అనురాధ ఆ స్నేహమయి పరీష్వంగంలో అలాగే వుండి పోయింది. ఎంతోసేపటి వరకు.
ఎందరో నృత్య ప్రదర్శన లిమ్మని వచ్చారు. కానీ ఒక్కరికీ మాట యివ్వలేదమె! మనసు బావుండలేదని చెప్పింది మృదువుగా.
రెండు నెలలు గడిచి పోయాయి. అనూరాధ నిరీక్షణ. నిరాశతో విలవిల లాడిపోతోంది. ప్రతి మనిషినీ పరిశీలించింది ఓపిక వున్నత వరకా పట్టణం లో.
అతని పిలుపు విన్పించినట్లే వుండి గదిలోకి వెళ్లి చూస్తుంది అపుడపుడు . శారద బ్రతిమాలి అపుడపుడు తనతో పాటు హాస్పిటల్ కి తీసుకుని వెళ్తుంది. సాయం చేయమంటుంది. ఆ విధంగానైనా ఏదో వ్యాపకం తో హరికృష్ణ ను తాత్కాలికంగా మరిచి పోతుందని అలా ఆదేశిస్తుంది.
కానీ ఏపని చేస్తున్నా, ఎంతగా నవ్వించినా, ఆ డాక్టర్ , ఆమె హృదయాన అనుక్షణం స్మృతుల మీటల్ని కదిలించుతూనే వుంటాడు . ప్రతి అక్షరం లోనూ ఆ వ్యక్తీ కోసం నిరీక్షణ విన్పించుతూనే వుంటుంది. నీరజ దగ్గరకు ఎన్నోసార్లు వెళ్లి వచ్చింది. ఒకవేళ గత స్మృతులతో అక్కడి కేమైనా వేళ్ళాడేమోనన్న వూహతో. కానీ అక్కడి కేనాడూ రాలేడతడు. నీరజకా సంగతి చెప్పకుండా దాచింది బాధపడుతుందని. మూడో నెల కూడా దాటిపోయింది. హరికృష్ణ జాడే లేకుండా పోయింది. అనూరాధను తిరిగి కాలేజీ లో చేరమని కోరింది శారద.
'క్షమించక్కా! ఇంకా యీ అనూరాధలో చదువు మీద గాదు గదా, మరి దేనిమీదా ఆసక్తి జనించలేదు. ఆ శుభ ఘడియ రావాలనే నేనూ కోరుకుంటున్నాను. అంతవరకూ నన్ను క్షమించవలసిందే!" అన్నది.
రాజును ఏలూరు కాలేజీ కి పంపించింది. ఆక్కడికి వెళ్ళాడేమో హరికృష్ణ అన్న భావనతో. కానీ అక్కడి కెపుడూ ఆ సంవత్సరం అలాంటి మనిషే రాలేదని తెలిసి నిట్టూర్చింది.
ఆరోజున శారద మళ్లీ బ్రతిమిలాడింది.
'అనూ! ఈ మద్రాసు నుంచి వెళ్ళిపో నువ్వు! ఈ పరిసరాలు మరింత బాధపెడతాయి నిన్ను! ఏలూరు వెళ్లు! అక్కగా నిన్ను ఆజ్ఞాపించుతున్నాననుకో!'
'నీ బాధ నా కర్ధమయిందక్కా! కానీ ఈ పరిసరాల్ని విడిచి అడుగు కూడా కదిలి వెళ్లలేను. బాధ రంపం లా కోస్తోంది. నిజమే! గత స్మృతులు నలిపివేస్తున్నాయి. కాదనను. ఆస్మృతులతో నిండిన పరిసరాలు చూస్తూన్న కొద్దీ బాధ పెరుగుతుంది. కానీ ఆ బాధ భరించడం లోనే నాకు కొంత వుపశమనంగా వుంటోంది. చిత్రంగా వుంది గదూ!?' నవ్విందామె.
'ఎక్కడా వున్నా ఆ వేదన తరగదు. కానీ స్ముతులు కదిలిన చోటే వుంటే ఆవేదన కాస్త ఊరడిల్లుతుంది. అదో రకం హాయి. తీయని బాధ అది.' అన్నదామె తిరిగి.
శారద మాట్లాడలేక పోయిందా పైన. ఆ హృదయాన దాగివున్న అనురాగ సంపద మహత్తర మైనదనీ, అత్యంత పవిత్రమైనదని గ్రహించి నిట్టూర్చింది. తిరిగి అందుకే ఆ ప్రసక్తి రాకుండా జాగ్రత్త పడింది.
* * * *
హరికృష్ణ వ్రాసుకున్న 'డైరీ' లను తిరగేస్తూ కూర్చుంది అనూరాధ! అంతలో శకుంతలమ్మగారు పెద్దగా శోకాలు పెడుతూ , రొప్పుతూ ప్రవేశించింది. అనూరాధ దగ్గరకు వచ్చి వుపన్యాసం మొదలెట్టింది ---
'అమ్మా! మహంకాళీ! నా బంగారు తండ్రి నేం జేశావు? ఎక్కడ దాచావు?! నేనేపుడో అనుకున్నాను యిలాంటి పని చేయగలవని. ఎంతకైనా తగిపోతుందని ఆనాడే మొత్తుకున్నాను. ఆస్తి కోసం నా తండ్రిని ఏం జేసిందో--'
అనూరాధ వోసారి తలెత్తి ఆమె వంక చూసి తిరిగి డైరీ లోకి వంగి పోయింది.
'మాట్లాడవేమిటి? మహాతల్లీ! చంపి పారేయించావా? లేక ఏ పరాయి దేశానికో పంపించావా?' పెద్దగా అరుస్తోందామె.
'శకుంతలమ్మ గారూ! జరిగింది తిరిగి రాదు ఎంత పెద్దగా అరిచినా! నిజాన్ని మోసగించడం ఎవరి తరమూ కాదు. మోసాన్ని దాచి వుంచడమూ ఎవరికీ మంచిది కాదు. ఊరికే అభాండాల్ని రుద్దడం వలన కంఠశోషె గాని లాభం వీసమైనా వుండదు.' శాంత స్వరంతో అన్నది అనూరాధ 'చేబుతావమ్మా! చెబుతావు! ధర్మ పన్నాలు! నీకేం బాధ!! బాబుని యీ చేతుల్తో పెంచి పెద్ద చేశాను. ఆఖరికి నీ పేరు మీద 'లేడు' అన్పించుకున్నాను. అయ్యో! భగవంతుడా! ఇదేం! కర్మంరా నాయనా! ఈ రధమ్మ తల్లి మాకెక్కడ దొరికింది బాబూ! ధర్మరాజు లాంటి మనిషిని మాయం చేసింది!' ఇంకా సాగిపోతూనే వుంది ఆమె సానుభూతి.
అనూరాధ ఆ తరువాత కనులెత్తి కూడా చూడనేలేదు. ఎదుట కూర్చుని తీరికగా, వోపికతో శాపనార్ధాలు పెడుతూన్న ఆ మహాతల్లిని వారించనూ లేదు. ఆగ్రహావేశాలతో ఎదురు చెప్పనూ లేదు. ఆమె వుపన్యాసధారా అడ్డు అపూ లేకుండా ప్రవహించి పోతోంది. అంతలో రామనాధం గారు ప్రత్యక్ష మయ్యారు.
ఆ భార్య భర్తలు ఏదో పెద్ద ఎత్తు వేసికునే వచ్చారని గ్రహించింది అనూరాధ. నిజంగా హరికృష్ణ పైన అభిమానం ఉన్నవాళ్ళే అయితే ఆ కబురు అందగానే రెక్కలు గట్టుకుని వచ్చి వుండేవారు. కానీ అతడు కన్పించకుండా పోయిన మూడు నెలలకు ప్రత్యక్షమై శాపనార్ధాలు పెడుతున్న ఆ దంపతుల హృదయా లెంత కోమల మైనవో అందరికీ తెలిసిపోయింది పూర్తిగా.
రామనాధం గారు వచ్చీ రావడం తోనే లాయరు లా ప్రశ్నించారు --
'మా హరికృష్ణ నీకేం అపకారం చేశాడు? ఎందుకిలా వాణ్ణి సర్వనాశనం చేస్తున్నావ్?'
అనూరాధ డైరీలు మూసి లేచి వెళ్లి వో కుర్చీ తెప్పించి ఆయనకు వేసింది -- 'ముందు కూర్చోండి! మీ అభియోగాలు చాలా వున్నాయని నాకు తెలుసు! మీరు నా పేరు విన్నప్పట్నుంచీ అనుమాన బీజాన్ని నాటి, పెంచి, పెద్ద వృక్షం గా తయారు చేసారు! ఆ! ఇక చెప్పండి! మీ అనుమానాలన్నింటినీ! కానీ ఒక్క మాట మాత్రం గుర్తుంచు కొండి తామనాధం గారూ!
ప్రతి మనిషికీ హృదయం వుంటుంది. అతి కోమలంగా వుంటుంది కొందరి విషయంలో. ఆ కోమలత్వాన్ని సమూలంగా నశానం చేసేంత వరకూ నిద్రబోరు కొందరు. అది నిజంగా రాక్షస ప్రవృత్తే! ఆ గుణం మిమ్మల్ని కొన్ని క్షణాలైనా ఆవేశించగూడదని ప్రార్ధిస్తున్నాను!'
ఆ మాటల్లోని గూడార్ధాన్ని గ్రహించాడా పెద్ద మనిషి. తూణీరంలో అక్షయింగా వున్నాయి బాణాలు అనుకున్నాడు. సవ్యసాచి లా రెండు చేతులా విసరగలనని భ్రమ పడ్డాడు. కానీ ఆ వ్యంగ్య పూర్ణ హెచ్చరిక ఆయనలోని జాగురూకతను మెల్కొల్పింది.
'అమ్మాయ్! నాకు డొంక తిరుగుడు వ్యవహారాలు నచ్చవు. సూటిగా అడుగుతున్నా నందుకే! నీకేం ఇస్తే యిక్కడి నుంచి వెళ్లి పోతావో చెప్పు.'
'ఏం తీసుకుని వచ్చానిక్కడికి?!'
'అదంతా నాకు అనవసరం! నీకేం కావాలో చెప్పు! అంతే!'
'నాకు కావాల్సింది మీరివ్వలేరు!'
'ఈ రామనాధం సంగతి నీకింకా పూర్తిగా తెలియలేదను కుంటాను. ఏం కావాలన్నా యివ్వగలడు!'
'అవి మాటలు! అయినా అలా చేయగలనని మీ నమ్మకం నిజం మాత్రం కాదు.'
'వాదన పెంచవద్దు!'
'అని నేనూ అంటున్నాను!
'ఇవిగో! ఈ పదివేలు తీసుకొని వెళ్ళిపో!' బల్ల మీద డబ్బును వుంచాడు.
'ఎందుకూ? ఎవరివ్వను?'
'ఎందుకేమిటి? నీకే? డబ్బుతో చేయలేని పని అంటూ లేదీ లోకంలో.'
'పొరపడుతున్నారు . డబ్బుతో అన్నీ అందవు.'
'నాది యాభై ఏళ్ళ అనుభవం!'
'ఏళ్ళు అనుభవాల్ని పెంచుతాయి ! కానీ సత్యాన్ని గుర్తింప జేయలేవు -- అయినా నేను పోగొట్టు కున్నది డబ్బు కాదు. వచ్చింది దాని కోసం గాదు---'
'మరి దేనికోసం వచ్చావో'?!'
'చెప్పవలసిందే నంటారా?
'ఆహా! చెప్పవలసిందే!
'మీ అనుభవాల్లో దొరకనిది యిది. మీరేనాడూ గుర్తించి ఉండని నగ్న సత్యం యిది. పువ్వు కన్నా నిర్మలమైన వో మనస్సు అందించిన ఆరాధానని కాదనలేక వచ్చాను. ఆ అనురాగ మూర్తి హృదయాన శాంతి నింపాలని ఎన్నో అపవాదుల్ని భరించాను. ఎందరో అపోహతో అసహ్యించు కున్నా పారిపోకుండా వున్నాను?
'ఇదెక్కడి బాష!? ఏ గ్రంధం లోనిది?'
