
11
జగననాధం విజయ కోసం అనేకచోట్ల గాలిస్తున్నాడు. ఆమె కనిపించటం లేదు. గాని ఆమె చిరునవ్వు, స్థైర్యం అనుక్షణం అతనికి కనిపిస్తూనే ఉన్నాయి. ఆమె ఆశయాలనూ, జీవిత కధనూ స్మృతి కి తెచ్చుకుని, మనస్సు లోనే ఆమెకు ప్రణమిల్లుతూ , ఆమె ఇప్పుడు పొరపాటు ను క్షమించగలిగే మనస్థితి లో ఉంటుంది; ఒక్కసారి కనిపిస్తే బాగుండును అనుకునేవాడు అతను.
అలాటి మహా ఇల్లాలి నుదుట కూడా పరిస్థితులు పతిత ముద్ర వెయ్యలేదు గద? ఈ అనుమానం వస్తేనే భయంతో వణికి పోయేవాడు జగన్నాధం. స్త్రీ అపవాదులను అతను నమ్మకుండా ఉండటానికే శతవిధాల ప్రయత్నిస్తాడు.
ప్రతి నెలా జీతం తీసుకోగానే నాలుగు రోజుల పాటు కనిపించడు అతను. విహయను వెతకటానికే అతను వెడుతున్నాడనే విషయం బ్రహ్మకు కూడా తెలియదు.
ఆ ఇంట్లో ఉండే ముగ్గురు ప్రాణులూ ఒకవిధంగా సన్నిహితులుగా ఉన్నా గాని,. మరో విధంగా యోజనాల దూరంలో బ్రతుకుతున్నారు. వారి దుఃఖాలలో సామరస్యం కన్నా వైవిధ్యమే ఎక్కువగా ఉంది.
చిట్టి జయప్రదరావు కూ ఒకే రకమైన వేదన. జగన్నాధం వేదన వేరు. చిట్టి తనను కాదనటం వలన పెద్దగా అతని నష్ట పోయిందేమీ లేదు. కాని అతని దుఃఖం విశ్వ జనీన మైనది. ఎవరి వేదన కయినా అతని అంతర్యం ప్రతి స్పందిస్తుంది. సుఖం అన్నా, సుఖ పడేవాళ్ళ న్నా అతని కేమీ తెలియదనే చెప్పాలి. దుఃఖం అన్నా, దుఃఖితులన్నా అతనికి సానుభూతి. స్వయంగా అతను అందులోంచి భాగం తీసుకుంటాడు.
పొద్దున్నే కాఫీ తాగి ఇద్దరూ దుకాణాని కి వెళ్ళిపోతారు. భోజనానికి మాత్రం ఒకరి తరువాత ఒకరు వస్తారు. కొట్టు కట్టి వెయ్యటానికి షావుకారు ఒప్పుకోడు. జయప్రదరావు త్రాగటం, పెకాడటం మానివేశాడు. తన పని చేసుకుని రావటం, నులక మంచం లో కూలబడి నక్షత్రాలు లెక్కపెట్టడం అతని పని.
"బావగారూ, భోజనానికి లేవండి" అని చిట్టి పిలిచే దాకా అతనా మంచం లోంచి కదలడు. జగన్నాధం లాగానే చిట్టి కూడా అతన్ని బావగారూ అని పిలవటం ప్రారంభించింది. క్రమక్రమంగా ఈ లోకంలో పడుతున్న చిట్టి పూర్వం కన్నా కాస్త నయంగా ఉంది.
తల్లీ తండ్రి తనను క్షమిస్తారనే ఆశ పూర్తిగా పోయింది ఆమెకు. ఈ ప్రపంచంలో తనకు ఎవరూ లేరు. ఉన్న నాలుగు రోజులూ ఎవర్నీ బాధ పెట్టకూడదు. ఈ నిర్ణయం తోనే జయప్రదరావు కూ, జగన్నాధానికీ అమితమైన సేవ చేస్తుంది ఆమె.
ఈ మధ్య జగన్నధాని కి మరో ఆలోచన కూడా వచ్చింది-- జయప్రదరావు కూ చిట్టి కీ పెళ్లి చెయ్యాలని. కాని విజయ ఏనాటి కయినా తిరిగి వచ్చి, "వారిని నీ చేతులారా అన్యా క్రాంతం చేశావా తమ్ముడూ? ఇప్పుడు నా గతేమిటి?" అంటే ఏం జవాబు చెప్పాలో తెలియక నోరు మూసుకుని ఊరుకున్నాడు.
తనకు వివాహం చేసుకోవాలని లేదు. ఒకప్పుడు ఉన్నా ఇప్పుడది పూర్తిగా నశించి పోయింది. పైగా జయప్రదరావు ను తను పిలిచినట్లే చిట్టి కూడా బావగారూ అని పిలుస్తున్నదంటే తనను స్నేహితుడుగా, సోదరుడు గా భావిస్తున్నదనే అనిపిస్తున్నది.
ఒకప్పుడు భ్రమించినా గాని చిట్టి తనకు దైవమిచ్చిన సోదరి. అంతే. అంతకన్నా మరేమీ కాదు.
తన మనసులో రేగిన ఈ ఊహను అతను ఇంకా బయట పెట్టలేదు.
చిట్టి గాని జయప్రదరావు గాని ఈ కోణం నుంచి ఆలోచిస్తున్నారా? అంటే లేదనే చెప్పాలి. కాని, ఒకవిధమైన దగ్గర తనం వారిలో దినదినానికి ఎక్కువవుతుంది. ఒకరి సమక్షంలో ఒకరు తను గడిచిన తప్పటడుగులను మరిచి పోతున్నారు. అదుష్ట హీనులూ, అశోపహతులూ అయిన వారిద్దరూ ఒకరి నొకరు హృదయ పూర్వకంగా క్షమించు కోటమే కాకుండా ఒకరి కొకరు ఓదార్పు కూడా ఇచ్చు కుంటున్నారు. జైలు లో కఠినం గా రాయి కట్టిపోయిన గుండె ఇప్పుడిప్పుడే కరుగుతున్నది అతనిలో. ఆరు నెలల జైలు జీవితంలో అతని అనుభవాలు అనేకం.
జైలు లోకి పోగానే ప్రతి ఒక్కడూ ఏకాంతంగా ఉండాలని కోరుకుంటాడు. తనకు సరిపడని వాతావరణం లోకి వెళ్లి పడ్డానని ఏడుస్తూ ఉంటాడు. అందులోంచి అది మొదటిసారి అయితే ఇహ చెప్పనే అక్కర్లేదు.
రాత్రి పూట ఏవో తిట్లూ, విపరీతపు శబ్దాలూ వినవచ్చేవి . హటాత్తుగా బయలుదేరే ఆ ధ్వనులు నరాలను మెలిపెట్టి లాగేవి. ఒకదినం తరువాత మరో దినం దీర్ఘకాలిక నైరాశ్యపు నీడల్లా, వికృత మైన కీచురాయి రోదలా సాగి సాగి బాధిస్తాయి. మొదట్లో కన్నా తరువాత అవి అలవాటూ అవుతాయి.
ఈ జైలు నోరు తెరుచుకున్న భూతం లాంటిది. లాంతరు వెంబడి సాగుతూ వచ్చే కాపలా వాడి కాళ్ళు హడలెత్తిస్తాయి. తనుండే గదికి పక్కనే స్త్రీల గదులు ప్రారంభం. ఆ గదుల్లో అప్పలమ్మ అని ఒక స్త్రీ ఉండేది. రాత్రీ పగలూ బిగ్గరగా ఏడుస్తూ ఉండేది ఆమె. ఆశ అనేది నశించి విహ్వల అయిపోయిన స్త్రీ నేరస్తురాలి ఆ అనంతకాల రోదన లో తన బ్రతుకు ఏదో ముడేసుకున్నట్లూ , ఆమె విజయ అయినట్లూ కల కంటూ ఉండేవాడు అతను.
ఈమె నేరస్తురాలు. విజయ ఈ జన్మలోనే కాదు, ఏ జన్మ లోనూ తప్పు చేసి ఉండదు బహుశా. కాని, ఈ హీన చరిత్ర అప్పలమ్మ పతన గాధలో అంతర్గతంగా విజయను కలగనట మేమిటి తను? అసలు పోలికనేదే లేదు. అయినా సరే, ఆ కల రెండు రోజుల కొకసారి వస్తూనే ఉండేది అతనికి.
అప్పలమ్మ తన జీవన కధనాన్ని ఏడుపు లోనే వ్యక్తపరుస్తూ ఉండేది. ఆమె చేసిన నేరం విజయ లాటి వారు ఊహించలేని నేరం. భర్తను చంపటం అది. ఆమెను ఎప్పుడూ తిడుతూ కొడుతూ ఉండేవాడు. తిండి పెట్టె వాడు కాదు. తన నేరాన్ని ఏడుస్తూ భయంకరంగా వర్ణించటం లో ఏదో ఆనందం ఉండేది అప్పలమ్మ కు. కనీసం రోజు కొకసారయినా తన భర్త హత్యా ప్రావీణ్యాన్ని వన్నె చిన్నెలుగా వర్ణిస్తుంది ఆమె. ఆ సంతోషానికి కారణం ఉన్నది -- కొడుకును చంపటం ద్వారా అత్తకు ప్రాయశ్చిత్తం చేశానని.
ఆరేళ్ళ కొడుకును ఇంటి దగ్గర వదిలి నెలరోజుల పసి గుడ్డుతో జైలుకు వచ్చింది అప్పలమ్మ. తరువాత నెలలో ఆ పిల్ల కూడా చనిపోయింది. అప్పలమ్మకు పిల్లలంటే ప్రాణం. అత్తగారు చేతబడి చేయించటం మూలంగా తన పిల్ల పోయిందని ఏడుస్తూ ఉంటుంది. ఇంటి దగ్గర వదిలి వచ్చిన పసివాడిని తల్చుకుని కుమిలిపోతూ ఉండేది అప్పలమ్మ. కాని ఆమరణంత శిక్ష ఆమెకు. జీవితంలో తిరిగి ఎప్పుడూ తన కొడుకును చూడలేదు.
కాని వాడిసరికి ఎంత పెరిగి ఉంటాడో ఊహిస్తూ ఉంటుంది. ఆమె తోటి మరొక స్త్రీ ఖైదీ ఉండేది. ఆమె పేరు సుబ్బులు. సుబ్బులుకూ అప్పలమ్మ కూ అరక్షణం కూడా పడేది కాదు. పగలూ, రాత్రీ పోట్లాడుకుంటూ ఉండేవారు. దొంగతనం చేయటం ఆడదానికి భావ్యం కాదంటుంది అప్పలమ్మ. మొగుణ్ణి చంపినా ఆడదాన్ని నేనెక్కడా చూడలేదంటుంది సుబ్బులు. అంతేకాదు. వీళ్ళిద్దరూ కలిసి వడ్డించే సోముల్ని ప్రేమించారు. వాడు వీళ్ళ మొహం కూడా చూడదు. గబగబా ఇంత పులుసూ అన్నం మూకుళ్ళ లో వేసి వాళ్ళ ముందు పడేసి తన దారిన తను పోతాడు.
వాడేవారికి ముందు మూకుడిస్తే అది ఆనాటికి అందలం ఎక్కుతుంది. రెండోదాన్ని అక్షులూ పక్షులూ రాలేట్లు తిట్టి పోస్తుంది.
సుబ్బులు క్రిందటేడు ఒక ఘన కార్యం చేసింది. దొడ్డిలో ఉన్న వేపచేట్టేక్కి పమిట కొంగు మెడకు బిగించుకొని ఉరి వేసుకొని చనిపోతానని బెదిరింపు ప్రారంభించింది. దానితో జైల్లో పెద్ద ఆగం బయలుదేరింది. అప్పలమ్మ క్రింద నించుని పెద్ద పెట్టున ఏడుపు సాగించేసరికి మెట్రాస్, సూపరింటెండెంట్ అంతా వచ్చారు.
చివరికి ఉరి వేసుకోలేదు గాని చెట్టు మీద నుంచి దూకి కాలు విరగ్గోట్టుకుంది. ఆనాడు తను చేసిన ఘన కార్యానికి చిహ్నమైన కుంటి కాల్ని చూసుకుని అపరిమితంగా గర్వపడుతుంది సుబ్బులు.
సుబ్బులు జైలుకు రావటం ఇది ఆరో సారి. ఒక చీరెను ఎత్తు కొచ్సినందుకు మూడేళ్ళ శిక్షతో లోపలికి వచ్చింది. నల్లని ఆకారంతో గిజిగాడి గూడు లాటి జుట్టుతో ఎత్తు పళ్ళతో పరమ వికారంగా ఉంటుంది.
రంగు చీరలంటే ఇష్టంట. అప్పలమ్మ సామాన్యంగా దాని ధోరణి కి అడ్డు వెళ్ళదు. ఎప్పుడయినా ఏదయినా అంటే ఇక తిట్లు ప్రారంభమయ్యేవి. చివరికి ఇద్దరూ కలిసి ఇంతసేపు ఏడిచి ఒక్కసారిగా ఊరుకునే వారు.
మానవులను మానవత్వాన్ని సజీవంగా సమాధి చేసే ఆ గోరీ లో మనిషి పాషండుడు అవుతాడు. వేలకు వేలు తగలేసి సంవత్సరాల పాటు న్యాయ శాస్త్రం నేర్చుకు నే కన్నా ఆరు నెలల పాటు జైలులో ఉంటె అన్నీ అర్ధమవుతాయి. మానవుడు బ్రతికే ఈ బ్రతుకులో ఇంకా ఎంత మహా విషం పేరుకు పోయి ఉందొ అవగతం చేసుకోవచ్చును. అది దౌర్భగ్య లోకం. కష్టాలూ, కన్నీళ్ళూ వేదాలూ కలిసి పేనిన ఒక ఉరితాడు.
కసాయి ప్రదేశాలూ, వ్యభిచార గృహాలు తిరిగి సంపాదించే క్రౌర్యాన్ని, ఒక్క రోజు జైల్లో ఉన్న మనిషి సంపాదించగలడు. ఇతరత్రా తెలుసు కోగలిగిన నీతి కంటే, వివేకం అధికమైన మరో వివేకాన్ని కూడా ఇక్కడ సంపాదించ వచ్చును.
ఇక్కడ సభ్య సమాజపు సంస్కార నినాదాలు మచ్చుకైనా వినిపించవు. వినిపించేది దుఃఖం. కరుణా పూరితమైన మానవ ఆక్రందనం. చేసిన నేరాన్ని తలుచుకుని పశ్చాత్తాప పడే స్థితిని పోగొట్టి గర్వించే స్థితికి మనిషి రావడం -- ఇక్కడ ఇవి సర్వసామాన్యం.
