Previous Page Next Page 
పధ విహీన పేజి 17


    కానీ....నీ శరీరం ?"
    "అవును , బాలా. అవన్నీ నీవే. కాదని ఎవరన్నారు? అవి వాళ్ళవి కానేకావు. అనుభవమే వాళ్ళది. నాకు చేతనైతే నిన్ను గట్టిగా కౌగలించు కునేదాన్ని ఇప్పుడు."
    "ఎందుకు చేతకాదు?"
    "శక్తీ లేదు. ప్రయిజనమూ లేదు." నిట్టూర్చింది నానా.
    "అన్ని రోజులు నీతో ఉన్నాననే అనుభవం తప్ప మిగిలే దేమీ కనిపించటం లేదు నాకు." నిట్టూర్చాడు బాలచంద్ర.
    "అంతే ఈ లోకంలో మిగిలేది."
    "ఎందుకని?"
    "ఏమయింది అన్నాళ్ళ అనుభవం? విషాదం తప్ప మిగిలిందేమిటి?
    "ఎందుకని?"
    "నాకు తెలీదు."
    "ఆనాటి చిన్న అబద్దానికి ఇంత శిక్షా?"
    "అబద్దం కాదు; శిక్షా కాదు. అది తప్పదంతే. నీ జీవనానుభూతికి ఇదే ప్రతిఫలం. నువ్వు దాని నుంచి తప్పించుకోలేవు. నానాను పొంద గలిగిన ఔన్నత్యం ఎలాగో తెలుసుకున్నావు కొంతవరకు. అంత ఔన్నత్యం నీకు సహజమయిన నాడు నానా నీ పాదా క్రాంతురాలవుతుంది. సృష్టి లో శిక్ష తప్ప క్షమా లేదు బాలా" అన్నది నానా.
    "ఒక్కసారి దగ్గరగా రా" అన్నాడు బాలచంద్ర ఆశగా ఆమె వంక చూస్తూ.
    ఆమె జాలిగా నవ్వింది.
    "నేను దగ్గరైతే తిరిగి నువ్వు వదల లేవు. ఈనాటి పరిస్థితి అది. దూరమైతే భరించనూ లేవు. నీతో కలిసి సుఖించిన నానానే తలుచుకో------ఈ నానాను అందుకోగలిగే వరకూ" అన్నది.
    సమస్తమూ పొందీ కూడా అర్ధం లేని అశాంతి తో బాధపడుతున్న బాలచంద్ర కు బ్రతుకు మీద అనేక సందేహాలున్నాయి. వాటికి సమాధానం లేదు.
    "మళ్ళీ ట్రంక్ కాల్ చెయ్యి-- డబ్బాలు వస్తున్నాయ్యేమో!" నవ్వింది నానా.
    "నీ కన్నా ఆ డబ్బాలే నయం" బుంగమూతి తో అన్నాడు బాలచంద్ర.
    "మరి ఆడదంటే అలాగే ఉంటుంది నీకు. నీ గడిచిన ప్రేమ గాధలన్నీ వెళ్ళబోశావుగా? కొన్నాళ్ళు ఏ అడదయినా నీ కౌగిలిలోకి వస్తే అది ప్రేమ. ఏ గొడవా లేకుండా శరీరం అర్పిస్తే అదీ ప్రేమ. కంటికి నదరుగా ఉన్న ప్రతి స్త్రీ నీ నీదాన్ని చేసుకోవాలని అఘోరించడం అద్భుతమైన ప్రేమ" వెక్కిరింపుగా అంది నానా.
    "మరి అంతకన్న ప్రేమకు అర్ధం ఏమిటి?"
    "స్త్రీ దేనికి సృష్టింప బడ్డదో తెలుసా? పురుషుడి ఆత్మ నేత్రానికి దివ్య దృష్టి ఇవ్వడానికి. అలాటి స్త్రీ మిగతా విషయాల ముందు తన ప్రాధాన్యం తగ్గిపోవాడన్ని సహించ లేదు."
    బాలచంద్ర ఇక తమాయించుకోలేక పోయినాడు. ఒకసారి పొందిన స్త్రీ దూరమయి పోవటం అతని కోక ఓటమి గా ఉంది. చివాలున నిలబడి ఆమె మీద వాలిపోయినాడు. తప్పించుకుని దూరంగా పోయి నవ్వింది ఆమె. తీరని దాహంతో చిన్నపోయినాడు అతను.
    "చాలా అన్యాయం ఇది."
    "ఏమిటి ఆ అన్యాయం?' నవ్వింది నానా.
    'అది చాలా స్వల్ప విషయం. ఒకప్పుడు నీలాగే నేనూ భావించాను. ఈనాడు మాత్రం అలా కాదు. సమక్షమే కాదు, నిరీక్షణ లో కూడా ఆనందం ఉంది."
    "నేను గ్రహించలేక పోతున్నాను."
    ":జన్మలో నువ్వు గ్రహించలేని దేమిటంటే అనుభవంతో గాని వికాసం కలగదనే విషయానికి ప్రాధాన్యం లేదనే విషయం. ఈ అనుభవ చాపల్యమే మగవాడి పతనానికి మొదటి కారణం."
    బాలచంద్ర చెంపల్ని రెండు చేతుల్తో ఎత్తి చంద్ర బింబంలో వికసించిన కలువ పూల లాటి అతని కన్నులలో కి చూస్తూ అన్నది నానా.
    సూర్యుడు పూర్తిగా అస్తమించాడు కొండల చాటున. కాల్చిన రంపంలా ఉంది సంధ్య.

                     

                                   10
    ఏ యుగంలోనూ ఎవరి కోసమూ ఆగని కాలం ఇప్పుడూ ఆగలేదు. కిటికీ లో కూర్చుని కాలంతో పోట్లాడుతున్న చిట్టికి దూరాన ఎవరో రావడం కనిపించింది. ఆ వ్యక్తీ సరాసరి ఇటే వస్తున్నాడు. చిట్టి కుతూహల నేత్రాలతో అతని కేసి చూస్తూ ఉండగానే అతనామెను పలకరించాడు.
    "చూడండి. ఈ పక్క ఇంట్లో విజయ అని....."
    ఆ ప్రశ్నతో అతనెవరో చిట్టి కి అర్ధం అయింది. వెంటనే సమాధానం ఇవ్వాలనిపించ లేదు. తెల్లపోయి అలాగే నిలబడి పోయింది.
    "చూడమ్మా. నిన్నే. ఇది జగన్నాధం ఇల్లేనా?"
    అయన ప్రశ్న పూర్తీ కాకమునుపే జగన్నాధం వచ్చాడు. మొదట్లో జయప్రదరావు ను గుర్తు పట్టలేదు. చిక్కిపోయి గడ్డం పెంచుకున్నాడు అయన. విజయ కేమైనా ప్రమాదం సంభవించలేదు గద?
    "బావగారూ?"
    "వెనక్కు తిరిగి చూసి, జగన్నాధాన్ని కౌగలించు కున్నంత పని చేశాడు జయప్రదరావు.
    "జగన్నాధం , విజయ ఏమయింది?"
    జగన్నాధం తెల్లపోయినాడు . అయితే వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళలేదా? ఇన్నాళ్ళూ ఈయన ఎక్కడ ఉన్నారు?....కాళ్ళ కింద భూమి కదిలి పోతున్నట్లుంది అతనికి.
    "మాట్లాడవేం జగన్నాధం ? విజయ ...."
    "మీరెక్కడ నుంచి బావగారూ?"
    "ఆ సంగతి తరువాత చెపుతాను. విజయ ఏమయింది?"
    "మీతో వచ్చారని ఇన్నాళ్ళ నుంచీ నేనూ ధైర్యంగానే ఉన్నాను బావగారూ." నిలుచో లేక కూల బడ్డాడు జగన్నాధం.
    జయప్రదరావు నడి నెత్తిన ఎవరో బలంగా చరిచి నట్లయింది. విజయ భర్తతో ఉంటుంది. లేదా చనిపోతుంది. ఈ రెండూ మార్గాలు కాక మరో మార్గం ఉండదు ఉన్నా విజయ లాటి స్త్రీలు ఆ మార్గాన్ని అనుసరించరు.
    "ఏమయింది విజయ?"
    "మీరు అధైర్య పడకండి, బావగారూ. వెతుకుదాం. అక్కగార్ని వెతికి తెచ్చే భారం నాది."
    "ఒకవేళ చనిపోయిందేమో," అన్నాడు జయప్రదరావు-- అంతరాంతరాల్లో ఆమె చనిపోవటాన్ని వాంచిస్తూ. జీవించి ఉంటె తను లేని చోట ఉండకూడదు. అలా జరిగిన రోజున ప్రపంచంలో పవిత్రత కున్న విలువలన్నీ తలక్రిందు లైనట్లే.
    "శత విధాల అలా అయి ఉండదు. ఇంతకూ మీరేమయినారో చెప్పారు గాదు" అన్నాడు జగన్నాధం.
    ఇంతవరకూ తిరిగి చిట్టి వంక చూడలేదు జయప్రదరావు. ఈమె ఎవరు? స్త్రీలు సామాన్యంగా పొరపాట్ల ను క్షమించరు. ఈ పిల్ల ఎదుట నేరాన్ని ఒప్పుకుంటే తనను అసహ్యించు కుంటుదేమో?
    "పెళ్లి చేసుకున్నావా?" హటాత్తుగా జగన్నాధాన్ని ప్రశ్నించాడు జయప్రదరావు.
 చిట్టి మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లి పోయింది.
    "లేదు. ఆ అమ్మాయి నా చిన్ననాటి స్నేహితురాలు . పధ విహీన."
    జగన్నాధం జవాబుకు కొండంత ధైర్యం వచ్చింది జయప్రదరావు కు. ఈ ఆరునెలల నుంచీ నేరాల మధ్య, నేరస్తుల మధ్య ఉండటం వలన పవిత్రత అన్నా, పరిశుభ్రత అన్నా భయం పట్టుకుంది అతనికి.
    ఉదయాన లేస్తూనే ఒకరి నొకరు తిట్టుకుంటారు ఖైదీలు. సిగ్గు పడటం వారికి తెలియదు. కొన్నాళ్ళ కు జయప్రదరావు కూడా ఆ సంగతి మరిచి పోయినాడు. తరువాత స్నానం లాటిది. ఆ పిమ్మట జైలు అన్నం, పులుసు నీళ్ళు తిని ఒకరి కధలు మరొకరికి చెప్పుకోవటం. ఎంత పెద్ద నేరం చేస్తే అంత హీరో వాడు.
    దుర్బరమైన ఆ వాతావరణం జయప్రదరావు మనస్థితి ని పూర్తిగా మార్చి వేసింది. మానవుడి పాపం చూసినా పతనం చూసినా ఇదివర కుండే సానుభూతి మరింత ఎక్కువయింది ఇప్పుడు. అంతేకాదు. పవిత్రత అంటే భయంగా ఉంది. ఇందాకటి నుంచీ చిట్టి ఎదుట నిలబడడానికి తను పడ్డ ఇబ్బంది ఆమె కూడా నేరస్తురాలే అని తెలిసిన తరువాత పూర్తిగా తగ్గిపోయింది. నేరం చేసిన మరో సోదరి తన కిక్కడ తోడు. ఇక భయం లేదు.
    "జైలు కెళ్ళాను జగన్నాధం." నిర్భయంగా చెప్పేశాడు జయప్రదరావు.
    "జైలా? అదేమిటి?"
    "అదంతేలే. కంగారు దేనికయ్యా! త్రాగి పేకడితే పట్టుకున్నారులే!" అని నిశ్చింతగా నులక మంచం లాక్కుని కూర్చున్నాడు అతను. ఈ నులక మంచం తనదే. అంటే విజయ ఏమీ తీసుకెళ్ళలేదన్న మాట. ఎక్కడికి వెళ్లి ఉంటుంది?
    "ఏమిటి ఆలోచిస్తున్నారు బావగారూ?"
    "ఏమీ లేదు. విజయ సంగతి చూడు, జగన్నాధం. విజయ చనిపోతే సరేసరి. బ్రతికి ఉంటె ఎప్పటి కయినా నన్ను వెతుక్కుంటూ ఇక్కడకు వస్తుంది. ఈ పరిస్థితిలో ఒక్క రోజయినా నూజివీడు దాటి వెళ్ళటానికి వీలులేదు -- ఏమో ఏ క్షణాన్నయినా ఆమె రావచ్చును కనక, ఇంతకూ నువ్వేం చేస్తున్నావు?"
    "కోమటి కొట్లో పద్దులు రాస్తున్నాను."
    "కవిత్వం మానేశావా?"
    "ఆహా. చింతపండు లెక్కలు అన్నం పెడుతున్నాయి బావగారూ. అందుకే సుబ్బి సెట్టి అన్నట్లు -- కవిత్వపు గాడిద గత్తర ఇంటా వంటా లేకుండా చేసేశాను. ఇహ చెప్పండి  బావగారూ, ఎందుకు అలా అడిగారు?"
    "నాకూ అందులో ఒక ఉద్యోగం చూద్దూ? ఎక్కడయినా గది కూడా. ఇక్కడే దగ్గర్లో ఉండాలి. మళ్ళీ విజయ వెతుక్కో లేదు."
    "అలాగే చూస్తాను. మొన్ననే మరో గుమస్తా నేతి పద్దులు చూడటానికి కావాలన్నాడు మా షావుకారు. గది సంగతంటారా? ఇక్కడే ఉండి పొండి" అని రహస్యంగా కన్నీళ్ళు తుడుచుకున్నాడు జగన్నాధం.
    జయప్రదరావు మాట్లాడలేదు. జగన్నాధం ఔదార్యం అతనికి ఇదివరకే తెలుసు. ఇప్పుడు మరింత తెలిసింది. తనకే ఏమీ లేదు. అయినా ఆశ్రయం ఇవ్వటానికి వెనక్కు జంకడు. ఇంత మంచివాడు ఇతను. భగవంతుడు ఎందుకు ఇతనికి ప్రతిఫలం లేకుండా చేస్తున్నాడు? పాపానికి శిక్ష అనివార్య మయినప్పుడు పుణ్యానికి బహుమానం అంత అనివార్య మయినది ఎందుకు కాదు?
    జయప్రదరావు కళ్ళ నిండా నీరు క్రమ్మింది.
    "చిట్టి, ఈయన జయప్రదరావు గారు. ఇదివరకు చాలా సార్లు చెప్పాను. మనతో పాటు ఇక్కడే ఉంటారు" అని చిట్టిని పిలిచి చెప్పాడు జగన్నాధం.
    చిట్టి మాట్లాడకుండా తల ఊపి లోపలికి వెళ్లి పోయింది. మానవుడి మమతకూ, అనుభవానికీ బొత్తిగా సంబంధం లేదనేది ఇప్పుడిప్పుడే అర్ధ మవుతున్నది ఆమెకు. తల్లితండ్రుల చేతా, ప్రేమించిన వాడి చేతా బహిష్కరించబడిన తను, స్నేహితుడు జగన్నాధం తోనూ, ఈనాడు ముక్కూ మొగమూ తెలియని ఈ నూతన వ్యక్తీ తోనూ బ్రతుకు తున్నది.
    బ్రతకటం ఇంత అవసరమూ ఇంత అనివార్యమూ అని తను మొదట్లో గ్రహించే ఉంటె మురళి తో వెళ్ళ కుండానే ఉండేది. ఎప్పుడు మురళీ తనకు లేకుండా పోతాడో అప్పుడు తనూ లేకుండా పోదామను కుంది. కాని, అలా చేయటం ఎంత అసంభవమో  ఇప్పుడామె కు తెలిసింది.
    భవిష్యత్తు లేదు. ఆశలు లేవు. ఆధారం అసలే లేదు. దేనికోసం తను బ్రతకటం? అయినా బ్రతికుతూనే ఉన్నది. బ్రతుకు బ్రతుకు కోసమే అని ఎంత సరిపుచ్చుకుందా మన్నా సరిపోవటం లేదు.
    బ్రతుక్కు లక్ష్య మేమిటి? ఏ ఫలితాన్ని ఆశించి మనిషి బ్రతుకుతూ వస్తున్నాడు? శతాబ్దాల వేదనలను సహిస్తూ జీవించే ఈ జీవితంలో ఏ మాధుర్యం కనిపించింది అతనికి?
    ఇతర జీవజాలం నుంచి తనను తను వేరు పరుచుకొని, ఈ చిత్ర మయ జగత్తు లో తనకొక పధాన్ని నిర్మించు కొని ఈ జగత్తు, ఈ చైతన్యం -- వీటి రహస్యం ఏమిటని విచారిస్తూ బ్రతుకుతున్నాడు. ఏనాటి కైనా సమాధాన్ని పొందుతాననేదే అతని ఆశ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS