Previous Page Next Page 
మనిషి - మిథ్య పేజి 17


    "మీరా కుర్రాడికి ఉద్యోగం ఇవ్వలేదుగదా?"
    "వాడ్డూ యూమీన్! అలా అడ్డమైన ప్రతి వాళ్ళకీ ఉద్యోగాలు వేసే స్థితికొస్తే, ఆ కంపెనీలోనే కాదు, ఈ ఇంట్లోనూ ఉండను తెలుసా రేణూ!"
    "ఆ స్థితి ఎన్నటికీ రాదని, మిమ్మల్నెవారూ శాసించే అధికారం లేదనీ నేను హామీ ఇస్తున్నాను" అన్నది రేణుక ఆవేశంతో.
    నిరంజనం పేలవంగా నవ్వుతో.
    "నీ మెర్సీ కోసమే బ్రతుకుతున్నాను" అన్నాడు వ్యంగ్యంగా.
    "ఏది చెప్పినా మీరు అపార్ధం చేసుకుంటున్నారు. ఇక మిమ్మల్ని వప్పించడం నా తరం కాదు."
    "గప్ చిప్. ఆ నిర్ణయానికొస్తే ఇక వేరే చిక్కే ఉండదు. నీ విషయాల్లో నేను గాని, నా విషయాల్లో నువ్వు గాని ఇక కలుగ జేసుకోరాదు. పదిమంది మధ్యా భార్యా భర్తలుగా తిరుగుదామంటావా? నాకే అభ్యంతరమూ ఉండదు. తలుచుకుంటే మీ అందరికంటే ఘనంగా నటించే సత్తా నాకుంది" అన్నాడు కటువుగా.
    రేణుక తన మోహాన్ని రెండు చేతుల్తో కప్పుకుని హాల్లోకి వచ్చేసింది. ఆమె అతని ధోరణికి అబ్బురపడింది.
    గాలి వాటపు మనిషా నిరంజనం? అతనికి నిజంగా తనమీద ప్రేమ లేదా? ఇంత చపలచిత్తుడా అతని దింతరాతి గుండె అని తనకు తెలీదు. తనెంత కుళ్ళి కుళ్ళి ఏడుస్తుందో అతను గమనించాడా?
    ఆమె చీర చెంగుతో కళ్ళు తుడుచుకుంది.
    తన పక్కన నిలబడ్డ నిరంజనాన్ని చూచి ఎత్తిన తల మళ్ళీ దించుకుంది.
    "ఆ రోగ్, ఆ ఆఫీసరు వెధవ నన్నెంత అల్లరి పెడుతున్నాడో మీరెవరైనా ఊహించారా? పది మందిలో ఈ విషయం చెప్పి వాడు నవ్వుతూ వాళ్ళని నవ్విస్తున్నాడు. ఈ అలుసు వాడి కేవరిచ్చారు. మీ నాన్న ఇప్పుడు వాడు నన్నూ, నా వ్యక్తిత్వాన్నీ నవ్వుల పాలు చేస్తున్నాడు. అసలు వాడెవడు? హు ఈజ్ హీ! ఆఫ్టరాల్ ఏ డేం బెగ్గర్! అలాంటివాడు మీ నాన్నకి దేవుడు!"
    "..................................."
    "నిజం చెప్తూన్నా రేణూ! నాకీ అధికారం పట్ల ఆశలేదు. నాకున్న అర్హతతో ఏ చిన్న ఉద్యోగం చేసుకున్నా మనశ్శాంతి ఉండేది. నీకు తెలీదు నా బాధ. ఒకే రక్తంలో భాగం పంచుకుని పుట్టిన తమ్ముడికీ, నాన్న ఉత్తరం రాసినా ఉద్యోగం ఇవ్వలేదు నేను. ఆ ఉద్యోగం చేస్తూ, వాడూ అందరిలో అలుసై పోవడం నా కిష్టంలేదు. తమ్ముడిగ్గూడా కోటలో జోగా ఇచ్చాడని దారినిపోయే ప్రతి వెధవా నోటి కొచ్చినట్లు వాగుతే విని సహించే ఓపిక నాకు లేదు. స్వంత తమ్ముడికి వేయించలేని ఉద్యోగం, ఎవడో ఆఫీసరుట, వాడి తాలూకు తల మాసిన మనిషి కెవ్వడికో ఉద్యోగం వేయించాలిట. ఇప్పుడు చెప్పు......నన్నేం చెయ్యమంటావ్"
    ".........................................."
    "ఒద్దు రేణూ......నన్నెవరూ శాసించడానికి ప్రయత్నించవద్దు. అవసరమైతే ఈ క్షణంలో నా ఉద్యోగానికి రాజీనామాయిచ్చి, మీ నాన్నకీ, ఆయన హోదాకీ ఒక నమస్కారం పెట్టి వెళ్ళిపో గలను. కానీ.......దానివల్ల బాధపడేది నువ్వు.......నువ్వు రేణూ....." పిచ్చిగా అనేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు నిరంజనం.
    అతను మంచంపైన నడుం వాల్చాడేగాని నిద్రపట్టడంలేదు. అతను చేస్తున్న పిచ్చి పనులన్నింటినీ ఒక్కటొక్కటిగా గుర్తుకు తెచ్చుకుంటున్నాడు.
    తండ్రి చేసిన పనికి రేణుక బాధ్యురాలా? మాటలని రేణుకని నొప్పించలేదుగదా! అయినా తన మనసు తెలిసి గూడా ఆమె అడ్డు చెప్పడం దేని కసలు?
    తను తాగొచ్చాడు. మనో నిబ్బరం లేనివాడూ, పిరికివాడు, నైతిక విలువలకి స్థానం ఇవ్వలేనివాడు చేసే పనిని తను చేశాడు.
    ఇది తలని రేణు ఎంత కుమిలి పోతుందోగదా!
    గోడ గడియారం రెండు గంటలు కొట్టింది. ఉలిక్కిపడి లేచాడు నిరంజనం మంచం మీదనుండి. హాల్లోకి తొంగి చూశాడు. అక్కడ లైటు ఇంకా వెలుగుతూనే ఉంది.
    లేచాడు. హాల్లోకి వచ్చాడు. సోఫామీద తల వాల్చి నిద్ర పోతుంది రేణుక. ఆమెను చూడగానే జాలి కలిగింది అతనికి.
    రేణుక భుజం తట్టి, నిద్రనుండి లేపాడు. ఆమె కళ్ళు విప్పింది. తనెదురుగా నిరంజనం నుంచుని ఉండటం చూచి, ఉలిక్కిపడి లేచి నిలబడింది.
    "ఇక్కడ పడుకున్నానే రేణూ పద......మంచం గదిలో ఉంది" అన్నాడు నిరంజనం.
    ఆమె కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి. అతను ఆమెను దగ్గరికి తీసుకుంటూ.
    "నాకు నేనే అర్ధం కావడంలేదు రేణూ! క్షమించు" అన్నాడు బాధగా.
    ఆమె అతని నోటిని తన చేత్తో మూసింది.
    "మీరా మాట అనొద్దు. మిమ్మల్ని నేనుఅర్ధం చేసుకున్నాను" అన్నది రేణుక.
    ఆ సాయింత్రం పెందరాళే ఇంటికి వచ్చాడు నిరంజనం.
    హాల్లో అడుగు పెట్టిన నిరంజనానికి మావయ్య మాటలు వినిపించాయి.
    "అతని మనసింత పాడు చేసుకోడ మెందుకు తల్లీ. నాక్కావలసిందీ మీ సుఖమే కదా, ఆ మాట గ్రహించలేకపోయేడా అతను. అతను పరాయి వాడని నే నెప్పుడైనా అనుకున్నానా?"
    నిరంజనం సరాసరి తన గదిలోకి వెళ్ళి కూర్చున్నాడు. కాసేపటికి రేణుక వచ్చింది.
    "మా నాన్న వచ్చాడు. మీతో మాటాడా లట. రమ్మంటారా?" అని ఆమె అంటుండగానే ఆయన లోపలి కొచ్చేడు.
    "అది కాదోయ్ అల్లుడూ! నే నేదో రాసేనే అనుకో. నువ్వు దానికి జవాబుగా నాలుగు చివాట్లు పెట్టి ఉత్తరం రాస్తే పోలేదూ. ఇంత అల్లరి చేసుకుంటారా ఎక్కడైనా?"
    "నిరంజనం మాటాడలేదు.
    "పెద్ద వాళ్ళం. చాదస్తం కొద్దీ ఏదో చేసేస్తాం. ఇది తప్పు అని చెప్పవలసిన బాధ్యత మీది. వినక పోతామా? అప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవాలిగాని వార్నింగైనా ఇవ్వకుండా నీకు నువ్వే మధనపడిపోవడం ఏమైనా బాగుందా. అమ్మాయి రాసిన మొదటి ఉత్తరం చదివి- ఏదోలే సర్దుకు పోతరాలే అని ఊరుకున్నాను. కానీ.....వ్యవహారం ఇంతవరకూ వస్తుందనుకోలేదు అల్లుడూ" అన్నారాయన నవ్వుతూ.
    "భోజనం సరిగ్గా చెయ్యడం లేదుట, వేళకి ఇంటికి రావడం, లేదుట, ప్రతి చిన్న మాటకీ విసుక్కుంటున్నావుట, భలే వాడివయ్యా నిరంజనం!" అన్నారాయన.
    "అబ్బే.....అదేం లేదు"
    "అయితే అమ్మాయి చెప్పిందంతా అబద్ద మంటావా?మీకేం తక్కువని ఈ విధంగా మనసు పాడు చేసుకోడం. అదీగాక........తప్పు చేసింది నేను నన్ను దండించు."
    "ఈ చివరి మాట నే ననలేడు నాన్నోయ్" అన్నది రేణుక.
    "ఇదిగో నబ్బాయ్ నే నొకటి చెప్తా విను. ఈ కంపెనీ, ఈ ఆస్థీ సర్వస్వమూ నీవి. నీ యిష్టం వచ్చి నట్టు చేసుకోడానికి నేను కాదుగదా బ్రహ్మదేవుడు గూడా ఎదురు చెప్పటానికి వీల్లేదంతే. కావాలంటే అలా అని రాసిస్తాను."
    నిరంజనం సిగ్గుపడిపోయాడు.
    "ఒక్కగా నొక్క కూతురు రేణుక. అది సంతోషంగా ఉండటమే నాక్కావలసింది. తండ్రుల మనసు నీ కిప్పుడే తెలీదు బాబూ. నీకూ ఓ నలుసు పుట్టి పెద్దదై, అత్తవారింటికి వెళ్ళిన తర్వాత ఇప్పటి నా ధోరణి నీ కప్పుడుగాని అర్ధం కాదు. శివానందం నిన్ను అల్లరి పెడ్తున్నట్టు అమ్మాయి చెప్పింది. నా బుద్ధి తక్కువతనం ఇప్పుడు తెలిసింది బాబూ. సరే......మళ్ళా రాత్రి బండికి పోవాలి నేను" అన్నారాయన.
    "అరె......భోంచేయకుండానే........."
    "అదేం కుదరదయ్య అల్లుడూ.....ఈ ఇంట్లో వంశోద్ధారాకుడు పుట్టి, 'తాతయ్యా భోజనానికి రా!" అనేంతవరకూ ఈ ఇంట్లో చేయి కడగరాదు. అది శాస్త్రం. కాబట్టి ఈ ముసలివాడికి, అతి త్వరలో ఇక్కడ చెయ్యి కడుక్కునేందుకు ఏర్పాట్లు చెయ్యాలి మరి" అన్నారు.
    దంపతులిద్దరూ సిగ్గుపడిపోయారు.
    ఆ రాత్రికి ఆయన వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయినా తర్వాత అడిగాడు నిరంజనం.
    "రాత్రి నేనేస్థితిలో వచ్చానో గూడా చెప్పావా రేణూ!"
    "లేదు. ఆ అవసరం రాలేదు.
    "నేను చాలా అదృష్టవంతుడిని."
    "ఎందుకనో"
    "ఒక చక్కటి అమ్మాయి, ఒక సుగుణాలరాశి మా ఆవిడ అయినందుకు."
    "చాల్లేండి. నా దగ్గరంటే అనేరుగాని బయట ఎక్కడా అనకండేం, భార్యను వెనకేసుకొస్తున్నారని అల్లరి చెయ్యగలరు"
    "అలాగేం" అన్నాడు ఆమెను దగ్గరగా తీసుకుంటూ.

                                         9

    ఏనాడూ లేనిదీ ఆఫీసరు శంకరాన్ని పిలవడంతో ఆఫీసులో చాలామంది ఆశ్చర్యపోయేరు. ఆఫీసరు, ఆఫీసులో చాలా ముభావంగా ఉంటాడు. అనుకున్న పని అనుకున్న వేళకి కాపోతే, దానికి హెడ్ క్లర్కు సంజాయిషీ చెప్పుకోవలసిందే గాని గుమాస్తాలు కారు. గుమాస్తాలకి గూడా ఆఫీసరు దగ్గరికి వెళ్ళే పని రానేలేదు. ఏదో శాస్త్రి లాటి బహు కొద్దిమందికి తప్ప.
    ఆఫీసరు పదకొండూ పన్నెండు గంటల మధ్య ఆఫీసుకు వస్తారు. మళ్ళా మూడున్నర నాలుగు గంటలకి వెళ్ళిపోతారు. ఎప్పుడో తప్పని సరైతేనేగాని ఆయన ఏడూ గంటల వరకూ కూర్చోరు. అలాంటి రోజులు ఆయన సర్వీసులో చాలా తక్కువ.
    శంకరం సైతం ఆఫీసరు తనని పిలవడంతో కాస్త తటపటాయించిన మాట నిజం. పతికి గూడా చిత్రంగా కనిపించింది. ప్రసాదం గుడ్లప్పగించి శంకరంవైపు చూశాడు. వాసు ఆలోచనల్లో మునిగిపోయేడు.
    శంకరం ఆఫీసరు గదిలోకి కాలు పెడుతూండగా శాస్త్రి తన పక్క సీటు వాడి చెవిలో ఏదో చెప్పి కిసుక్కున నవ్వేడు. అవతలివాడూ పళ్ళికిలించాడు.
    శంకరాన్ని చూడగానే సాదరంగా ఆహ్వానించేరు ఆఫీసరు నవ్వుతూ-
    "మీ గురించి చాలా విన్నాను" అన్నారు.
    శంకరం కాస్త ఖంగారు పడ్డాడు.
    "మీరు చక్కటి కథలు రాస్తారని తెలుసు గాని మీరు మీరని మాత్రం తెలీదు. అది నిన్ననే తెలిసింది" అన్నారాయన సంతోషంగా.
    శంకరం మనసు కుదుట పడింది.
    "మీ 'చెదిరిన మనసులు' చదువుతున్నాను చాలా బావుంటుంది."
    "థాంక్స్ సార్"
    "మీరు నా ఆఫీసులో పని చేస్తుండటం చాలా గర్వంగా ఉంది నాకు. కావాలండీ, ఇలాంటి ఏక్టివిటీస్ మన మధ్య ఉండాలి. ఫైళ్ళు ముందేసుకుని సర్వం అవే అనే పద్ధతి పోవాలి. అఫ్ కోర్స్- డ్యూటీ ఫస్టన్నారు గనక మన విధిని మనం సక్రమంగా నిర్వహించాలన్న మాట మరిచిపో కూడదనుకోండి. అంతమాత్రంచేత జీవితాన్ని 'సీటు'కి అంకితం చేయడం తగదు. ఈ పద్ధతి మనోవికాసానికి గానీ, మనిషి విలువకిగానీ ఉపయోగించదు. ఏవంటారు?"
    అవునన్నట్టు తలూపాడు శంకరం.
    "మొదట్లో మీరు నాకు మరో విధంగా పరిచయమయ్యారు. ఈ లక్షణం కథలు రాసే ప్రతివాళ్ళకి ఉంటుందనే అంటారు. మన తప్పు లేనప్పుడు మరొహళ్ళకి అనవసరంగా భయపడవలసిన పని లేదనే ధీమా మీ కుండటం నేరం కాదు. నా పద్ధతి వేరు-నేను ఎదటివారి మాటని నమ్మి వెంటనే ఒక నిర్ణయానికి వచ్చే మనిషినికాను. మీరు ఆఫీసులో కాస్త అలజడి లేవదీశారుట నిజమేనా?"
    "కానీ........."
    "ఐ నో మిస్టర్ శంకరం. ఒకడంటే మరొకడు మండి పడ్తూన్న ఆఫీసుకి ఆఫీసర్నైన తర్వాత కారణాలు ఊహించగలను మరి. మీ గురించి విన్న 'చెడు' ని ప్రత్యక్షంగా చూడాలనే ఉద్దేశ్యంతో, ఆ క్షణాన్ని మిమల్నేమీ అనకుండా వాయిదా వేసాను. కానీ-ఒక్కటి మాత్రం నిజం...... తన పనిని తాను సక్రమంగా చేసుకుపోతే, మిగతా విషయాలు ఎలా ఏడ్చినా ఫర్వాలేదు. పని చెయ్యండి. పైకి రావడానికి ప్రయత్నించండి. ఇదే మీకు నేను చెప్పగలిగేదీ, ఆజ్ఞాపించేదీను."
    "అలాగే సార్"  
    "మీరు వెళ్ళొచ్చు"
    శంకరం బయట కొచ్చేశాడు. అతను బయటకు రాగానే హెడ్ క్లర్కు పిలిచాడు. శంకరం వెళ్ళేడు
    "అవునోయ్......ఆఫీసరేమన్నారు?"
    "చాలా అన్నారు"
    "ఏమిటో"
    "చెప్పినందువల్ల నాకుగానీ, మీకుగానీ లాభించే దేమీలేదు."
    "వాట్"
    "నిజం......."
    "సరి సరి......నువ్వు నీ సీట్లోకి వెళ్ళచ్చు" బాగా తగ్గిపోయి, కాస్త సిగ్గుపడుతూ అన్నాడు హెడ్ క్లర్కు.
    ఆఫీసంతా చాలా నిశ్శబ్దంగా ఉంది. శాస్త్రి హెడ్ క్లర్క్ దగ్గర కెళ్ళి ఏవో మంతనాలు సాగిస్తున్నాడు, అతను చెప్తూన్న ప్రతిడానికీ హెడ్ క్లర్కు తలూపుతున్నాడు.
    మరి కొద్ది నిమిషాల్లో ఆఫీసరు కుసుమని పిలిచారు. దీంతో ఆఫీసులో 'దుమారం' విజ్రుంభించింది. శాస్త్రి తన అనుచరుల సీట్ల దగ్గరికెళ్ళి, ముసి ముసి నవ్వుతూ ఏదో మాటాడేస్తున్నాడు. ఈ వరస చూచిన ప్రసాదం భయపడ్డాడు.
    శంకరం దగ్గర కొచ్చి మెల్లిగా-
    "ఆఫీసరు నీతో కుసుమ విషయం ఏమీ అనలేదుగా గురూ! ఎందుచేతనంటే ఈ మధ్య మీ ఇద్దరిపైనా-"
    "నువ్వేమీ భయపడకు ప్రసాదం. ఆఫీసరు మన మనుకున్నంత తలూపే రకం కాదు. అన్ని విషయాలూ రూంలో చెప్తాను."
    "అయితే సరే......మరేంలేదు......ఆ శాస్త్రి గాడి నటన చూస్తూంటే భయమేసింది అంతే" అన్నాడు ప్రసాదం.
    పది నిమిషాల్లో కుసుమ వచ్చింది. ఒక్కోరు వెయ్యి కళ్ళు పెట్టుకుని ఆమెని నఖశిఖ పర్యంతం పరీక్ష చెయ్యడం మొదలు పెట్టారు. ఆమె తన సీట్లో కూర్చుని ఏదో టైప్ చేసి, ఆ కాగితాన్ని తీసుకుని ఆఫీసరు గదిలోకి వెళ్ళింది.
    "ఈ దెబ్బతో అమ్మగారికి ఉద్వాసన ఖాయం" అన్నాడు శాస్త్రి కాస్త బిగ్గిరగా.
    ప్రసాదం బుర్ర గోక్కున్నాడు. పతి బిత్తర పోయాడు.
    మరో అయిదు నిమిషాల్లో కుసుమ వచ్చింది.
    తన సీట్లో కూర్చుని తన పనేదో తాను చేసుకుపోతోంది.
    అప్పుడే గుస గుసలూ, పక పకలూ ప్రారంభమయ్యాయి. ఓ మూల ఊహాగానాలు, తలో విధంగా ఆలోచనలు, పరిశోధనలూను. కానీ, ఎవరికీ సరైన సమాధానం దొరకడం లేదు.
    మూడో పిలుపు హెడ్ క్లర్కుకి సంబంధించినది. ఆయనకీ పిలుపు రాగానే ఎగిరి గంతేసినంత పనిచేసి గదిలోకి వెళ్ళేడు. మళ్ళా కొద్ది నిమిషాల్లోనే బిక్కమొగంతో, నీరసంగా తిరిగి వచ్చేశాడు. శాస్త్రి ఆయన దగ్గరికి వెళ్ళేడు.
    హెడ్ క్లర్కు శాస్త్రితో ఏదో చెప్పాడు. శాస్త్రి ఏడుపు మొహం పెట్టేడు. శాస్త్రి వాలకం ప్రసాదానికి వచ్చినట్టుంది. ఒకసారి పకిలించేడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS