిళ్ళు తెరిచి, కాల ప్రవాహం అట్టడుగుకు మునిగి, అనుభవాల వెలుగు లో జీవన పధాన్ని వెదికి చూపించే పధ ప్రదర్శకుడు -- సృష్టి యొక్క ప్రతి వాకిలి తట్టుతూ జ్ఞానాన్ని యోచించే యోగి --
సృష్టి గమనానికి గణితం కట్టే రచయిత -- జడత్వం నుంచి జాగృతిని రచించే చిత్రకారుడు --
ప్రకృతిలో ప్రాణాన్ని మల్చే శిల్పి--
వీరందరూ తమ శక్తుల్ని ఏక పధంలో ప్రయానింప చేసే శుభ ముహూర్తాల కోసం సృష్టి ఎదురు చూస్తున్నది. మానవుడి కధలో ముఖ్య మైన మార్పు కోసం క్షణాలు లెక్క పెడుతున్నది వియతి.
బుద్ది వికాస వైవిధ్యాలలో భిన్న విభిన్నమైన మార్పుల వల్ల పొందే అనుభవాలు, కలిగే ఫలితాలు -- జన్మాంతరాలు అవస్థ పడి పొందిన జ్ఞానానికి సంకెళ్ళు అవుతున్నాయ్. బుద్ది గతి తప్పి దూసిన కత్తి అంచు మానవుడి మెదడు కానించి మృత్యు సమీపంలోకి నెట్టివేస్తున్నది. ఈ పురాతన బాటసారి గాయాలకు మందు లేదు. అతని గుండెలో దుఃఖానికి అవధి లేదు. అతని నిరాశకు హద్దు లేదు.
ఇక స్త్రీ........
ఈ సమాజంలో మగవాడి చెలి స్త్రీ. మగవాడి పరిధులలో బ్రతుకుతూ అవమానిత అయినప్పుడు ఆత్మహత్య చేసుకునే స్త్రీ.
ఈమె తన అశ్రువాహినిలో మగవాడి మనో నౌకకు తెరచాప ఎత్తుతుంది. తన జీవితంలో ఈ ప్రపంచాన్ని అనంతం చేస్తుంది. పరాదీనత గా బ్రతుకుతూ, మగవాడి కోరికలకు అనుగుణంగా నాట్య మాడుతూ సృష్టి కి మూలమై పధవిహీనగా బ్రతకటం ఆమెకే చేతనవును.
కామన నుంచి ముక్తికి ప్రయత్నిస్తున్న ఆమె దుర్భర క్షోభ లోకానికి మొదటి వాకిలి. అంధ కారపుటడవి లో పరిత్యక్త గా బ్రతుకుతూ తన మూలుగుతో లోకాన్ని నిద్ర పోనీయని కీచురాయి స్త్రీ. ఈమె లేనిది సృష్టి లేదు.
జీవితం దాని సత్యం. మానవుడు శతాబ్దాలుగా దానిని వెతుకుతున్నాడు. శతాబ్దాలు అతడు చేసిన దారుణ పూజలోని పూలు రాలి పోతున్నవి.
ఇప్పుడు....ఇప్పుడు జరగవలసిందేమిటి?
సిగరెట్ ముట్టించాడు నాగేశ్వరరావు. అతని కళ్ళు లోపలికి పీక్కుపోయినాయి. గడ్డం చేసుకోవటం చాలా రోజులుగా మరిచి పోయినట్లు న్నాడు.
ఇప్పుడతను నూజివీడు లో ఉండటం లేదు. విజయవాడ వదిలి పెట్టాలనీ అనిపించటం లేదు. స్పృహ రాగానే జ్వరం లోనూ విజయ ఎటో వెళ్ళిపోయింది. ఆమెను బ్రతికించాలని తీసుకొచ్చాడు తను. అయినా తనను అపార్ధం చేసుకుంది. ఎక్కడికి వెళ్లిందో తెలియదు. అంత జ్వరం తగ్గిందో లేక ఏ చెట్టు కిందనయినా ప్రాణాలోదిలిందో అదీ తెలియదు. ఈ ఆరునెలల నుంచీ ఆమె జాడ జవాబు లేదు. చేతిలో చిల్లి గవ్వ లేకుండా ఒంట్లో దమ్మిడీ ఎత్తు శక్తీ లేకుండా దేన్నీ కాపాడుకోవాలని ఆమె పారిపోయిందో దాని విలువ ప్రాణం కంటే అధికంగా కనిపించలేదు అతనికి. ఇంత మూర్క్జత్వం నచ్చనూ లేదు.
నూజివీడు చేరలేదు. అంతమటుకూ అర్ధం అవుతూనే ఉంది. మరి ఏమయింది? ఆరు నెలల నుంచీ ఈ ప్రశ్న అనుక్షణం అతన్ని వేధిస్తూనే ఉంది. కారు వేసుకుని వెతుక్కుంటూ అతను తిరగని రోజు లేదు.
నానా ఈ కధ విని నాగేశ్వరరావు నే మందలించింది.
"నీవు ఇల్లు కదిలించ కూడదు. భర్తతో చెప్పకుండా వచ్చిన స్త్రీ తిరిగి ఇల్లు చేరలేదు. ఎటు వంటి వాడయినా ఆమెను శంకిస్తాడు. ఆ అనుమానం తోటే ఎక్కడో ఆత్మహత్య చేసుకుని ఉంటుంది." అన్నది.
"రేపు నేను తీసుకొచ్చానని అన్నయ్య కు తెలిసి నన్నడిగితే ఏం సమాధానం చెప్పను?"
"ఇదే చెప్పు" అన్నది నానా. కాని ఆరునెలల వరకూ విజయ గురించి ఎవరూ అడగక పోవటంతో అతని ఆశ్చర్యం మరీ హెచ్చింది.
విజయ లో వర్గ సామరస్యం, స్త్రీ పురుష సంఘర్షణ అట్టే లేవు. కేవలం, ఆత్మ వికాసం, సతీత్వపు గర్వం, జాగృతి మాత్రమె ఉన్నాయి. ఆమె ఆత్మ వికాసం కర్తుత్వమైనది. ఆమె గుడ్డి నమ్మకాలు ఈ యుగానికి సంబంధించి నవి కానూ కావు. లోకంలో అందరూ ఆమె లాటి మూర్కులే అయితే లోకం ఏనాడో నశించి పోయేది.
ఒకతడవ నానా ఆనందం అంటే ఏమిటో అతనికి తెలియ చెప్పింది-- విజయ పారిపోయిన మరునాడు.
"చావు తప్ప గత్యంతరం కనిపించటం లేదు" అన్నాడు నానాతో.
ఆమె చిరునవ్వు నవ్వుతూ --
"చస్తే సమస్యలు తీరిపోతే అందరం చద్డుం. ముక్తీ దొరుకుతుంది." అన్నది.
"ముక్తి ఏమిటి?"
"జన్మ లేకపోవటం. మీ భారతీయ తత్త్వాన్ని గురించి నేనా నీకు చెప్పాల్సింది?"
"చెపితే ఫరవాలేదు గాని, జీవితం లేని శూన్యం అంటే భయం పుడుతుంది. నాకు కావాల్సింది శాంతి ఆనందం" సిగరెట్ వెలిగించాడతను.
"ముక్తి లోనే ఆనందం ఉంది."
"అంటే?'
'అత్యున్నతమూ, అవిచ్చిన్న మూ అయిన ఆనందాన్నే ముక్తి అంటారు. భగవంతుని లో కలిసి పోవడమే ఆ ఆనందం. ఈ లోకంలో కూడా పూల వికాషాలలో , ఇంద్రధనుస్సు రంగులలో ఆకాశపు స్వచ్చత లో ఆనందం ఉంది." "ఎట్లా అది దొరుకుతుంది?"
"ప్రస్తుతం విజయ జాడ తెలిస్తే నీకు దొరుకుతుంది. నాకు ఎప్పటికి దొరుకుతుందో నాకే అర్ధం కావటం లేదు."
"ఎందుకని?"
"ఎంత సౌందర్యోపాసకుడైతే అంత ఈశ్వర సాక్షాత్కారం పొందగలడు. ఎంత అనుభూతి ని పొందగలడో అంత జగదీశ్వరుడి సమక్షాన్ని పొందగలడు. కాని నాకు ఆ అదృష్టం లేదు."
ఇలాటి చర్చలలో నే కాస్త మనశ్శాంతి ని పొందుతున్నాడు నాగేశ్వరరావు. అతనిలో ఇప్పుడు మిగిలింది కఠోర దుఃఖితుడయిన నాగేశ్వరరావు. నారీ పవిత్రతడే విజయం. అతను ఓడిపోయినాడు. ఆ ఓటమిలోంచి మరో జన్మ ప్రారంభ మయింది. ఈ జన్మలో ఒకటే ధ్యేయం. అది విజయ కోసం అన్వేషించడం .
