Previous Page Next Page 
మనం మిగిలేం పేజి 17


    కెవ్వున తగిలింది దంపతులకు. అక్కడ రాజు అన్నమాట-'నాకున్న ఆవిడ చాలా పెద్దావిడ'- ఇక్కడ కంపనం అయ్యింది. ఏమిటి ఈ ఘణాక్షర న్యాయం?
    "అందుకే......." ఇక మాట్లాడలేక లోపలకి వెళ్ళింది శాంత.
    అంతతో మధ్యగదికి వాళ్ళు నలుగురూ అయ్యేరు. ప్రస్తావన అయ్యిందన్నట్లే, వెంకటమ్మ చిన్నగా దగ్గుదగ్గి, జరిగినదంతా పూసగుచ్చి నట్లు చెప్పింది.
    లక్ష్మయ్య నోరు తెరిచినా, వాళ్ళు శ్రోతలే అయి విన్నారు.
    "మధు మనింటికి వచ్చేడా?"
    "అవును, బాబయ్యా వెంట ఓ పదహారేళ్ళ అమ్మాయికూడాను. వెళ్ళబోయే ముందే 'అక్కయ్యా!' అంటూ శాంతమ్మ కాలిధూళి కళ్ళకద్డుకునే వెళ్ళింది. ఆఖరుకు మధయ్య కూడాను."
    ప్రపంచం అంతా తిరుగుతున్నట్లయ్యింది. "ఏమిటమ్మా ఇదంతా?' అన్న ఎలుగుతోనే స్నానం గోధూళి వేళనే చేసి, ధావళీ కట్టుకుని పీఠం వద్ద కూర్చున్నాడు. ఆచమనం చేసినపుడు, బంగారం మలామాలో, సింధూరంమధ్య అమ్మ నిలబడే, 'నీకన్న ఎక్కువ పూజే చేయించుకున్నా శాంతతోటే' అన్నట్లే అయ్యింది.
    దాసోహం అని, దిగ్బంధం చేసి ధ్యానమ్ చేసి, పంచపూజ కావించి, బిగించేడు మంత్రాన్ని. అది వంశాలనుండి వచ్చిన కొట్టిన పిండి అయినా, ఈనాడు నడవనివ్వని బలవత్తర ప్రతిఘటనే అయ్యింది. ఎందుకో ప్రణవం చెవుల్లో, ఇల్లంతా మార్మోగేటట్టే వినపడింది. సన్నగా, వెనకాల ఉచ్చారణకాని రహస్యంలో శక్తిబీజం కొస రేస్తూంది.
    ఎవరు చదివేది? తన చుట్టూరా చూచుకున్నాడు. ఎవ్వరూ లేనేలేరు. కళ్ళు పరకాయించేయి. లేరు. తనొక్కడే.
    అయినా ప్రణవం చిక్కబడి ఊగిస్తూంది. తన్ను కప్పి, ఆవులించుకుంటూంది. తను లేడు. కాని ఉన్నాడు. ఆ గొంతుక, ఉచ్చారణ, స్వరం కూడా తను విన్నాడు కొన్నాళ్ళు. ఎవరూ?
    ఛాయల్లో మైకం. పీఠం మధ్య రామం. పద్మాసనంలో, ఇడా పింగళుల అంగుళీకపు పట్టుల్లో ప్రణవమే చదువుతున్నాడు.
    భావనా? పరీక్షా? చేతులెత్తే దాసోహం అన్నాడు.
    పీఠం వెలుగొందింది. అందులో మధ్యగా చిత్కళ ఒక్కదానితోనే అమ్మ అభయహస్తం. అంతే.
    కళ్ళమ్మట నీళ్ళు కారేయి. కళ్ళకద్దు కున్నట్లే శీర్షావాదం చేసి, మంత్రం మొదలు పెట్టేడు. ఇక ఆగనేలేదు. అడ్డు రానే రాలేదు. తనకు బాహ్యస్మృతే తప్పింది. ఎవ్వరూ లేరు. అవధానే లేడు. ఆవరించిన అమ్మ. శక్తి. అదో సంభూతి. ఘంటలే గడిచేయి.
    "అమ్మాయీ శాంతా, రా అమ్మా. తీర్ధం పుచ్చుకుందుకాని." అవధానే పిలిచేడు.
    శాంత అంతవరకూ ఏ తీర్పు వస్తుందో అనే తల్లడిల్లింది. వినీవినడంతోటే ఒక్కగంతే వేసి చెయ్యి చాపేసింది.
    తీర్ధం అవధాని స్వయంగానే ఇచ్చేడు. పార్వతమ్మ ఒదిగి, ఓసరిల్లే కళ్ళతో నిల్చుండి పోయింది. నెమ్మదిగానే పూజాకుంకం తీసి, తన చేతుల్తోనే శాంతకు బొట్టు పెడుతూనే-
    "ఈ దృఢతర సంకల్పం నీకు విజయం చేకూర్చవచ్చు. లేకపోవచ్చు. అది నీ కర్మాను భవం మీద ఆధారపడి వుంది. దాన్ని ఎవ్వరూ తప్పించలేరు.
    ఈనాటి సంభూతి ఓ పరీక్షానమ్మా నీకు. అది నెగ్గగల్గేవంటే....." ఇక మాట్లాడలేని రుగ్ధత క్రమ్ముకుంది. కొనగోటితోనే కన్నీరు చిమ్ముకున్నాడు.
    ఒక్క శాంతేకాదు, పార్వతమ్మకూడా సాష్టాంగ నమస్కారం పెట్టేసింది. తాము దుఃఖిస్తున్నామన్న జ్ఞానం కూడా లేక సర్వస్వం మరిచిపోయి. అది క్షణికం; అయినా అమరం.
    "ఆ రాజే మన రామం ఏమో? ఇది సృష్టి రహస్యం. అంతకన్న నేనేమీ చెప్పలేను ఇప్పుడు" అంటూనే లేచి వెళ్ళేడు. వరండాలోంచి పైన నక్షత్రాలు. తను గుర్తుపట్టలేని గుంపుల్లో. తన గోత్రం జ్ఞాపకం వచ్చింది. ఏడుగురు ఋషులున్నూ తలంపుకు వచ్చేరు. అవ్యక్తంగానే రామచంద్రయ్య గోత్రం, ఋషులున్నూ మననం అయ్యేరు. ఇద్దరికీ నలుగురు ఋషులు ఒక్కరే.
    ఎగిరిపోయేడు. ఇదా తాను అనుకున్న సందిగ్ధం? తను కాదు నిర్ణేత. అది ఆ శంకరునికి తెలియాలి. ఓ నిమిత్తమాత్రుడే అయి నమస్కరించేడు.
    గదంతా ఓంకారం ప్రకంపనం అయ్యింది. తనే అన్నాడు "ఓం" అని.

                                   12

              

    ఒక్కసారి పునః రాజు తన యింటికి వస్తే జీవితమే తరిస్తుందన్న నమ్మకం సత్యలో రేగింది. శాంతను చూచివచ్చినప్పటి నుండీ ఆ కోర్కె బలవత్తరం అయ్యింది. చిగురించింది. అయినా ఓ మిథ్యలో తను ఊహించుకుంటుందేమో అన్న భయం లేకపోలేదు.
    ఈ అన్వేషణ అన్నది రాజులో ఎంతవరకూ పరిణామం కలగ చేసింది? ఫలితం అన్నది ఏ విధంగా మార్పు తెచ్చింది? ఇది తెలుసుకోవాలన్న కోర్కె. తెలుసుకున్నందువల్ల ప్రయోజనం ఉంటుందో, లేదో కూడా తనకు తెలియదు. అయినా కుతూహలం చంపుకోలేక పోయింది.
    అర్ధరాత్రి దాటిన ఘంటల్లోనే ఇంటి తలుపు తెరుచుకుంది, ఆనాటి తిరుగుప్రయాణం నాడు. చాలా బరువుగా అలిసిన శరీరం, దానితో ఆత్మ, మనస్సుకూడా ఉండగానే. తన తల్లి విరుచుకుపడింది.
    "ఈ అర్ధరాత్రిళ్ళవరకూ తిరుగుళ్ళేమిటే? ఉదయం అనగా వెళ్ళేవు. ఇప్పుడా రావడం? పైగా..."
    "అమ్మా!"    
    "చెప్పకుండా కూడా వెళ్ళేవు. ఎక్కడికి వెళ్ళేవో అని మేం ఖంగారుపడి చస్తున్నాము. మీ నాన్న రెండు మూడుసార్లు స్నేహితుల ఇళ్ళకు కూడా వెళ్ళివచ్చేరు."
    "అమ్మా! ఇప్పుడు నన్నేం మాట్లాడించకుండా ఉందూ."
    "ఆ! మాట్లాడి, నిలబెట్టకపోతే రేప్రొద్దుట తలలు తీసుకోవలసింది మేం అవుతాం. నీకేం?"
    "అల్లాంటి తప్పుపని నేనేం చెయ్యలేదు."
    "మరి ఈ రాకలో అర్ధం?"
    తను చెప్పే స్థితిలో లేదు. ఓ వేళ కూడ కట్టుకుని చెప్పినా అమ్మ నమ్మలేదు.
    "నా ఇష్టం." మొరాయించేసింది.
    అంతవరకూ వీధి మెట్లమీదనే నించున్న మధు లోపలికి వస్తూనే "నమస్కారమండీ అన్నాడు.
    "మరి దీని అర్ధం ఏమిటే?" ఆవిడ స్వీకరించే పరిస్థితుల్లో లేనట్లే
    మధు కృంగిపోయేడు, అందులో విపరీతార్ధానికి. "మీరు చాలా పొరబాటు బడుతున్నా రండీ" అన్నాడు.
    "ఏమిటయ్యా, మా శ్రీరంగనీతులు చెపుతావు! అంత చెప్పగలిగినవాడవు - పెండ్లికాని పిల్లకదా, నువ్వూ బ్రహ్మచారివి - ఇల్లా అర్ధరాత్రిళ్ళు వస్తుంటే, ప్రజలేమనుకుంటారయ్యా? ఆమాత్రం జ్ఞానం నీకు ఉండక్కర్లేదూ?
    "ఏదో కాస్త చనువిస్తే ఇదేనటయ్యా చేసేది? మాకు పరువూ, ప్రతిష్ఠా లేవనుకుంటున్నావా?"
    కుమిలింపు, కోపం చెరో రెక్కా పుచ్చుకుని గుంజేసేయి మధును. మ్రింగుకున్నాడు. తన మీద ఉప్పెనే పడింది. ఓసారి సత్య వైపు చూచేడు.
    పొట్ట పగిలేటట్లు నవ్వడం ప్రారంభించింది సత్య. డిల్లబోయింది ఆవిడ. మధుకు అర్ధంకాలేదు. క్షణికం ఆపుకున్నట్లుగానే -
    "అమ్మ! ఈయనకీ ఆ రాజుకన్న ఎక్కువ డబ్బూ, ఆస్తీ, మేడలూ ఉన్నాయే" అంది.
    ఈ మాటలు కోటలు దాటి, కంచు గోడను తాకినట్లే అయ్యింది.
    "నోర్మూయ్!"
    "చిత్తం. రాజైనా, మదైనా ఇద్దరూ మీకు ఆమోదమే కదే! మీకు కావలసింది డబ్బు.....డబ్బు.... అవునుకదమ్మా?" హేళన నషాళం అంటింది.
    'ఏమిటిది?' అన్నట్లు మధు చూపులు.
    ఆవిడ కృంగిపోయింది. నడుం విరిగినట్లే కుర్చీలో కుప్పకూలింది. జాలిపడలేదు సత్య.
    "మధూ, ఈనాడు నా జీవిత రహస్యం చెప్పాలి. మా అమ్మ స్వచ్చమైన బ్రాహ్మణ నైష్టిక కుటుంబంలోనే పుట్టింది. వ్యామోహం దాన్నే ప్రేమ అంటారు-లో పడి ఓ ఇతరజాతివానితో లేచివచ్చి రిజిస్టరీ పెండ్లి చేసుకుంది. ఆ ఫలితమే నేను.
    "కన్నందుకు ఋణం తీర్చుకున్నట్లుగా నాకు ఎత్తుబడి, చదువు వాళ్ళు దాచుకోకుండానే ఇచ్చేరు. దానికి నేను కృతజ్ఞురాలినే.
    "వాళ్ళిరువురికి కూడా ఆశయం ఒక్కటే-నేను ఎల్లాగైనా ఓ ధనిక, కూలిన కుటుంబికున్ని ఉద్వాహం ఆడాలని. అది అగ్రజాతి అయితే మరీ మంచిది. దానివల్ల అమ్మ పూసు కున్న మసి కడుక్కోవచ్చు అన్న ఆశయం. అందుకే నాకు స్వేచ్చ ఇచ్చేరు.
    "ఆ స్వేచ్చ ఫలితం మీరు అందరూ నాకు స్నేహితులయ్యేరు. అమ్మ వలపన్నుటలో ఏ చేప పడుతుందా అన్న చూపు. అందులో స్వార్ధం ఉంది. కుచ్చితం ఉంది. పైగా లోకానికి తొడుక్కోవాలన్న ఆశయం కోటూ ఉంది.
    "రాజు నచ్చేడు అమ్మకు. ఎల్లాగైనా పెండ్లి చేసుకుంటే అదృష్టవంతులం అన్న ఉర్రూత నాన్నది, అమ్మదిన్నూ. ఇది వాళ్ళ కళ్ళజోడు.
    "ఆనాడు నేను ఊగిపోయేను. నన్ను నేనుగా ఉండనివ్వని శరీరానికి లోబడిపోయి, రాత్రి నేనే బలవంతం చేసేను - అమ్మా, నాన్నా మాట్లాడి నిర్ణయించుకున్న కైపులో, నేను.
    "కాని రాజు ఎవ్వరివాడూ కాదని ఆనాడు ప్రథమంగా నాకు తెలిసింది. అతనెవరో చూచాయగా గుర్తు వచ్చింది. అదే అతడు చీకట్లో నించుని ఉండి అన్నాడు.
    "ఒక్కటే అడిగేను అతన్ని - ఏనాడైనా సత్య కొన్ని ఘడియలు నీ సేవ చెయ్యగలిగితే జీవితం తరిస్తుందని. అందుకే ఈ అన్వేషణ. నేను కాదు. నాలో నించున్న ప్రోత్సాహం.
    "ఇదీ నా పరిస్థితి. కనీసం నువ్వేనా అర్ధం చేసుకో, మధూ." కళ్ళమ్మట నీళ్ళు తిరిగేయి.
    తెల్లబోయింది ఆవిడ. గుటక మ్రింగలేని నాలిక పిడచకట్టు.
    "ఒక్కటి మిగిలిపోతోంది. అది అది..."ఇక చెప్పలేకపోయింది.
    మధు గ్రహించినట్లే "అమ్మా, అపోహ పడకండి. అదె కలిగితే మానవులు రాక్షసులు అవుతారు. ఈనాడు సత్య చేసింది తప్పు ఏమీ లేదు. ఓ కుతూహలంలో బయల్దేరింది" అంటూ మొదలుపెట్టి చూచాయగా అన్న వతులోనే జరిగింది చెప్పేడు.
    అతి టూకీగా ఉన్నా ఆవిడకు తల తిరిగి పోయింది. ఎప్పుడు లేచిందో అన్న స్పృహ లేనట్లే సత్య ప్రక్క చేరి, "క్షమించు, అమ్మా" అనేసింది.
    "ఓరి నీ యిల్లు బంగారంగాను! చచ్చే టట్లు మీకోసం తిరుగుతున్నాం. ఎప్పుడు వచ్చేరురా?" రావు బూట్ల చప్పుడు చేసుకుంటూనే లోపలికి వచ్చేడు. వెనుక దశరధం పిల్లి అడుగులతోనే అనుక్రమణ చేసేడు.
    కళ్ళతో వారించింది మధును సత్య.
    "ఓ అర ఘంట అవుతుంది."
    "ఏం జరిగింది?"
    "అక్కడినుండి అదే రాత్రి మళ్ళీ పరారీ."
    "అంతేనా?"
    దశరథం నిరాశపడ్డాడు. నిట్టూర్పు నిగిడ్చేడు. "మరి ముందు కర్తవ్యం?" అని అడిగేడు.
    "శోషగొట్టి కాలవగట్టున పడితే, దయ తలచి కాస్త భోజనం పెట్టేరు. మళ్ళీ నాన్చకున్నూ చెప్పకుండా వెళ్ళిపోయేట్ట."
    "తర్వాత ఆచూకీ?"
    "ఎవరూ చెప్పలేకపోయేరు."
    రావు గ్రహించేసేడు. ఈ ఇంట్లో కాలు పెడితే, అందరి నోళ్ళూ ఎందుకోకొ మూగపోతాయి. ప్రతివాళ్ళూ తమ చుట్టూరా ఓ ప్రహరీ నిర్మించుకున్నట్లు ప్రవర్తిస్తారు. ఇంటి మహత్యమో, లేక ఆ ఇంట్లో కాపురమున్నవాళ్ళ గుట్టో తెలియదు. సువాసనకు   క్షోణాలు పెద్దవవుతాయి. అల్లాగే అందుకు వాగుడు వాక్కాయి అయినవాడికేనా సరే, నోరు తాళం పడుతుంది ఇక్కడ.
    "ఎందుకురా దాస్తావు?" అన్నాడు కోపంలో.
    "పోనీ, నువ్వైనా చెప్పమ్మా" అన్నాడు ప్రాధేయంతో దశరథం, అందులో ధ్వనిభేదం కొంచెం కదల్చింది సత్యను. తను అనుభవించిన వన్నీ ఓ ఆధ్యాత్మిక ప్రపంచ ఛాయలు, అక్కడ. అది పూనుకున్న భౌతికపు కదలింపు. ఇవి తను నమ్మిందో, లేదో చెప్పుకోలేదు. కాని పరిస్థితులకు అక్కడమాత్రం దాసోహం అని తలవంచింది. రాగద్వేషాల్లో శ్రుతి కల్పింది.
    ఇవన్నీ ఇప్పుడు ఈయనకు చెప్పినా ప్రయోజనం లేని అడియాస అవుతుంది. పైగా ఈ సంభూతి వ్యక్తిగతం. అది తన సొత్తు.
    "అతను చెప్పినదే నిజం" అంది వంతపాడినట్లు.
    ప్లీడరీ బుర్ర. అది వమ్ము కాదన్నట్లే - "రాజు కొన్నాళ్ళక్రితం రుక్మిణిని కలుసుకుందుకు వచ్చేడు. అప్పుడు 'నా భార్యని నేను చూచేను. కాని ఆవిడకీ, తనకీ తేడా' అన్నాడు. పోనీ మీరు ఆవిడ ఎవరో ఊహించగలరా?" అన్నాడు దశరథం.   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS